మనసు మాట వినదు…

“పరువు పోతే మరల రాదు..పదవి పోతే బతుకు చేదు..
న్యాయమైతే ఒప్పుకోదు..రగిలిపోతే మచ్చపోదు”.

“అంతా తప్పేనని తెలుసు. అదీ ఒక ముప్పేనని తెలుసు…
తెలిసీ లేదని ఖండించుటలో లేకితనం ప్రజలకు తెలుసు..”

రెండు మనస్సాక్షులు కన్నీళ్లు తుడుచుకున్నాయి. వైయస్‌ కంటిన్యూ చేశాడు.

“గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ఇచ్చిన విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్న దాని మీదే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. అంతే తప్ప నేను తప్పు చేశానా, లేదా అన్నది నా మనస్సాక్షికి వదిలేయండి.”
మీడియా సమావేశంలో ఇలా చెప్పి తప్పించుకున్న వైయస్‌ని ఏదో అశాంతి వెంటాడుతూనే ఉంది. తాను తప్పు చేశానా, ఒప్పు చేశానా అని మనసులో మధనపడుతూనే ఆయన ఇంటికి చేరాడు.
అన్యమనస్కంగానే భోజనం ముగించి పక్క మీద వాలాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. అప్పుడో విచిత్రం జరిగింది. బెడ్‌రూంలో ఉన్న మూడు నిలువుటద్దాలు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఒక్కసారిగా కంపించాయి. ఒక నిలువుటద్దంలో వైయస్‌ ప్రతిబింబం ప్రత్యక్షమై వికటాట్టహాసం చేసింది.

వైయస్‌ ఉలిక్కిపడి లేచాడు.

“ఎవరు నువ్వు? కొంపదీసి నా మనస్సాక్షివి కాదు కదా!” అడిగాడు.

“భలే కనిపెట్టావోయ్‌ మిత్రమా! అందుకే నువ్వంటే నాకు ముచ్చటేస్తుంది. ఆవులించకుండానే పేగుల్లెక్కపెట్టేస్తావు.. ఇంతకీ నేనే నీ మనస్సాక్షినని ఎలా కనిపెట్టావు?” మురిపెంగా అడిగింది మనస్సాక్షి.

“పాత సినిమాలు చూసిన అనుభవం ఉందిలే గానీ ఇప్పుడెందుకు ఊడిపడ్డావో చెప్పు” అడిగాడు వైయస్‌.

“అదే చెప్పబోతున్నా! గౌరు వెంకటరెడ్డి క్షమాభిక్ష ఫైలు మీద సంతకం చేసి నువ్వు ముమ్మాటికీ తప్పే చేశావు. నాకు బాగా తెలుసు. సుప్రీంకోర్టు తీర్పుతో నీ పరువు బజారు పాలయింది. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. నీ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠా ఇనుమడిస్తాయి. నీ మనస్సాక్షిని చెబుతున్నాను. నా మాట విను.. తప్పు ఒప్పుకో!” మనస్సాక్షి కేకలు గదిలో ప్రతిధ్వనించాయి. వైయస్‌ వినలేక చెవులు మూసుకున్నాడు.

“వద్దు… వద్దు.. వద్దు.. నువ్వు ఏ తప్పూ చెయ్యలేదు… లేదు లేదు” ఇంకో నిలువుటద్దంలో మరో వైయస్‌ ప్రతిబింబం ప్రత్యక్షమైంది.

“నువ్వెవరు? నా మనస్సాక్షికి డూప్‌వా?” అయోమయంగా అడిగాడు వైయస్‌.

“నేనే నీ అసలు మనస్సాక్షిని.. ఇది దొంగ మనస్సాక్షి.. దీని మాట వినకు” రెండో మనస్సాక్షి అరిచింది.

“అది అలా నాకు నీతులు చెబుతుంటే నాకూ ఆ డౌటొచ్చింది గానీ ఇంతకీ నువ్వేమంటావ్‌?” అడిగాడు వైయస్‌.

“చెప్పాను కదా, నువ్వు ఏ తప్పూ చేయలేదని.. ఆ ఫైలు తయారుచేసిన అధికారులదే అసలు తప్పు. నువ్వు అమాయకుడివి. పరిశుద్ధుడివి… అసలు నువ్వు ఆ ఫైలు చదవనే లేదు కదా?” రెండో మనస్సాక్షి వైయస్‌కి ధైర్యం చెప్పింది.

మొదటి మనస్సాక్షి ఎగతాళిగా నవ్వింది.

“నువ్వు చదవకపోవడానికి ఇదేమీ ఆంధ్రజ్యోతి పేపరు కాదు కదా! ఈ దొంగ మనస్సాక్షి మాటలు నమ్మకు..నువ్వు ఆ ఫైలు చదివావు. అసలు నువ్వు ఆ ఫైలు చదవక ముందే అందులో ఏముందో నీకు బాగా తెలుసు. ఈ నకిలీ మనస్సాక్షి నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది. దాని బుట్టలో పడకు సుమా” అంటూ హెచ్చరించింది.

“నోర్ముయ్యవోయ్‌..పెద్ద చెప్పొచ్చావు. ఫైలు చదివితే చదివాడనుకుందాం. అయితే ఏంటట? గౌరు ఆయనకు చిరకాల మిత్రుడు. ఏదో స్నేహధర్మం కొద్దీ క్షమాభిక్ష ఇమ్మని రికమెండ్‌ చేశాడు. ఎ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఎ ఫ్రెండ్‌ ఇండీడ్‌.. అయినా సుప్రీంకోర్టు వైయస్‌ని పల్లెత్తుమాట కూడా అనలేదని మర్చిపోతున్నావు..” రెండో మనస్సాక్షి కసిరికొట్టింది.

“మిత్రమా! ఈ నకిలీ మనస్సాక్షి మాట వింటే నీ పరువు పార్వతీపురం బస్టాండై పోతుంది. వెంటనే తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పు” అంటూ మొదటి మనస్సాక్షి ఓ పాట అందుకుంది.
“సారీ.. సారీ.. సారీ..
చెప్పాలోయ్‌ ఈ సారీ..
పరువుపోతే బతుకే సహారా ఎడారీ..”

వైయస్‌ ఆగ్రహంగా చూడటంతో మొదటి మనస్సాక్షి కాస్త తగ్గి ‘తాగించనా బిస్లరీ… తినిపించనా క్యాడ్‌ బరీ’ అంటూ ఇచ్చకాలాడింది.

“మాకూ వచ్చులేవోయ్‌ పాటలు.. వైయస్‌! ఇప్పుడు నా గానం అవధరించు’ అంటూ రెండో మనస్సాక్షి మొదలుపెట్టింది.
“రాజశేఖరా.. నీపై కోర్టు తీర్పు కాదురా!
రాజసాన ఏలరా.. రాజశేఖరా!
కొంపమునగలేదురా.. కోర్టు తిట్టలేదురా!
ఎందుకింత బాధరా? మరపు మేలు… ఆ ఆ ఆ…”

“చాల్లే.. నోర్ముయ్‌.. నువ్వే మూస్కో.. ఖామోష్‌..నువ్వే ఖామోష్‌.. షటప్‌.. నువ్వే షటప్‌… గెటౌట్‌…నువ్వే గెటౌట్‌’ రెండు మనస్సాక్షులు గోలగోలగా అరవడం ప్రారంభించాయి. వైయస్‌ రెండు చెవులూ మూసుకొని ‘ఆపండి’ అరిచాడు. మనస్సాక్షులకు నోళ్లు మూతపడ్డాయి. వైయస్‌ లేచి, శాలువా కప్పుకొని, ఖళ్లు ఖళ్లు మని దగ్గి,“వాగితే మర్చిపోగలను. వాగనివ్వదు… మర్చిపోతే వాగగలను, మరవనివ్వదు” అంటూ విషాదంగా తనలో తానే పాడుకోవడం ప్రారంభించాడు.
“మనసు గతి ఇంతే.. నాకు మతి కొంతే..
క్షమ ఇచ్చినందుకు సుఖము లేదంతే.. మనసు గతి ఇంతే!”

రెండు మనస్సాక్షులు వైయస్‌ వైపు సానుభూతిగా చూశాయి.

“పరువు పోతే మరల రాదు..
పదవి పోతే బతుకు చేదు..
న్యాయమైతే ఒప్పుకోదు..
రగిలిపోతే మచ్చపోదు.”

“అంతా తప్పేనని తెలుసు. అదీ ఒక ముప్పేనని తెలుసు…
తెలిసీ లేదని ఖండించుటలో లేకితనం ప్రజలకు తెలుసు..”

రెండు మనస్సాక్షులు కన్నీళ్లు తుడుచుకున్నాయి. వైయస్‌ కంటిన్యూ చేశాడు.

“మరు టెర్ము ఉన్నదో లేదో… ఈ పదవులప్పుడేమవుతాయో..
మనిషికి మనసే తీరని శిక్ష… నాకెలా దొరికేను క్షమాభిక్ష?”
వైయస్‌ తలబాదుకున్నాడు.

“ఏమిటర్రా.. అర్థరాత్రి అంకమ్మ శివాలన్నట్టు ఈ వేళప్పుడు ఇలా పాటలు పాడుతున్నారు?” మూడో నిలువుటద్దం మీద మూడో ప్రతిబింబం ప్రత్యక్షమై, ఆవలిస్తూ ప్రశ్నించింది.

వైయస్‌ కంగారు పడ్డాడు. “ఏయ్‌! మధ్యలో నువ్వెందుకు వచ్చావు.. పో, ఇక్కణ్ణించి..” అంటూ కోప్పడ్డాడు.
“మిత్రమా! ఇది కూడా నీ మనస్సాక్షేనా? ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కుంది?” మొదటి, రెండు మనస్సాక్షులు కుతూహలంగా అడిగాయి.
వైయస్‌ తాపీగా జవాబిచ్చాడు.
“ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి మనస్సాక్షి. అప్పుడు నేనన్న ప్రతి మాటా, వేసిన ప్రతి చేతా దీనికి తెలుసు. అందుకే నేను అధికారంలోకి రాగానే ‘ఇక కొన్నాళ్ల దాకా లేవకు, ఊర్మిళాదేవిలా నిద్రపో’ అని దాన్ని బజ్జో పెట్టేశాను. నిద్రా భంగమై ఇప్పుడు లేచినట్టుంది”.

(కిండల్ కర్త రాజగోపాల్)

ప్రకటనలు

3 thoughts on “మనసు మాట వినదు…

  1. రాజకీయాల పోకడ వివరించాలంటే వ్యంగ్య రచనల్ని మించిన సాధనం మరోటి లేదని ఇప్పుడనిపిస్తోంది. ఇదే అంశం మీద ఒక గంభీరమైన వ్యాసం రాసి ఉంటే ఇంత బావుండేది కాదు. ఏమైనా ఎంతో అలరింపజేశారు. కృతజ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s