ఎవరు సాటి, ఎక్కడ పోటీ?

మన్మోహన్‌సింగ్‌ గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తే కావచ్చు!

అంతకుమించి దేశానికి ప్రధానమంత్రే కావచ్చు!

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకూ వచ్చి ఉండవచ్చు!

అంతమాత్రాన

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని అంతమాట అంటారా?

ఆయన స్థాయి తగ్గిస్తే చేతులు ముడుచుకుని కూర్చోవాలా?

వై.ఎస్‌. అభినవ కాటన్‌ అట.

వై.ఎస్‌. ఎక్కడ?

కాటన్‌ ఎక్కడ?

(ఎక్కడ అంటే పిన్‌కోడ్‌ పట్టుకోవడం కాదు, పెన్‌కోడ్‌ పట్టుకోవాలి.)

కడప చించుకుంటే కాళ్లమీద పడుతుంది!

వై.ఎస్‌. అనుచరుల మనోభావాలు ఎంత గాయపడుతున్నాయి!

కొంతకాలం కిందట రాష్ట్ర మంత్రి ఒకరు కూడా వై.ఎస్‌.ను కాటన్‌తో పోలిస్తే కాటనా? టెరికాటనా? అంటూ కొంతమంది పళ్లికిలించినప్పుడు వారు ఎంత బాధపడ్డారు?

గతంలో కొంతమంది వై.ఎస్‌.ను భగీరథుడితో పోలిస్తే ఆయనది ఏ పార్టీ అని ఎంక్వయిరీ చేసిన అతిరథులూ, మహారథులూ ఉన్నారు.

ఇప్పుడు వై.ఎస్‌.కు మళ్లీ కష్టాలు వచ్చిపడ్డాయి! కాటన్‌ అనగానే గోదావరి గుర్తుకువస్తుంది.

అందరూ భేష్‌ అన్నారు సరే! ఇప్పుడు రాష్ట్రంలో నీళ్లన్నీ కడపకు తరలిస్తున్నారన్న గొడవేమిటి? నిజంగా నీళ్లన్నీ ‘చలో కడప’ అంటే కాటన్‌కన్నా వై.ఎస్‌. ఎన్నిరెట్లు గొప్ప? పనిలోపనిగా కాటన్‌ మీద కూడా ఆరోపణలు వచ్చాయి గదా అని ఆ మధ్య కాంగ్రెస్‌ నాయకులు కంటతడిపెట్టారు? కాటన్‌ మీద ఆరోపణలస్థాయి ఎంత? అనడానికైనా అనిపించుకోవడానికి వై.ఎస్‌.తో పోల్చేపనేనా వై.ఎస్‌. రాజ్యంలో ప్రాజెక్టు ఎస్టిమేట్ల గురించి ఎవరయినా ఎస్టిమేట్‌ చేయగలరా? సొంత పార్టీ ముఖ్యమంత్రులయిన మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి వంటి వాళ్లనే పబ్లిగ్గా బహిరంగసభలో చరిత్రహీనులని దులిపేసిన చరిత్ర వై.ఎస్‌.కు ఉంది? ఇటువంటి ఘనచరిత్ర కాటన్‌కెక్కడిది? కనీసం పత్రికలను విమర్శించిన చరిత్ర అయినా కాటన్‌కు లేదే! పైగా కాటన్‌ కాలంలో ‘ఆ రెండు పత్రికలు’ లేవే! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. శాశ్వత శత్రువుల మాటేమోగానీ శాశ్వత మిత్రులు ఉండరని వై.ఎస్‌. రుజువు చేశారు. 1983లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి మారగానే తమ మైత్రీ బంధం దెబ్బతిన్నదని వై.ఎస్సే చెప్పారు. ఇంతకుమించిన రుజువేముంది?

కాటన్‌ ఇంజనీరు. వై.ఎస్సేమో డాక్టరు. దేనికి ఏమందు వేయాలో మన డాక్టర్‌కు తెలిసినంతగా కాటన్‌ ‘ఇంజన్‌నీరు’కు ఏమితెలుసు? ప్రాజెక్టుల మీద రాసే రిపోర్టర్లంతా ఇంజనీర్లయితే బాగుండునన్న వై.ఎస్‌. ముందుచూపు కాటన్‌కు ఎక్కడుంది? ఎంత రంగుపడ్డా, వై.ఎస్‌. దొర జంటనగరాల రింగురోడ్డు కోసం ఎంత దూసుకుపోతున్నారు! కాటన్‌ దొర గోదావరి జిల్లాల చుట్టూ రింగ్‌రోడ్డు వేయిస్తే ఆయన సొమ్మేంపోయింది? వై.ఎస్‌. చేతిమీద ఎంత మంది పంటపండుతోంది? నీళ్లతో పంటలు పండిస్తేనే గొప్పవాళ్లా? రోడ్లమీద పంటలు పండిస్తే తక్కువ వాళ్లా? వై.ఎస్‌.కు ఉన్న పాదయాత్ర అనుభవం లేకపోవడం కాటన్‌కు పెద్దలోపం! గుర్రం మీద తిరిగితే ఎలా తెలుస్తుంది?

