ఏ దేవుడికి మొక్కాలి?

దోమలు కుడతాయి. పందులు బురదలో పొర్లుతాయి. అవి వాటి సహజ స్వభావ లక్షణాలు. ఆ అల్పప్రాణులవల్ల బుద్ధిజీవులకు సంక్రమించే మాయదారి రోగాల్ని కాచుకోవాల్సిన పాలక ప్రభువులు పైకి ఏమని బూకరించినా, నిర్లజ్జగా నిజనైజం చాటుకుంటూనే ఉన్నారు! ప్రతివ్యక్తికీ జీవించేందుకు గల హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగంలోని ఇరవై ఒకటో అధికరణ చెబుతోంది. దానిప్రకారం ఆస్పత్రులకు కావాల్సిన అన్నింటినీ ప్రభుత్వాలే సమకూర్చాలని సుప్రీంకోర్టు ఏనాడో నిర్దేశించింది. అందుకు మనసా వాచా కర్మణా నిబద్ధమైనట్లు నమ్మబలుకుతూనే, బాధ్యతను గాలికొదిలేయడంలో బహునేర్పరులు మనపాలిట ఏలికలుగా దాపురించారు!పందుల్ని కుట్టిన దోమలు మనుషుల్లో మెదడువాపు వ్యాధికి కారణమైనా, కసిగా మలేరియా గన్యా డెంగీలను ప్రజ్వరిల్లజేసినా- స్థితప్రజ్ఞ నేతలకు చీమ కుట్టినట్లయినా ఉండదు. విషజ్వరాలు ఎంతగా ప్రబలుతున్నా వాటి ఉనికిని పట్టించుకోరు. జిల్లాల నుంచి వచ్చిన సమాచారమూ రాష్ట్రస్థాయి నివేదికల్లోకి రాకుండా పకడ్బందీ వడపోత నిక్షేపంగా జరిగిపోతుంది. సర్కారీ అలసత్వమే దన్నుగా దోమల సంతతి తెగ పుచ్చిపోతుంటే, రోగాలూ రెచ్చిపోతున్నాయి. అర్భక దోమలు తమ జోలికి రాలేవని దళసరి చర్మధారుల ధీమా! ఏ రకంగానూ ఎటువంటి రక్షణలూ లేని సాధారణ ప్రజానీకానికే గురితప్పని దోమకాట్లు. దేశవ్యాప్తంగా డెంగీ పీడితుల సంఖ్య నాలుగు వేలకు పైబడినా, ఆందోళన చెందాల్సిందేమీ లేదని కేంద్ర సర్కారు జోకొడుతోంది. రాష్ట్రప్రభుత్వానికీ అదే ఆదర్శం. భాగ్యనగరంలోనే, డెంగీ ఉందేమోనని నేతలు అనుమానం వెలిబుచ్చేసరికే- కేసుల సంఖ్య పాతిక దాటిపోయింది. మారుమూల ప్రాంతాల సంగతి వేరే చెప్పేదేముంది?

వై.ఎస్‌. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో విజృంభించిన మలేరియా, ఏజెన్సీ ప్రాంతాల్ని గంగవెర్రులెత్తించింది. జాతీయ మానవహక్కుల సంఘం లెక్కల ప్రకారమే అప్పట్లో రెండువేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏడాదిగా కోరచాస్తున్న గన్యాజ్వరాల పాలబడి బాధితులుగా మిగిలి పొగులుతున్నవారి సంఖ్య కోటికి పైమాటేనని వార్తాకథనాలు వెల్లడిస్తున్నాయి. గన్యా ప్రాణాంతకం కాదని అమాత్యులెందరు ఢంకా బజాయిస్తున్నా- ఆ జ్వరాలకు సుమారు వెయ్యిమంది బలైపోయినట్లు అంచనా. వాస్తవాల్ని మరుగుపరచాలని తపించే జమానాలో ఇప్పుడు డెంగీ వ్యాధి చాపకింద నీరులా రాష్ట్రమంతటా వ్యాపిస్తోంది. ఇదేదో అమాంతం ప్రకోపించడంతో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలు దక్కి ఉండిపోయిందనే వీలు లేనే లేదు. రాష్ట్రంలో డెంగీ విస్తరించే ఆనవాళ్లను పసిగట్టి ఏడు నెలల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘తస్మాత్‌ జాగ్రత్త’ అని హెచ్చరించింది. ఆ సంస్థ సూచనల్ని రాష్ట్ర సర్కారు కడుజాగ్రత్తగా బుట్టదాఖలు చేసింది. తనంతట తానుగా దోమల నివారణ నిమిత్తం డజను ప్రత్యేక బృందాలు నెలకొల్పనున్నట్లు ఆర్భాటంగా కేంద్రానికి లేఖ రాసింది. తరవాత మళ్ళీ ఆ ఊసెత్తితే ఒట్టు! ఉత్తరాంధ్ర, కోస్తా, తెలంగాణ జిల్లాల్లో డెంగీ మరణాలు నాలుగు పదులకు చేరువైనా- పాలకశ్రేణిలో ఇప్పటికీ తొణుకూ బెణుకూ లేదు.

రాష్ట్రంలో గన్యా విషాదం లేనేలేదని బడాయి ఒలకబోసి భ్రష్టుపట్టిన ప్రభుత్వం- డెంగీపైనా అలాంటి తప్పుడు నివేదికను కేంద్రానికి ఇటీవల పంపినట్లు గుప్పుమంది. రోజుల వ్యవధిలోనే సమస్య తీవ్రతపై గగ్గోలు పుట్టాక- తీరిగ్గా మాటమార్చింది. గన్యా, డెంగీ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యమంత్రి సమావేశానికి రంగం సిద్ధమయ్యాక- ఇక్కడ దోమలపై యుద్ధానికి ప్రణాళికను ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యాధుల నివారణకు నిధులు, మందుల కొరత ప్రసక్తే లేదని అలవాటుగా చెప్పేశారు. ఢిల్లీ సమావేశానికి వెళ్ళిన ఆరోగ్యమంత్రి రోశయ్య- రాష్ట్రంలో గన్యా తగ్గిందనీ, మలేరియా డెంగీ కేసులు పెరుగుతున్నాయనీ కేంద్రమంత్రి రామదాస్‌కు విన్నవించారు. పనిలోపనిగా- దోమల మందు జల్లే యంత్రాలు, డెంగీ రోగ నిర్ధారణ పరికరాల కొనుగోలుకు రూ.50కోట్లు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. కేంద్రసాయంతో నిమిత్తమే లేకుండా రోగాల సీజన్‌ మొదట్లోనే సమకూర్చుకోవాల్సిన సామగ్రి ఎప్పటికి ఒనగూడుతుందో, దోమల్ని మట్టుపెట్టే కార్యక్రమం ఏనాటికి పట్టాలకు ఎక్కుతుందో– అంజనంవేసి చెప్పగలవారెవరు?

సరిగ్గా వారం క్రితం, దోమ వ్యాధుల నివారణకు భాగ్యనగరంలో ఒక సదస్సు నిర్వహించారు. అందులో ఎలాంటి బరువూ బాధ్యతా తనపై పడకుండా సర్కారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వ్యాధులు పెచ్చరిల్లడానికి కారణమైన స్థితిగతుల గురించి నోరు విప్పలేదు. ఎక్కడా దేనికీ హామీ ఇవ్వలేదు. అన్ని మున్సిపాలిటీల్లో అర్బన్‌ మలేరియా విభాగాలు ఏర్పాటుచేయాలన్న అధికారుల విజ్ఞప్తికి స్పందన లేదు. బ్లడ్‌బ్యాంకులు, మందులు, పరీక్ష కిట్ల పంపిణీపైనా మౌనవ్రతమే. మరెందుకా సదస్సు అంటే- ప్రభుత్వ స్వీయకర్తవ్య నిర్వహణాదీక్షను లోకానికి చాటేందుకేనేమో! ఆ మర్నాడు జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రముఖంగా వార్తలకు ఎక్కింది. వాహనాలు, మందులు లేకుండా దోమల్ని చంపేదెలాగని కలెక్టర్లు నిలదీస, అమాత్యులు మారుమాట్లాడలేకపోయారు్తే. సూటిగా అడిగితే కష్టంగాని, ధాటిగా ప్రసంగాలు దంచడంలో ఆరితేరిన రాష్ట్ర ఆరోగ్యశాఖామాత్యులు దోమల నివారణ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా చేపట్టాలని ఇటీవలే పిలుపిచ్చారు. ఇంటినీ ఒంటినీ రోగాలు గుల్లచేస్తుంటే అసహాయంగా గొల్లుమంటున్న బాధిత పౌరులు- ప్రాణాలు దక్కించుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెట్టుకూ పుట్టకూ మొక్కుకుంటున్నారు. ఉద్యమాన్ని పలవరిస్తున్న ప్రభుత్వమూ చేతులు ముడుచుక్కూర్చోలేదు. వైద్యసేవల్ని రేయింబగళ్లు పర్యవేక్షించే ఏర్పాట్లపై ఎడాపెడా ఊదరగొట్టడంలో ఏలికలకు క్షణం తీరికలేదు!

