ఎంతకూ అందని పర్యాటక ఫలాలు (నేడు ‘వరల్డ్‌ టూరిజం డే’)

    …కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల దృష్టిలో టూరిజం అంటే కేవలం విదేశీ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే. ఇటీవల ప్రబలుతున్న మరో అర్థహీనమైన వ్యవహారమేమిటంటే – నాలుగు రోజులు డబ్బుల్ని జల్సాగా ఖర్చుచేసి రావడం కూడా ‘టూరిజ’మే!…

పర్యాటక రంగాన్ని ప్రభుత్వం ఓ పరిశ్రమగా ఏనాడో గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంబంధిత మంత్రిత్వ శాఖలూ ఉన్నాయి. భవిష్యత్తు పర్యాటక రంగానిదే అనే ప్రకటనలు ఏళ్ల తరబడి ఆయా సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే, సహస్రాబ్దాల చరిత్ర, సాంస్కృతిక వారసత్వంగల ఈ దేశంలో నేటికీ అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నది పర్యాటక రంగమే. పర్యాటక రంగాన్ని పాలకులు కేవలం నాలుగు రూకలు రాల్చుకునే మార్గంగా భావిస్తుండటమే అసలు సమస్య. జాతీయతా స్ఫూర్తిని రగిల్చేందుకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేందుకు కూడా ఎంతగానో దోహదం చేసేది పర్యాటక రంగం. చారిత్రక, సామాజిక కోణాలలో పర్యాటక రంగాన్ని బల సుసంపన్నం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరగకపోవడం వల్లే మాణిక్యాల్లా భాసిల్లాల్సిన ప్రదేశాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

మన రాష్ట్రాన్నే చూడండి… చేజెర్లలోని కపోతేశ్వరాలయం నాలుగో శతాబ్దంలో నిర్మించినదని ప్రతీతి. మహాబలిపురం ఆలయం తరవాత ఇదే అత్యంత పురాతన కట్టడమని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. మన రాష్ట్రంలో ఎందరికి చేజెర్ల కపోతేశ్వరాలయం గురించి తెలుసు? గుంటూరు చేరువలోని చేబ్రోలులో ఉన్న అనేక ఆలయాలు ఏడు, ఎనిమిది శతాబ్దాల్లో నిర్మించినవి. దేవాలయాలకు ప్రసిద్ధికెక్కిన తమిళనాడులోని ఆలయాలు పరిమాణంలో పెద్దవేగాని వాటిలో చాలావరకు పది, పదకొండు శతాబ్దాల్లో నిర్మాణమయ్యాయి. అత్యంత పురాతన దేవాలయాలు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు, ఏడు శతాబ్దాలనాటి అద్భుత కళాసంపదల కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ పర్యాటక సంస్థలు నిర్వహించే యాత్రల్లో కూడా వీటి ప్రస్తావన ఉండదు.

సామాన్యుడికి దూరం
మనకున్న దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే, ఈ దేశ సంస్కృతి, నాగరికత, కళా సంపదల్లోని విశిష్టతల గురించి, ఏనాటి నుంచో వర్ధిల్లుతున్న వాటి ప్రాముఖ్యం గురించి తలెత్తుకుని గర్వంగా చెప్పుకోవాలనే ఆలోచన కూడా లేకపోవడం. ఇలాంటి అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందరికీ అందించే చదువులు లేవు. వాటిని వ్యాప్తిలోకి తీసుకువచ్చే సరైన పుస్తకాలు కూడా కరవు. మన రాష్ట్రంలో, మన దేశంలో చూడదగిన ప్రదేశాల సమగ్ర సమాచారాన్ని అందించే యంత్రాంగంగాని, రచనలుగానీ లేనే లేవు. పర్యాటక రంగం సామాన్యుడికి చేరువకాకపోవడానికి కారణమేమిటని వేరెక్కడనో పరిశోధించడం ఎందుకు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల దృష్టిలో టూరిజం అంటే కేవలం విదేశీ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే. ఇటీవల ప్రబలుతున్న మరో అర్థహీనమైన వ్యవహారమేమిటంటే – నాలుగు రోజులు డబ్బుల్ని జల్సాగా ఖర్చుచేసి రావడం కూడా ‘టూరిజ’మే! ప్రజల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనలు కావివి. పర్యాటక రంగాన్ని ఏ తీరున నడిపించాలనే అవగాహన లేకపోవడం నుంచి పుట్టుకొస్తున్న వింత పోకడలే ‘వాటర్‌ స్పోర్ట్స్‌’, ‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’, ‘ఎంటర్టెయిన్‌మెంట్‌ టూరిజం’ తదితర వ్యవహారాలు. అన్నింటా లక్ష్యం ఒకటే – విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించే హోటళ్లు, వసతి గృహాలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున అమల్లో ఉన్న పర్యాటక పథకాలు సామాన్యులకు అందుబాటులో లేవు. చివరికి ప్రభుత్వ పర్యాటక శాఖలు ముద్రించే పుస్తకాలు, కరపత్రాలు కూడా విదేశీ పర్యాటకుల్ని ఉద్దేశించి రాసినవే. ఫలానా దర్శనీయ స్థలానికి చేరేందుకు విమానాల్లో, కార్లలో వెళ్లగల మార్గాల వివరాలు; వసతి గృహాల్లో గదుల అద్దెల వివరాలతో సరి. అక్కడి కట్టడాల ప్రాశస్త్యం క్లుప్తంగా, సామాన్యులకు అర్థం కాని సాంకేతిక భాషలో రాసి ఉంటుంది. పర్యాటక శాఖ వారు ప్రచురించే పుస్తకాల ధరలు సామాన్యుడికి అందవు.

