రాచరిక కాలంలో… పన్నులతో జేబులు ఖాళీ చేయడంలో ఔరంగజేబు చరిత్ర సృష్టించాడు. సృజనాత్మకతకు పదునుపెట్టి కొత్తకొత్త పన్నులు వేశాడు. జుట్టు పెంచితే పన్ను… గర్భిణిలపై పన్ను! ఆ సృజనాత్మకత ఆయనతోనే ఆగిందా!
ప్రజలే ప్రభువులుగా, నేతలు సేవకులుగా కీర్తినొందిన మన ప్రజాస్వామ్యంలో సేవకులు, ప్రభువులకు చేసే వడ్డింపుల్లోనూ ఎంతో సృజనాత్మకత! పన్ను, సుంకం, ఛార్జీ, రుసుము, డ్యూటీ, సెస్.. పేరేదైతేనేం పిండుకోవడమే పరమార్థం.
సొంత డబ్బుతో మోటర్ సైకిల్ కొంటే… దానిపై జీవితకాల పన్ను. బయట తిప్పినందుకు రోడ్డు పన్ను. రోడ్డుపక్కన ఆపితే పార్కింగ్ పన్ను. బండి నడిపేందుకు వంద రూపాయల పెట్రోలు పోయిస్తే… అందులో సగం పన్నుకే పాయె!
కష్టపడి… చెమటోడ్చి డబ్బు సంపాదిస్తే ఆదాయపు పన్ను. ఆస్తులుంటే ఆస్తిపన్ను. దివాల దీసి దిక్కుతోచక అమ్ముకున్నా వచ్చే మూలధన లాభంపై పన్ను. ప్రాజెక్టుల్లో ఇల్లూ వాకిలి పోగొట్టుకున్నందుకు ఇచ్చే పరిహారంమీదా ఆదాయపు పన్ను.
ఫోన్ కొంటే దానిపై పన్ను. అందులోంచి మాట్లాడితే సేవా పన్ను. సేవ చేసిన ఫోన్ కంపెనీపైనా పన్ను. వెరసి… సేవ పొందినా పన్ను, సేవ చేసినా పన్ను.
సరదాగా హోటల్‌కెళ్లి తింటే బిల్లుపై విలువ ఆధారిత పన్ను. దానిపైనా సేవా పన్ను. బ్యాంక్‌లో వేసిన మన డబ్బులు మళ్లీ తీసుకుంటే పన్ను… సినిమాకొచ్చి ఏడ్చినా, నవ్వినా ‘వినోద’ పన్ను… జుట్టు కత్తిరిస్తే పన్ను… పార్కులో నడిస్తే పన్ను… ఎగుమతి చేస్తే పన్ను… దిగుమతి చేసుకుంటే పన్ను… కొనుగోలు పన్ను… అమ్మకం పన్ను.
సర్ఛార్జీల పేరిట, సెస్సుల పేరిట పన్ను మీద మరో పన్ను. కేంద్రం వేసే పన్ను… రాష్ట్రం వేసే పన్ను… మున్సిపాలిటీ వేసే పన్ను… పంచాయతీ వసూలు చేసే పన్ను. ఒక్కో సేవకుడు వేసేది ఒక్కో పన్ను.
తింటే పన్ను.. వింటే పన్ను… కొంటే పన్ను… కదిలితే, మెదిలితే పన్ను… వదిలితే పన్ను… పట్టుకుంటే పన్ను!
పన్ను… పన్ను… పన్ను…
అయినా ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనే పన్నుల ఆదాయం తక్కువట. ఇది చిదంబరం మాట! ముందు ముందు ఇంకా వేటిపై వేస్తారో? ఎంత వసూలు చేస్తారో! మన నేతల ముందు ఔరంగజేబు ఎంత? ఆయన సృజనాత్మకత ఎంత?
ఒకరు చేస్తే దోపిడీ.
వెయ్యి మంది చేస్తే పన్ను రాబడి…
అన్న వాన్యా కోహెన్ మాటలు నిజమా? అబద్ధమా?
(ఈనాడు ప్రచురణ)
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం