• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 242,082 హిట్లు

దరిద్రపు ఆలోచనలు!

”తెలుగు వీర లేవరా
కక్షబూని సాగరా
గూండా గ్యాంగుల అండగ
కోట్లు కూడబెట్టరా
ఎవడు వీడు ఇచటి వాడు
గడ్డమీది గరీబోడు
తరిమి తరిమి కొట్టరా
తెగని ఆస్తి నీదెరా!”

అంటూ అవకాశవాణి ఉత్సాహపరుస్తుంటే, ‘గరీబ్‌ హటావో’ (పేదల నిర్మూలన) పథకం ఇక్కడ గల్లీ గల్లీలో చకచకా సాగుతుంటే ‘లేదురా ఇటువంటి రాష్ట్రమింకెందు’ అని ఢిల్లీ పెద్దలు అబ్బురపడి పోతున్నారు. భారతదేశం పేదది కాదు, భారతీయులే పేదవాళ్ళు అన్న చెడ్డ పేరు ఇన్నాళ్లూ ఎలాగూ భరించాం… ఇకమీదట భరించడానికి వీల్లేదంటూ నాయకులు ఆవేశపడి పోతుంటే అపార్థం చేసుకోవడం అన్యాయం. పేదవాళ్లు లేని భారతదేశం కోసం వారు తహతహలాడుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటే ‘పరుల కలిమికి పొరలి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్‌’ అన్న మాటలను మహాకవి గురజాడ అప్పారావు నేతలకు సానుభూతిగా అన్నారా అన్న అనుమానం తత్వంగా తలకెక్కుతుంది. ‘గరీబీ హటావో’ అని ఇందిరమ్మ ఒకప్పుడు గర్జించారు. దాంతో దేశ దరిద్రం సంగతి ఏమయినా ఆమె పార్టీకి ఓట్ల దరిద్రం పోయింది. నిజానికి గరీబీ హటావో పథకంలో రెండు దశలున్నాయి. మొదటి దశలో నాయకుల దరిద్రం తీరిపోవాలి. రెండో దశలో ప్రజల దరిద్రానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. ఇంకా మొదటి దశే అనుకున్న మేరకు పూర్తి కాలేదు. వెనకటికి నాయకులూ పేదలుగా ఉండటంవల్ల వాళ్లూ బాగుపడలేదు. అడ్డదారుల్లో ఇతరుల్నీ బాగుపడనీయలేదు. అలనాటి నాయకుల గురించి తెలుసుకున్న ఇప్పటి నాయకులు అటువంటి దుస్థితి తమకు పట్టకూడదనుకున్నారు. ఏదయినా తాము చేసిందే ఇతరులకు చెప్పాలి కదా! అందుకే ముందుగా తమ ఇళ్లనుంచి దరిద్రాన్ని పోగొడుతున్నారు. ఇందుకోసం ఒడలు వంచి, మెడలు వంచి పని చేస్తున్నారు. అందుకే ఎక్కడి భూమీ చాలడం లేదు. ఎవరెన్ని వంకలు పెట్టినా- వాగులూ, వంకలను, చెరువులను, దొరువులను, అడవులను, ఎడారులనూ ఆక్రమించుకుని అక్కడ పేదవాడన్నవాడు కలికానికి కూడా కనిపించకుండా భూములన్నిటినీ కలవారితో కళకళలాడిస్తున్నారు. కావలసినవాళ్లు ధనికులు కావడం కన్నా కావలసిందేముంటుంది? యమర్జన్సీలో ఢిల్లీ సుందరీకరణ కోసం బుల్‌డోజర్లు ఎంత కష్టపడ్దాయి! ఆ కష్టం ఊరకే పోలేదు. ఆ ప్రాంతాల్లో పేదవాళ్లు లేకుండా పోయారు కదా! మళ్లీ ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రభువులు ఊరిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యానికి ఒప్పుకొన్న తరవాత ఏది వచ్చినా పట్టవలసిందే! తప్పదు.

