పాడుజిల పైత్యావధానం

అమెరికాలోని కాలిఫోర్నియాలో … ఓ తెలుగువారి కుటుంబం ఇంటి ముందు కారాగింది. పట్టు లుంగీ, పట్టు అంగీ, వేళ్ల నిండా ఉంగరాలు, నుదుటిన రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో ధగధగలాడిపోతూ, మెళ్ళో మువ్వన్నెల ఉత్తరీయాన్ని సవరించుకుంటూ కారు దిగాడు సదరు సరంజామాల యజమాని.
“నమస్కారం పాడుజిల భోగమణి శర్మగారూ! దయచేయండి … మేం కోరగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చినందుకు కృతజ్ఞతలు” ముకుళిత హస్తాలతో ఆహ్వానం పలికాడు ఇంటిపెద్ద.
పాడుజిల భోగమణి శర్మ మందహాసం చేశాడు.
“ఎంత మాట … నిజానికి నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ వినాయక చవితి పండగపూట దేశం కాని దేశంలో తెలుగువారి మధ్య … అందులోనూ తెలుగుతనం ఉట్టిపడుతూ, చూడముచ్చటగా ఉన్న ఈ మహిళల మధ్య మెలగడం నాకు పరామానందంగా ఉంది …”
ఆయన అంత చనువుగా మాట్లాడేసరికి అక్కడ మహిళల్లో బెరుకుతనం తగ్గిపోయింది. “అదికాదు సార్‌! మన రాష్ట్రంలో ఎంతో పేరు తెచ్చుకున్న సహస్రావధానులు మీరు … మీకు ఎంత బిజీ షెడ్యూల్‌ ఉందో మాకు తెలుసు. అందుకే మీరు వస్తారా, రారా అని అనుకుంటూనే ఉన్నాం” అందొక అమ్మాయి చొరవగా.
‘భలే దానివే … మీరింత మంది ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఇంకా ముందే వచ్చేవాణ్ణి’ అమ్మాయి బుగ్గమీద చిటికెవేసి ముందుకు నడిచాడు భోగమణిశర్మ. ఆ అమ్మాయి ఒక్క క్షణం బిత్తరపోయినా ‘ఏదో, పెద్దవాడులే’ అని సరిపెట్టుకుని, ‘సార్‌, పాడుజిల భోగమణి శర్మగారూ!’ అంటూ ఏదో చెప్పబోయింది.
‘నన్నంత పూర్తి పేరుతో పిలవక్కర్లేదు చిట్టీ …!’
‘పోనీ … అంకుల్‌ అనమంటారా!’
‘అంకులూ, పెంకులూ అంటే నాకు చికాకు. శర్మగారూ అనండి చాలు, తియ్యగా ఉంటుంది’ అంటూ ఆ అమ్మాయి నెత్తిమీద సుతారంగా మొట్టికాయ వేశాడు శర్మ. అక్కడున్న మహిళలందరూ మొహమొహాలు చూసుకున్నారు.
లోపల పూజ జరుగుతున్నంతసేపూ శర్మ కళ్ళు ఆ అమ్మాయిని వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో మిషమీద మాటిమాటికీ ఆ అమ్మాయిని పిలిచి పరాచికాలాడ్డం ఆ కుటుంబ సభ్యుల దృష్టిలో పడకపోలేదు.
ఇంటిపెద్ద కోర్కె మేరకు మహాగణపతికి నైవేద్యం సమర్పించాడు శర్మ. అందరూ భోజనాలకి లేచారు. ఇంటావిడ శర్మకి ధగధగలాడే వెండి కంచంలో అన్నం వడ్డించింది.
‘ఇదేదో అల్లుడిగారి కంచంలా ఉందే!’ జోకేశాడు శర్మ ఆ అమ్మాయి వేపు ఓరకంట చూస్తూ. భోజనాలయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుని అందరూ కార్లలో బయల్దేరారు శర్మగారి ప్రోగ్రామ్‌కి.

***
హైదరాబాద్‌లో శర్మ స్థాపించిన సరస్వతీ పీఠం కార్యకలాపాలను వివరించే డివిడి ప్రదర్శన మొదలైంది. శర్మ ఒక్కడూ మరో రూమ్‌లో ఖాళీగా కూర్చున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని శర్మ ఆ అమ్మాయికి కబురుపెట్టాడు రూంలోకి రమ్మని. ఏమిటో అనుకుంటూ ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయితో పాటే మరికొందరు కూడా రూమ్‌లోకి దూరడంతో శర్మ ప్లాన్‌ బెడిసికొట్టింది. ఈలోగా డివిడి ప్రదర్శన పూర్తయింది. శర్మ అవధాన ప్రదర్శనకి వేళయింది.
అందరూ పరుపుల మీద కూర్చున్నారు. శర్మ బాలీసుని ఆనుకుని విలాసంగా చిటికెలు వేశాడు.
‘సభాయనమః… మీ అందరికీ తెలుసు నేను సహస్రావధానినని .. ఎన్ని అవధానాలు చేసినా, మా పీఠం ద్వారా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా తృప్తి తీరడం లేదు. ఇంకా ఏదో చెయ్యాలని … ఏదో చెయ్యాలని … ఏదేదో చెయ్యాలని …’ ఆ అమ్మాయి కేసి చిలిపిగా చూస్తూ ఆగాడు శర్మ …
ఆ అమ్మాయికి కంపరం ఎత్తింది.

