టాటా, బిర్లా .. మధ్యలో ‘ఆయన’

‘అన్నా! టీవీ చూశావా? మీ మార్గదర్శి నష్టాల్లో ఉందట …’ గుండెలు బాదుకుంటూ వచ్చి చెప్పాడు యాదగిరి.
వెంకట్రావు టీపాయ్‌ మీద కాళ్ళు బార్లాజాపి, సోఫాలో వెనక్కి వాలి, సిగరెట్టు పొగ గుప్పున వదిలి, నిశ్చింత ముద్రపట్టి అన్నాడు.
‘అయితే ఏంటటా?’

వెంకట్రావు దాదాపు పాతికేళ్ళ నించి మార్గదర్శి ఖాతాదారుడు. ఆ సంగతి యాదగిరికి తెలుసు. మార్గదర్శిలో వెంకట్రావు బోలెడంత డబ్బు దాచాడని కూడా తెలుసు. అలాంటి వెంకట్రావు మార్గదర్శి నష్టాల్లో ఉన్న సంగతి తెలిసి కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం యాదగిరిని ఆశ్చర్యపరిచింది.
‘అలా అంటావేంటీ? మార్గదర్శి దివాలా ఎత్తేస్తే, నువ్వు నెత్తిన గుడ్డేసుకోవల్సిందే… నీ డిపాజిట్లన్నీ మటాష్‌…’ అన్నాడు యాదగిరి.
వెంకట్రావు యాదగిరిని జాలిగా చూశాడు. ‘పిచ్చివాడా! వరల్డ్‌ బ్యాంకైనా దివాలా తీస్తుందేమో కానీ మార్గదర్శి దివాలా దియ్యదు గాక తియ్యదు. మా చైర్మన్‌ రామోజీరావు గారంటే ఏమనుకున్నావు? నిప్పులాంటి నిజాయతీ ఆయనది. నాకు ఆయన మీద బోలెడంత నమ్మకం ఉంది. పైగా, ప్రతిపైసాకి నాదీ పూచీకత్తు అని చెప్పారు … వినలేదా?’

‘పైస లెవడిక్కావాలిబే … రూపాయిల సంగతి చెప్పు’ అన్నాడు యాదగిరి.
వెంకట్రావుకి ఒళ్ళు మండింది. ‘ఛప్‌ .. నోర్ముయ్‌! నీ కసలు తెలుగు నుడికారం తెలీదు. దానర్థం అదే … అయినా, అంత అవసరమైతే తన ఆస్తులన్నీ అమ్మేసైనా ఖాతాదారుల డిపాజిట్లు చెల్లిస్తానని మా చైర్మన్‌ గారు హామీ ఇచ్చారు … నేను నమ్ముతున్నాను. కందకి లేని దురద కత్తిపీట కెందుకన్నట్టు ఏ డిపాజిట్లూ లేని వాడివి … మధ్యలో నీకెందుకూ బెంగ?’

యాదగిరి కాస్త తగ్గాడు. ‘తైనా జిగ్రీ దోస్తువి కదా? నా బెంగ నాది … అవును గానీ రామోజీరావు ఆస్తులు ఎంత ఉంటాయేంటీ?’ కుతూహలంగా అడిగాడు.
‘ఆయనే పబ్లిగ్గా చెప్పారు కదా … గ్రూపు సంస్థలన్నీ లాభాల బాటలో నడుస్తున్నాయని … అన్నీ కలిపితే కొన్ని వేల కోట్లు ఉండొచ్చు’ పరవశంగా అన్నాడు వెంకట్రావు.
‘అబ్బా .. టాటా, బిర్లా, అంబానీల కన్నా గొప్పోడా ఏంది మీ రామోజీరావు?’ ఎకసెక్కంగా అన్నాడు యాదగిరి.
‘కాకపోవచ్చు గానీ మన స్టేట్‌లో మాత్రం ఆయన గొప్పోడే?’ బల్లగుద్ది చెప్పాడు వెంకట్రావు.

‘నీకు తెలీకపోతే తెలీనట్టు ఉండు. ఆయన కన్నా ధనవంతులు మన స్టేట్‌లో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటపడలేదు … తప్పనిసరై ఈయన బయటపడ్డాడు. అంతే తేడా? సరేలే కానీ … టీవీ పెట్టు .. మార్గదర్శి సీరియల్‌ చూద్దాం!’ అంటూ తనే లేచి వెళ్ళి టీవీ ఆన్‌ చేశాడు యాదగిరి.
తెరమీద కె.చంద్రశేఖర్రావు బల్లగుద్ది చెబుతున్నాడు. ‘అందరికీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం …’
యాదగిరి చప్పట్లు కొట్టాడు. ‘చూశావా … మా కేసీఆరన్న ఏం చెబుతున్నాడో! మా కేసీఆర్‌ మీ ఆంధ్రా పెట్టుబడిదారుల్ని వదలడు గాక వదలడు. తెలంగాణ వస్తే రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్ళతో దున్నించడానికి రెడీగా ఉన్నాడు. అసలు మా కేసీఆర్‌ దెబ్బకి మీ ఆంధ్రా కార్పొరేట్‌ కాలేజీలు గడగడలాడిపోయాయి … గుర్తు లేదూ! మా తెలంగాణ అంతా మార్గదర్శి బ్రాంచీలు పెట్టి, మా తెలంగాణ ప్రజల డిపాజిట్లు కొల్లగొట్టిన రామోజీరావుని కేసీఆర్‌ ముప్పుతిప్పలు పెతాడు … చూడు..’ ఆవేశంగా అన్నాడు యాదగిరి.

‘నీ బొంద … కేసీఆర్‌ అంటున్నది కరీంనగర్‌ ఉప ఎన్నికలో ప్రత్యర్థుల డిపాజిట్ల సంగతి … అదిగో .. మార్గదర్శి గురించి మాట్లాడుతున్నాడు … విను…’ అన్నాడు వెంకట్రావు.
‘… మార్గదర్శి మీద ప్రజలకు విశ్వాసం ఉంది. మార్గదర్శిలో అవకతవకలు జరగడం కానీ, చెక్కులు బౌన్సవడం గానీ ఎప్పుడూ లేదు .. తమ అక్రమాలు బయటపెడుతున్నందుకే రామోజీరావు మీద అధికార పార్టీ నేతలు కక్షగట్టారు … ఆయనకి పేపరు లేకపోతే అసలు మార్గదర్శి జోలికి వచ్చేవారా?’ నిలదీస్తున్నాడు కేసీఆర్‌.