చెరువులు ఆక్రమించుకుంటున్నారని పత్రికల్లో ఒకటే గగ్గోలు. చెరువులు పోతే దెబ్బ తినేది వ్యవసాయమే కదా! దెబ్బ తింటే తిననివ్వండి. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం కష్టపడితే మాత్రం అన్నదాతకు భూములు మింగిన స్వాములకు వచ్చిన ఆదాయంలో ఈషణ్మాత్రమైనా వస్తుందా? అందుకే వ్యవసాయానికి తావు లేకుండా చేయాలని నాయకులు కంకణం కట్టుకున్నారు. దీనిని కాదంటే, వారి గుండె చెరువయిపోతే ఎవరిదీ బాధ్యత?

ప్రాజెక్టుల్లో కమిషన్లూ కొట్టేయనివ్వరు! స్థలాలూ ఆక్రమించుకోనివ్వరు! అందుకే ఈ అభివృద్ధి నిరోధక శక్తులను చూస్తే నాయకులకు ఒళ్ళు మంట. నాయకుల దారిద్య్ర నిర్మూలన పథకాన్ని సహృదయంతో అర్థం చేసుకోబట్టే అనేక చోట్ల రక్షక భటులు వారితో చేతులు కలిపి తక్షణ సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు ధనికులను పెంచే కార్యక్రమం రాష్ట్ర రాజధాని నుంచి జిల్లాలకూ విస్తరిస్తున్నది. ప్రాజెక్టుల కోసం ఎంతోమంది పేదలు నిర్వాసితులవుతున్నారు. నిర్వాసితులయి పేదలయినవారూ ఉన్నారు. నాయకులు కావడమొక్కటే వారు ధనికులు కావడానికి మార్గం. పరిశ్రమల పేరుతో పేదల భూముల్ని లాక్కోవడం కూడా కొంతమంది వ్యక్తులు ధనికులయ్యే టెక్నాలజీలో ఒక భాగమే. రోడ్ల పుణ్యమా అని ధనికులయ్యేవాళ్ళ జీవిత చరిత్రలు రాస్తే రింగు రోడ్డు చాలదు. ఏది కబ్జా, ఏది కాదు అనేదాన్ని మనమేం చెప్పగలం? కాంగ్రెస్‌ పెద్దలే చెప్పాలి. ఉదాహరణకు కోకాపేటలోని 70 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న రైతులంతా కబ్జాదారులేనని వారే చెప్పారు.

ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు అవుతున్నారన్నది కాలం చెల్లిన వాదన. ధనికుల సంఖ్య పెరుగుతూ ఉంటే పేదల సంఖ్య తగ్గుతుందన్నది తాజా రాజా సిద్ధాంతం. ‘దమ్మున్న వాడిదే సొమ్ము’ అన్నదే అమలు అవుతున్న సూత్రం. దోచుకున్నవాడు దాచుకోక పోడు. దాచుకున్నవాడు ధనికుడు కాకపోడు. ధనికులు కావాలన్నదే అసలైన గమ్యం. సంపద భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి దానికింత విలువ.

ఏమాట కామాటే చెప్పాలంటే రాజశేఖరరెడ్డి రాజ్యంలో భూమికి ఉన్న విలువ ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగలేదు. ఇప్పుడు భూమి తన విలువ పెంచుకుంటూ ఆక్రమించుకున్న వారి విలువ కూడా పెంచుతోంది. అందుకే మన నాయకులు పేదల భూములను కారు చౌకగా కొట్టేయడంతోపాటు ప్రభుత్వ జాగాల్లో సైతం పాగా వేస్తున్నారు. ప్రైవేట్‌ సైన్యాలతో కంటికి రెప్పల్లా వాటిని కాపాడుకుంటున్నారు.

వెనకటికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌, జై కిసాన్‌’ అన్నారు. ప్రైవేట్‌ సైన్యాల సాయంతో నాయకులు నోట్ల పంట పండించుకుంటూ ఉంటే అసలు జవాన్‌లూ కిసాన్‌ల అవసరం ఉందాంట?

4 స్పందనలు

 1. అదరగొట్టేశారు.

  –ప్రసాద్
  http://charasala.com/blog/

 2. మీ పాటకు ఏదైనా అవార్డు ఇవ్వవచ్చు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: