అరుదైన పత్రిక ‘తెలుగు విద్యార్థి’

ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండగా ఒక పత్రికను ప్రారంభించి యాభై ఏళ్లకు పైగా అనవరతంగా ఒక్క సంచిక తప్పకుండా, ఆలస్యమన్నది అస్సలు లేకుండా నడుపుతూ రావడం తెలుగు పత్రికా చరిత్రలో అరుదైన విషయం. ఆ వ్యక్తి కొల్లూరి కోటేశ్వరరావు. ఆ పత్రిక ‘తెలుగు విద్యార్థి’. 1953లో ఎస్‌ఎస్‌ ఎల్‌సి విద్యార్థిగా ఉండగా అప్పుడు పుంఖాను పుంఖాలుగా వెలు వడుతున్న డిటెక్టివ్‌ నవలా సాహిత్యం వైపు నుంచి మంచి సాహిత్యం వైపు విద్యార్థులను మళ్లించాలన్న లక్ష్యంతో కోటేశ్వరరావు పత్రిక ప్రారంభించారు. నిజానికి పత్రికను ప్రారంభించి నడిపే శక్తి ఏమాత్రం లేని వ్యక్తి ఆయన. కృష్ణా జిల్లా ఘంటశాల మండలం కొత్తపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో 11వ సంతానంగా జన్మించిన కోటేశ్వరరావు ఉన్నత పాఠశాలలో చదివేందుకు డబ్బులు లేక అన్న వెంకయ్య వద్ద వడ్రంగం పనిలో చేరాడు.

గొట్టిపాటి బ్రహ్మయ్య చలవతో హైస్కూలు చదువు కొనసాగించాడు. ఎస్‌ఎస్‌ ఎల్‌సిలో ఉండగా పత్రిక ప్రారంభించాలన్న ఆశయం ఏర్పడింది. చేతిలో డబ్బులేదు. ఘంటశాల, ఘంటశాలపాలెం, కొత్తపల్లి, కొడాలి, మొవ్వ, కోసూరు, కాజ మొదలైన గ్రామాలకు వెళ్లి అంద రికీ తన ఆశయాన్ని గురించి వివరించారు. మొత్తం మీద 300 మందిని చందా దారులుగా చేర్చుకున్నారు. తన ప్రాంతం వారి అండదండలతో ఆ విధంగా అప్పట్లో లక్నో విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆచార్య నరేంద్రదేవ్‌ ముఖచిత్రంతో ‘తెలుగు విద్యార్థి’ మాస పత్రిక మొట్టమొదటి సంచిక వెలువడింది. పత్రిక నడపడం తప్ప వేరే వ్యాపకం లేదాయనకు. ఆనాటికీ ఈనాటికీ అదొక కుటుంబ పరిశ్రమ. కుటీర పరిశ్రమ. ‘ఆంధ్ర విద్యార్థి’ అన్న పేరు పెట్టాలని ఆలోచించారు. అప్పటికి ‘ఆంధ్ర’ అంటే తెలుగు వారందరికీ సంబంధించిన పేరే. అయినా పత్రిక జాతి పరమైంది కాదు భాషా పరమైందన్న ఉదాత్తభావనవైపు కోటేశ్వరరావు మొగ్గారు.

‘తెలుగు విద్యార్థి’ అనిపేరు స్థిరపరచారు. గత 53 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు ఎదురు నిలిచినా, దాడులు, దౌర్జన్యాలు (వంగవీటి మోహనరంగ హత్యానంతర అల్లర్లు, లూటీల్లో మచిలీపట్టణంలో తెలుగు విద్యా ర్థి పత్రిక పాత ప్రతుల పెన్నిధిని తగులబెట్టారు) ఏవీ పత్రికను ఆపలేకపోయాయి. తెలుగు విద్యార్థి అంటే ఇంతకాలంగా ఆగకుం డా కొట్టుకుంటున్న కోటేశ్వరరావు గుండె. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు ఇంతగా దగ్గరైన పత్రి క మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులకు, యువతకు విజ్ఞానాన్ని అందించేందుకు ప్రచురించవలసిన అంశాల గురించి తెలుసుకుంటూ, రాయించుకుంటూ, ప్రచురించుకుంటూ పోయేం దుకు కొల్లూరి కోటేశ్వరరావు ఎంతో మంది విద్యావేత్తలను, మేధా వులను ఆశ్రయించారు.

