“ఇందిరా గాంధీయిజం”

గెలిచిన పార్టీ వారిమీద కేసులా?వారిమీద విచారణలా?వారికీ కోర్టు శిక్షలా?వారికి క్షమాభిక్ష పెట్టుకోవలసిన దుస్థితి రావడమా?అయినా చెల్లకపోవడమా? ఎంతమాట! ఇదేం ప్రజాస్వామం?

ఇంతకుమించిన అన్యాయం ఏముంది? అధికారపక్షానికి కాలూచేయీ (కనీసం చెయ్యి) ఆడని పరిస్థితి కల్పిస్తే… కారే కన్నీటికి ఎవరు బాధ్యులు? దానికి ఏ ప్రాజెక్ట్‌ కట్టగలం? రిగ్గింగూ చేయనివ్వరు… రింగ్‌రోడ్డూ వేయనివ్వరు అంటూ చేతివాటం ఉన్నవాళ్లు లబోదిబోమంటుంటే వారికి ఉపశమనం ఎలా అన్న విషయం ఆలోచించరేం? అడగందే అమ్మయినా పెట్టదు కదా! అందుకే అమ్మను అడిగిచూద్దామని అనుకోరేం! ఢిల్లీకి బాధయాత్ర చేయడానికి పూనుకోరేం? పోరాడితే పొయ్యేది ‘సంకెళ్లే గదా’.

గెలిచిన పార్టీవాళ్లమీద పాత కేసులు రద్దు… కొత్త కేసులు చెల్లవు అని ఒక్క రాజ్యాంగ సవరణ చేస్తే భవిష్యత్తులోనూ ఇక ఏ రాజ్యాంగ సవరణా అవసరం ఉండదు! జైళ్లు కూడా నోళ్లు తెరిచి ఆవలిస్తూ చక్కగా ఈగలు తోలుకోవచ్చు. కొత్తకోర్టుల అవసరం ఉండదు. కొత్త పోలీస్‌స్టేషన్ల సంగతి దేవుడెరుగు ఉన్న పోలీసుస్టేషన్లకు పొగపెట్టినా ఇబ్బందీ ఉండదు. సెల్‌ఫోన్లకు గిరాకీ తగ్గినా బాధ పడవలసిందేముంది? అయినవాళ్ల కళ్లలో తృప్తి చూసుకుంటుంటే ఏ బాధ ఉంటుంది?

భారతీయ శిక్షాస్మృతిని భిక్షాస్మృతిగా మారిస్తే ఏ చిక్కులూ ఉండవు. ‘క్షమాభిక్ష వ్యవహారంలో అంతా నా మనస్సాక్షికే వదిలేయండి’ అని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అనగానే అలా రెచ్చిపోతున్నారేం? ఇదీ ఇందిరమ్మ రాజ్యం ఇలాకానే అనుకోరేం? 1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డిని ఓడించి వి.వి.గిరిని గెలిపించడానికి అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయమని ఇందిరాగాంధీ అడిగారు! ఇద్దరూ తెలుగువాళ్లే. ఎవరిని గెలిపించాలి? ఎవరిని ఓడించాలి అని మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు జుట్టు పీక్కోకుండా ఇందిరమ్మ అంతరాత్మ ప్రబోధం ప్రకారమే ఓటు చేశారు. గంధర్వుల లెవెల్లో కాగల కార్యం తీర్చారు. అదెంత క్లిక్‌ అయింది? ‘నమ్మినబంటునురా! అమ్మకు నమ్మినబంటును రా! ‘అంటున్న అచ్చమైన ఇందిరాగాంధేయవాది డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ఇప్పుడు మనస్సాక్షి సిద్ధాంతాన్ని (ర)సమయానుకూలంగా బయటికి తీశారు. తప్పేంది? కేసులు, విచారణలు శిక్షల ఛాదస్తాలన్నీ తొలగించడానికి ఏ కేసుల్లోనయినా తుదినిర్ణయాన్ని వారి మనస్సాక్షికే వదిలివేయడం, పొరపాటున నిందితుడివే అని మనస్సాక్షి చెబితే శిక్షకింద గంగలో మునిగిరమ్మనడం వంటివి విధించాలి. గంగలో మునిగివస్తే అన్ని పాపాలు ప్రక్షాళనమయిపోతాయని అనాదిగా ఉన్న విశ్వాసాన్ని ఇలా ఉపయోగించుకోవాలి. అలాగే కష్టనష్టాలకోర్చి సాక్షులను రప్పించడం, వారిని నిందితులుగానీ వారి తరఫువారుకానీ బెదిరిస్తారనో అదిలిస్తారనో భయపడటమెందుకు? నిజం కక్కించడానికి నిందితులకు లైడిటెక్టర్లను తెప్పించి పరీక్షలు పెట్టడం ఎందుకు? ‘మీ పిల్లలమీద ఒట్టేసి నిజం చెప్పండి’ అంటే నిజం చెబుతారు.

ఫైళ్లు రైళ్ల స్పీడులో వచ్చిపోతుంటే చదివి సంతకంపెట్టడానికి తీరిక లేని పాలకులు ఎంత హాయి పొందుతారు! అయినా ఓ ఫైలును చదవకుండా సంతకం పెట్టానని మన ముఖ్యమంత్రి అన్నందుకు ఎందుకంత గగ్గోలు! గౌరు గుట్టుపై ఎందుకా రోకటిపోటు? చదవకుండా సంతకం పెట్టారన్న బాధ ప్రతిపక్షాలకే కాదు, అంతకన్నా ఎక్కువ బాధ వై.ఎస్‌. అనుచరులకూ ఉంది! గిట్టనివాళ్లు ఎవరయినా రాజశేఖరరెడ్డి రాజీనామా పత్రం రాసి అది సి.ఎం. టేబుల్‌మీదికి వచ్చేట్టు చేస్తే, దానిమీద వై.ఎస్‌. చూడకుండా ఆటోగ్రాఫ్‌ పడేస్తే కొంపమునుగుతుందే అన్నదే వారి దిగులు! ఇటువంటి షార్ట్‌(సర్క్యూట్‌)కట్టులు జరిగితే తల ఏ గోడకు కొట్టుకోవాలన్నది దిక్కుతోచని విషయం!

ఒక చెంపమీద కొడితే ఇంకొక చెంపను చూపించాలన్న గాంధీజీని కాంగ్రెస్‌ పాలకులు మరచిపోలేకుండా ఉన్నారు. అది గాంధీజీ బతికున్న సత్తెకాలనికి సరిపోయింది. గాంధీలు మారిపోతూ కొత్త కొత్త గాంధీలు రాజకీయ రంగప్రవేశం చేస్తూ ఉంటే ఈ కాలానికి బాపూజీ మాట అచ్చుగుద్దినట్టు ఎలా సరిపోతుంది? దానిని అవసరాలకు తగ్గట్టు మార్చుకోక తప్పదు!తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షం వాళ్లు ఒక ధర్నా చేస్తే దాన్ని దెబ్బతీయడానికి అధికారం పక్షంవాళ్లు రెండు ధర్నాలు చేయాలి? వాళ్లు దున్నపోతును ఊరేగిస్తే మనం గాడిదలను, కుక్కలను పెట్టి ఊరేగించాలి. ఎదుటివాళ్లు ఒక ఫిర్యాదు చేయాలనుకుంటే, వారికన్నా ముందుగా మనమే రెండు ఫిర్యాదులు చేయాలి. రాయికి రాయే జవాబు.

దెబ్బకు దెబ్బ అన్నట్టు బ్రేకుల్లేకుండా బండి లాగించాలి. దీన్ని కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే పరిమితం చేస్తే సంకుచిత దృక్పథం అనే చెడ్డపేరు వస్తుంది. కాబట్టి పరిధిని పెంచాలి. అడ్డువచ్చేవారు అటార్నీ జనరల్‌ అయినా వదలకూడదన్న సూత్రాన్ని రాజభక్తుల్లో నూరిపోయాలి.

గాంధీకి గాంధీయే మందు. ఒక చెంపమీద ఎవరు కొట్టకపోతే గాంధీయిజం ఎక్కడుంది, నేరగాళ్లు ఎక్కడుంటారు? అందువల్లనే వారి మంచిచెడ్డలు చూసుకోవలసిన పవిత్ర బాధ్యత నాయకులమీద ఉంది! కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక నాయకుణ్ని వై.ఎస్‌. పరామర్శించినందుకు ఎంత గొడవ జరిగింది! గాంధీయిజంవల్ల ఎన్ని కష్టాలు వచ్చాయని కాంగ్రెస్‌వాళ్లు ఎంత బాధపడ్డారు! ఇటువంటి కష్టాలన్నీ పోవడానికి కావలసిన రీతిలో రాజ్యాంగ సవరణే రాజమార్గం. ఆలస్యం ఎందుకు?

(వ్యాసం శంభూది, ఈనాడు కోసం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: