• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 259,365 హిట్లు

వుయ్‌ లవ్‌ టెల్గూ, ఓ సున్నా మహిమ

“నువ్వు ‘టెల్గూ’వాడివి కావూ? ‘అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో’ అన్న అచ్చ ‘టెల్గూ’ సామెతను గౌరవించవూ? ఆ నానుడికి అర్థమేమిట్ట… విసిరిపారేసే విస్తళ్లలో అయినవారికి, కడిగి దాచుకొనే కంచాల్లో కానివారికి వడ్డించాలనే కదా! మరి ఆ సామెతకు పట్టం కట్టాలన్న ‘సత్సంకల్పం’తోనే కాదూ, మీ ‘కొత్త మేస్టార్లు’న్నూ… స్కూళ్లల్లోనుంచి మనదైన తెలుగును ఆవలకు నెట్టి, మనది కాని ఇంగ్లిషును అందలమెక్కిస్తుంట! జాగర్ఫీ, గీగర్ఫీ, అల్జీబ్రా, ఇంగ్లిషుతోపాటు తెలుగులోనూ నా వద్ద శిష్యరికం చేసిన నీకు ఇంత చిన్న విషయం అర్ధం కాకపోవడమేమిటోయ్‌!

అసలు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్‌. అటువంటిది ఎడ్యుకేషన్‌లో నా దగ్గర తర్ఫీదైన నువ్వు ఇలా మాట్లాడటమేమిటి! ‘సున్నా’ గొప్పదనాన్ని గుర్తించకుండా ఎంతసేపూ ఒకట్లూ, పదులూ అంటూ నువ్వు అంకెల్నే పట్టుకుని వేలాడింది చాలక, నా సావాసం చేయడం చేతనే నిన్ను మీ కొత్త మేస్టార్లు పక్కన పెట్టారని అభాండం వేస్తావ్‌?

‘ది ఎలెవన్‌ కాజెస్‌ టు అడోర్‌ ది జీరో’ విషయమై నేనిచ్చిన లెక్చర్లు వంటబట్టించుకుని జీనియస్సులైపోయిన వాళ్లెందరో ఉన్నారే! అలాంటిది, నా ప్రియశిష్యుడివైయుండిన్నీ నువ్వేమిటోయ్‌… వాటిని ఒట్టి కంఠశోషగా మిగిల్చివేసినావ్‌!

పైపెచ్చు- తెలుగులో ఫస్ట్‌ మార్క్‌ స్కోరు చేసిన నిన్ను కాదని, ఇంగ్లిషులో ‘సున్నా’ మార్కు వచ్చినవారినే మీ మేస్టార్లు నెత్తినెక్కించుకుంటున్నారని ముఖం వేలాడవేస్తావ్‌! ‘వుయ్‌ లవ్‌ టెల్గూ’ అంటూ తెలుగుమీద తమకున్న ప్రేమాభిమానాలను, గౌరవ ఆదరాలను ఇంగ్లిషులో వారు అంత గొప్పగా చాటుకున్న తరవాత కూడా వారిపై ఇలా నిందలు మోపడం… మైడియర్‌ వెంకటేశం… నిజంగా బార్బేరియస్‌!

అసలు ‘సున్నా’ మజా నీకు ఇంకా బోధపడకపోవడం చూస్తుంటే హాశ్చర్యమేస్తోంది. ‘సున్నా’ విలువను కనిపెట్టిందే మనమైనప్పుడు- దాన్ని అందలం ఎక్కించాల్సిన బాధ్యతా మనది కాదా? ఆ మాటకొస్తే కొలువు తీరిన మీ కొత్త మేస్టార్లకే కాదు,… యావన్మందికీ సున్నాయే పూజనీయం. అందుకు సవాలక్ష రుజువుల్ని చూపించి ‘నిజమేస్మీ!’ అని నీ చేతనే ఒప్పిస్తాను చూడు.

మందికి మంచిచేసే తెలివితేటలు, పనికొచ్చే ఆలోచనలు గట్రావంటి ‘అవలక్షణాలు’ ఏవీ లేకుండా బుర్రంతా ఖాళీగా ఉన్న నాయకుల్నే మనం భుజాలపై మోస్తున్నామా, లేదా?

‘నీతిమంతులెవరయ్యా’ అంటూ పరీక్షిస్తే పోటాపోటీగా ఫస్ట్‌ క్లాసులో ‘సున్నా’ మార్కుల్నే సంపాదించుకునే నేతాశ్రీలనే ఎన్నికల్లో గెలిపిస్తున్నాంకామా?

‘నిజాయతీపరులెవరహో… రారండో… నిగ్గుదేలుస్తాం’ అని పోటీపెడితే- పొలోమంటూ ముందుకురికి ‘సున్నా’ మార్కుల్నే తెచ్చుకున్న ప్రజ్ఞాధురీణులకు తప్ప మరొహరికి మనం పదవుల్ని కట్టబెడుతున్నాంటోయ్‌!

గూండాయిజాన్ని చెలాయించకుండా ఉండటంలో ‘జీరో’ మార్కులను సాధించిన ప్రతిభాశాలుల్నే కాదూ మనం తలపైకి ఎక్కించుకుంటున్నది?

అంతెందుకు… కథ- కమామిషు, కళ- కాకరకాయ, సంగీతం- సాహిత్యం- సహజత్వం ఎట్సెట్రా చాదస్తాల జోలికిపోకుండా, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ‘సున్నా’ విలువలతో తీసిన సిన్మాలనే మనం సూపర్‌హిట్‌ చేయడం లేదూ?

ఇలా సున్నాలెన్నియో మిన్నులనందుకుంటుంటే- తెలుగు భాషను ఇంగ్లిషులో విపరీతంగా ప్రేమిస్తున్నట్లు ఢంకా బజాయించి మరీ చాటిన మీ కొత్త మేస్టార్లు… ఇంగ్లిషులో ‘సున్నా’ మార్కు తెచ్చుకున్నవారిని ముద్దు చేయడంపై నీకు కడుపుడుకెందుకంట?

ఆమాటకొస్తే- ‘మిన్ను’ అనగా పంచభూతాల్లో ఒకటైన ఆకాశం అంటే ఏమి? శూన్యం. అనగా ఏమీలేదన్న మాట. అలాగని గణిత శాస్త్రం చెబుతుంది. కానీ- అసలు సిసలు ‘ఛాత్రంలో మన్ను-మిన్ను అన్నాడు కాడా? మన్ను ఉన్నప్పుడు మిన్ను ఉండదా?’ అని మా అగ్రహారంలోని వీరేశం ఏనాడో సిద్ధాంతం చేశాడు. అందువల్ల- మన్ను వంటిదే మిన్ను కూడా. ‘స్కై ఈజ్‌ ది లిమిట్‌’ అన్నది ఇంగ్లిషువాడి ఉవాచ. దాన్ని తర్జుమా చేస్తే ‘ఆకాశమే హద్దు!’ అవునా… అంటే- ‘సున్నాను సాధించడమే గొప్పరా చవలాయా’ అన్నదే దాని అర్థం. ఇంగ్లిషు సూక్తిని తెలుగులోకి ఇలా ఫిరాయింపజేయడంతోపాటు దాని ‘అంతరార్థాన్నీ’ గ్రహించి చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టడం ‘వుయ్‌ లవ్‌ టెల్గూ’ అని ఉద్ఘాటిస్తున్న కొత్త మేస్టార్ల కర్తవ్యం కాదూ!

ఏ ఇంగ్లిషువాడైనా సరే, తన లాభం చూసుకోకుండా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఇటువంటి ‘హితబోధ’ చేసిన దాఖలాలు కలికానికైనా కనబడతాయా? శూన్యం అంటే సున్నా కాబట్టి ఏమీ లేదని సరిపెట్టుకోవడానికి- మా ఊరి మునసబు చెప్పినట్లు- తెల్లోడేమన్నా ఎర్రోడా! అందుకే వాడు ‘సున్నా’ను కనిపెట్టిన మనకే కాక ఈ భూప్రపంచంలోని అందరికీ సున్నాలు చుట్టగలిగాడు. అందుకు కారణం వాడు సున్నా మహిమను గ్రహించడమే. ఇప్పుడు కొలువు తీరిన మీ కొత్త మేస్టార్లూ ఆ పరంపరలోని వారే. కాబట్టే వారు- ఎన్నికలప్పుడు ‘ఆకాశమే హద్దు’గా తాము చేసిన వాగ్దానాలే కాదు, మాతృభాషను అమలు చేయడంలోను ‘సున్నా’ సాధనకే కంకణబద్ధులయ్యారు. ఆ నిజాన్ని తెలుసుకోలేక నువ్వు వారిని తప్పుపట్టడం- పామరత్వంలో పడి కొట్టుకుపోవడం కాక మరేమిటోయ్‌?

ఇప్పటికైనా మించి పోయిందేమీలేదు. సెలవల్లో మీ ఊరొచ్చి నీ చేత పాఠాలు వల్లె వేయించడానికి నేను చెప్పిన పుస్తకాల జాబితాలోని ‘రాజ్యలక్ష్మీ మేడ్‌ డిఫికల్ట్‌’ బుక్‌లోనుంచి వచ్చే ప్రశ్నలకు ‘సున్నా’ మార్కులు తెచ్చుకుంటివా… నువ్వూ విద్యాశాఖమంత్రివై పోవచ్చు. ఏమంటావ్‌?”
(వ్యాసకర్త ఆర్‌.ఎస్‌. గౌతమ్‌, ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: