అంధ్రప్రదేశ్ లో దేవుడి పాలన

“పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా…! ఆదిలక్ష్మి నీ పాదమూ లొత్తగా…”
ఆ మధురగానాన్ని ఆస్వాదిస్తూ అర్థనిమీలిత నేత్రుడైన శ్రీమహావిష్ణువు ఉన్నట్టుండి దిగ్గున లేచాడు.
“ఏమిటీ కలవరపాటు స్వామీ?” అడిగింది ఆదిలక్ష్మి.
“మరేంలేదు…కాస్సేపు పాచికలాడు కుందామా లక్ష్మీ!” అడిగాడు మహావిష్ణువు.
“పరాచికాలాడుతున్నారా స్వామీ! ఎన్నడూ లేనిది ఏమి ఈ వింత కోరిక?” లక్ష్మీదేవి విస్తుపోయింది.
మహావిష్ణువు అసలు విషయం చెప్పాడు.

“కలియుగంలో నా అవతారమైన శ్రీవెంకటేశ్వరస్వామి వారి మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారు దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి దృశ్య, శ్రవణ ధారావాహిక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారట. ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాది దర్శకుడికి అప్పగించారట. ఆ దర్శకుడు ఒక సన్నివేశంలో మనమిద్దరం శేషతల్పం మీద పాచికలాడుతున్నట్టు చిత్రీకరించాడట. దేవస్థానం వారు ఆ సన్నివేశాన్ని ఆక్షేపించారనుకో…అది విషయాంతరం. ఆ సన్నివేశాన్ని దివ్యదృష్టితో తిలకించిన దగ్గర నుంచి మనం పాచికలాడాలని నా మనసు ఉర్రూతలూగినది…”
లక్ష్మీదేవి బుగ్గన వేలేసుకుంది. “హవ్వ…హవ్వ ఎవరయినా వింటే నవ్విపోతారు. మీకంతగా ఏమీ తోచకపోతే కాసేపు ముల్లోకాభిరామాయణం మాట్లాడుకుందాం!” సలహా ఇచ్చింది.

ఇంతలో రివ్వున సుడిగాలిలా దూసుకొచ్చింది భూదేవి.
“స్వామీ…శరణు,శరణు! ఆ దుర్మార్గుల బారినుండి మీరే నన్ను కాపాడాలి…”
ఆదిదంపతులు ఆశ్చర్యపోయారు.
“భూదేవీ! ఎందుకింత తల్లడిల్లుతున్నావు? నీ కొచ్చిన కష్టమేమిటి? ఎవరా దుర్మార్గులు?” అడిగాడు మహావిష్ణువు.
భూదేవి కళ్లు తుడుచుకుంది. “ఏమి చెప్పను స్వామీ! ఒకనాడు యజ్ఞ యాగాదులతో, సస్యశ్యామలమైన పంటలతో కళకళలాడిన భూతలం ఇప్పుడు ఆక్రమణదారుల గుప్పిట్లో విలవిలలాడుతోంది. నన్ను నమ్ముకున్న రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అసలు ఈ అనర్థానికి ఒకరకంగా మీరే కారణం స్వామీ!” అంటూ నిష్ఠూరమాడింది.
విష్ణుమూర్తి తెల్లబోయాడు. “నేనేం చేశాను దేవీ? అర్థమయ్యేట్టు వివరంగా చెప్పు.”
“నేను చెప్పడమెందుకు? మీ అభిమాన ద్వారపాలకులు జయ విజయుల్ని పిలుస్తాను. వారే మీకు వివరిస్తారు. జయ విజయులారా! ఇటు రండి…స్వామి వారికి అసలు విషయం చెప్పండి” భూదేవి ఆజ్ఞాపించింది.
జయ విజయులు భయపడుతూ వచ్చి “స్వామీ! కొన్నాళ్ల క్రితం మీరు మాకో వరం అను గ్రహించారు…గుర్తు తెచ్చుకోండి” అన్నారు.
శ్రీమహావిష్ణువు కళ్లు మూసుకున్నాడు. ఆయన ముఖంపై వలయాలు గిర్రున తిరిగాయి.

