యూ(బూ)తు రాజకీయం

”సార్‌! మావాడి సంగతి మీకు తెలియదు. వాడు తట్టుకోలేడు. ఇలా రిబ్బన్లలాంటి దుస్తులతో హీరోయిన్లు ఆ టీవీల్లో కనిపిస్తుంటే తట్టుకోలేడు”

”వార్నీ… మీవాడి పేరు రాముడని పెడితే ఏంటో అనుకున్నా. ఈ కాలం కుర్రకారు చూడు… హిమాలయాల్లో, మానససరోవరంలో, దక్షిణ ధ్రువంలో… ఎక్కడ సినిమా తీయనీ, నిండా కప్పుకొన్న హీరోయిన్‌ని చూడలేరు. మరి మీవాడేంటయ్యా ఇలా…”

”నన్ను చెప్పనివ్వండి. మా వాడి సంగతి మీకు తెలియదని ముందే చెప్పా. వాడు తట్టుకోలేడు”

”నీ అసాధ్యం కూల! అంత తలొంచుకుపోయే కుర్రాడు పార్టీలో ఏం పనికొస్తాడయ్యా? మనపార్టీ యూతు వింగులో మీవాడు చురుకని విన్నాను. తట్టుకోలేనివాడు ఈ రాజకీయాల్లో ఏం నెగ్గుకొస్తాడయ్యా?”

”మరోసారి తమరికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సినిమాల్లో దృశ్యాలే కాదు… ఫ్యాషన్‌ షోలు చూసినా మా వాడు… తట్టుకోలేడు సార్‌ తట్టుకోలేడు”

”ఇందాకట్నించి చూస్తున్నాను… తట్టుకోలేడంటూ ఆ పదాన్ని తెగ నొక్కుతున్నావు, ఏం చేస్తాడేంటి?”

”తెలుసుకుని మీరు తట్టుకోలేరు సార్‌…”

”ఫరవాలేదు- చెప్పు”

”అలాంటి దృశ్యాలు టీవీలోచూడగానే వాడు…”

”ఊ. చెప్పు. వాడు…”

”తట్టుకోలేడు సార్‌”

”నీ బండబడ… మీవాడికి ఏదో పదవి కావాలని వచ్చి ఏందయ్యా ఈ టైము తినుడు. తట్టుకోలేకపోతే పోయాడుగానీ, ఇప్పుడు వాడికేం పదవి కావాలో అసలు విషయం చెప్పు”

”అదే చెబుతున్నా సార్‌… వాడు అలాంటి దృశ్యాలు వస్తున్నాయని తెలిస్తే…”

”తెలిస్తే, టీవీ కట్టేసి బయటకు వెళ్ళిపోతాడు. అంతేగద. నీ తస్సాగొయ్యా. దీనికింత సాగతీతేందయ్యా”

”అదిగాదు సార్‌. వాడు తట్టుకోలేక, టీవీ పట్టుకు కూర్చుంటాడు సార్‌”

”హహ్హహ్హ! వార్నీ…! ఇదా నువ్వు చెప్పేది. భలేవాడివేనయ్యా. నీకొడుకేదో శ్రీరామచంద్రుడన్నట్లు తెగసాగదీశావుగదయ్యా! భేష్‌, మన యూతురత్నం మన విలువల్ని నిలబెడుతున్నాడన్నమాట”

”ఏదో సార్‌. చిన్నప్పట్నించి వాడికి రాజకీయాలు తప్ప మరేదీ తెలియదు. ఎలాగోలా ఏదో పదవి ఇచ్చి మీరే ఆదుకోవాలి”

”దాన్దేముందయ్యా… దేవస్థానం పదవులేవైనా ఖాళీ ఉన్నాయేమో చూద్దాం”

”అవి వద్దు సార్‌… మావాడు పార్టీ భజనే తప్ప దైవ భజన చేయడు”

”లక్షణాలు. పైకొచ్చే లక్షణాలయ్యా… పోనీ కార్పొరేషన్లేవైనా చూడమంటావా?”

”వద్దు సార్‌. అవీ వద్దు”

”పోనీ నువ్వే చెప్పు. ఎక్కడో ఒకచోట ఇరికించేద్దాం”

”అలా అయితే… సెన్సార్‌బోర్డులో ఇరికించండిసార్‌”

”ఇదేం కోరికయ్యా! మీవాడు చూసి ఊరుకునే రకం కాదన్నావ్‌. పైగా తట్టుకోలేడంటున్నావ్‌. ఆపైన యూతునేత కూడా. సెన్సార్‌బోర్డులో మీవాణ్ణి… బాగోదేమోనయ్యా?”

”మీరంతమాట అనకండి సార్‌. మావాడు తట్టుకోలేడు. సెన్సారైన సినిమాని అంత ఇదిగా చూసే మావాడికి సెన్సారుకాని సినిమాలంటే- మహాపిచ్చి. కాబట్టి సెన్సారుబోర్డులో తప్పించి మరే పదవిలోనూ ఇమడలేడు సార్‌!”

”అలాగంటావా. ఇది రేపు పత్రికలవాళ్ళకి తెలిస్తే బదనామ్‌ అవుతాం కదయ్యా”

”భలేవార్సార్‌. మీరు పత్రికలు సరిగా చూస్తున్నట్టు లేదు. ఏకంగా 28మంది యూత్‌ నాయకుల్ని సెన్సార్‌ బోర్డులో నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి నియామకాలు దయచేశారు సార్‌”

”భేష్‌, మరింకేం, అలాగేకానిద్దాం. మనం పవర్లో ఉండగా సెన్సార్‌ కాని సినిమాల్ని మన పుత్రరత్నాలు కాకుండా వేరేవాళ్ళు చూడటమేమిటి?”

”అదీకాక ఇంకో పాయింటుందిసార్‌”

”చెప్పు”

”ప్రేక్షకులకు ఏంకావాలో మావాడికి బాగా తెలుసుసార్‌. తనకు నచ్చిందే జనానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాడని హామీ ఇస్తున్నాను సార్‌”

”యూతు నేత కదా… ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సెన్సార్‌ చేస్తాడయ్యా! కత్తెరిచ్చి పంపించు. తనకు నచ్చనివన్నీ తీసేసి… సినిమా చిన్నదైనా జనంమీదికి వదలమను”

”చిన్న డ్రెస్సు- చిన్న సినిమా… భలేవుంద్సార్‌”

”సెన్సార్‌బోర్డు పదవి వస్తోందంటే… మీవాడు తట్టుకోగలడా?”

(జనం సంగతి ఎవడిక్కావాలండీ బోడి!)

– (వ్రాసింది ప్రమోదూత, ఈనాడు కోసం)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s