ఆ నాటి తిరుమల

రోజుకు 350కి పైగా బస్సులు… సగటున 30వేల మంది భక్తులు… ఏడుకొండల మీదకు రెండు ఘాట్‌రోడ్లు… ఎక్కడంటే అక్కడ భోజనశాలలు, తితిదే ఏర్పరచిన ప్రత్యేక సదుపాయాలూ సౌకర్యాలతో ఇప్పుడంటే తిరుమల శోభాయమానంగా వెలిగిపోతోంది కానీ ఒకటిన్నర శతాబ్దం వెనక్కి వెళ్తే…

నూరూ నూటయాభైయేళ్ల క్రితం… కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ… వెుత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడిబద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి వోసుకెళ్లేవారు. అందుకు పదిఅణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్‌ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధివీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది.
ఘాట్‌రోడ్డు నిర్మాణం


1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మోదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్‌ అధికారులు సర్వేబృందాల వారు తిరుపతి చేరుకున్నారు. జనంలో ఆశ్చర్యం… అసలు అంత ఎత్తున రోడ్డెలా వేస్తారా అని. వారి అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ 1944 ఏప్రిల్‌ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్త్తెంది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్‌ ఆర్ధర్‌హోప్‌ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. వెుదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని వెుదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్‌ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.

కొండ మీద వూరు
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. వెుదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే వెుదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30ఏళ్లక్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.

ఎంతోమార్పు
స్వాతంత్య్రానికి పూర్వం దళితులకు తిరుమలేశుని ఆలయప్రవేశం నిషిద్ధం. అలిపిరి పాదాలమండపం దాటి వారిని రానిచ్చేవారు కాదు. అక్కడికి సమీపంలోని జలపాతంలో స్నానం చేసి తలనీలాలు అర్పించుకుని వెనుదిరిగే వారు. అందుకే ఆ జలపాతానికి మాలాడిగుండమనే పేరొచ్చింది. హరిజనోద్ధరణ ఉద్యమం సందర్భంగా గాంధీజీ ఈ పద్ధతిని ఖండించారు. పరదేశీయులకు లేని ఆంక్షలు స్వజాతీయులకు మాత్రం ఎందుకని ప్రశ్నించారు.

అలాగే… పూజావిధానాల్లోనూ, ఆర్జితసేవా టిక్కెట్ల ధరల్లోనూ నాటికీ నేటికీ హస్తిమశకాంతరం. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మోదలుపెడుతున్నారు. ఏడుకొండలస్వామికి పాపం కునుకే బంగారమైంది!

ప్రకటనలు

6 thoughts on “ఆ నాటి తిరుమల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s