అ అంటే ………

అ అంటే అశాంతి అని
ఆ అంటే ఆవేశం అని
ఈ అంటే ఈర్ష్య అని
అక్షరాభ్యాసం చేశాను

ఎంత చింతించి ఏమి లాభం
అ అంటే అందమని
ఆ అంటే ఆనందమని
ఈ అంటే ఈశుడని
దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది
చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు
ఇది ……………. జీవితం

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

మరికొన్ని తవికలు:

గమ్యం సినిమా బాగుందంట

శుక్రవారం ఐపోతోంది…వారాంతం దగ్గర పడుతోంది. అవును, వారాంతంలో సగటు తెలుగుజీవి ఏమి చేస్తాడు? ఏమి చేస్తాడు…ఎన్ని సార్లు డోక్కున్నా, ఎన్ని సార్లు తల బొప్పికట్టిచ్చుకున్నా, ఎన్ని సార్లు థూ..ఇది ఒక సినిమానే!! అని తిట్టుకున్నా ఆశాజీవైన తెలుగోడు మళ్ళీ మళ్ళీ థియేటర్ వైపుకే అడుగులేస్తాడు. ఏం చేస్తాం ఉన్న చెత్త సినిమాల్లో ఓ ఉత్త(మ) చెత్త సినిమాను ఎంచుకొని వెళ్ళవలసిన పరిస్థితాయె. సరే అషలు విషయానికొచ్చేస్తున్నా. ఇటీవలే విడుదలైన గమ్యం సినిమా చాలా బాగుందని విశ్వసనీయ మరియు అవిశ్వసనీయ వర్గాల ద్వారా కూడా తెలియవచ్చింది. ఆన్ని రివ్యూలు, చూసిన జనాలందరూ దీన్ని మంచి సినిమా, చూడవలసిన సినిమా అని కితాబులు బిరుదులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ ఊర్లో ఈ సినిమా ఆడుతూంటే ఈ వారాంతం ‘గమ్యం’ వైపు హ్యాపీగా అడుగులు వెయ్యవచ్చు.
తెలుగు సినిమా చూడనని ఒట్టుపెట్టుకున్న వాళ్ళుమాత్రం నిన్న విడుదలైన 10000BC సినిమా చూసే ప్రోగ్రాము పెట్టుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నా, ఎప్పుడో అంతరించిపోయిన శాబర్ కోరల పులులు, మమ్మోతులు చూడటం కోసమైనా వెళ్ళాల్సిందే (ఇప్పుడే అందిన వార్త, సినిమా పరమ చెత్తగా ఉందంట. గ్రాఫిక్సు చూడాటానికి మాత్రమే వెళ్ళచ్చంట). ఇవి రెండూ కాక కొత్త ఇండియానా జోన్సు ఎప్పుడొస్తాడా అని రెండు కళ్లతో ఎదురుచూస్తున్నా :)

అప్పుడు ఆహా…ఇప్పుడు అబ్బా

అప్పుడు కళ…ఇప్పుడు వ్యాపారం
అప్పుడు కథ…ఇప్పుడు వ్యధ

అప్పుడు నటులు..ఇప్పుడు స్టార్లు
అప్పుడు ప్రేక్షకులు…ఇప్పుడు ‘అభిమానులు’

అప్పుడదో తపస్సు…ఇప్పుడిదో గారడీ
అప్పుడు తీపిగుర్తులు…ఇప్పుడు తలనొప్పులు

అప్పుడు సంతృప్తి…ఇప్పుడు లాభం
అప్పుడు నాటకరంగం…ఇప్పుడు వారసత్వం

అప్పుడు లంగాఓణీలు … ఇప్పుడు చెడ్డీబనీన్లు
అప్పుడు డ్రామా…ఇప్పుడు కోమా

(మనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాల మీద రాకేశ్వరా వ్రాసిన విమర్శనాత్మకమైన వ్యాసం చదివి పొంగిన భావజాలాన్ని పదాల రూపంలో ఇలా పేర్చాను.)

పడిపోయాను….

శరీరాన్ని తొడుక్కోవటానికి భూమి మీదకొచ్చాను
సంస్కారము వదిలేసి పాతాళానికొచ్చి పడ్దాను

( కొన్నాళ్ళు తవికల పేరిట నేను జరిపే హింసాకాండను పాఠకులు భరించాలి :) )