***
మహావిష్ణువు దర్శన భాగ్యం కల్పించలేదని అలిగిన సనకసనందాది మునులు ద్వారపాలకులైన జయవిజయుల్ని విష్ణు వియోగులు కమ్మని శపించారు. జయ విజయులు విష్ణుమూర్తి కాళ్లావేళ్లాపడి శాపవిమోచనం చెప్పమని ప్రార్థించారు.
“మహా మునుల శాపం నేను మరల్చలేను. మన మధ్య వియోగం తప్పదు. మీకు విష్ణు భక్తులుగా, నాకు స్నేహితులుగా ఆరు జన్మలు కావాలా? విష్ణుద్వేషులుగా, నాకు శత్రువులుగా మూడు జన్మలు కావాలా?” అడిగాడు విష్ణుమూర్తి.
“ఆరు జన్మలు మీకు దూరంగా ఉండేకన్నా మూడు జన్మల తర్వాత మీ సన్నిధికి చేరుకోవడమే మాకు ఆనందం” అన్నారు జయవిజయులు ముక్త కంఠంతో.
“తథాస్తు” అన్నాడు విష్ణుమూర్తి. ఆ జయవిజయులే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడులా, రావణ కుంభకర్ణుడులా, శిశుపాల, దంతవక్రుల్లా రాక్షస జన్మలెత్తి, విష్ణుమూర్తి చేతుల్లో హతులై తిరిగి కైవల్యం చేరుకున్నారు.
కలియుగం ప్రారంభమైన తర్వాత భూ లోకం పోకడల్ని గమనిస్తున్న జయ విజయులకి ఓ దిగులు పట్టుకుంది. ఓ రోజు విష్ణుమూర్తి దగ్గరకి వెళ్లి ఇలా విన్నవించుకున్నారు.
“స్వామీ…మేము రాక్షసులుగా జన్మించినా ఆ రాక్షసుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి. నీ చేతిలో చచ్చిన పుణ్యాన కాబోలు … ఆ అంశాలే భూలోకంలో మళ్లీ మళ్లీ జన్మిస్తున్నాయి.. ఒక్క హిరణ్యాక్ష అంశ తప్ప. మా హిరణ్యాక్ష అంశను కూడా భూలోకంలో చూడాలని ఉంది. మా కోరిక తీర్చండి స్వామీ!”
“తథాస్తు” అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.

***
అదంతా జ్ఞాపకం వచ్చి విష్ణుమూర్తి భుజాలు తడుముకున్నాడు. భుజకీర్తులు తగిలాయి.
భూదేవి మళ్లీ అందుకుంది.
“గుర్తొచ్చిందా స్వామీ! మీ వాక్కు పుణ్యాన భూలోకంలో హిరణ్యాక్ష సంతతి అగణితంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగువారి రాజధాని భాగ్యనగరంలో వీరు స్వైర విహారం చేస్తున్నారు. నా గోడు ఎవరితో చెప్పుకోవాలి? అలనాడు నన్ను చాప చుట్టగా చుట్టి, సముద్రంలో దాక్కున్న హిరణ్యాక్షుడికి తగిన శాస్తి చేసి, నన్ను విడిపించినట్టే … ఈ కలియుగ హిరణ్యాక్షులకి కూడా మీరే బుద్ధి చెప్పి, వారి చెర నుంచి నన్ను తప్పించాలి” అంటూ భూదేవి గోడు గోడుమంది.
విష్ణుమూర్తికి పట్టరాని కోపం వచ్చింది. “వరుణదేవా!” అంటూ గర్జించాడు. వరుణుడు గజగజ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు.
“వరుణదేవా! నీవు తెలుగువారి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పక్షాన చేరావని తెలిసి నిన్ను పిలిచాను. తక్షణం భూ ఆక్రమణలను అరికట్టాలని మా ఆజ్ఞగా ఆ ముఖ్యమంత్రికి చెప్పు. లేదా, నేను మరో అవతారం ఎత్తాల్సి వస్తుందని మా మాటగా హెచ్చరించు” ఆజ్ఞాపించాడు శ్రీమహావిష్ణువు.

***
వైఎస్‌ గొప్ప ఖుషీగా సూరీణ్ణి పిలిచాడు. “సూరీడూ! ఆ ఆకుల రాజయ్య ఎవడో గానీ… ఆయనకి సన్మానం చెయ్యాలని ఉందయ్యా!”
“ఎందుకు సార్‌?” అడిగాడు సూరీడు కుతూహలంగా.
“ఎందుకంటావేంటి? ఔటర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారాలు, గౌరు వెంకటరెడ్డి క్షమాభిక్ష గొడవ … ఇత్యాది సమస్యలన్నీ రాజయ్య దెబ్బకి ఒక్కసారిగా మరుగున పడిపోయాయి కదా! నిశ్చింతగా అన్నాడు వై ఎస్‌.
హఠాత్తుగా వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వై ఎస్‌ ప్రమాణం చేసి ” ఈ సంతోష సమయంలో తమరి రాక నా ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింది. ఏమిటి శెలవు?” అడిగాడు.
వరుణుడు వచ్చిన పని చెప్పాడు. భూ ఆక్రమణలు అరికట్టకపోతే మహావిష్ణువు మరో అవతార మెత్తుతాడు సుమా అని బెదిరించాడు.
వైఎస్‌ గొల్లున నవ్వాడు. నవ్వీ నవ్వీ అలిసిపోయి, బలవంతాన నవ్వు ఆపుకుని అన్నాడు. “అంత శ్రమ తీసుకోవద్దని మీ స్వామి వారికి చెప్పు. ఇక్కడ ప్రస్తుతం దేవుడి పాలనే కొనసాగుతోందని, అనవసరంగా ఒక అవతారాన్ని వృధా చేసుకోవద్దన్నానని చెప్పు … సరేనా?!”

(కిండల్ కర్త రాజగోపాల్)

ప్రకటనలు

4 thoughts on “అంధ్రప్రదేశ్ లో దేవుడి పాలన

  1. రాధిక గారు…మన రాజశేఖరుడు ఇప్పటికే ఈనాడు పీక మీద కాలేసి కస కస తొక్కుతున్నాడు…ఈ పోస్ట్ ను చదివితే..అంధ్ర జ్యోతిని కూడా……………….ఎందుకులే..జనాలకు తెలిసిందే.

    – నవీన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s