రాజకీయ ఎయిడ్స్‌

‘తాటి చెట్టు ఎందుకెక్కావూ?’ అనడిగితే ‘దూడగడ్డికోసం!’ అన్నాట్ట వెనకటికి ఎవడో. చిన్నప్పటినుంచీ ఈ వ్యవహారం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థంకాలేదుగానీ, ఈ మధ్యే కొంచెం అర్థమైనట్టు అనిపిస్తోంది! గవర్నమెంటు స్థలాల్నీ, పోరంబోకుల్నీ, అక్కడక్కడా చెరువుల్నీ ప్రభుత్వం అమ్మేస్తూ, ‘జలయజ్ఞం నిధులకోసం అమ్ముతున్నా’మంటే కాదనగలమా? రైతుల్నించి అతి చవగ్గా భూముల్ని ‘కొట్టేసి’ బడా వ్యాపారులకీ బడాబడా కంపెనీలకీ కోట్లాది రూపాయలకి అమ్ముతుంటే ‘నిధుల’ కోసమే అనుకోవాలేగానీ వేరే దురుద్దేశంతో అని అనుకోకూడదు గదా!

‘అవునయ్యా ఎస్‌.ఇ.జెడ్‌. పేరుతో పంటపొలాల్ని అమ్మిపారేశాక జలయజ్ఞాలు ఎందుకూ?’ అనడిగారనుకోండి- ‘దూడగడ్డికోసం’ అనే సమాధానం ఉండనే ఉంది.

అసలు మాటకీ చేతకీ పొంతన లేకపోవడం అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఎవరైనా పెద్దలు ‘పరమపదించార’నుకోండి… మనవాళ్ళు రెండు నిమిషాలపాటు ‘మౌనం’ ప్రకటిద్దాం- అని నిలబడి అరనిమిషంలో కూర్చోవడం చూస్తుంటే ఏమనిపిస్తుందీ? పోయినవారిని తలుచుకుని జాలిపుట్టదూ? రెండు నిమిషాల మౌనంవల్ల పరమపదించిన వారికిగానీ, బతికి ఉన్న వారికిగానీ ఏం ప్రయోజనం? అసలీ సంప్రదాయం ఎక్కడిదీ? పనికిరాని పనులు కావాలని నెత్తిన వేసుకుని మరీ చేయడాన్ని మేధావులు ఏనాడో మనకు అలవాటు చేశారు.

రైతన్నలు ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటే ‘ప్రగాఢ సానుభూతి’ని వ్యక్తం చేయడం, ఇంకొకరు మరికాస్త ముందుకెళ్ళి ‘దిగ్భ్రాంతి’ వ్యక్తం చేయడం చూస్తుంటే నవ్వూ జాలీ ఒకేసారి పుట్టుకొస్తాయి. బతికుండగా పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయనివాళ్ల ప్రగాఢ సానుభూతీ దిగ్భ్రాంతీ ఎవరికి పనికొస్తాయి.

తాజా విశ్వసుందరి జులైకా రివేరా ఈ మధ్య చెన్నై దర్శించారు. విలేఖర్ల సమావేశంలో కూడా పాల్గొనడమేగాక, ‘వణక్కం చెన్నై’ అని అరవంలో ఒక మాటని ప్రయోగించి అరవ సోదరుల్నందర్నీ అలరించారు. అంతేగాక, ‘నేను కేవలం ఫొటో సెషన్స్‌కి మాత్రమే రాలేదు, ఎయిడ్స్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, వారిలో ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడానికి వచ్చాను!’ అని ప్రముఖంగా ప్రకటించారు.

ఆ తరవాత పారిస్‌నుంచి దిగుమతైన మరి కొందరు సుందరీమణులతోపాటు ‘పిల్లి నడకలు’ (క్యాట్‌వాక్‌) నడుస్తూ వయ్యారం ఒలకబోశారు. ఇంకేం… ఆహూతులందరూ లొట్టలు వేస్తూ సదరు సుందరీమణుల అందచందాల్ని కనులారా అవలోకించి ఈలలతో అరుపులతో చప్పట్లతో తమ ఆనందాన్ని బహుముఖంగా వ్యక్తం చేశారు. కార్యక్రమం ‘ఫస్టు’క్లాసు విందుతో ముగిశాక జులైకా ఫైవ్‌స్టార్‌ హోటల్నించి బయల్దేరి ఫ్త్లెటెక్కి మరోచోట అలాంటి ‘అవగాహన’ కార్యక్రమం నిర్వర్తించడం కోసం పరుగులు తీశారు. మరుసటి రోజున ఎక్కడ చూసినా మిస్‌ యూనివర్స్‌ వార్తలే.