అయిన వాళ్లకు చేసేదే ప్రజాసేవ. ఈ విషయంలో వై.ఎస్‌.ను ఎవరూ వేలెత్తిచూపలేరు. కాటన్‌కు ఈ ఘనత ఏది? గోదావరి తీరంలో కాటన్‌ తన కన్నబిడ్డను పోగొట్టుకున్నారు. ఆయనకు అయినవాళ్లు ఇంకెవరు బాగుపడ్డట్టు? ఇంకెవరు బావుకున్నట్టు!! కాటన్‌ కట్టిన కొన్ని కట్టడాలు వంద సంవత్సరాలయినా చెక్కుచెదరలేదని ఆయనకు గొప్పతనం ఆపాదించడంలో అర్థంలేదు. అవి దెబ్బతిని ఉంటే ఎంతమంది ఇంజనీర్ల చేతికి పనివచ్చేది? ఎంతమంది కాంట్రాక్టర్ల కడుపునిండేది? ఎంతమంది రాజకీయ నాయకులు కొన్ని తరాలవరకు వెనక్కు చూడకుండా ఉండగలిగేవారు? ఈ నష్టమంతా కాటన్‌వల్ల కాదా? నల్లదొరలను ఈ రకంగానూ తెల్లదొరలు దెబ్బతీశారన్న మాట నిజంకాదా?

కాటన్‌ను తలుచుకునే వాళ్లెంతమంది? వై.ఎస్‌.ను తలుచుకుంటున్న వాళ్లెంత మంది? లెక్కలు తీసిచూడండి. వై.ఎస్‌. కాటన్‌కన్నా కొన్ని కిలోమీటర్ల దూరం ముందుంటారు! కనీసం కాటన్‌కు వై.ఎస్‌. లాగా నవ్వడమైనా వచ్చా అంటే జవాబులేదు.

కృతజ్ఞత విషయంలో మాత్రం వై.ఎస్‌.కు తక్కువేముంది? ‘తక్కువేమి మనకు రాజీవ్‌ ఒక్కడుండువరకు’ అంటూ ఆయన రాజీవ్‌ నామాలు పాడుతూ అవకాశం వచ్చినచోటల్లా రాజీవ్‌ పేరు పెడుతుంటే (భ)జన పథం ఎంత పొంగిపోతోంది! కాటన్‌ తన కట్టడాలకు అటువంటి పని ఎప్పుడైనా చేశారా? అడిగితే చెడ్డ అంటారు గానీ ఇందులో అబద్ధమేముంది?

తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకునే తత్వం వై.ఎస్‌.కు బాగా వంటబట్టింది! ఈ తత్వం కాటన్‌కు ఏదీ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకును చీల్చిచెండాడిన వై.ఎస్‌. ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘ప్రపంచబ్యాంకు అంటే భూతమేమీకాదు’ అంటూ మంచి (త)రుణం మించిపోవును’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎదిగేకొద్దీ ప్రపంచబ్యాంకుకు ఒదిగిపోతున్నారు. కాటన్‌ జీవితాంతం ఒకేమాటమీద ఉన్నారు తప్ప ఇటువంటి పరిణామ క్రమంఏది!

ఇప్పటికైనా వై.ఎస్‌.ను కాటన్‌తోనో, భగీరథుడితోనో చేసే పోలికలకు ఆనకట్టో, అడ్డుకట్టో కట్టక తప్పదు (కాంట్రాక్టు గొడవలు వచ్చినాసరే) లేకపోతే వై.ఎస్‌.కు అన్యాయం జరుగుతుంది.

ఏవిషయంలోనైనా వై.ఎస్‌.కు ఎవరు సాటి? ఎవరు పోటీ?

(వ్యాసకర్త శంకరనారాయణ)

ప్రకటనలు

One thought on “ఎవరు సాటి, ఎక్కడ పోటీ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s