ఆంధ్రాలో ఆ’రోగ’ శాఖా మంత్రిత్వం

కంటికి సైతం ఆనని దోమలు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని సహా రాష్ట్రాలన్నింటిలోనూ ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తూ చెలరేగుతున్నాయి. దేశ ఆరోగ్యవ్యవస్థ దురవస్థలో కొట్టుమిట్టాడుతోందనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో గన్యా, 69 జిల్లాల్లో మలేరియా విజృంభించినా పెద్దగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం… ఢిల్లీలో డెంగీ వ్యాధితో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి మరణించిన తరవాతగానీ మేలుకోలేదు.మన రాష్ట్రంలో నగరాలు మొదలు గిరిజన ప్రాంతాల వరకూ గన్యా, మలేరియా జ్వరాలు వ్యాపించినా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయింది. కానీ ఈ విషయంలో ఢిల్లీలో కదలికను చూసి హఠాత్తుగా మేల్కొని- టాస్క్‌ఫోర్సు, మూడేళ్ల కార్యాచరణ అంటూ కొత్త పల్లవి మొదలు పెట్టింది. సమస్య తీవ్రతను గుర్తించి సత్వరమే స్పందించి కార్యాచరణకు పూనుకోవాల్సిన ప్రభుత్వాలు తమ విధ్యుక్త ధర్మాన్ని విస్మరించడం దురదృష్టకరం. పాలకుల ఉదాసీనత కారణంగా జబ్బులతో కోట్ల ప్రజలు అనారోగ్యం పాలు కావడం ఈ దేశ దౌర్భాగ్యం. గన్యా వ్యాధిని కలిగించే దోమే డెంగీకీ కారణం. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ గన్యా జ్వరాలు వ్యాపించినప్పుడు కేంద్రం అప్రమత్తమై- రాష్ట్రాలను కార్యాచరణకు ఆదేశించి ఉంటే సమస్యకు కొంత పరిష్కారం లభించేది. గన్యా అంత తీవ్రమైందేమీ కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రామ్‌దాస్‌ తేలికగా కొట్టి పారేయడం- ప్రజారోగ్యాన్ని కుంగదీస్తున్న రోగాల నివారణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఎడిస్‌ ఈజిప్టి దోమకాటుతో ఢిల్లీలో ఇప్పుడు ఒక్కసారిగా డెంగీ విస్తరించడం, 41 మంది మరణించడం- ఇందులో 18 మంది ఆసుపత్రి సిబ్బందే కావడం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. దానితో కేంద్రం ఉలిక్కిపడి హడావుడిగా కార్యాచరణకు పూనుకుంది.

అంటురోగాల వ్యాప్తి సమయంలో ఆలస్యంగా మేలుకొని హడావుడి చేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. వాస్తవానికి 1996 అక్టోబరులో ఢిల్లీలో డెంగీ వ్యాధి ఒక్కసారిగా వ్యాపించి 300 మందిని బలిగొంది. ఆ ఒక్క నెలలోనే మరో 7,242 మంది అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో ప్రభుత్వాల పనితీరు సరిగా లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకొని వ్యాధుల నివారణకు తగిన మార్గదర్శకాలను జారీ చేసినా అవి ఇప్పటికీ అమలు కాలేదు. తాజాగా వ్యాధి వ్యాప్తిపై మళ్లీ పిటీషన్‌ దాఖలు కాగా తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదన్న విషయం తెలిసి ఢిల్లీ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

దిగజారుతున్న ప్రజారోగ్యం
మన రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి జి.డి.పి.లో కేవలం 0.79 శాతమే కేటాయించడం ఈ రంగంపై ప్రభుత్వాల అలసత్వాన్నే చాటుతోంది. ఒకవైపు వైద్య రంగం వృద్ధి చెందుతుండగా, మరోవైపు సామాన్యులకు మాత్రం వైద్య సేవలు మృగ్యమవుతున్నాయి. ఇంగ్లాండులో ప్రతి వేయిమంది శిశువుల్లో ఆరుగురు మరణిస్తుంటే మన దేశంలో 70 మంది చనిపోతున్నారు. ఆదివాసీ, దళిత నివాసిత ప్రాంతాల్లో ప్రతి వేయిమందిలో 85 మంది శిశువులు పుట్టకలోనే మరణిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే శిశు మరణాలు భారత్‌లో 50 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో నూటికి 50 శాతం స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం కంటే తాత్కాలిక సాయంతో చేతులు దులుపుకొంటున్నాయి. పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండటం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం, పౌష్టికాహారలేమి తదితర కారణాల వల్ల దేశంలో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో చేరే భారతీయులు తమ సంపాదనలో సగాన్ని వైద్య చికిత్సల కోసమే వెచ్చించాల్సివస్తోందని ప్రపంచ బ్యాంకు ఓ నివేదికలో వెల్లడించింది. ఖర్చులను భరించలేక గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 24 శాతం, పట్టణాల్లో 10 నుంచి 21 శాతం ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళడమే మానేశారని జాతీయ ఆరోగ్య నివేదిక పేర్కొంది. మలేరియా, ఫైలేరియా, డెంగీ, బోదకాలు తదితర వ్యాధుల నిరోధానికి జాతీయ స్థాయిలో పథకాలను భారీగానే రచించారు. కానీ వాస్తవంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందుతున్న సాయం నామమాత్రం. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నిర్ధరణకు దేశంలో కేవలం మూడే పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో దోమల కారణంగా వ్యాపించే వ్యాధులు మన రాష్ట్రంలో అయిదు రెట్లు పెరిగినా ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రక్త నమూనాలను సేకరించి ఏటా అయిదు కోట్ల రూపాయల వ్యయంతో వాటిని పూణెకు విమానంలో పంపించాల్సి వస్తోంది.

దోమల తాకిడి, నీటి కాలుష్యం వల్ల ప్రబలే వ్యాధులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మనదీ ఒకటి. రాష్ట్రంలో దోమల కారణంగా ప్రతి లక్ష మందిలో 53 మంది మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతి వేయిమందిలో 17 మందికి అతిసారం, డయేరియా సోకుతున్నాయి. వాతావరణ పరిస్థితులకు తోడు పారిశుద్ధ్య సమస్యల వల్ల మన రాష్ట్రంలో దోమల బెడద మితిమీరుతోంది. ప్రభుత్వ వైద్య చికిత్స వ్యవస్థను పటిష్ఠపరుస్తామని రెండున్నర ఏళ్ల క్రితం తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌- ఆ దిశగా తీసుకున్న చర్యలు నాస్తి. కొత్తగా ఆరోగ్య కేంద్రాలేవీ ప్రారంభం కాలేదు. బడ్జెట్‌ కేటాయింపులు రోగుల అవసరాల మేరకు గాకుండా మొక్కుబడిగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 2,500 కోట్ల మేరకు అవసరం కాగా ప్రభుత్వం రూ. 2,113 కోట్లను కేటాయించింది. ఇందులో మందులకు కేవలం రూ. 100 కోట్లు, రోగుల సేవలకు మరో వంద కోట్లు మాత్రమే వెచ్చిస్తున్నారు. మిగిలిన మొత్తం జీతభత్యాలకే సరిపోతోంది. నిరుపేదలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు దానిని ప్రారంభించలేదు. నిరుడు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి నగరంలో ఒక సూపర్‌స్పెషాలిటీ, పట్టణాల్లో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని; వైద్యుల, మందుల కొరత తీరుస్తామని హామీ ఇచ్చిన సర్కారు అందులో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా అభాసుపాలైంది. ఏటేటా ఖాళీలకు అనుగుణంగా నియామకాలు జరగాలి. గత ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటికి ఒకేసారి వైద్యుల, సిబ్బంది నియామకాలు చేశారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యుల్లో 80 శాతం, సిబ్బందిలో 70 శాతం స్థానికంగా నివసించడమే లేదు. వ్యాధి ముదిరితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో సరైన చికిత్స సౌకర్యాలు లేవు. బోధనాసుపత్రులలో నిపుణులు, సిబ్బంది, పరికరాలు, మందుల కొరత కారణంగా వైద్యసేవలు మొక్కుబడిగా మారాయి. వ్యాధులు వస్తే ప్రజల వద్దకు వెళ్లి సేవలందించేందుకు వాహన సౌకర్యం లేదు. దోమలు, వర్షాల కారణంగా వచ్చే వ్యాధుల నివారణకు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక నిధి ఉంది. బడ్జెట్‌లో కేటాయింపులూ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో అలాంటి ఏర్పాట్లు లేవు.

మాటలేతప్ప చేతలేవీ?
దోమల నిర్మూలన, వ్యాధుల నివారణకు కావలసింది… చిత్తశుద్ధి, కార్యదీక్ష తప్ప ఉత్తి మాటలు కాదు. కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన పనులు జరగాలి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కిందటి నెల గన్యా వ్యాధి తీవ్రం కావడంతో ప్రభుత్వం వేగంగా కదిలి నివారణ చర్యలు చేపట్టి పక్షం రోజుల్లో దానికి అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు ఆసుపత్రుల సేవలను వినియోగించుకుని విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. మంచినీటి క్లోరినేషన్‌, నీటి నిల్వలపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి చర్యల ద్వారా వ్యాధికి అడ్డుకట్ట వేసింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం దోమల నివారణకు మూడేళ్ల క్రితం హెలికాప్టర్‌ ద్వారా పెద్దయెత్తున ఫాగింగ్‌ నిర్వహించి ప్రజారోగ్య పరిరక్షణలో తన చిత్తశుద్ధిని చాటింది. కర్ణాటకలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు జరిపారు. తమిళనాడులో పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో పారిశుద్ధ్య పనులతో పాటు పెద్దయెత్తున వైద్యశిబిరాలను నిర్వహించారు. రాష్ట్రంలోనూ ఇలాంటి తరహా చర్యలు చేపట్టాలి. ఒక్కసారి ఫాగింగు చేస్తే మూడు నెలల వరకు దోమల బెడద ఉండదు. చెత్తచెదారాన్ని ప్రతి రోజూ తొలగిస్తే, మురుగునీటిని నిరంతరం ప్రవహించేలా చేస్తే లార్వా దశలోనే దోమలను అరికట్టవచ్చు. ఈ కృషిలో స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు, వైద్య విద్యార్థులు, ఎన్‌.సి.సి., ఎన్‌.ఎస్‌.ఎస్‌. ఇతర విభాగాలకు భాగస్వామ్యం కల్పించాలి. ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించాలి. ఖాళీలన్నింటినీ యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి. మందుల బడ్జెట్‌ను మూడు రెట్లు పెంచాలి. దోమల కారణంగా వ్యాధుల నివారణకు ప్రత్యేక నిధి, నైపుణ్యం కలిగిన యంత్రాంగం ఉండాలి. సత్వరమే వ్యాధుల సమాచారం సేకరించి, వైద్యసాయం అందించేందుకు పటుతర సమాచార, రవాణా వ్యవస్థ ఉండాలి. జ్వరాలు, అంటువ్యాధుల బారినపడిన వారి చికిత్స కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలి. రోగాలు, రొష్టుల బారినపడకుండా ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత.. దానిని గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకత్వాలేవైనా ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నట్లే.

ప్రకటనలు

One thought on “ఆంధ్రాలో ఆ’రోగ’ శాఖా మంత్రిత్వం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s