‘ఎన్నా తంబీ… ఎయిడ్స్‌ గురించి నీకేమన్నా అవగాహన పెరిగిందా?” అని మా ‘టీ’ కొట్టువాణ్నడిగా. వాడు నా వంక చిత్రంగా చూసి పక్కవాడికి టీ కలపడం మొదలెట్టాడు. ‘వీడు చదువురానివాడుకదా’ అని క్షమించి డైలీ పేపరు చదివే మా కూరగాయల దుకాణం వాణ్ని అదే ప్రశ్న అడిగా. ‘ఏం సారూ తమాషా చేస్తుండారూ, ఆమె ఫేషన్‌ పెరేడ్‌ చేస్తే ఎయిడ్స్‌ పోతాదా?” అని నంబియార్‌ స్త్టెల్లో వికటంగా నవ్వాడు. కనీసం ఒక్కరికైనా ‘అవగాహన’ పెరిగిందా లేదా కనుక్కుందామని, ఆనాడు ప్రదర్శన చూడటానికి వెళ్ళిన ఓ తమిళ జర్నలిస్టుని మళ్ళీ అదే ప్రశ్న అడిగా. ఆయన ‘గురూజీ… ఎయిడ్స్‌ గురించి ఏ అవగాహనా రాలేదుగానీ ఫేషన్‌ పెరేడ్‌ గురించి, ‘క్యాట్‌వాక్‌’ గురించీ మాత్రం బోలెడు అవగాహన పెరిగింది… ఫైవ్‌స్టార్‌ హోటల్లో ఫేషన్‌ పెరేడ్‌ చూడ్డం ఇదే మొదటి సారి!” అంటూ అదోలా నవ్వాడు.

ఆ మధ్య హైద్రాబాద్‌లో కూడా, జాతీయ అంతర్జాతీయ సెలబ్రిటీలు చాలామంది సమావేశమై, ఒకరి చేతులు ఒకరు పైకెత్తేసి ‘ఎయిడ్స్‌ భూతమా పారిపో… ఈ లోకంనుంచి పారిపో’లాంటి నినాదాల్ని దిక్కులు పిక్కటిల్లేలా ఇవ్వడం కూడా టీవీలో చూశా. ఆ తరవాత వారందరూ ‘ఎయిడ్స్‌’ని రూపుమాపడానికి ఏం చేశారో, ఆ అరుపుల్ని ఏ నిశ్శబ్దంలో కలిపారో ఇప్పటికీ నాకు అజ దొరకలా. ఇదే మాట కృష్ణమాచారితో అంటే ‘ఏందయ్యా… పిచ్చోడిలా ఉండావు. నినాదం ఇస్తే జాలదా? ఇంకేం చెయ్యాల?’ అని గుడ్లురిమాడు.

నటరాజన్‌ అనే మా పొరుగింటాయన నన్ను అనునయిస్తూ ‘చూడు సత్తెకాలం సారూ, పులిరాజాకీ ఎయిడ్స్‌ వచ్చునా ‘రాందా’ అని కటౌట్‌ పెడ్తిమిగదా- అంతే. మన పని పూర్తయినాది. ఎయిడ్స్‌ వచ్చునో రాందో పులిరాజుదా తేల్సుకోవాల…!’ అని భుజం తట్టాడు. నిజమే. నినాదాల్లో చాలా మహిమ ఉంది. ‘మేరా భారత్‌ మహాన్‌’ అనీ ‘గరీబీ హటావో’ అనీ లక్షలూ కోట్లూ ఖర్చుపెట్టి గొప్పవాళ్లెందుకు నినాదాలిస్తారూ?

సరే…! చదువుకున్న వారికోసం పత్రికా ప్రకటనల వంటివి ఉపయోగపడతాయి. నిరక్షరాస్యులకి అవగాహన కలిగించే విధానం ఏదీ? ఈ ప్రశ్నకి అతి సులభంగా సమాధానం చెప్పాడు మా తిరగలిస్వామి. ‘అయ్యా.. ప్రతి ఇంటి తలుపు మీదా… ‘ఓ ఎయిడ్స్‌ రేపురా’ అని రాయిస్తే చాలు. ఎయిడ్స్‌ దాన్దారిన అదే చక్కాబోతుంది!” అన్నాడు.

‘అదేంటండీ?’ అని నేను ఆశ్చర్యపడితే, ‘అదేమరి! ఆ రోజుల్లో ‘ఓ స్త్రీ రేపురా’ అని తలుపుల మీద రాయలేదూ? అలాగే ఇది కూడా! ఆ దెయ్యంలాగే ఈ ఎయిడ్స్‌ భూతం కూడా ఆ మాటని చదువుకుని ‘రేపొద్దాంలే’ అంటూ వెళ్ళిపోతుంది!’ నశ్యంపట్టు పీల్చి మరీ అన్నాడు. ‘ఎయిడ్స్‌ అనేది ఓ భయంకరమైన వ్యాధి. దానికి చదువెక్కడొస్తుందయ్యా స్వామీ’ చికాగ్గా అన్నా. ‘పిచ్చివాడా నిజానికి అదీ ఓ భూతమే. మ్లేచ్ఛ మంత్రానికి పిశాచ యంత్రానికి పుట్టిన బిడ్డ అది. దానికి చదువు రాకపోవడమేం! అయినా జబ్బు అనేది ప్రారబ్ధ కర్మవల్ల వస్తుందిగానీ… మరొకలా ఎలా వస్తుందోయ్‌?’ అని లా పాయింటు కూడా తీశాడు. అదీ తిరగలి స్వామి అవగాహన. వాడే విశ్వసుందరి ఫ్యాషన్‌ షోతో పాటు, ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాల నిర్వాహకుడు. అదండీ సంగతి…!
(వ్రాసింది భువనచంద్ర, వేసింది ఈనాడు)

2 స్పందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: