అమ్మ చెప్పింది

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ గెస్ట్‌హౌస్‌లోంచి బయటికి వచ్చి, కారెక్కబోతుండగా ఓ దృశ్యం ఆయన్ని ఆకర్షించింది.
వరండాలో ఓ కుర్రాడు ఓ కుక్క తోక పట్టుకుని అదే పనిగా లాగుతున్నాడు.
‘ఏం చేస్తున్నావురా అబ్బాయ్‌!’ దిగ్విజయ్‌సింగ్‌ ఆసక్తిగా అడిగాడు.
‘మరేం లేదు సార్‌! ఈ కుక్కతోక మహా వంకరగా ఉంది. దాన్ని సరిచేద్దామని …’ చెప్పాడు కుర్రాడు. ‘మంచిది. నేనూ ఇప్పుడు అదే పని మీద వెళ్తున్నాను. సాయంత్రానికి మళ్ళీ వస్తాను. మనిద్దరి ప్రయత్నం సఫలం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం’ అని దిగ్విజయ్‌సింగ్‌ కారెక్కి గాంధీభవన్‌కి వెళ్ళిపోయాడు.

***
పిసిసి విస్తృత సమావేశంలో తాను చెప్పదల్చుకున్నది స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు దిగ్విజయ్‌సింగ్‌.
‘తెలంగాణ అంశం చాలా సున్నితమైన వ్యవహారం. దీని గురించి ఇక మీదట ఎవరూ కూడా అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ నోరెత్తడానికి వీల్లేదు. ఇది హైకమాండ్‌ ఆదేశం. దీనికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మేడం సోనియాగాంధీ గారు మరీ మరీ చెప్పమన్నారు. మీకేదైనా చెప్పాలని ఉంటే మొదట పిసిసి అధ్యక్షుడు కేశవరావుకీ, తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌కీ చెప్పుకోండి. అంతేగానీ, మీడియా దగ్గర అనవసరంగా నోరు పారేసుకోకండి.’
డిగ్గీ సాబ్‌ అంత నిక్కచ్చిగా చెప్పాక ఇక ఎవిరకీ మాట్లాడే ధైర్యం లేకపోయింది. దిగ్విజయ్‌సింగ్‌ సమావేశాన్ని ముగించి, లేవబోతుండగా బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. ‘సార్‌! బయట మన ఎంపీలు లగడపాటి, సర్వే సత్యనారాయణల అనుచరులు కొట్టుకుంటున్నారు’ ఓ కార్యకర్త పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు.

దిగ్విజయ్‌, వైఎస్‌, కేశవరావు హడావిడిగా బయటికొచ్చారు. అక్కడ కొంతమంది జుత్తూ జుత్తూ పట్టుకుంటున్నారు. చొక్కాలు చించుకుంటున్నారు. తోసుకుంటున్నారు. నోటి వెంట ఒక్క మాట కూడా బయటికి రానీయకుండా తన్నుకుంటున్నారు. లగడపాటి, సర్వేలు తమ అనుచరుల మూకీ పోట్లాటని మురిపెంగా చూస్తూ నిలబడి ఉన్నారు. ‘ఆగండాగండి … ఏవిటీ గొడవ? మళ్ళీ తెలంగాణ గురించేనా? ఇప్పుడే కదా చెప్పాను, తెలంగాణ ఊసెత్తద్దని .. అప్పుడే పరగడుపా?’ గద్దించాడు దిగ్విజయ్‌సింగ్‌.
‘అమ్మమ్మ .. ఎంత మాట .. మీరంతలా చెప్పాక ఇక మేమెందుకు మాట్లాడతాం? అందుకే సైలంటుగా పోట్లాడుకుంటున్నాం’ వినయంగా సంజాయిషీ చెప్పారు ఎంపీలిద్దరు.
‘అలా మీలో మీరు కొట్టుకోకూడదు. అన్ని ప్రాంతాల వారు ఐకమత్యంగా ఉండాలి. అందరూ బాగుండాలి. సర్వేజనా సుఖినోభవంతు’ హితబోధ చేశాడు దిగ్విజయ్‌సింగ్‌.
‘అంటే, ఒక్క సర్వేగారి మనుషులేనా సుఖంగా ఉండాలి? మా వాళ్ళు ఉండక్కర్లేదా?’ ఉక్రోషంగా అన్నాడు లగడపాటి.
సర్వే సత్యనారాయణ చంకలు గుద్దుకున్నాడు. ‘అద్గదీ… అలా చెప్పండి … లేకపోతే, ఆ పెద్దమనిషి మొన్న నన్ను అన్ని మాట్లంటాడా? నేనట … తల్లి పాలు తాగలేదట … గేదెపాలు తాగానట…’

‘సరే లేవయ్యా! గేదె పాలు అన్నాడు గానీ హెరిటేజ్‌ పాలు అనలేదు కదా!’ వైఎస్‌ సర్ది చెప్పాడు. ‘అదొక్కటే కాదు సార్‌! ఇంకా చాలా తిట్లు తిట్టాడు. అవన్నీ మర్యాదస్తులు, పెద్దమనుషుల ముందు చెప్పేవి కావు’ అన్నాడు సర్వే.
‘అయితే దిగ్విజయ్‌సింగ్‌ గారి చెవిలో చెప్పు’ యథాలాపంగా అన్నాడు వైఎస్‌.
దిగ్విజయ్‌సింగ్‌ మొహం మాడ్చుకున్నాడు. ‘మీ తెలుగు తిట్లు నాకు అర్థం కావుగానీ … ఇలాంటిదేమైనా ఉంటే ముందు కేశవరావుకి చెప్పమన్నాను కదా! ఆయనకి చెప్పు’ అంటూ ముందుకి నడిచాడు. కేశవరావు గడ్డం గోక్కుంటూ ఆయన్ని అనుసరించాడు.

***
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌ని వాళ్ళింటికి లంచ్‌కి ఆహ్వానించాడు. సరేనని వెళ్ళాడు దిగ్విజయ్‌సింగ్‌. ఆ నాయకుడి అర్థాంగి అందరికీ కూల్‌డ్రింక్స్‌ ఇచ్చింది. ఆమెను దిగ్విజయ్‌కి పరిచయం చేశాడు. దిగ్విజయ్‌ నమస్కారం పెట్టి కుశలప్రశ్నలు వేశాడు. అందరూ సోఫాల్లో విశ్రాంతిగా కూర్చుని లోకాభిరామాయణంలో పడ్డారు.
ఇంతలో ఆ నాయకుడికి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా విని, గొంతెత్తి గట్టిగా మాట్లాడసాగాడు ఆ నాయకుడు.
‘అవునయ్యా! అదంటే నాకు పంచ ప్రాణాలు … అదే నా ఊపిరి … అదే నా సర్వస్వం…’
నాయకుడి అర్థాంగి ఉలిక్కిపడి, దిగ్విజయ్‌ వైపు బిత్తర చూపులు చూసింది.
‘ఇన్నాళ్ళూ నా మనసు విప్పి ఎవరితో చెప్పలేదు. ఇప్పుడు పబ్లిగ్గా చెపుతున్నాను … విను! దానికోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం .. కావాలంటే నా ప్రాణాలిచ్చేస్తాను … నా సంసారాన్ని కూడా వదిలేస్తాను…’ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు ఆ నాయకుడు.
నాయకుడి అర్థాంగి బావురుమంది. ‘ఇదెక్కడి ఘోరం? ఏమిటీ అన్యాయం? ఎన్నాళ్ళ నించి సాగుతోందీ భాగోతం? ఎవర్తండీ అది? ఆ టక్కులాడి కోసం నన్ను వదిలేస్తారా? ఇన్నేళ్ళొచ్చి … ఇప్పుడిదేం రోగం? అన్నయ్యగారూ! మీరైనా ఆయనకి బుద్ధి చెప్పండి’ అంటూ ఆమె దిగ్విజయ్‌ కాళ్ళావేళ్ళా పడింది. దిగ్విజయ్‌సింగ్‌ అయోమయంలో పడ్డాడు.

నాయకుడు ఫోన్‌ పెట్టేసి, అర్థాంగి మీద గుయ్‌మని అరిచాడు.
‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టక్కులాడేమిటి? దాంతో నా భాగోతమేమిటి? అసలు నీకేం అర్థమైందని నా శీలాన్ని శంకిస్తున్నావు?’
‘మీరే అన్నారుగా .., అదెవర్తో మీ ప్రాణమని .. మీ ఊపిరని … ఇంకా … ఇంకా ఏమిటన్నయ్య గారూ … (‘సర్వస్వం’ అని గంభీరంగా జవాబిచ్చాడు దిగ్విజయ్‌సింగ్‌) మరేం … సర్వస్వం అనీ …’ ముక్కు చీదింది అర్థాంగి.
నాయకుడు భళ్ళున నవ్వాడు. ‘ఓసి పిచ్చిదానా? అదీ … ఇదీ అంటే ఆడదనుకున్నావా?’ అది అంటే తెలంగాణ’ అంటూ అర్థాంగి చెవిలో గుసగుసగా అన్నాడు.
‘అదీ, ఇదీ అని డొంకతిరుగుడుగా అనేకంటే డైరెక్టుగా తెలంగాణ అని ఏడవ్వొచ్చు కదా!’ అమాయకంగా అడిగింది అర్థాంగి.
‘తెలంగాణ అంటే వీపు చీరేస్తామని హైకమాండ్‌ హెచ్చరించిందే … అందుకని …’
‘బావుంది మీ వరస … అనవసరంగా నా ఏడుపు వేస్టయింది … అదేమిటి అన్నయ్య గారూ! భోం చేయకుండానే వెళ్ళిపోతున్నారు ..?’
‘వద్దమ్మా! నా కడుపు నిండిపోయింది …’ అంటూ హడావిడిగా న్రిష్కమించాడు దిగ్విజయ్‌సింగ్‌.

***
దిగ్విజయ్‌సింగ్‌ గెస్ట్‌హౌస్‌కి వెళ్ళేసరికి, ఇంకా ఆ కుర్రాడు కుక్కతోక పట్టుకుని లాగుతూనే ఉన్నాడు.
‘కుక్కతోక సరి చేశావా?’ అనే ప్రశ్న వెయ్యకుండా రూంలోకి వెళ్ళిపోయాడు దిగ్విజయ్‌సింగ్‌.

ప్రకటనలు

One thought on “అమ్మ చెప్పింది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s