రిజిగ్నేషన్‌ గున్యా

‘అతడు’ సినిమాలో ఒక దృశ్యం…
బ్రహ్మానందం తనది వజ్ర కాయమని చిన్న పిల్లల దగ్గర గొప్పలు పోతుంటాడు. పిల్లల చేత కడుపు మీద కొట్టించుకుని, ‘అమ్మో… చెయ్యి నొప్పెట్టింది బాబాయ్‌!…’ అంటూ పిల్లలు గోల పెడుతుంటే చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు.
సరిగ్గా అప్పుడే మహేష్‌బాబు ఎంటరవుతాడు. మహేష్‌బాబుని చూసి బ్రహ్మానందం “ఏంటీ, నువ్వు కొడతావా? కమాన్‌… బీట్‌మీ యార్‌!” అంటూ సవాలు చేస్తాడు.
మహేష్‌బాబు మొహమాటంగా నవ్వి, పక్కకి తప్పుకుని వెళ్లి పోబోతాడు. బ్రహ్మానందం అతణ్ణి ఆపి, “హలో… కొట్టవయ్యా! ఏం? సిగ్గా … భయమా… గౌరవమా? అని నిలదీస్తాడు.
“సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం కాబోలు” అంటూ పక్కనే ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ పుల్ల వేస్తాడు. బ్రహ్మానందం పెళ్లున నవ్వి తల పట్టుకుంటాడు.
“ఒహ్హొహ్హొ … పార్థూ! మీ పట్నం వాళ్లు ఇంతేనయ్యా…మహా సున్నితంగా ఉంటారు… అదే నీ వయసులో నేను కొడితే గోడలు బద్దలైపోయేవి” పక్కనించి త్రిష వద్దంటూ నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా బ్రహ్మానందం పట్టించుకోడు. మహేష్‌ బాబు బిడియంగా చూసి వెళ్లిపోబోతాడు.
బ్రహ్మానందం సీరియస్సై “ఏంటీ… జాలి చూపిస్తున్నావా? (తన పొట్టని చూపిస్తూ) రాయి… స్టోన్‌… కమాన్‌… కొట్టవయ్యా… కమాన్‌ … హిట్‌ మీ హార్డ్‌ యార్‌!” అంటూ పదేపదే రెచ్చగొడతాడు.
ఇక లాభం లేదని మహేష్‌బాబు పిడికిలి బిగించి, బ్రహ్మానందం పొట్టలో ఒకే ఒక్క పంచ్‌ ఇస్తాడు. బ్రహ్మానందం మొహంలో ప్రేతకళ ఉట్టిపడుతుంది.

***

సరిగ్గా… అలాంటి పంచ్‌… అంతకుమించిన పంచ్‌… కెసిఆర్‌ ఎమ్మెస్‌కి ఇచ్చాడు. దాంతో ఎమ్మెస్‌ కళ్లు బైర్లుకమ్మాయి. కళ్ల ముందు చక్రాలు తిరిగాయి. ఆ చక్రాల్లో ముందురోజు జరిగిన ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తొచ్చింది.

***
ఆ ముందురోజు … ఎమ్మెస్‌కి వైఎస్‌ దగ్గర్నించి ఫోన్‌ వచ్చింది. “ఏంటీ… కెసిఆర్‌ సిద్ధిపేట సభలో మిమ్మల్ని అలా విమర్శిస్తే నోరు మెదపకుండా ఊరుకున్నారేం?” అంటూ వైఎస్‌ కిర్రెక్కించాడు.
“ఏదో … మంత్రి వర్గ విస్తరణ ఉందని… ఈసారైనా నాకు మంచి శాఖ ఇస్తారని నోరు మూసుక్కూర్చున్నాను. లేకపోతే, ఈ పాటికి నాలుగు ఝాడించెయ్యనూ!” ఎమ్మెస్‌ వివరణ ఇచ్చుకున్నాడు.
“తెలంగాణ గురించి మాట్లాడొద్దన్నాను గానీ తిడితే పట్టించుకోవద్దని చెప్పానా?” వైఎస్‌ హింట్‌ ఇచ్చాడు.
ఆ మాటతో ఎమ్మెస్‌ హుషారెక్కిపోయాడు. “మీరా మాత్రం సందు ఇవ్వాలే గానీ… ఇక చూస్కోండి, రెచ్చిపోతా!” అంటూ ఫోన్‌ పెట్టేసి, అప్పటికప్పుడు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి చెలరేగిపోయాడు.
“ఆ కేసీఆర్‌ ఉన్నాడే! మహా మాయగాడు… నిజంగా తెలంగాణ ప్రజల మద్దతు ఉంటే రాజీనామా చేసి కరీంనగర్‌లో నాతో పోటీకి సిద్ధం కావాలి… నేనోడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా… ఆయన ఓడిపోతే ఇక నోరెత్తకూడదు…మొన్న కట్టించాడే విలాసవంతమైన బిల్డింగ్‌…కుంయ్‌, కంయ్‌ మనకుండా అందులో పండుకోవాలి…”
ఇలా దాదాపు గంటసేపు ఎమ్మెస్‌, కెసిఆర్‌ని కడిగిపారేశాడు. ఇదంతా అప్పటికప్పుడు టీవీలో చూసిన కేశవరావు కూడా రెచ్చిపోయాడు. “కెసిఆర్‌ ఎమ్మెస్‌ సవాల్ని స్వీకరించి రాజీనామా చెయ్యాలి. కావాలంటే నేను ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమీషన్‌తో మాట్లాడి, నెలరోజుల్లో ఉప ఎన్నిక పెట్టిస్తా” ఎలక్షన్‌ కమిషన్‌ గాంధీ భవన్‌కి బ్రాంచాఫీసయినట్టు హామీ ఇచ్చేశాడు.

సిద్ధిపేట సభ తర్వాత ఇక ముందు ఏం చేయాలా అని గింజుకుంటున్న కెసిఆర్‌కి “వెదకబోయిన తీగె…”, “ఆడబోయిన తీర్థం..” సామెతలు గుర్తొచ్చి ఎగిరి గంతేయబోయాడు గానీ నడుం సహకరించక ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నాడు. వెంటనే ప్రెస్‌ మీట్‌ పెట్టి కరీంనగర్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. దమ్ముంటే ఎమ్మెస్‌ కూడా రాజీనామా చేసి అన్న మాట నిలబెట్టుకోవాలని బంతిని కాంగ్రెస్‌లోకి ఎడం కాల్తో తన్నాడు.
***
కెసిఆర్‌ ఇచ్చిన పంచ్‌కి కళ్లు తిరిగిన ఎమ్మెస్‌ ఇక చచ్చినట్టు తాను కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాల్సి వచ్చింది. అటు నరేంద్ర, ఇటు షబ్బీర్‌ అలీ కూడా రాజీనామా లేఖల్ని రెడీ చేసుకున్నారు. అప్పటికే ఢిల్లీ నుంచి అక్షింతలు వేయించుకున్న కేకే కూడా రాజీనామాకు మెంటల్‌గా ప్రిపేరయిపోయాడు.

***

ఎమ్మెస్‌ లబోదిబోమని మొత్తుకుంటూ, రాజీనామా లేఖని వైఎస్‌కి ఇచ్చాడు. వైఎస్‌ అదిచూసి జేబులో పెట్టుకొని తాపీగా అన్నాడు.
“అవునుగానీ…పెద్దాయనా! కరీంనగర్‌లో ఉప ఎన్నిక జరిగితే మిమ్మల్నే కేండిడేటుగా పెడతారని మీకు ఏమిటి గ్యారంటీ? మీరు ఢిల్లీకి వెళ్లే అవకాశం లేకుండా చెయ్యడానికే – మీకు చచ్చు క్రీడలు శాఖ కట్టపెట్టిన నేను మిమ్మల్ని ఏకంగా ఎంపి చేసేస్తానా? అమ్మా … ఆశ… దోశ… అప్పడం… వడ…!”
ఎమ్మెస్‌ ఉలిక్కిపడ్డాడు. “అమ్మనా వైఎస్సూ… నన్ను కేబినెట్‌ నించి వదుల్చుకోడానికి ఇంత వ్యూహం పన్నావా? ఎంపీ టికెట్‌ ఇవ్వకపోతే నా బతుకు కరీంనగర్‌ బస్టాండయిపోతుంది. బాబ్బాబు… నా రాజీనామా లేఖ వాపసిచ్చెయ్యి… నీకు పుణ్యముంటుంది…” అంటూ లబలబ లాడాడు.

“డోంట్‌ వర్రీ! మీ రాజీనామాను ఆమోదించడం లేదు లెండి” వైఎస్‌ భరోసా ఇచ్చాడు. ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎమ్మెస్‌ వెళ్లిపోయాడు. *** ఈ రాజీనామాల ప్రహసనం చూస్తున్న వెంకట్రావుకి ఒళ్లు మండిపోయింది. ఆ కోపంలో నిద్ర పోతే ఒక కల వచ్చింది. కెసిఆర్‌, ఎమ్మెస్‌ రాజీనామాల మీద కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడేశాడట వెంకట్రావు. కేసు విచారించే న్యాయమూర్తి కూడా వెంకట్రావే. న్యాయమూర్తి వెంకట్రావు తన తీర్పును ఇలా ప్రకటించాడు. “అయిదేళ్ల పాటు తమకు ప్రాతినిధ్యం వహించమంటూ ప్రజలు వీరిద్దర్నీ చట్ట సభలకు పంపితే … కేవల వ్యక్తిగత ఆవేశకావేశాలకు లోనై వీరిద్దరూ పదవులకు రాజీనామా చేయడం ముమ్మాటికీ ప్రజాద్రోహం. వీరి రాజీనామాల వల్ల వారి వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరిపించాల్సి వస్తే… ఆ ఉప ఎన్నికల్లో తిరిగి వారే పోటీ చేస్తే … అందుకు మళ్లీ కోట ్లకొద్దీ ప్రజాధనాన్ని వినియోగించడం పరమ అన్యాయం… కనుక. కరీంనగర్‌ లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలు రెండింటికి గానీ, లేదా ఏదో ఒక్క స్థానానికి గానీ ఉప ఎన్నిక జరిగితే సదరు ఖర్చు అణాపైసల్తో సహా కెసిఆర్‌ లేదా ఎమ్మెస్‌లే భరించాలని తీర్పు ఇవ్వడమైనది. భవిష్యత్తులో ఇటువంటి ఆవేశపూరిత రాజీనామాలు లేకుండా చేయడానికి ఈ తీర్పును మార్గదర్శకంగా తీసుకుని ఎన్నికల నిబంధనలు మార్చవలసిందిగా పార్లమెంటుకూ, ఎన్నికల కమిషన్‌కూ సూచించడమైనది.”

(రాజగోపాల్ రచన)

ప్రకటనలు

2 thoughts on “రిజిగ్నేషన్‌ గున్యా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s