‘మందు బాట’లో మరింత ముందుకు

ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాలనేది నీతి. ప్రజలేమైపోయినా తన పబ్బం గడిస్తే చాలునన్నది నేటి ప్రభుత్వం రీతి. ఇప్పటికే ఊరూరా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయంలో తన వ్యాపార దక్షతను రుజువు చేసుకొన్న ప్రభుత్వం, గడపగడపకూ మందు అనే అప్రకటిత లక్ష్యంతో మరింత ముందుకు దూసుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రజలకు కావలసింది గుక్కెడు నీళ్లు, పిడికెడు మెతుకులు కావనీ, గ్లాసెడు మందు మాత్రమేనని గుడ్డిగా నమ్ముతున్న ఈ ప్రభుత్వానికి- రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బెల్టు షాపులపై దండెత్తుతున్న మహిళాశక్తి సమరశంఖారావం వినబడకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం.

ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఆదాయం అత్యవసరం. ఏ రూపంలోనైనా, ఏ మార్గంలోనైనాసరే డబ్బు పిండుకోవడమే ప్రభుత్వానికి తెలిసిన విద్య. సునాయాసంగా ఆదాయం పొందడం కోసం ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికీ ప్రభుత్వం వెనకాడటం లేదు. ఈ విషయంలో దశాబ్దాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న సులువైన మార్గం… మద్యం విక్రయం. వీటి అమ్మకాల్ని వీలైన మేర పెంచి ఆదాయం పొందడమే ఏ ప్రభుత్వానికైనా రివాజుగా మారింది. ఆర్థిక వనరుల సమీకరణపై అత్యున్నత స్థాయిలో ఎప్పుడు సమీక్ష జరిగినా, ఎక్సైజ్‌ ఆదాయంపైనే ప్రధానంగా చర్చ కేంద్రీకృతం అవుతుంటుంది. సాధ్యమైనంత వరకు మద్యం అమ్మకాల్ని, తద్వారా ఆదాయాన్ని పెంచాలన్న సూచనలే ఉన్నతాధికారులకు అందుతుంటాయి. మద్యం విక్రయాల్ని తగ్గిస్తామని, బెల్టుషాపులు లేకుండా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా వాగ్దానాలు చేసే పార్టీలు, అధికారంలోకి రాగానే ఆదాయం కోసం మద్యంపైనే మితిమీరి ఆధారపడుతుంటాయి. రూ.100 విలువైన మద్యం విక్రయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.70కి పైనే. ఎక్సైజ్‌ సుంకం, వాణిజ్య పన్ను, బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ లాభం, వైన్‌షాపులు, బార్ల లైసెన్సు ఫీజు తదితరాల ద్వారా వచ్చే మొత్తంతో ఇంత భారీగా ఆదాయం సమకూరుతుంది. మద్యం తయారీ విలువ, దానిపై డిస్టిలరీల లాభం, రవాణా, రిటైలరు మార్జిను అన్నీ మిగిలిన రూ.30 లోనే.

అమ్మకాల పెంపే ధ్యేయం
మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై మన ప్రభుత్వాలు మక్కువ చూపడానికి కారణమేమిటంటే… ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఎలాంటి వసూళ్లు చేయాల్సిన అవసరం లేదు. కడుపులో చల్ల కదలకుండా హాయిగా కార్యాలయాల్లోనే కూర్చుని బ్రూవరీస్‌ కార్పొరేషన్‌తో హోల్‌సేల్‌గా మద్యం విక్రయించుకొంటే చాలు. వేల కోట్ల రూపాయలు ఖజానాలో చేరతాయి. విక్రయాలు పెంచేలా దిగువస్థాయి ఎక్సైజ్‌ సిబ్బందిని ప్రోత్సహిస్తే- పంట పండినట్టే. ఈ విషయంలో మన ప్రభుత్వాలు విజయం సాధించాయి. అందుకే 1994-95లో రూ.951 కోట్ల మేర ఉన్న ఎక్సైజ్‌ ఆదాయం 2005-06 నాటికి రూ.4,617 కోట్లకు చేరింది. కేవలం 11 ఏళ్లలో నాలుగు రెట్లకు పైగా పెరిగిందన్నమాట. ఈ స్థాయి వృద్ధి మరే ఇతర రంగంలోనూ నమోదు కాలేదు.
మద్యం విక్రయాలను పెంచి, ఖజానా నింపుకోవడం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినంతగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ప్రజల నెత్తురు నీరైపోతేనేం- తమ నెత్తిన పాలు పోసే ఈ వ్యాపారంలో అది ఆరితేరిపోయింది. ఈ వ్యాపారంలో ఘనంగా లాభాలు దండుకోవడానికి ఏం చేయాలో ఆలోచించింది. మార్గం ఇంత సులువుగా ఉన్నప్పుడు దాన్ని అనుసరించడమే మేలన్న నిర్ణయానికి వచ్చి వెంటనే కార్యాచరణకు దిగింది. మద్యం అమ్మకాలు పెంచాలంటే ప్రజల్ని వీలైనంత వరకు తాగుడుకు అలవాటు చేయాలి. పట్టణాలు, మండల కేంద్రాలు, కొన్ని మేజరు పంచాయతీలకే మద్యం దుకాణాలు పరిమితమైతే ఆశించిన స్థాయిలో ఆదాయం రాదు. అమ్మకాలు విస్తృతంగా సాగాలంటే ప్రతి పల్లెలోనూ ఇలాంటి దుకాణాలు ప్రారంభం కావాలి. మందుబాబులకు ఎల్లవేళలా మద్యం అందుబాటులో ఉండాలి. అలాగని అన్నిచోట్లా దుకాణాలకు ఉదారంగా లైసెన్సులిస్తే విమర్శలు రావచ్చు. దానికన్నా మేలైన మార్గం అనధికార విక్రయాల్ని ప్రోత్సహించడం. ప్రభుత్వం ఇప్పుడు ఇదే పని చేస్తోంది.అయిదారేళ్ల కిందట ప్రారంభమైన ఈ విధానం క్రమంగా విస్తరిస్తూ, రెండేళ్లలో బాగా వ్యవస్థీకృతమైంది. రాష్ట్రంలో రేషను దుకాణం, మంచినీటి ట్యాంకు, ప్రాథమిక పాఠశాలలేని పల్లెలు ఉన్నాయేమోకానీ, బెల్టు షాపులేని పల్లె అంత తేలిగ్గా కనబడదంటే అతిశయోక్తి కాదు. మన రాష్ట్రంలో ఎక్సైజ్‌ శాఖ నుంచి లైసెన్సు తీసుకొన్న అధికారిక వైన్‌ షాపులు ఆరున్నర వేలుంటే, వాటికి అనుబంధంగా ఉన్న బెల్టు షాపుల సంఖ్య లక్షకు పైమాటే. 1,500 బార్లుంటే, అంతకు 30 రెట్లు అధికంగా ఓపెన్‌బార్లు నడుస్తున్నట్టు అంచనా. రాష్ట్రంలోని దాదాపు ప్రతి నివాస ప్రాంతంలోనూ బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. వీటికి వేళాపాళా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది. కాకపోతే అధికారిక షాపుల్లో కన్నా కాస్త ఎక్కువ ధర చెల్లించాలి. ఈ దుకాణాల్ని ఎక్సైజ్‌ సిబ్బందే పరోక్షంగా ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఇవి లేనిదే మద్యం అమ్మకం సాగదన్నది వీరి వాదన. సారాని నిరోధించాలన్నా ఈ బెల్టు షాపులు ఉండాల్సిందేనని ఆంతరంగిక సమావేశాల్లో వారు చెబుతుంటారు. ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పుడు సమీక్షలు జరిపినా, ఆయా దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరును రోజులు, వారాలు, నెలల వారీగా విశ్లేషిస్తుంటారు. ఎక్కడ విక్రయం తగ్గినా, సంబంధిత స్టేషను సిబ్బంది అందుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. దాంతో విక్రయాల్ని వీలైనంతగా పెంచేందుకు బెల్టుషాపుల్ని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ సిబ్బందే సూచిస్తుంటారు. ఎక్సైజు సిబ్బందే వైన్‌ షాపులకు అప్పులిచ్చి మరీ ఎక్కువ మద్యం కొనుగోలు చేసేలా చూస్తున్న సందర్భాలు ఎన్నో!
ప్రస్తుత ప్రభుత్వ విధానం మద్యం విక్రయాల పెంపుదలకు, అందుకోసం విరివిగా బెల్టు షాపుల ఏర్పాటుకు దోహదపడేలా ఉంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం సీల్డు టెండర్ల రూపంలో వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీని పెట్టిందీ ప్రభుత్వం. గరిష్ఠమొత్తం కోట్‌ అయ్యేందుకు వీలుగా దుకాణాల లైసెన్సు కాలాన్ని రెండేళ్లకు పొడిగించింది. ఇటీవల జరిగిన వేలంపాటల్లో ఆరు దుకాణాలకు- ఒక్కోదానికి కోటి రూపాయలకు పైగా ధర పలకడం విశేషం. గతంతో పోలిస్తే సగటున దుకాణానికి సుమారు 80 శాతం అధిక ధర లభించింది. రూ. 100 విలువైన మద్యం విక్రయిస్తే వైన్‌ షాపు యజమానికి లభించేది రూ. 20. రెండేళ్లకు కోటి రూపాయలతో లైసెన్సు తీసుకొన్న వ్యాపారి లైసెన్సు ఫీజు, ఎక్సైజు, పోలీసు, రాజకీయ నాయకుల మామూళ్లు, ఇతర ఖర్చులు పోను పెట్టుబడికి తగిన లాభం పొందాలంటే రోజుకు లక్ష రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒక్కో దుకాణానికి సగటున రూ. 50 లక్షల ఫీజు నిర్ణయిస్తే- రోజుకు రూ. 50 వేల మద్యం అమ్మాలి. ఒకే దుకాణంలో ఈ మేరకు విక్రయించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ విషయం ప్రభుత్వం సహా అందరికీ తెలుసు. బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయించుకోకుంటే నష్టపోవడం ఖాయం. డబ్బు పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధపడరు కనుక వీలైనంత మేరకు బెల్టు షాపుల్ని పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ దాదాపుగా ఓపెన్‌బార్లే. కొన్ని చోట్ల ఇలాంటి షాపుల ప్రారంభానికే పరిమితంకాని వ్యాపారులు, అక్రమ రవాణాకూ తెగబడుతున్నారు. ఉదాహరణకు- కర్ణాటకలో మద్యం ధర తక్కువ. ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని రాయలసీమ, తెలంగాణ జిల్లాలకు అక్కడి నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకొని బెల్టు షాపుల ద్వారా విక్రయించడం ఇటీవల బాగా పెరిగింది. ఈ పరిణామం ఒక్కోసారి కల్తీ మద్యం అమ్మకానికీ దారితీస్తోంది. పరిశ్రమల్లో ఉపయోగించే ఆల్కహాలును పలచన చేసి అడపాదడపా విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల తనిఖీ అసలుండదు. అక్కడ ఏ మద్యం విక్రయిస్తున్నారన్నది ఎవరూ పట్టించుకోరు. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో గ్రామపంచాయతీలకు సమాంతరంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. ఇవి సొంతంగా వేలంపాటలు నిర్వహించి బెల్టు షాపులు కేటాయిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు దుకాణానికి సమానమొత్తంలో ఈ షాపు ధరా ఉంటోంది.

ఇచ్చిన మాట- నీటిమూట
ఎల్లవేళలా మద్యం అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో మందుబాబులకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. దీనికి కొత్తగా అలవాటయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కూలీనాలీ చేసుకొనేవారు కష్టం మరచిపోవడానికంటూ మద్యానికి బానిసలవుతున్నారు. తమ కూలీలో అధికమొత్తం మద్యానికి ఖర్చు పెడుతున్నారు. వీరు సేవించే చీప్‌ లిక్కరే ప్రధానంగా బెల్టు షాపుల్లో విక్రయమవుతుంటుంది. ఈ షాపులకు నిరసనగా అప్పుడప్పుడు, అక్కడక్కడ మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నా, ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం దాన్నొక సమస్యగానే పరిగణించడంలేదు, పట్టించుకొనడం లేదు. మద్యం విక్రయాన్ని వీలైన మేర నిరుత్సాహపరుస్తామని, స్వచ్ఛందంగా మద్యపానాన్ని వదిలేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా- ఆ మాట నీటి మూటగానే మిగిలింది. చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం మద్యం విక్రయాలను పెంచడానికే ప్రయత్నిస్తోంది. మద్యం విషయంలో ప్రజల్ని జాగృతపరచేందుకు 2005-06 బడ్జెట్లో రూ. 10 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మొత్తాన్ని సైతం ఖర్చు చేసిన దాఖలా లేదు. మద్యం తాగొద్దని అంటూనే ప్రజలచేత సాధ్యమైనంత అధికంగా మద్యం తాగించేందుకు, వారి కష్ట ఫలాన్ని కొల్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. 2005-06లో ఎక్సైజ్‌ ఆదాయం అంతకు ముందు ఏడాదికన్నా రూ.750 కోట్ల మేరకు పెరగడం- మద్యం అమ్మకంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం! ఒకవైపు మద్యం అమ్మకాలు పెంచుకొంటున్న ప్రభుత్వం, మరో వైపు మద్యపానం వద్దని ప్రజల్ని కోరుతూ రేడియోలో ప్రకటనలు ఇవ్వడం విడ్డూరం. టీవీల్లో కూడా ఇలాంటి ప్రకటనలే ఇస్తుందట! 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంచుతూ, కొద్దిపాటి ప్రకటనలతో దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి. మహిళలు చైతన్యవంతులై బెల్టు షాపులకు వ్యతిరేకంగా ఉద్యమించిన చోట్లనైనా మద్యం విక్రయించకుండా చూస్తే, ప్రభుత్వ ప్రకటనలకు విశ్వసనీయత ఉండేది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై యావ తప్ప, ప్రజల ఆయురారోగ్యాలపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదనడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ఇంకేమి కావాలి!

(కనపర్తి శ్రీనివాస్‌ వ్యాసం, ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s