లెక్కంటే లెక్కే

“లెక్క చేసే విధము తెలియండీ
అధికారులారా!
లెక్కచేసే విధము తెలియండీ”

అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అంటుంటే “ఏ లెక్కన మిము మెప్పించెదమో” అని అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఆ మధ్య అనంతపురం జిల్లా ప్రసూతి లెక్కల్లో తేడా వచ్చేటప్పటికి గొడవైపోయింది. ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్నవారు 94 శాతం అని నివేదికలో, గట్టిగా నిలదీశాక 80 శాతం అని నోటిమాటల్లో ఓ వైద్యాధికారి చెప్పేసరికి లెక్కల డొంకంతా కదిలిపోయింది. “బాబు లెక్కలు, కాకి లెక్కలు నాకు వద్దు”. నా లెక్కలు నాకు ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి అనేశారు. పురుషులందు పుణ్యపురుషులు అన్న వేమన్న ఇప్పుడు ఉంటే వై.ఎస్‌. ఒత్తిడికి ‘లెక్కలందు రాజ లెక్కలు వేరయా’ అనక తప్పేది కాదు. మొత్తమ్మీద సర్కారీ లెక్కల్లో మా చెడ్డ విప్లవం వచ్చేసింది. ఇప్పటివరకు అధికారిక గణాంకాల గురించి భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రభుత్వ గణాంకాలు నమ్మశక్యం కావని ప్రతిపక్షాలు, పత్రికలు అంటుండేవి. ప్రభుత్వం అవి నూటికి నూరు పాళ్లు నిజమని ఢంకా భజాయిస్తుండేది. ఇప్పుడలా కాదు. ప్రభుత్వ లెక్కలను ప్రభుత్వాధినేతే నమ్మడంలేదు. ‘దాచాలంటే దాగవులే’ అని పాటపాడుతున్నారు. ఇంతకు మించిన (అ)పారదర్శకత ఇంకేముంటుంది? పంచ పాండవులంటే మంచం కోళ్లలో ముగ్గురని చెప్పి రెండు వేళ్లు చూపిన మహానుభావుడే ప్రభుత్వం తరఫున గణాంకాలు వెల్లడించిన తొలి అధికారి అని పరిశోధనలో తేలిపోయింది. మన ఆంధ్రపాలుడికి లెక్కల్లో శ్రీకృష్ణ పరమాత్ముడే స్ఫూర్తి. కాలిక్యులేటర్లు లేకపోబట్టి శిశుపాలుడి ప్రతి తప్పును చేతితో లెక్కపెట్టి వంద తప్పులు కాగానే అతగాడి తలలేపేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారులు కూడా వంద తప్పులు ఎప్పుడు చేస్తారా? వాళ్ల మీద చర్య తీసుకోవాలి అని వై.ఎస్‌. ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఈ లెక్కలో న్యాయం ఉంది. వందమంది దోషులు తప్పించుకొన్నా ఫర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనే కదా న్యాయశాస్త్రం కూడా చెబుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను కేంద్ర ప్రభుత్వం నమ్మకపోవడం ఇంకో పద్ధతి. రెండూ ప్రభుత్వాలే కదా ఇదేంటి అనుకునేవాళ్లు వెర్రివాళ్లు. రాష్ట్రంలో గన్యా లేదు లేదని రాష్ట్ర వైద్యాధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. మెచ్చి మేకతోలు కప్పలేదు కానీ గన్యాతో చచ్చిపోతున్నాం తల్లీ అని వాపోయిన కేరళకు ఆర్థిక సాయం చేసింది కేంద్రం! దాంతో నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా కన్నీళ్లేనా అని అధికారులు నిర్వేదంలో పడిపోయారు. అంకెలు మోసం చేయవనడం తాతలనాటి మాట. ఈ మధ్య అవి కూడా బురిడీలు నేర్చుకొన్నాయి. స్కాముగరిడీలు ఒంటపట్టించుకున్నాయి. ఏ ప్రాజెక్టు చరిత్ర చూసినా లెక్కల్లో సర్కార్‌కు మించిన సర్కార్స్‌ ఇంద్రజాలం అబ్రకబద్ర అంటుంది. ఫలితం అక్షరాలతో అబద్ధం చెబితే తడికబెట్టినట్టు ఉంటుందని, అంకెలతో అబద్ధం చెబితే గోడ కట్టినట్టు ఉంటుందని అనే మాట కూడా అర్థం కోల్పోయింది. అబద్ధాల్లో అంకెలు అక్షరాలా అక్షరాల తాతలయిపోయాయి. అంకెల వెనక ఒక వ్యూహం ఉంటుందని కూడా వెల్లడయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాల విషయంలో కావాలనే తప్పుడు అంచనాలు ఇచ్చామని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు.

