ఠాణా బజానా

”బాలమిత్ర పోలీస్‌ స్టేషన్‌ చూడర బాబూ, చూడర బాబూ” అంటూ డిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌ ఊరిస్తుంటే నోట్లో వేలు వేసుకున్న బుడతళ్లతో సహా పిల్లలంతా బిలబిలమని ఆయన చుట్టూ చేరిపోయారు. ‘అంకుల్‌, అంకుల్‌’ అంటూ ఆయనతో లింకులు కలిపారు. దాంతో ఆయన ”ఎన్నెన్నో జన్మల బంధం మీదీ మాదీ” అన్నట్టు చూశారు.

దేశంలోనే ‘హోం ప్రథమంగా’ నెల్లూరు జిల్లా కావలిలో బాలమిత్ర పోలీస్‌ స్టేషన్‌ సందడి సందడిగా ఏర్పాటయింది. ప్రజల ప్రయోజనాలకు ‘కావలి’దారులుగా ఉండవలసిన పోలీసులు ఈ మధ్య కొంత కాలంనుంచి పిల్లల మీద దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య ఓ కుర్రాడిని మానవతా దృక్పథంతో ‘ఏక్‌ దిన్‌ కా పోలీసు’ చేశారు. హైదరాబాద్‌లోని జూబిలీ హిల్స్‌ పోలీసు స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా దర్జాగా విధి నిర్వహణ చేసిన చిచ్చర పిడుగును చూసి ‘ఇంత సీను మనకు కూడా లేదే’ అని ఎంతో మంది పోలీసులు ముక్కున వేలు వేసుకున్నారు. ‘ఏ చట్టంబు పఠించె బుడతడేసెక్షన్‌ను నేర్చె’ అని పద్యం పాడుకున్నారు.

ఇప్పుడు పోలీసుల మీద పిల్లలకు అభిమానం కలగడానికి ‘జై బాలమిత్ర’ అంటున్నారు. ఆటపాటలకోసం పిల్లలకు పార్కులు గట్రా ఏర్పాట్లు చేయడమే కాకుండా తమ దగ్గర ఉన్న తుపాకులను కూడా వారికి చూపించి ‘జాయ్‌ రాజా జాయ్‌’ అంటున్నారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా, దీనిని ఎవరూ ప్రశ్నించలేరు. ‘మన పోలీసు స్టేషన్లలోని ఎన్నో తుపాకులు పిల్లలు ఆడుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావ’ని గిట్టనివాళ్ళు అంటున్నా పోలీసులు (తుపాకులు) లెక్క పెట్టడం లేదు. ‘ఆ తుపాకులన్నీ పని చేస్తే ఎంత ప్రమాదమో ఆలోచించండి’ అంటున్నారు!

ఇప్పటి చదువుల్లో పెద్దబాలశిక్ష లేదే అనే బెంగ కూడా అవసరం లేదు. పోలీసుల సన్నిధిలో పిల్లలకు అన్ని ‘శిక్షల’ గురించి అవగాహన వస్తుంది. ఏ శిక్షనుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుస్తుంది.

తండ్రి హత్య కేసు తన మీదికి రాకుండా ప్రహ్లాదుడు ఎలా తప్పించుకున్నాడో చెప్పవచ్చు. అలాగే బాల కృష్ణుడు మట్టి తిన్నాడని బలరాముడు తమ తల్లి యశోదకు ఫిర్యాదు చేస్తే ఆ చిన్న కృష్ణయ్య ఏం చేశాడు? తన నోట్లో పధ్నాలుగు భువనాలు చూపించి అప్పీలు లేకుండా చేశాడు. కృష్ణుడు వెన్న దొంగతనం కేసు నుంచి ఎలా తప్పించుకున్నదీ, గోపికా వస్త్రాపహరణ చేసినా ఇబ్బందేమీ రాలేదని బొమ్మలు కూడా చూపించి పోలీసులు పిల్లలకు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెబుతుంటే బాలలకు కాలక్షేపం… ఖాకీలకు విధి నిర్వహణ ఏక కాలంలో అయిపోతాయి.

ఈ కథలన్నీ విన్న ఏ గడుగ్గాయి అయినా ‘ఆ రోజుల్లోనూ పోలీసులు ఇంతేనన్నమాట’ అని ఒక చెణుకు విసిరితే తాము ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామని పోలీసులు వణుకు లేకుండా రొమ్ము విరిచి చెప్పుకోవచ్చు.

అంతే కాదు- శ్రీకృష్ణ పరమాత్ముడు జైలులోనే పుట్టాడని గొప్పగా చెప్పవచ్చు. అప్పుడు పిల్లలకు తమ ఇల్లు జైలులా ఎందుకు అనిపిస్తుందో, తల్లిదండ్రులు జైలు సిబ్బందిలా ఎందుకు కనిపిస్తారో ‘తాట తెల్లం’ అవుతుంది.