‘… మన రాష్ట్రంలో ఎన్ని చేసినా ఈ కండూతి తీరక విదేశాల మీద పడ్డాను’ అంటూ పూర్తి చేశాడు శర్మ.
‘చిత్తం … ఆ కండూతి తమరి నామధేయంలోనే ఉంది కదా స్వామీ!’ అన్నాడో పృచ్ఛకుడు.
శర్మ అతడి వైపు చురుగ్గా చూసి, ‘ఇప్పుడు మనం ఆశుకవిత్వం గురించి చెప్పుకుందాం. ఆశుకవిత్వం అంటే అప్పటికప్పుడు లోపల్లోపల్నించి బైటికి తన్నుకొచ్చే కవితాధార అన్నమాట ..’ ఇంకా ఏదో అనబోతున్న శర్మకి అడ్డు తగిలాడు మరో పృచ్ఛకుడు.
‘అంటే తిన్నది అరక్క తన్నుకొచ్చే వమనం లాంటిదా స్వామీ!’
‘అప్రస్తుత ప్రసంగం అని … ఇది కూడా అవధాన ప్రక్రియలో భాగమే … అంటూ సభికులకు సర్దిచెప్పి ‘ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే నాలో ఆశుకవిత్వం పొంగుకొస్తోంది. ఆలపిస్తాను … అవధరించండి’ అంటూ గొంతు ఎత్తాడు శర్మ.
‘ఫుల్లు మూను లైటటా .. జాస్మిన్ను వైటటా .. మూను కన్న, మొల్ల కన్న, నీదు మోము బ్రైటటా … టా, టా, టా!’ అంటూ ఆ అమ్మాయి వీపు చరిచాడు శర్మ.
ఆ అమ్మాయి చిరాగ్గా కదిలింది. అక్కడున్న మహిళలు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఇంతలో శర్మ జేబులో సెల్‌ఫోన్‌ మోగింది. శర్మ స్క్రీన్‌ మీద నెంబర్‌ చూసి, ‘మన స్టేట్‌ నించి .. మినిస్టరు గారు’ అని జనాంతికంగా చెప్పి ఫోన్‌ సంభాషణ మొదలుపెట్టాడు.
‘హలో … మన పీఠం పక్కన బోలెడు జాగా ఖాళీగా ఉంది కదా అని సరస్వతీ మాతకి కైంకర్యం చేశానండి … మీ డిపార్టుమెంటు వాళ్ళేమో గోల పెడుతున్నారు … కాస్త వాళ్ళ సంగతి చూడండి … మనం, మనం నేనక్కడికి వచ్చాకా మాట్లాడుకుందాం’ అంటూ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు శర్మ. ‘ఇలా ఖాళీ స్థలాన్ని సరస్వతీ మాతకి అర్పించడం, పైవాళ్ళతో సర్దుబాట్లు చేసుకోవడం … ఇవి కూడా నా అవధాన ప్రక్రియలో భాగాలే’ అంటూ ఆ అమ్మాయి తొడమీద చరిచాడు. ఇది చూసి వాళ్ళమ్మ భరించలేక ఎవరికో ఫోన్‌ చేసింది.

‘ఇప్పుడు పుష్పగణనం అని మరో ప్రక్రియ … ఇంతసేపూ నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా … ఇక్కడున్న ఆడాళ్ళ తల్లో పూలన్నీ లెక్కపెట్టేశా! అందరి కొప్పుల్లో, అన్ని రకాల పువ్వులు కలిపి నాలుగొందల ఇరవై ఉన్నాయి. కావాలంటే లెక్కపెట్టుకోండి …’ వెకిలిగా నవ్వుతూ ఆ అమ్మాయి నడుం మీద చెయ్యేశాడు శర్మ.
ఆ అమ్మాయి కోపంతో బుసకొడుతూ చివ్వున నిలబడింది. ఈలోగా పృచ్ఛకుడెవరో ‘స్వామీ … ముక్తపదగ్రస్తంతో ఓ పద్యం చెప్పండి’ అంటూ అడిగాడు.ఠి ఆ అమ్మాయి గట్టిగా అరిచింది.
‘ముక్తపదగ్రస్తంలో ఆ పద్యమేదో నేను సోదాహరణగా చెబుతా! నా కాలి చెప్పుతో వీడి మొహం మీద కొడతా … అదే చెప్పుతో ఆ తర్వాత మా అమ్మ కొడుతుంది … మళ్ళీ అదే చెప్పుతో మా అత్తయ్య … ఆ తర్వాత మా అన్నయ్య … మా నాన్న .. అందరూ ఆ చెప్పుతోనే …’ అంటూ జరగాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
శర్మ లబలబలాడుతూ ‘సరస్వతీ యాగం చేసి మీ అంతు తేలుస్తా’నంటూ బెదిరించాడు. ‘ఇక మీ కార్యక్రమానికి ముక్తాయింపు పలకండి స్వామీ’ అంటూ పృచ్ఛకుడు మార్గనిర్దేశనం చేశాడు.
‘ముక్తాయింపు పలకడానికే మేం వచ్చాం’ అంటూ పోలీసులు రంగప్రవేశం చేశారు.

(రాజగోపాల్ రచన)

ప్రకటనలు

2 thoughts on “పాడుజిల పైత్యావధానం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s