మన గౌరవ నేతలకు, విలాసాలకు అలవాటుపడిన అధికారులకు అర్థం కాని అంశం ఒకటుంది. సుదూర విదేశాల నుంచి ఇక్కడికి చేరుకున్న పర్యాటకులు ఏదో నాలుగు రోజులు అటూ ఇటూ తిరిగి వద్దామనే ఆలోచనతో ఇక్కడికి రారు. మన పర్యాటక శాఖ అందిస్తున్న జలక్రీడలు ఆ దేశాల్లో ఏనాడో పాతబడిపోయాయి. పాశ్చాత్య యాత్రికులైనా, మనదేశంలోని వారైనా యాత్రికుల దృష్టి ప్రాచీన కట్టడాలు, శిల్పాలు వాటి చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యం తెలుసుకోవడం మీద ఉంటుంది. దేవాలయ చరిత్ర, శిల్పం విశిష్టత వంటి వాటిని వివరిస్తుంటే విదేశీ పర్యాటకులకు కలిగే సంతోషాన్ని ప్రత్యక్షంగా అనేక పర్యాయాలు చూశాను. మనదేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు, కట్టడాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి విడివిడిగానైనా వివరించే పుస్తకాలేవీ లేకపోవడం పెద్దలోపం. కాబట్టే భారతదేశానికి వచ్చే విదేశీ యాత్రికులలో ఎక్కువ శాతం కాశ్మీర్‌, లేదంటే రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ మాత్రమే దర్శించి వెనుదిరుగుతారు. కారణం – రాజస్థాన్‌లో ఉన్నవి, చూడదగినవి నాటి మహారాజులు నిర్మించిన కోటలు, భవంతులు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండేది మంచుతో కూడిన పర్వతాల సౌందర్యమే. ఒక ప్రాచీన ఆలయాన్ని సందర్శించే వారు కోరుకునే సూక్ష్మమైన వివరాలు రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పర్యాటకులకు అవసరం లేదు. విదేశీ యాత్రికులు ఆధారపడుతున్న పర్యటన ‘గైడ్‌’లలో ఎక్కువ భాగం రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని దర్శనీయ స్థలాల గురించే ఉంటుంది.

పర్యాటక అభివృద్ధి ప్రణాళికలను విదేశీయులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందించడమంత తెలివితక్కువ పని మరొకటి లేదు. మనదేశంలో ఉన్నన్ని దర్శనీయ, యాత్రా స్థలాలు మరే దేశంలోనూ ఉండవేమో. ఇవన్నీ కేవలం మతపరమైనవి కాదు. ప్రతి జాతికి సంస్కృతి, జీవన విధానం ఉంటాయి. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో అలాంటివి ఉంటాయి. వాటన్నింటినీ చూసి రావడం మానవమాత్రులెవరికీ సాధ్యం కాదు. కాకపోతే, నూరుకోట్లకు మించి జనాభా ఉన్న మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక శాతం మంది – అంటే కనీసం కోటి మంది యాత్రలు చేస్తే… విదేశీ యాత్రికుల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే ఉండదు. విదేశీ యాత్రికుల నుంచి వచ్చే ఆదాయానికి పది రెట్లు ఇక్కడనే లభిస్తుంది. కావాల్సిందల్లా సదాలోచన, కార్యాచరణ. ఏయే ప్రాంతాల్లో ఏయే దర్శనీయ, చారిత్రక నిర్మాణాలు ఉన్నాయో, వాటి విశిష్టత ఏమిటో తెలిపే రచనలు ముందుగా అందుబాటులోకి రావాలి. ఆ కట్టడాల పరిరక్షణకు సశాస్త్రీయంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దర్శనీయ స్థలాలన్నింటికీ నమ్మకమైన రవాణా సౌకర్యాలను కల్పించాలి. విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఖజానా నిండేటంత ఆదాయం వస్తుందంటే సారాయి వ్యాపారం చేయడానికి కూడా వెనకాడని ప్రభుత్వం వారు- కనీసం వ్యాపార దృష్టితోనైనా పర్యాటక స్థలాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తే, నష్టం మాత్రం ఉండదు.

సమైక్యతకు సాధనం

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. అనాది నుంచి మనదేశంలోని వివిధ ప్రాంతాలు దేనికవి గిరిగీసుకుని ఒంటికాయ సొంఠికొమ్ములా ఉండటానికి అలవాటుపడ్డాయి. పొరుగువారి పొడగిట్టని ఈ తత్వం వల్లే విదేశీ దురాక్రమణదార్లకు ఇక్కడి ప్రభువులు లోకువయ్యారు. చివరికి దేశం మొత్తం పరాయిపాలనలోకి వెళ్లిపోయింది. ఈ రోజుకూ మిగిలి ఉన్న సదరు ధోరణుల్ని మార్చడానికి సామాన్య కుటుంబాలనూ యాత్రలు చేసేలా ప్రోత్సహించాలి. మామూలు మనిషికీ అందుబాటులో వసతి సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కొత్త సంస్కృతులు, కొత్త విషయాలు, కొత్త వింతలు, ఆధ్యాత్మికం, ఆనందం, అధ్యయనం… ఇలా ఎన్నింటికో ఉపయోగపడుతూ ఆలోచనల పరంగా సుసంపన్నం చేసే శక్తిమంతమైన సాధనం పర్యాటక రంగం. టూరిజం విదేశీయులను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సిన కార్యక్రమం కాదు. అది మనదేశ ప్రజల మధ్య ప్రగాఢ అనుబంధాన్ని నిర్మించేందుకు సిసలైన సాధనం.           

 (వ్యాసకర్త పి.వి.కె. వసంతకుమార్‌, ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s