‘మరేం … ఆయనకి పేపరు లేకపోతే మీరు మాత్రం ఈ వివాదంలోకి తలదూర్చేవారా?’ చురకంటించి యాదగిరి వైపు చూశాడు. కేసీఆర్‌ ప్రసంగంతో అప్పటికే దిమ్మ తిరిగిన యాదగిరి పేపరు చాటున మొహం దాచుకున్నాడు.
తెరమీద జయప్రకాష్‌ నారాయణ ప్రత్యక్షమయ్యాడు. ‘మార్గదర్శి మీద ఒక్క ఫిర్యాదూ లేదని సాక్షాత్తూ హోంమంత్రే చెప్పారు … ఒక్క డిపాజిట్‌ దారుడూ ఫిర్యాదు చేయనప్పుడు అసలు సమస్య ఏముంది?’ ప్రసన్న వదనంతో గంభీరంగా అంటున్నాడు జయప్రకాష్‌.
‘అంటే … చేతులు కాలాక ఆకులు పట్టుకోమని తాత్పర్యం’ గొణిగాడు యాదగిరి.
‘సరేగానీ .. నేనిప్పుడు మార్గదర్శి ఆఫీసుకి వెళ్తున్నా … డిపాజిట్‌ చేయడానికి … పనేం లేకపోతే నాతోరా!’ అంటూ బయల్దేరాడు వెంకట్రావు. యాదగిరి అతణ్ణి అనుసరించాడు.
***
ఇద్దరూ వెళ్ళేసరికి మార్గదర్శి ఆఫీసు ఖాతాదార్లతో కోలాహలంగా ఉంది. రెండు న్యూస్‌ చానెల్స్‌ ప్రతినిధులు డిపాజిట్‌దార్ల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
‘ఇదిగో .., మార్గదర్శికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పే వాళ్ళు ఇటు రండి. వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఆ న్యూస్‌ ఛానెల్‌ దగ్గరికి పొండి’ ఆదేశించాడో న్యూస్‌ ఛానెల్‌ ప్రతినిధి. డిపజిట్‌దార్లు రెండుగా చీలిపోయి అటూ ఇటూ క్యూలు కట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడ్డం మొదలుపెట్టారు.
అది చూసి వెంకట్రావు ఉత్సాహంగా అనుకూల న్యూస్‌ ఛానెల్‌ దగ్గరికి వెళ్ళి, బ్యాగ్‌లోంచి నోట్ల కట్టలు తీసి ప్రదర్శిస్తూ చెప్పాడు.
‘సార్‌! ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను అయిదు లక్షలు డిపాజిట్‌ చేయడానికి వచ్చాను. ఇదిగో … చూడండి.’
కెమెరా గిర్రున వెంకట్రావు వైపు తిరిగింది. అనుకూల చానెల్‌ ప్రతినిధి చప్పట్లు కొట్టి ‘గ్రేట్‌ .. చెప్పండి సార్‌ చెప్పండి’ అంటూ ప్రోత్సహించాడు.
‘నాకు మార్గదర్శిలో దాదాపు కోటి రూపాయల దాకా డిపాజిట్లు ఉన్నాయి సార్‌! ప్రతినెలా ఒకటో తేదీన టంచన్‌గా వడ్డీ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏనాడూ నన్ను మోసం చేయలేదు … ఇబ్బంది పెట్టలేదు…’ వెంకట్రావు చెప్పుకు పోతున్నాడు. యాదగిరి కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు.

***
వెంకట్రావు ఇంటికెళ్ళేసరికి అర్థాంగి ధుమధుమలాడుతూ ఎదురొచ్చింది.
‘మీ నిర్వాకం తగలడ్డట్టే ఉంది. మన దగ్గర అంత డబ్బు ఉందని వెర్రి వెంగళప్పలా ఊరూ వాడా టముకు వేస్తారా? ఇప్పుడే మా చెల్లెలు వచ్చి వెళ్ళింది. పోయిన్నెల వాళ్ళాయన గుండె ఆపరేషన్‌కి అయిదు లక్షలిమ్మంటే, లేదు పొమ్మన్నాంగా! టీవీలో మీ వాగుడు విని, ఇంటికొచ్చి నానా తిట్లు తిట్టి వెళ్ళింది. ఇందాకే మీ చిన్నాన్న ఫోన్‌ చేశాడు. కూతురి పెళ్ళి తలపెట్టాట్ట … ఓ అయిదు లక్షలు అప్పిమ్మంటున్నాడు …
వెంకట్రావు తల పట్టుకున్నాడు. ఇది జరిగిన రెండ్రోజులికి వెంకట్రావుకి రిజిస్టర్డ్‌ పోస్టులో నోటీసు వచ్చింది.
వెంకట్రావు అంత డబ్బు ఎలా సంపాదించాడో అణాపైసల్తో లెక్క చెప్పమని ఆదాయం పన్ను శాఖ వారు పంపిన శ్రీముఖం అది.
(కిండల్ కర్త రాజగోపాల్)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s