భక్త గద్దరు

“జజ్జనకరి జనారే … మముబ్రోవమనీ చెప్పవే … జనకుజనా జనారే .. సీతమ్మ తల్లీ … బంగారు తల్లీ … హా… హా…”
మందిరంలో సీతాదేవి ఉలిక్కిపడింది. రామదాసు నుంచి కీరవాణి దాకా ఎందరో సంగీతకారులు శ్రావ్యంగా స్వరపరిచిన ఆ్రర్దరసభరిత గీతాన్ని జానపద బాణీలో చెవుల తుప్పు వదిలేలాగా పెడబొబ్బలు పెడుతూ పాడుతున్నదెవరు?
“హనుమా!” పిలిచింది సీతాదేవి లాలనగా.
హనుమంతుడు చెంగున లేచి “తల్లీ … ఆనతింపుము” అన్నాడు నడుం విరుచుకుంటూ.
“బయట ఎవరో గాయక భక్తుడు హృదయ విదారకంగా మొరపెట్టుకుంటున్నాడు. ఆ వైనమేమిటో తెలుసుకోగోరెద …”
“అటులనే తల్లీ …” భక్తిగా తలవంచి నమస్కరించి అదృశ్య రూపంలో బయటికి వచ్చాడు హనుమంతుడు. భద్రాద్రి రామాలయ ప్రాంగణంలో … భక్త జనసందోహం మధ్య … చిందులు వేస్తూ పాడుతున్నాడో గాయకుడు. చింపిరిజుత్తు, గుబురుగడ్డం … భుజం మీద ఎర్రంచు నల్లగొంగళి .. బొడ్డు కింద పంచెకట్టు … చేతిలో ములుకర్ర…
“శ్రీరామ నామం మరువాం .. మరువాం … లాఠీ దెబ్బలకు మేం వెరువాం .. వెరువాం .., వైఎస్సు భరతం పడతాం .. పడతాం … కొబ్బరికాయ కొడతాం, కొడతాం…’ వీరావేశంతో చిందులు తొక్కుతున్నాడా గాయకుడు. రామనామం వినగానే హనుమంతుడి ఒళ్ళు పులకించిపోయింది. భక్తి పారవశ్యంలో మునిగిపోయి, వచ్చిన పని మరిచిపోయి, తాను కూడా గెంతడం ప్రారంభించాడు. కాసేపయ్యాక సీతాదేవి మళ్ళీ పిలిచింది. హనుమంతుడు ఉలిక్కిపడి మళ్ళీ మందిరంలో దూరాడు.
“ఏమిటిది హనుమా! చూసి రమ్మంటే ఆడి వచ్చితివా?” చిరుకోపంగా ప్రశ్నించింది సీతాదేవి. హనుమంతుడు బిక్కమొహం పెట్టబోయాడు గానీ మానవేతర వదన నిర్మాణం మూలంగా సాధ్యపడలేదు. మౌనంగా నిల్చున్నాడు. “నీ వల్ల కాదులే … నారదుణ్ణి పిలుద్దాం” అంటూ నారదుణ్ణి ధ్యానించింది సీతాదేవి. మహతి మీటుతూ ప్రత్యక్షమయ్యాడు నారదుడు.
“తల్లీ … ఆ గాయకుడు మావోయిస్టు పార్టీ మానస పుత్రుడు … గద్దరు నామధేయుడు … ప్రజాయుద్ధ నౌక బిరుదాంకితుడు .. ప్రప్రథమంగా రాముడి గుడి ముంగిట మోకరిల్లాడు … పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల తమ గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన చేస్తున్న గిరిజనులకు బాసటగా నిలబడ్డాడు … వారి పోరాటానికి మీ ఆశీర్వచనాలు కోరుతున్నాడు …” త్రికాల జ్ఞాని అయిన నారదుడు టూకీగా వివరించాడు.
“మొదటిసారి మన గుడికి వచ్చిన ఆ భక్తుడి కోర్కె నెరవేర్చండి స్వామీ” సీతాదేవి రాముడికి సిఫార్సు చేసింది. శ్రీరాముడు అంగీకార సూచకంగా మందహాసం చేశాడు.
“అయితే నేను వెళ్ళి, రాముడు నీ మొర ఆలకించాడని గద్దర్‌కి చెప్పి వస్తా” నంటూ నారదుడు అదృశ్యమై, గద్దర్‌ దగ్గర ప్రత్యక్షమయ్యాడు.
నారదుణ్ణి గుర్తు పట్టేశాడు గద్దర్‌. “నమస్తే, నారదన్నా! గిదేంది ఇట్ల వచ్చినవ్‌?” అంటూ పలకరించాడు. రాముడు వరమిచ్చాడన్న శుభవార్త గద్దర్‌ చెవిన వేశాడు నారదుడు. గద్దర్‌ ఆపాదమస్తకం పులకించి పోయాడు.
“ధన్యుడనైతిని ఓ రామా .. నా పుణ్యం పండెను శ్రీరామా … విప్లవ పార్టీ కేడరును … నీ రాకకు చూసే గద్దరును … పాపీ శిరోమణి వైఎస్సు సర్కార్ని … ఒక్క వేటున కూల్చగ వేడెదనూ … కారుణ్యాలయ కామిత మీడేర్చ కలకాలము నిను కొలిచెదనూ … ధన్యుడ… ధన్యుడ …”
“రాముడు నిన్ను కరుణించాడులే … కాస్సేపు పాట ఆపవయ్యా మగడా! నాకో సందేహం ఉంది. మరేం అనుకోక తీరుస్తావా?” అడిగాడు నారదుడు.
“అడుగన్నా! నీ కడ్డేంది?” హుషారుగా అన్నాడు గద్దర్‌. “మరేం లేదు … నువ్వు నాస్తికుడివి కదా! గుడికెందుకు వచ్చినట్టో?” సూటిగా అడిగేశాడు నారదుడు.
అజ్ఞానిని చూసినట్టు నారదుణ్ణి జాలిగా చూసి చెప్పాడు గద్దర్‌. “చూడన్నా! మీ దేవ రహస్యాల్లాగే మాక్కూడా కొన్ని విప్లవ రహస్యాలు ఉంటాయి. సాటి గాయకుడివి కాబట్టి చెబుతున్నాను. విను … గుళ్ళూ, గోపురాలు, పూజలూ, పునస్కారాలు ఇవన్నీ జనం సంస్కృతిలో భాగమే … జనంతో పాటే మనం .. గుడికొచ్చినంత మాత్రాన పోరాటాలు ఆపం కదన్నా! దేని దారి దానిదే …”