విద్యకు సంబంధించి ‘విద్యార్థి’ ప్రచురిం చని విషయమే లేదు. పత్రిక చదివేవారు, పత్రికలో తమ రచనల్ని ప్రచురించేవారు రాష్ట్రమంతా ఉన్నారు. తర్వాతి కాలంలో సము న్నత స్థాయికి ఎదిగిన కవి రచయితలు, విద్యావేత్తలు, చరిత్రకా రులు, మేధావులెందరో తొలినాళ్లలో ‘తెలుగు విద్యార్థిలో’ తమ రచనల్ని ప్రచురించారు. విశ్వనాథ, చలం, దాశరథి, కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, సంజీవదేవ్‌, రావూరి భరద్వాజ, ఎబికె. ప్రసాద్‌ వంటి కవి రచయితలు, మామిడిపూడి వెంకట రంగయ్య, జి. రామిరెడ్డి, ఆవుల సాంబశివరావు, పైడి లక్ష్మయ్య, విఎస్‌. కృష్ణ, ఆర్వీఆర్‌. చంద్రశేఖరరావు వంటి విద్యావేత్తలు, న్యాయకోవిదులు, చరిత్రకారులు తెలుగు విద్యార్థి ద్వారా తమ ఆలోచనల్ని విద్యా ర్థులకు అందించిన వారే. విద్యారంగంలో ‘తెలుగు విద్యార్థి’ వేసిన ముద్ర చెరగనది. భారతదేశం కీర్తి ఖండాంతరాలలో చాటిచెప్పిన తత్త్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, చరిత్రకారులు, విద్యావేత్త మామిడిపూడి వెంకట రంగయ్య, విఖ్యాత శాస్త్రవేత్త సూరి భగ వంతం, డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతరామయ్య వంటి పెద్దలు తెలుగు విద్యార్థిని క్రమం తప్పక చదువుతూ ఆశీర్వదిస్తూ ఉత్తరా లు రాసేవారు.

‘తెలుగు విద్యార్థి’ని నేను ఎంతో ఆసక్తిగా చదువు తున్నాను’ అని ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రశంసి స్తే, ‘తెలుగు విద్యార్థి సంచికలను క్రమం తప్పకుండా, శ్రద్ధగా చదువుతున్నాను. విద్యార్థిలోకాన్ని సరైన దిశలో నడిపే పత్రికల్లో ఇది దేశంలోనే గొప్పదైన పత్రిక. గొప్ప గొప్ప వారు పత్రికకు తమ రచనలు పంపు తున్నారు. విభిన్నమైన అంశాల్ని పత్రికలో ప్రచురిస్తున్నారు. అభిప్రాయాల్లో సంతు లనం కనిపిస్తున్నది. ఈనాటి విద్యార్థి మన స్తత్వమెరిగి తదనుగుణంగా అనేక అంశాల్ని ప్రచురిస్తున్నారు. విద్యార్థులు తప్పక చద వదగ్గ పత్రిక’ అని మామిడిపూడి వెంకట రంగయ్య ప్రశంసించారు. పత్రిక నడపటానికి కొల్లూరి కోటేశ్వరరావు చేస్తున్న త్యాగా నికి ముగ్ధుడైన మామిడిపూడి వారు 1955 నుంచి 1981లో తొలిశ్వాస విడిచే వరకు పత్రికలో విద్యార్థుల ప్రశ్నలకు సమాధా నాలు ఇచ్చారు. తరువాత జస్టిస్‌ ఆవుల సాంబశివరావు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు టి. హనుమాన్‌ చౌదరి ఈ శీర్షి కను నిర్వహిస్తున్నారు. పావలా ధరతో వెయ్యి ప్రతులతో ప్రారంభమైంది.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోర్సుల వివరాలు, ప్రవేశపరీక్షల తేదీలు, వివిధ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల విశేషాలు, అనుబంధ కళా శాలలు, రెసిడెన్సియల్‌ పాఠశాలలు, పబ్లిక్‌ స్కూళ్లు, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యలో వస్తున్న మార్పులు, విద్యార్థుల ప్రతిభ… ఇలా ఒక్కటేమిటి విద్యార్థులకు సమగ్ర వేదికగా పత్రికను తీర్చిదిద్దేందుకు సంపాదకులు తీసుకుంటున్న శ్రద్ధ అపారం. కొల్లూరి కోటేశ్వరరావు పత్రిక ప్రారంభించిన తర్వాతే డిగ్రీ పూర్తి చేశారు. 1962లో మచిలీప ట్నంలోని జై హింద్‌ సెకండరీ పాఠశాలలో తెలుగు పండితునిగా అధ్యాపకవృత్తిని చేప ట్టారు. 1968 వరకూ పనిచేశారు. ఉపా ధ్యాయుల సమస్యలను, విద్యారంగంలో చేపట్టవలసిన మార్పులను గురించి అవగాహన పెంచుకున్నారు. కృష్ణా జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968 నుంచి శాసనమండలి రద్దయ్యేవరకూ మండలిలో ప్రాతినిధ్యం వహించారు. ప్రతీ నెల మొదటివారంలో విద్యామంత్రి సమ క్షంలో సమావేశం జరిపి విద్యారంగ సమ స్యల పరిష్కారానికి కృషిచేశారు. అప్పటి విద్యామంత్రి పివి. నరసింహరావు ఇందుకు ఎంతో సహకరించారు.

ఒకవైపు తెలుగు విద్యార్థి మరోవైపు ఉపాధ్యాయ ప్రతినిధిగా కోటేశ్వరరావు విద్యారంగం వికాసం కోసం తన కృషిని ధారవోశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ సిండికేట్‌ సభ్యులుగా 1969 నుంచి 1985 వరకు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. 53 సంవత్సరాలుగా పత్రిక ఎన్నడూ రాజీ పడలేదు. విద్యార్థులకు విద్యా విజ్ఞాన విశేషాలను అందించి సమగ్ర వ్యక్తిత్వాన్ని నిర్మించుకొనేందుకు పాటు పడింది. ఈ నాడు ‘తెలుగు విద్యార్థి’ అందని గ్రంథాలయం లేదు. ఉన్నత పాఠశాల లు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కవులు, రచయితలు, సాధారణ పాఠకులకు పత్రిక అందుతున్నది.

ఇన్నేళ్ళుగా ప్రచురణాంశాల్లో విలువల్ని పాటించడమే గాక ఆర్థికమైన విలువల్ని కూడా పత్రిక ఆచరిస్తోంది. ఎన్నడూ ఎవరినీ విరాళాల్ని అడగలేదు. ఎవరైనా ఉదారంగా ఇవ్వజూపినా సున్నితంగా తిరస్కరించింది. ప్రకటనల్ని మాత్రమే స్వీకరించింది. పెద్దలెవరైనా పత్రికకు వెయ్యి రూపాయల జీవిత చందా చెల్లిస్తే క్రమం తప్పక పత్రిక పంపుతారు. విద్య విలువ తెలిసిన వదాన్యులు తమ వంతు విద్యాదానంగా తమ జిల్లాలోని పాఠశాలకు నెలనెలా తెలుగు విద్యార్థి పంపేందుకు జీవితచందా చెల్లిస్తున్నారు. 1953లో మొట్టమొదటి సంచికకు చల్లపల్లి రాజా ప్రకటన ఇచ్చారు. ఆనాడు లోపలి పేజి ప్రకటన ధర 60 రూపాయలు. అది మొదలు విద్యా సంస్థలు ప్రకటనలు ఇస్తూ పత్రికను నిరాఘాటంగా నడిపేందుకు దోహదం చేస్తున్నాయి. ‘ప్రకటన’ పత్రికను పోషించడం కోసం కాదు; తమ వివరాలను పత్రికలో ప్రచురిస్తే విద్యార్థులకు చేరుతా యి అని భావించే పరిస్థితి తెచ్చుకోగలగడం ‘తెలుగు విద్యార్థి’ సాధించిన విజయం. తెలుగు విద్యార్థుల కరదీపిక తెలుగు విద్యార్థి.

చిన్న పత్రికయినా పెద్ద లక్ష్యం కోసం ఆవిర్భవించింది. లక్ష్యం చేరేందుకు సుదూర ప్రయాణం చేసింది. విద్యార్థుల్లో ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ ప్రత్యక్షమైంది. ప్రతిభను అక్షరరూపంలో ప్రచురించి ప్రోత్సహించింది. ఇరవయ్యేళ్ళు రాక ముందే పత్రికను ప్రారం భించిన కోటేశ్వరరావు 53 ఏళ్ళుగా అలుపనేది ఎరగక సంపాదకునిగా ఉన్నారు. 73 ఏళ్ళ వయసులో వృద్ధాప్యం వచ్చి ఏవో అనారోగ్యాలు తలెత్తి శరీరాన్ని పీడిస్తున్నా ఆయన పత్రికా నిర్వహణా సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. ‘పత్రికే నా ప్రాణం…పత్రికే నా ఆశ… నా శ్వాస…’ అంటూ తరగని తపనను వ్యక్తీకరించే కొల్లూరికి అభినందనలు. ఆయన పత్రిక ‘తెలుగు విద్యార్థి’కి స్వర్ణోత్సవాభినందనలు.

(వ్యాసకర్త జె. చెన్నయ్య, అంధ్రజ్యోతి కోసం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: