పీసీకి లేజర్‌ కాంతులు!

ఒకప్పుడు… పీసీ వేగం చాలా తక్కువ. నిక్షిప్తం చేసుకోగల సమాచారం మోతాదూ తక్కువే. ఇప్పుడు… వేగం… ప్రచండం. 80 గిగాబైట్ల సామర్థ్యం సాధారణం. మరి రేపు… మరింత వేగం. గిగాబైట్ల స్థానంలో టెరాబైట్లు!

వారం రోజుల్లో టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను పరిశీలిస్తే… ఇదేమంత కష్టమైన విషయం కాదని స్పష్టమవుతుంది. ఒకవైపు కాంతి సాయంతో పీసీలోని భాగాల్లో సమాచార మార్పిడి మరింత వేగంగా జరిగేందుకు ఇంటెల్‌ ఓ టెక్నాలజీని సిద్ధం చేస్తే… మరోవైపు సమాచారాన్ని నిల్వచేసుకునే విషయంలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలకమైన పురోగతి సాధించారు. ఆ రెండింటి వివరాలు…

కంప్యూటర్లలో సమాచారం ఎలా ప్రసారమవుతుంది? విద్యుత్తు ద్వారా. విద్యుత్‌ ప్రసార వేగం ఎంత? ఎంతైనా… కాంతి కంటే తక్కువే. కంప్యూటర్లలో విద్యుత్తుకు బదులు కాంతిని ఉపయోగిస్తే? అద్భుతాలు సాధ్యమవుతాయి. ఇందుకోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈమధ్యనే ప్రసిద్ధ మైక్రోప్రాసెసర్‌ కంపెనీ ఇంటెల్‌ విజయం సాధించింది. సాధారణ మైక్రోప్రాసెసర్‌కు ఓ అదనపు పొరను ఏర్పాటు చేయడం ద్వారా అది లేజర్‌ కిరణాలను ఉత్పత్తి చేసేలా చేసింది. ఫలితంగా కంప్యూటర్లలో ఒక మైక్రోప్రాసెసర్‌ నుంచి మరో ప్రాసెసర్‌కు ప్రసారమయ్యే సమాచార వేగం గణనీయంగా పెరిగింది.

ఎలా సాధ్యమైంది?
మైక్రోప్రాసెసర్‌ తయారీలో ఉపయోగించే సిలికాన్‌ను కాంతిని వెదజల్లే పదార్థాలతో మేళవించేందుకు గతంలోనూ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ సిలికాన్‌కు ఉండే ప్రత్యేక ధర్మాల వల్ల ఇవేవీ విజయవంతం కాలేదు. ఇంటెల్‌ బృందం… మాత్రం ఇన్‌డియం ఫాస్పేడ్‌ అనే పదార్థాన్ని అతితక్కువ ఉష్ణోగ్రతల్లో సిలికాన్‌ చిప్‌పై పూతగా పూయగలిగింది. దీనిపై ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన నిర్మాణాలు కాంతిని ప్రసారం చేయగలిగిన వేవ్‌గైడ్‌లుగా ఉపయోగపడతాయి.

ఉపయోగాలు

ఇంటెల్‌ తయారుచేసిన హైబ్రిడ్‌ మైక్రోప్రాసెసర్‌ (ఫొటోనిక్‌ చిప్‌) వల్ల కంప్యూటర్‌ రంగం రూపురేఖలు మారిపోతాయని శాస్త్రవేత్తల అంచనా. కాంతివేగంతో సమాచార ప్రసారం జరుగుతూండటం వల్ల పీసీల వేగం, ప్రస్తుతం ఉన్నవాటికంటే వందలరెట్లు ఎక్కువ అవుతుంది. దీంతోపాటు ఈ హైబ్రిడ్‌ చిప్‌ ప్రభావం ఇంటర్నెట్‌పై కూడా ఉంటుంది. సర్వర్లు, రూటర్లలో వీటిని ఏర్పాటు చేస్తే… అతితక్కువ ఖర్చుతో ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను పొందవచ్చు. అంటే ఇంటర్నెట్‌ వాడకానికయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నమాట.ఈ ఫొటోనిక్‌ చిప్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలతో తయారుచేసే వీలుండటం వల్ల… తయారీకయ్యే ఖర్చు కూడా తక్కువ కావడం వల్ల భవిష్యత్తులో మైక్రోప్రాసెసర్ల ధరలు తగ్గిపోయే వీలుంది. ఇంటెల్‌ ప్రస్తుతం తయారుచేసిన ఫొటోనిక్‌ చిప్‌ సైజు కేవలం 800 మైక్రాన్లు. ఇలాంటి వందలాది చిప్‌లను అనుసంధానించడం ద్వారా అతివేగవంతమైన సూపర్‌ కంప్యూటర్ల నిర్మాణం సాధ్యమవుతుంది.