నూరు కోట్ల రూపాయల ఖర్చుతో మూడేళ్లలో దోమల నిర్మూలనకు రాష్ట్రప్రభుత్వం తనదైన పద్ధతిలో ప్రతిపాదనలు వండివార్చింది. కేంద్రం నిధులివ్వడం తరువాయి, పథకం అమలు చేసేస్తామన్నట్లుగా ఏకసందడి! వందకోట్లు వచ్చి పడేలోగా చురుగ్గా కొన్ని ఏర్పాట్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రస్థాయిలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతృత్వాన టాస్క్‌ఫోర్సుల ఏర్పాటు ముఖ్యమైనది. ఆయా అధికారుల సారథ్యంలో ఇప్పటికే వ్యాధుల నివారణకు ఉద్దేశించిన సమన్వయ సంఘాలు కొలువుతీరాయి. మలేరియా, గన్యా జ్వరాల నియంత్రణలో చేతగానితనం నిరూపించుకుని అవి చతికిలపడ్డాయి. పరువుమాసిన సంఘాలకు కొత్తపేర్లు పెట్టి జనంపైకి వదలడంలో సర్కారీ చాణక్యానికి సాటిలేదు! ఈ తరహా ‘లౌక్యం’ కొరవడ్డ తక్కిన రాష్ట్రాలు ఉన్నంతలో చర్యలు చేపడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం మెదడువాపు వ్యాధి ఉద్ధృతమైనప్పుడు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దోమలమందు పిచికారీకి హెలికాప్టర్లు వినియోగించింది. ఇప్పటికీ మహారాష్ట్రలో ఏటా ప్రైవేట్‌ సిబ్బందికి ఫాగింగ్‌ పనులు అప్పజెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక సైతం గన్యా విస్తృతిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి వైద్యపరీక్షలు జరిపించాయి. ‘భగవంతుడి పాలన’ సాగుతున్న మన రాష్ట్రంలో అన్నింటికీ దేవుడే దిక్కు! ఇతర రాష్ట్రాల ధాటికి ఉక్కిరిబిక్కిరై అసంఖ్యాకంగా దోమలు చస్తున్నాయి. ఇదమిత్థంగా మానవయత్నం కొరవడ్డ ఇక్కడ, చచ్చేవంతు జనానిది!

పౌరులందరికీ ఉత్తమ వైద్య సదుపాయాలు సమకూరుస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠీకరించి డాక్టర్లను మందుల్ని అందుబాట్లో ఉంచుతామనీ ఊరించింది. మాట తప్పిన జాబితాలోకి అవన్నీ ఏనాడో చేరిపోయాయి. జాతీయ దోమవ్యాధుల నియంత్రణ కార్యక్రమ సంచాలకులకు ఆ సంగతేం తెలుసు? రాష్ట్రంలో గన్యా విజృంభణను అరికట్టేందుకు- ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సత్వర వైద్యం అందాలన్నారు. మందుల పంపిణీ జరగాలనీ సూచించారు. మలేరియా చావులతో మన్యం ప్రాంతం హోరెత్తిపోయినప్పుడు- తప్పెక్కడుందో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏకరువు పెట్టింది. మలాథియాన్‌ చల్లలేదనీ, పారాసెట్‌మాల్‌ మాత్రల్నీ సకాలంలో ఇవ్వలేదనీ తప్పుపట్టింది. అసలు పట్టించుకున్నదెవరు? రక్షిత మంచినీటి సరఫరా మెరుగుపడలేదు. పారిశుద్ధ్యంపైనా, దోమల నివారణ చర్యలపైనా మాటలు జాస్తి, చేతలు నాస్తి. చాలాచోట్ల సీజన్‌ ఆరంభంలో చేపట్టాల్సిన కనీస చర్యలకూ దిక్కులేదు. నిధుల్లేవని పంచాయతీలు మొత్తుకుంటున్నాయి. అది తమ పనికాదని వైద్యారోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది!

దేశంలో ఎనభైశాతం పేదలకు సర్కారీ ఆరోగ్యసేవలు ఎండమావేనని జాతీయ ఆరోగ్య విధాన ముసాయిదా గతంలో ఆక్షేపించింది. ‘ఘనత’ను అనితర సాధ్యమైన రీతిలో ‘సంపూర్ణం’గా మలచుకునేందుకు రాష్ట్ర సర్కారు పంతం పట్టినట్లుంది. కాగల కార్యం గన్యా, డెంగీలు నెరవేరుస్తున్నప్పుడు మోకాలడ్డటం ఎందుకన్నట్లుగా- నిష్క్రియ వెలగబెడుతోంది! పునాది తెగ్గోసుకునే నిర్వాకాలతో ‘నాది’ అని చెప్పుకొనేందుకు ఇంకేం మిగులుతుంది?

(వ్యాసకర్త బాలూ, ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s