కల్యాణానికైనా, లోకకల్యాణానికైనా లెక్కలే ముఖ్యమైనవి. ఎక్కువైనా తక్కువయినా చిక్కులే. పెళ్లిలో మూడు ముళ్లు వేస్తారు. ‘అధికస్య అధిక ఫలం’ అని ఒకటి ఎక్కువ వేసినా, రెండు ముళ్లయినా గట్టిగా వేస్తాను అన్నా మూడ్‌ దెబ్బతింటుంది. వధూవరులు ఏడడుగులు నడవడం కూడా ఇంతే. అత్యుత్యాహంతో పదిహేడు అడుగులు నడిచినా, మోకాళ్ల నొప్పులని రెండడుగులు తగ్గించినా ముడియాదు. మొదటి రాత్రికి ఉన్న సీను రెండో రాత్రికి ఉండదు. మరే రాత్రికీ ఉండదు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు అడిగాడే తప్ప ఎక్కువ అడుగులు అడగలేదు. అప్పుడు రింగ్‌ రోడ్డు పథకం లేదు… భూమికి ఇంత రేటు లేదు అని సన్నాయి నొక్కులు నొక్కేవాళ్లున్నారు అది వేరే సంగతి. లక్ష్మణుడు కూడా రింగ్‌ రోడ్డును దృష్టిలో పెట్టుకుని ఇన్ని అడుగులని లెక్కించి లక్ష్మణరేఖ గీశాడు తప్ప లెక్కలేకుండా కాదు. పౌరాణికాలు తిరగేస్తే లెక్కలు ఇష్టం లేనిది పాండవులకు మాత్రమే. తాము కేవలం అయిదుగురే ఉంటే కౌరవులు వందమంది ఉన్నారు, దేవుడి లెక్క తప్పింది అని పాండవులు బాధపడ్డారు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం అంటూ లెక్కపెట్టి శిక్ష విధించడం కూడా వారిని బాధపెట్టింది. ఈ శిక్షల లెక్కలు ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. లెక్కలంటే తమాషా కాదు. ఒక ప్రభుత్వం పనితీరును ఇంకో ప్రభుత్వంతో పోల్చి డొక్క చించి డోలు కట్టవు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని, తెలుగుదేశం హయాంలో ఎన్ని అని పోల్చి చెబుతూ ఉంటే కొంత పుణ్యకాలం గడిచిపోయింది. ఆ సమయంలో మరికొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అర్థం చేసుకుంటే ఏ ప్రభుత్వమైనా తప్పుడు లెక్కలు చెప్పేది ప్రజా సంక్షేమం కోసమేనని తేటతెల్లమవుతుంది. నిజం చెప్పి జనం బిపి పెంచితే ఆ పాపం ఎవ్వరిదని ప్రభుత్వాలు గుట్టుగా ప్రశ్నిస్తాయి. అప్రియమైన సత్యాలు చెప్పకూడదన్న పూర్వీకుల ఆంతర్యాన్ని మనకు తెలియజేస్తాయి. లెక్కల్లో ఇన్ని చిక్కులుండబట్టే కడుపు చించుకున్నా గొంతు చించుకున్నా క్యాలికులేటర్ల మీదనే బడతాయి. అయినా లెక్కంటే లెక్కే.

(వ్యాసకర్త శంకరనారాయణ, ప్రముఖ పాత్రికేయులు. నాకు అనుసరించ బుద్దేసే శైలుల్లో ఈయన శైలి ఒకటి)

ప్రకటనలు

3 thoughts on “లెక్కంటే లెక్కే

  1. లెక్కచేసే విధము గురించి మాట్లాడుతూ ఈ వ్యాసమూ లెక్క తప్పినట్లుంది.
    పాండవుల అరణ్యవాసం పన్నెండేళ్లేకదా మాస్టారూ…
    రాముని వనవాసం పద్నాలుగేళ్లు.
    ఏమంటారు?

  2. మీ సునిశితమైన పరిశీలనకు నా జోహార్లు. మీరు పన్నెండేళ్ళ తర్వాత అన్న తర్వాత నేనేం అంటాను, అవునంటాను. చరిత్ర ను పురాణాలను మార్చి చెప్పలేము కద. ఇది కూడా ప్రభుత్వ లెక్కలానే ఉంది :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s