ఒక సీడీలో… 700 మెగాబైట్లు, డీవీడీల్లో అయితే… నాలుగైదు గిగాబైట్లు… ఇవీ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న డేటాస్టోరేజీ పరికరాల సామర్థ్యం. బ్లూరే డిస్కులోనైతే… 30 నుంచి 50 గిగాబైట్లు! అంతే! మరి ఒక సీడీలో దాదాపు మూడు వేల గిగాబైట్లు… అంటే మూడు టెరాబైట్ల సమాచారం పడితే? ఇదేమంత అసాధ్యమైన విషయం కాదని నిరూపించారు… హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్‌ క్రోజీర్‌. అలాగని ఈ సాంకేతిక పరిజ్ఞానం ఖరీదైంది కాదు సుమా! ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్నే… భిన్నంగా ఉపయోగించడం ద్వారా వీరీ ఘనతను సాధించారు.

సీడీ, డీవీడీలపై సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు లేజర్‌ కిరణాలను వాడుతూంటారన్న విషయం మనకు తెలుసు. వీటి తరంగదైర్ఘ్యాన్ని బట్టి ఒక్కో పరికరంలో ఎంత సమాచారం పడుతుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. సీడీల్లో 780 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపురంగు లేజర్లను ఉపయోగిస్తారు. డీవీడీల విషయంలో 650 నానోమీటర్లు… కొత్తగా అందుబాటులోకి వచ్చిన హెడీ-డీవీడీ, బ్లూరే డిస్క్‌లలో 405 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం ఉన్న నీలిరంగు లేజర్లను వాడతారు. ఇంతకంటే తక్కువ తరంగదైర్ఘ్యమున్న లేజర్లను సృష్టించేందుకు ఖరీదైన పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

క్రోజీర్‌ బృందం… ఈ సమస్యను అధిగమించేందుకు ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేజర్‌లనే ఓ నానో యాంటెన్నా ద్వారా అతితక్కువ ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా చేయగలిగారు. అంటే 405 నానోమీటర్ల కాంతినే… యాంటెన్నా సాయంతో 40 నానోమీటర్ల సైజుకు తగ్గించగలిగారన్నమాట. దీంతో ఒక్క సీడీలోనే మూడు వేల గిగాబైట్ల సమాచారం పట్టే వీలు ఏర్పడింది.

ఈ నానో యాంటెన్నాలో రెండు బంగారు కడ్డీలు ఉంటాయి. రెండింటి మధ్య 30 నానోమీటర్ల ఖాళీ ఉంటుంది. దీనిపైకి లేజర్‌ కాంతి ప్రసారమైనప్పుడు… బంగారు కడ్డీల్లోని ఎలక్ట్రాన్లు ఆవేశ పూరితమవుతాయి. అటుఇటూ కదులుతాయి. ఈ క్రమంలో ధనావేశ కణాలన్నీ ఖాళీకి ఒకవైపు, రుణావేశ కణాలన్నీ మరోవైపు చేరతాయి. నానో కడ్డీలు, ఆవేశపూరిత కణాల కారణంగా ఈమొత్తం వ్యవస్థ ఒక కెపాసిటర్‌ మాదిరిగా పనిచేస్తుంది. లేజర్‌ కిరణాల ద్వారా వస్తున్న శక్తిమొత్తాన్ని రెండింటి మధ్య ఉన్న ఖాళీలో కేంద్రీకృమయ్యేలా చేస్తుంది. ఈ వ్యవస్థను ఆప్టికల్‌ డిస్క్‌లలో ఉపయోగిస్తే… సమాచారాన్ని 40 నానోమీటర్ల స్థాయిలో నిక్షిప్త చేయడం వీలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. బంగారు కడ్డీల స్థానంలో వెండిని ఉపయోగించడం ద్వారా ఒక సీడీలో మరింత ఎక్కువ సమాచారాన్ని పట్టించే వీలు కూడా ఉందని క్రోజీర్‌ అంటున్నారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s