ఇంతటితో పౌరాణికాలను ఆపనక్కర లేదు! అలనాటి రక్షకభటులైన జయ విజయులు తక్కువ కాలంలో దేవుణ్ని చేరుకోవడానికి రాక్షసులుగా మారిన కథలను కూడా చెబితే అద్భుతంగా ఉంటుంది. పోలీసులంటే ఏమిటో తలకెక్కుతుంది. వారు వైర భక్తులని తేలిపోతుంది.

ఆ తరవాత ఇప్పుడు సాగుతున్న దేవుడి పాలన గురించి తాపీగా చెబితే పిల్లకాయలు హ్యాపీగా వింటారు. ‘ఆహా! పోలీస్‌, ఓహో! పోలీస్‌’ అంటారు. ‘హరికథల’కు ఆదరణ తగ్గలేదన్న నమ్మకమూ ఏర్పడుతుంది. ‘పిల్లలూ-పోలీసులు’ చల్లనివారే అన్న పాటతో కార్యక్రమాలు ముగిస్తే శాంతి భద్రతలు భద్రంగా ఉంటాయి. పోలీసు స్టేషన్లకు వచ్చి పోయే నిందితులు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అంతా అదుపులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కథలన్నీ విని అంతా మరిచిపోయి ‘సీతారామ స్వామీ మేం చేసిన నేరములేమీ?’ అని నేరుగా దేవుణ్ణే అడుగుతారు. దేవుడు కంప్యూటరేం కాడు కాబట్టి ఇవేమీ గుర్తుండవు. దాంతో నిందితులంతా నిర్దోషులవుతారు! బాలమిత్ర పోలీసు స్టేషన్ల వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి!

ఇప్పటి పోలీసులంటే పడనివాళ్లు అనేక ఠాణాలను గూండామిత్ర పోలీసు స్టేషన్లనీ, కబ్జామిత్ర పోలీసు స్టేషన్లనీ, నాయకమిత్ర పోలీసు స్టేషన్లనీ అదే పనిగా ఆడిపోసుకోవడం పరిపాటి అయింది. బాలమిత్ర ఠాణాలతో దీనికి తెర పడుతుంది. పోలీసు స్టేషన్లలో ఏమి జరిగినా పిల్లలు ప్రత్యక్ష సాక్షులవుతారు. పైగా ‘బాలవాక్కు బ్రహ్మవాక్కు’ అనే మాటను ఉపయోగించుకుంటే ఆ సాక్ష్యానికి తిరుగుండదు. పిల్లలకు సర్వాధికారాలు ఇస్తే చట్టం పదునెక్కుతుంది. పెద్దలను శిక్షించడంలో పోలీసుల పాత్ర కన్నా పిల్లల పాత్రే మిన్న అని ‘గన్నులకు’ కట్టినట్టు రుజువయి పోతుంది. చిన్నప్పుడు తమను చైల్డ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచినందుకు ప్రతీకారంగానే తాము పెద్దయ్యాక ఆ పిల్లలు తల్లిదండ్రులను ఓల్డ్‌ ఏజ్‌ హోంలలో చేరుస్తున్నారన్న విమర్శ కూడా ఎలాగూ ఉంది.

పిల్లల విషయంలో ఇంకో చిత్రమైన సంగతి ఉంది. వారు నిజం చెబుతారేమోనని పెద్దలు భయపడతారు తప్ప అబద్ధం చెబుతారని భయపడరు. లై డిటెక్టర్ల అవసరమూ ఉండదు. రాష్ట్రంలో మరో ఆరు బాలమిత్ర పోలీసు స్టేషన్లు వస్తున్నాయొస్తున్నాయని పోలీసు పెద్దలు చెబుతున్నారు. రానున్న కాలంలో ఇవి ఇంకా పెరిగిపోతాయి. వ్యవహారం అంతా బాలల చేతికొస్తుంది. ధర్మం కార్లలో, జీపుల్లో నాలుగు చక్రాలా నడుస్తుంది. బాలకులు పాలకులయిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీ మహాత్ముడు ఎందుకు అనలేదా అని అనిపిస్తుంది. ‘నాడు బాలుడగానె నాయకులార’ అన్న బాలచంద్రుని మాటా గుర్తొస్తుంది.

విద్యా వ్యవస్థలో పరీక్షల తీరు మారిపోతున్నట్టే ఇంకో కొత్తదనమూ వస్తుంది. స్కూళ్లలో టీచర్లు బెత్తం పట్టుకుని వెంటబడుతుంటే పిల్లలు పరిగెత్తడం పాత సినిమా స్క్రిప్టు. పిల్లల చేతికే గనక లాఠీలు వస్తే పరిగెత్తడం పంతుళ్ళ పని. ఈ చరిత్రను ఏ సిరాతో రాసినా విరిగేదీ లాఠీనే. అంతా బాలానందమే. బాలానందమే బ్రహ్మానందం. ఎవరు కాదనగలరు?
(శంకరనారాయణ వ్యాసం, ఈనాడు కోసం)

ప్రకటనలు

One thought on “ఠాణా బజానా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s