“మరేం … కవి అన్నాక కాసింత విప్లవ పోషణ కూడా ఉండాలి” సమర్థించాడు నారదుడు. గద్దరు సలాం కొట్టి బయల్దేరబోతుండగా నారదుడు ఆపాడు. “చూడు నాయనా! ఎలాగూ తెలంగాణలో ఉన్న భద్రాద్రికి వచ్చావు. అలాగే రాయలసీమలో వేంచేసి ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారినీ, ఆంధ్రలో అవతరించిన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహం వారిని కూడా దర్శించుకుంటే తరిస్తావు. ఆ ప్రాంతాల్లో కూడా నీకు అభిమానులు ఉన్నారు కదా!” సలహా ఇచ్చాడు నారదుడు.
“మస్తు అయిడియా ఇచ్చినావన్నా! గిప్పుడే బయల్దేరతా … రామదండ్రామదండెన్నీయల్లో .. రామ సక్కనిదీ దండెన్నీయల్లో .. పాడుకుంటూ బయల్దేరాడు గద్దర్‌.
***
నారదుడు చెప్పినట్టే సింహాచలం వెళ్ళి, అప్పన్నని దర్శించుకుని, కప్ప స్తంభం కౌగలించుకుని, అక్కడ్నించి తిరుపతి చేరుకున్నాడు గద్దర్‌. తిరుమల కొండ ఎక్కబోతూ, అలిపిరి దగ్గర కాస్సేపాగి, ఆ ప్రదేశాన్ని కలయచూసి, ‘ప్చ్‌!’ అనుకుని భారంగా ఓ నిట్టూర్పు వదిలాడు. తిరుమల ఆలయాన్ని చేరుకుని పాట అందుకున్నాడు.
“తందనానా ఆహి … తందనానా … పురే … తందనానా .. భళా … తందనానా .. లక్ష్యమొక్కటే .. మన లక్ష్యమొక్కటే … సర్కార్‌ కూల్చుటొక్కటే …” అలా ఎంతసేపు చిందులు తొక్కినా తిరుమలేశుడు కరుణించలేదు. గద్దర్‌ మరో పాట ప్రారంభించాడు. “ఏడు కొండల స్వామీ, ఎక్కడున్నావయ్యా, ఎన్ని స్టెప్స్‌ వేసినా కానరావేమయ్యా …”
నారదుడు ప్రత్యక్షమయ్యాడు.
“గిదేంది నారదన్నా! మల్లొచ్చినావు … భూలోకంలోనే సెటిలై పోయినావా … లేకుంటే ఏదన్నా మీడియాలో ఉద్యోగం గినా వచ్చిందా?” ఆరా తీశాడు గద్దర్‌.
“ఆ వెంకన్నస్వామి కూడా నిన్ను ఆశీర్వదించాడు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను.”
“హమ్మయ్య .. బతికించినవ్‌ … నువ్వు చెప్పినట్టే మూడు ప్రాంతాల్లో గుళ్ళు తిరిగాను … ఇక హైదరాబాద్‌ పోతా” వెళ్ళబోతున్న గద్దర్ని ఆపాడు నారదుడు.
“మరో సమస్య తలెత్తే ప్రమాదం ఉంది గద్దర్‌! నువ్వు మూడు ప్రాంతాల్లోనూ వైష్ణవ ఆలయాల్ని మాత్రమే సందర్శిస్తే శివుడు .. పాపం … చిన్న బుచ్చుకోడూ! వేములవాడ రాజన్ననీ, శ్రీశైలం మల్లికార్జునుడినీ, ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి కూడా పలకరించి వస్తే ఓ పనైపోతుంది కదా!”
గద్దర్‌ ఆలోచనలో పడ్డాడు. “గంతేనంటావా నారదన్నా!” అన్నాడు.
“అంతేనా అంటే అంతేకాదు. ఇంకా చాలా ఉంది. మనం ఆడదేవుళ్ళతో పేచీ పెట్టుకోకూడదు. బెజవాడ కనకదుర్గమ్మ, అనకాపల్లి నూకాలమ్మ, విశాఖ కనకమాలక్ష్మి … ఇలా ఊరూరా అమ్మవార్లు ఎందరో ఉన్నారు. ఆ తల్లుల ఆశీర్వచనం కూడా కావాలి కదా!”
గద్దర్‌ ఏడుపు మొహం పెట్టాడు. నారదుడు తన వాగ్ధాటి కొనసాగించాడు.
“పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడి భద్రాద్రి వెళ్ళావు. బాగానే ఉంది. మరి మిగతా ప్రాజెక్టుల నిర్వాసితుల మాటేమిటి? వాళ్ళ తరఫున కూడా అక్కడున్న దేవుళ్ళకి మొక్కితే వాళ్ళ పోరాటాలు కూడా సఫలమవుతాయి కదా! ఉదాహరణకి … బాక్సయిట్‌ తవ్వకాలు వద్దంటున్న విశాఖ ఏజెన్సీ గిరిజనుల తరఫున పాడేరు మోదకొండమ్మకీ … తోటపల్లి నిర్వాసితుల తరఫున విజయనగరం పైడితల్లికీ …”
గద్దర్‌ పిచ్చిచూపులు చూస్తున్నా నారదుడు చెప్పడం ఆపలేదు.
“అసలు సంగతి మర్చిపోయానయ్యా గద్దరూ! పోరాటాలు చేస్తున్న ప్రజల్లో అన్ని మతాల వారూ ఉంటారు కాబట్టి చర్చిలకీ, దర్గాలకీ, గురుద్వారాలకీ కూడా వెళ్ళడం మర్చిపోకు సుమా!” అన్నాడు.
అప్పటికే గద్దర్‌ కిందపడి బ్రహ్మానందంలా గిలగిల కొట్టుకుంటున్నాడు.

(కిండల్ కర్త, రాజగోపాల్)

ప్రకటనలు

6 thoughts on “భక్త గద్దరు

  1. హ హ హ, బలే ఉంది. గద్దరు గారికి హటాత్తుగా తను పోరాడుతున్నది కేవలం తెలంగాణ కోసమే నని, రాష్ట్రంలో పీడిత ప్రజలందరు ఇక్కడే ఉన్నారని అనిపించినట్లుంది. నాకిప్పటికి ఒక అనుమానం, గద్దరు డబ్బులు ఎలా సంపాదిస్తున్న్నాడబ్బా? ఆ బొజ్జ చూస్తే బాగానే పూజ జరుగుతున్నట్లు ఉందే? అది వాపా? బలుపా?

  2. రాములన్నా గంతా ఫీల్ కామాకే. గద్దరన్న అంటే నాకూ అభిమానమే. ఒకప్పుడు పదెకాలున్న ఆసాములు..ఇప్పుడు బిచ్చపోల్ల లెక్కన తయారయ్యిండ్రు. రాష్ట్రమంతా రైతులు ఆత్మ హత్య చేసుకొంటూ కరువు కాటకాలతో అల్లాడుతూంటే. రైతులను దగా చేస్తున్న దళారులను వదిలేసి, భూకబ్జాలు, రోగాలు, నీరక్షరాస్యత, నిరుద్యోగ సమస్యల కన్నా రాష్ట్రాన్ని చీల్చడం..అంత ముఖ్యమా? ఆత్మ గౌరవం పేరుతో రేపు ఈ నీతి లేని నాయకులు రాష్ట్రాన్ని చీలిస్తే..సమస్యలు తీరటం కాదు..మొదలౌతాయి.

  3. రవి, సరిగ్గా నీలాంటి వారి కోసమే “మంగు రాజగోపాల్” సరదా రచనల్ని నా బ్లాగులో భధ్రపరిచాను. నా సరదా సెక్షన్ లో రాజగోపాల్ రచించిన మరిన్ని ఆసక్తికర హాస్యపూరితమైన రచనలు ఉన్నాయి. చదివి హాయిగా నవ్వుకోండి :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s