ఆరోగ్య’దేవో’భవ

ఎంతయినా వై.ఎస్‌. ఘటికుడు! తనది ‘దేవుడి పాలన’ అన్నారే తప్ప ఏ దేవుడి పాలనో చెప్పలేదు. చెబితే ఓట్ల బ్యాంకుకు తూట్లు పడతాయన్న భయమూ ఆయనకు లేదు. ఎందుకంటే గిట్టని దేవుళ్లమీద రాజకీయ దేవుళ్లనే ముద్రవేయ వచ్చు! కడుపుకింత అన్నంపెట్టే ప్రత్యక్ష దేవతలైన రైతుల్నే రాజకీయ రైతులన్న అధికార గజేంద్రుడు ‘కలడు కలండనెడువాడు కలడో లేడో’ అనిపించుకున్న దేవుళ్లను సైతం ఏ మాట అయినా అనడానికి వెనకాడడు. అయినా సామదాన భేద దండోపాయాలని పురుషార్థాలు నాలుగున్నాయి కాబట్టి ముందు దేవుళ్లను సామరస్యంగా కాంగ్రెస్‌లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే దానం చేస్తాం. మాట వినని దేవుళ్లను దారికి తేవడానికి రెండు పరుషార్థాలు ఎలాగూ ఉన్నాయి!

దేవుడి పాలనలో జబ్బులు ఇంత ఘోరంగా విలయతాండవం చేస్తాయా అన్నది పిచ్చి ప్రశ్న. వరుణుడు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడని కాంగ్రెస్‌ పెద్దలు ఆమధ్య టముకు వేశారు. వై.ఎస్‌.తో పేచీ ఎందుకులెమ్మనో, మేఘమధనం దెబ్బకు భయపడో వరుణుడు నీరుగారిపోయి లొంగిపోతే లొంగిపోవచ్చుగానీ ఆరోగ్యానికి అధిపతి అయిన సూర్యుడు అంత తేలిగ్గా కాంగ్రెస్‌ సంగీతానికి తగ్గట్టు డ్యాన్సు చేస్తాడా? దగ్గరకు చేరిన హనుమంతుడి మూతినే దెబ్బతీసిన పర్సనాలిటీ కదా ఆయనది అని కొందరు అప్రస్తుత ప్రసంగం చేస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ రాజ్యంలో తేడాల్లేవు. జబ్బుల్లోనూ సోషలిజమే. రాష్ట్ర ఆరోగ్యమంత్రి సతీమణికి గన్యా వచ్చినా, ప్రధానమంత్రి మనవళ్లనే డెంగీ వ్యాధి పట్టుకుని పీడించినా కాంగ్రెస్‌ పాలకుల్లో కించిత్తు మార్పు ఉండదు. అపరిశుభ్రతవల్లనే ఈ పాడు జబ్బులు దాపురిస్తున్నాయని తప్పు జనం మీదికే నెట్టివేస్తారు. ఫాగింగ్‌ అన్నవాళ్లను మాటలతో ర్యాగింగ్‌ చేసిగానీ వదలరు! మన చేతిలో ఏముందని! జబ్బుకు కారకుడయిన వాడూ, నయం చేసినవాడూ ఆ పైవాడే కదా!

గన్యా, డెంగీలతో మంచానపడ్డ ఆంధ్రదేశం ‘వైద్యమో రాజశేఖరా’ మందులో రోశయ్యా’ అంటూ రోగాలాపన చేస్తుండడం ఎంత అన్యాయం! అంతా జలయజ్ఞానికే ఖర్చవుతుంటే ఆరోగ్య యజ్ఞానికి డబ్బులెక్కడున్నాయి? ‘కాలక్రమంలో నశించిపోయే శరీరం కోసం అంతంత డబ్బు తగలెయ్యడమెందుకు?’ ‘అయినా లేస్తే మనిషిని కాను డాక్టర్‌నే’ అన్నట్టు ఆరోగ్యమంత్రి రోశయ్య హావభావ విన్యాసాలు చేస్తున్నారు. దప్పికయినప్పుడు ఏ తావులలో బావులు తవ్వాలో నలుగురికీ చూపిస్తున్నారు. ‘భోజనం దేహి రాజేంద్ర’ అన్న కాళిదాసును మించిపోయి ఖాళీదాసుడయిపోయి తక్షణం 50 కోట్లు ఇవ్వండి మహప్రభో’ అని ఆరోగ్యమంత్రుల సమావేశంలో కేంద్రానికి మొరపెట్టుకున్నారు. ఢిల్లీ నుంచి కనక మహాలక్ష్మి కరుణించేవరకు జ్వరపీడితులు కృష్ణా, రామా అనుకోవలసిందేనా!

తెలుగునాడు పెద్దాసుపత్రిగా మారిపోయింది.

‘రామరాజ్యమనుకుంటే దోమరాజ్యమొచ్చెనా?’ అని జనం లబలబలాడిపోతున్నారు. డబ్బుకు జబ్బుకు ముడి తప్పదా? విత్తసిద్ధి అయ్యేదాకా చిత్తశుద్ధి లేదా? ఇబ్బడిముబ్బడిగా జబ్బులతో కుంగి కునారిల్లుతున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా కళకళ లాడేట్టు రమణీయంగా తీర్చిదిద్దగల అధికారులే మనకులేరా! ‘పారాసిటమాల్‌ వేసుకోండి’ అన్న ఉచిత సలహాలు తప్ప వేరే మార్గం లేదా! ఆరోగ్య మంత్రిగా ఉండటానికి తనకు అర్హత లేదని రోశయ్య అన్నారు. ఈ ఒక్క సత్యం చెప్పినందుకు అయినా ఆయన్ను గౌరవ డాక్టర్‌ చేయవచ్చు. ఏదో వినయంతో, అర్హతలు ఉన్నవారిమీద అభిమానంతో రోశయ్య అంతమాట అన్నారుగానీ, అర్హత ఉన్నవారికి పదవులు వచ్చే రోజులా ఇవి?

జనం రోగం కుదిర్చేందుకు ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది! రోగాన్ని కనుక్కుంటే కదా సమస్య? అందువల్ల అది గన్యానో, డెంగీనో తేల్చకుంటే సరి! ఏ జబ్బో నమోదు చేయకుండా ఉంటే సరి! గన్యా వచ్చాక జనం మలేరియాను మర్చిపోయారు. డెంగీ బాగా ప్రబలితే గన్యాను మరిచిపోతారు. ఏ జబ్బుకైనా అదే మందు!

ఫలానా వాడికి ఫలానా జబ్బు ఉందని కేసు హిస్టరీ బయటపెడితే మెంటల్‌ కేసు కింద లెక్క. అందుకే సర్కారు పెద్దలు ‘వస్తే రానీ పోతే పోనీ గన్యాల్‌ డెంగీల్‌’  అని దోమలమీద భారం వేసి ధీమాగా ఉన్నారు. అందుకనే వాటిని రాజకీయ దోమలు అనడంలేదు. పైగా మన రాష్ట్రంలోనే కాదు… ఆ రాష్ట్రంలో డెంగీ ఉంది, ఈ రాష్ట్రంలో డెంగీ ఉంది అని స్టేట్‌మెంట్లు ఇస్తూ ఉంటే చాలు. జనానికి అంతకన్నా ఉపశమనం, ఆనందం ఏముంటాయి? నలుగురితో చావు పెళ్లితో సమానం కదా! ఊరికే టెన్షన్‌ పెంచుకుంటే అందరికీ బి.పి. పెరుగుతుంది. అదో సమస్య. అవినీతి జబ్బుతో పోల్చుకుంటే ఏ జబ్బుకు మాత్రం ఎంత ప్రాధాన్యం ఉంది? అవినీతి అంతర్జాతీయమైన జబ్బు అయితే డెంగీ ఇంకా జాతీయస్థాయి జబ్బే! అందుకే జబ్బుల గురించి పత్రికలు చచ్చు ప్రశ్నలు వేస్తుంటే, పాలకులకు తిక్క రేగుతుంది. డాక్టర్లూ, ప్రొఫెసర్లు, ఐ.ఎ.ఎస్‌.లూ, ఐ.ప.ిఎస్‌.లు, కూడా ఈ మాయదారి జబ్బుల బారిన పడిపోతున్నారని ప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే చిర్రెత్తుకొస్తుంది. జబ్బులు తగ్గేవరకు ఎవరెవరి ఇష్ట దైవాలను వారు ప్రార్థించుకోక ఇదేం అన్యాయం! ఇంతకు మించిన కార్యాచరణ, ధైర్యాచరణ ప్రణాళిక ఏముంటుంది!

ఆరోగ్యదేవోభవ!

(వ్యాసకర్త శంకరనారాయణ, ఈనాడు కోసం)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s