వీళ్లా రైతుజన బాంధవులు?

‘నా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…
ఆదుకుంటానంటోంది సోనియాగాంధీ… మేలు చేస్తానంటోంది…
అవకాశమీయండని కోరుతున్నా’
నంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారఘట్టంలో వై.ఎస్‌. ఊరూ వాడా మోతెక్కించారు. ‘రైతుల ఆత్మహత్యలు ఆపడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్య’మని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంనాడు ఆయన ఢంకా బజాయించారు. ‘… ఇకపై రాష్ట్రంలో ఒక్కరైతూ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అగత్యం ఏర్పడకుండా అన్ని రకాలుగా ఆదుకుంటా’మని ఉద్ఘాటించిన ప్రభువుల ఏలుబడిలో మృత్యునగారా ఆగకుండా మోగుతూనే ఉంది! నిరాశా నిస్పృహల్లో మగ్గిపోతూ అర్ధాంతరంగా బతుకు చాలించుకుంటున్న అన్నదాతల విషాద ఉదంతాల పరంపర గుండెల్ని మెలిపెడుతోంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మూడు వేలమంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని కాంగ్రెస్‌ ప్రచార సారథులు గతంలో ఎడాపెడా ఆరోపణలు గుప్పించారు. తాము రైతు సముద్ధారకులమని అలవాటుగా చాటుకునే ఏలికల పాలనలో- ఆ సంఖ్య ఎప్పుడో చిన్నబోయిందని అడ్డూఆపూ లేని బలవన్మరణాలు అసందిగ్ధంగా రుజువు చేస్తున్నాయి. గడచిన మూడేళ్లలో 4200మంది రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో నమోదయ్యాయని ప్రధానికి నివేదించినట్లు మూడు నెలల క్రితం స్వయానా ముఖ్యమంత్రే వెల్లడించారు. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్నాయనీ, వాటి నిరోధానికి సరైన చర్యలు తీసుకోని సర్కారు తమది కర్షక ప్రభుత్వమని ఎలా చెప్పుకొంటుందన్న రైతు సంఘం సూటి ప్రశ్నకు- నేతలు కిక్కురుమంటే ఒట్టు. కర్షక ప్రయోజనాల్ని బలిపెట్టడంలో మరే రాష్ట్రప్రభుత్వమైనా వై.ఎస్‌.సర్కారు ముందు తీసికట్టు! అధికారాన్ని ఒడిసిపట్టే వ్యూహంలో భాగంగా గుప్పించిన ఉచిత విద్యుత్‌ వాగ్దానాన్ని అరగదీయడంలో వై.ఎస్‌. బృందానిది సాటిలేని రికార్డు. ప్రభుత్వం బలవంతాన రుద్దిన కెపాసిటర్లను బిగించినా మోటార్లు కాలిపోతున్నాయన్న రైతుల గగ్గోలును పట్టించుకున్న నాథుడు లేడు. నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్‌ సరఫరా హామీని కొండెక్కించడానికి సిగ్గులేదా అని గత ప్రభుత్వాన్ని నిగ్గదీసిన వై.ఎస్‌. నేడదే ప్రశ్న రైతుల నోట ప్రతిధ్వనిస్తున్నా- పట్టించుకోవడమే లేదు. ప్రకృతి ప్రకోపం, సర్కారీ నిర్లక్ష్యం చెరో వంక మృత్యుక్రీడలాడుతుంటే- రైతాంగానికి అండగా నిలిచి ఆసరా ఇచ్చే దిక్కేది? నిన్నటికి నిన్న ఇరవైనాలుగు గంటల వ్యవధిలో పన్నెండుమంది రైతులు ఉసురు తీసుకోవాల్సిన దారుణ దురవస్థ రైతుబాంధవుల ‘కార్యకుశలత’కు ప్రబల ప్రతీక!

‘మిమ్మల్ని సవాలు చేస్తున్న అన్ని సమస్యలనూ నామరూపాలు లేకుండా చేయడానికి మీ అడుగులో అడుగేస్తా’నని అన్నదాతలకు నాడు బహిరంగ లేఖ రాసి వై.ఎస్‌. చరిత్ర సృష్టించారు. ఇబ్బడిముబ్బడిగా గుమ్మరించిన హామీలు కురవని మబ్బులేనని నిరూపించడంలోనూ తనకు సరిసాటి లేరని నేడు నిర్లజ్జగా రుజువు చేసుకుంటున్నారు! రాష్ట్ర వ్యవసాయరంగంలో మరో సస్యవిప్లవం సాధిస్తేనే పదేళ్లుగా దెబ్బతిన్న సేద్యాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చగలమని ఉద్ఘోషించిన నేతలు- వాస్తవంలో ఒరగబెట్టిందేమిటి? విప్లవం మాట దేవుడెరుగు- మనుగడకే ముప్పు ముంచుకొస్తున్నా తప్పించుకోలేని అసహాయస్థితిలో రైతన్న అలమటిస్తున్నాడు. పరపతి వసతి మొదలు విత్తనాలు, ఎరువుల వరకు దేనికీ పాలకులు పూచీ ఇవ్వలేనప్పుడు సస్యవిప్లవం వట్టి పగటి కల. ఆత్మహత్యల మాటే వినిపించకూడదన్న మహదాశయంతో ఆరంభించిన ‘హెల్ప్‌లైన్‌’ మూగబోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబానికి సత్వర సాయం, రకరకాల కొర్రీల మాటున అక్కరకు రాకుండా పోతోంది. చేసిన అప్పులు తీర్చే దారి లేక చావే శరణ్యమనుకునే దురవస్థలో విలపిస్తున్న రైతుల్ని ఆదుకునే ఆపన్న హస్తమేదీ? అండగా నిలుస్తామన్నవాళ్లు కర్కశంగా మొండిచెయ్యి చూపడంవల్లే రాష్ట్రంలో వ్యవసాయదారుల ఆత్మహత్యలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. దిగుబడి కుంగిపోయిందని ఎమ్మార్వో నివేదిక ఇచ్చినా సాయం అందదు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, లోఓల్టేజీ సమస్యలతో పంట ఎండిపోయి నష్టాలు పేరుకుంటుంటే బక్కరైతుకు దిక్కు తోచదు. సాగునీటి ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయిన అభాగ్యులకు సరైన పరిహారమూ దక్కదు. రైతుకు భవిష్యత్తు పైనే కాదు, వర్తమానంలోనూ భరోసా కల్పించే కార్యాచరణ ఎండమావి కావడం వల్లనే ఈ రోజుకూ బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడే రైతన్నల్ని చూస్తే మనసు క్షోభిస్తుందని నాటకీయ డైలాగులు వల్లెవేసిన నాయకులు, ప్రస్తుత దురన్యాయానికి ఏమని బదులిస్తారు?

రైతు సంక్షేమాన్ని ఘోరంగా నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణపై 356 అధికరణ కింద చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షనేతగా వై.ఎస్‌.- జాతీయ మానవహక్కుల సంఘాన్ని అభ్యర్థించారు. వ్యవసాయానికే అగ్రతాంబూలమని ఎంతగా డప్పుకొట్టినా అడుగడుగునా విహిత బాధ్యతలనుంచి తప్పించుకుంటున్న ఇప్పటి సర్కారు ప్రయోజకత్వం ఏపాటిదో వేరే చెప్పడమెందుకు? వేలకోట్ల రూపాయల వ్యయీకరణతో రాష్ట్రంలో అపూర్వ జలయజ్ఞం చేపట్టిన అపర కాటన్‌గా వై.ఎస్‌.ను ప్రధాని మన్మోహన్‌ ఇటీవల ఆకాశానికెత్తేశారు. ఎవరి కళ్లకు ఎన్నాళ్లని గంతలు కడతారు? కట్ట నిలవని చెరువులకు- డ్రెయిన్లకు కనీస మరమ్మతులకైనా చేతులు రావు. అస్మదీయ ప్రయోజనాలు అమితంగా ఇమిడి ఉన్న భారీ పథకాల టెండర్లు, కాంట్రాక్టుల పందేరంలో మాత్రం తగని చురుకు! ఎక్కడికక్కడ అవకతవకల ఉరవడివల్లే ‘రైతు ప్రభుత్వ’వాసి గబ్బెత్తిపోతోంది. తక్కినచోట్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా ఆంధ్రప్రదేశ్‌లో బలవన్మరణాలు పెరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్‌ కొన్నాళ్ల క్రితం పార్లమెంట్లోనే ప్రకటించారు. ఈ భ్రష్ట రికార్డుకు- ‘రైతు బిడ్డను… రైతు సమస్యలన్నీ తెలిసినవాణ్ని’ అంటూనే అహేతుక నిర్వాకాలు వెలగబెట్టిన ముఖ్యమంత్రే ప్రధానంగా జవాబుదారీ. పైరుకోసం చేసిన అప్పులు కాలనాగులై రైతుల్ని కసిగా కాటేస్తుంటే ఆయన ప్రభుత్వం చేసిందేమిటి? వ్యవస్థాగత పరపతి వసతి మెరుగుదల సంగతి గాలికొదిలేసి ప్రైవేటు రుణాలపై మతిమాలిన మారటోరియం విధించింది. రైతుల్ని పెనంమీద నుంచి పొయ్యిలోకి నెట్టింది. దుర్భర స్థితిగతులనుంచి వారిని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన జయతీఘోష్‌, రామచెన్నారెడ్డి కమిషన్ల సిఫార్సుల స్ఫూర్తినీ, స్వామినాథన్‌ మేలిమి సూచనల్నీ పెడచెవిన పెట్టింది. వేలాది రైతుల దుర్మరణాలకు తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అంటూ లోగడ నిప్పులు చెరిగిన నేతలు, ఇప్పుడు స్వీయ తప్పిదాలకు ముసుగులు తొడగడంలో నిమగ్నమైపోయారు. ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ కేవలం కంటి తుడుపు. 2005 చివరికి అన్నదాతల అర్ధాంతర దుర్మరణాలు సున్నా స్థాయికి చేరాయన్న సర్కారీ బడాయి ప్రకటన పచ్చి అబద్ధం. తాము చేపట్టిన చర్యల కారణంగా ఇటీవలి కాలంలో రైతుల చావులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పింది, కల్తీలేని అవాస్తవం. గడచిన అయిదు నెలల్లోనే మూడువందల వరకు ఆత్మహత్యలు ప్రభుత్వ నయవంచకత్వానికి నిలువెత్తు నకళ్లు. మొసలి కన్నీరు కారుస్తూ, ఉత్తచేతులతో మూరలు వేసే వీళ్లా రైతుజన బాంధవులు?

(ఈనాడు సంపాదకీయం)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s