విచారమేలనోయి!

శ్రీకృష్ణ పరమాత్ముడు పైకి అలా చట్టంమీద నమ్మకం లేనట్టు కనిపిస్తాడు గానీ ఎంత గొప్ప మేధావి!
ఎంత న్యాయశాస్త్ర పారంగతుడు!!
చనిపోయిన వారి గురించి, చనిపోబోయే వారి గురించి ‘విచారించడం’ తగదు అన్నాడు.
ఎంత విచారించినా చివరికి ‘విచారించడం’ తప్ప ఏదీ జరగదని ముందుగానే తెలిసినవాడు గనక!
సర్వం ‘జగన్నాథం’ అన్న సత్యాన్ని భగవద్గీతలో తేటతెల్లం చేసినవాడు గనక!
”ముందు మాయ(ం)
వెనక మాయ(ం)
కుడి ఎడమల
మాయ(ం) మాయ(ం)” అన్న తత్త్వం తలకెక్కిన వాడు గనక! ఆ మధ్య పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి నలుగురి ప్రాణాలు పోతే ఒరిస్సాలో నాయకులు కళ్లు తెరిచారు- ‘వెనక గతి కానవే చిలకా’ అనుకున్నారు. 1993లో ఇదే ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన తర్వాత అప్పటి పాలకులు ఏం చేశారన్నది ‘చర్య’నీయాంశం అయింది! ఏముంది? అప్పుడు న్యాయ విచారణ జరిపించారు. అదీ అంతా సజావుగానే సాగింది గానీ ఎటొచ్చీ నివేదిక మాత్రమే ‘కనబడుటలేదు’. లా మంత్రి అలా చెప్పారు. అప్పుడు అధికారంలో ఉన్న (నివేదిక) ‘పట్టునాయకుడి’ జమానాలో ‘లా’వొక్కింతయు లేదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆ నివేదిక ఆధారంగా అప్పుడే ఏమయినా చర్యలు తీసుకుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదా? అన్నారు.
‘అబ్బెబ్బే నివేదిక చూశాను. కానీ దాని ఆధారంగా ఏం చేశారన్నదే తెలీదు’ అని అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ‘చేతు’లెత్తేశారు. అయినా, జగన్నాథుడి ఆలయంలో సంస్కరణలకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వ ముసాయిదా బిల్లు తయారు చేసేటప్పుడు ఆ నివేదిక చూసి ఉండవలసింది అని ఉ’చేతి’ సలహా ఇచ్చారు. మొత్తంమీద నివేదిక ఎలా మాయమయిందన్న విషయంపై ‘న్యాయ విచారణ’ జరిపించవలసిన పరిస్థితి! ఏదయితేనేం, కావలసింది ఒక న్యాయమూర్తికి చేతినిండా పని… ముందు ఆరోపణల గని… కొంత కాలక్షేపం…
‘ఏ కమిషన్‌ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
ఈ విచారణల చరిత్ర సమస్తం
అటకలపై నివేదికలు భద్రం’
అన్న విమర్శలూ వినిపిస్తుంటాయి. అంతెందుకు విచారణలు జరిపే న్యాయమూర్తుల మీద కూడా ఆరోపణలు వస్తుంటాయి. వారు మాజీ న్యాయమూర్తులయితే ఇక చెప్పేదేముంది? వారు అధికార పార్టీకి అనుకూలురు అన్న ఆరోపణలు వస్తుంటాయి. వారు ఇవ్వబోయే ‘నివేదికల సారం’ ఏమిటో నాయకులు తమ దివ్యదృష్టితో చూసి ముందే చెప్పేస్తారు. దాంతో ఇంకో కోణంలో గొడవ. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా ముంద్రా కుంభకోణం కేసు విచారణ ఎం.సి.చాగ్లా నేతృత్వంలో జరిగింది. చాగ్లా అప్పటి బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. చాగ్లా వేలెత్తి చూపడంతో అప్పటి ఆర్థికమంత్రి టి.టి. కృష్ణమాచారి పదవి నుంచి తప్పుకొన్నారు. చిత్రమేమిటంటే, జస్టిస్‌ చాగ్లా ఆనాటి కేంద్ర హోంమంత్రి గోవింద్‌ వల్లభ్‌పంత్‌తో ఒక అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. అక్కడ టి.టి.కె. తారసపడ్డారు. ఇంకేముంది? చాగ్లా అంతటి న్యాయమూర్తి మీదనే అనుమానాల నీలిమేఘాలు ముసురుకున్నాయి. ‘ఎరక్కపోయి వచ్చాను’ అని చాగ్లా విచారించవలసి వచ్చింది. అంతెందుకు, కమిషన్ల ప్రస్థానమంతా విచారాల మయమే. కమిషన్లను నియమించిన తర్వాత విచారించడానికి తగిన సౌకర్యాలు లేవే అని న్యాయమూర్తులు ‘విచారించడం’తో వ్యవహారం మొదలవుతుంది. ‘విచారణ’కు మూణ్నెల్ల కాలమో, ఆర్నెల్ల కాలమో గడువు ఇస్తే తాము ఆ విచారణను పూర్తి చేయలేకపోయామని న్యాయమూర్తులు ‘విచారించక’ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది! అయితే ప్రభుత్వాలు మటుకు ఏ మాత్రం ‘విచారం’ లేకుండా విచారణ గడువు కాలాన్ని పెంచుతారు. నివేదికలు సకాలంలో సమర్పిస్తే ప్రభుత్వాలకు ‘విచారం’ గానీ లేకపోతే లేదు. ‘నిదానం ప్రధానం’ అన్నది తిరుగులేని విధానమవుతుంది. అయితే ఇక్కడో తిరకేసు ఉంది. కేసు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిందయితే ఈ సూత్రం వర్తిస్తుంది. కేసు తమకు గిట్టని పాత ప్రభుత్వానికి సంబంధించిందయితే ఇంకా కమిషను నివేదిక ఇవ్వడం లేదే అని కొత్త ప్రభుత్వం నిండా ‘విచారం’లో మునిగిపోతుంది. ‘ముంచి’పోయే మార్గం కోసం పొంచి ఉంటుంది.
కమిషన్ల నివేదికలు వచ్చాక జరిగిన చిత్రాలు ఎన్నో. అధికారంలో ఉన్న పెద్దల రాజకీయ శత్రువుల మీద ఆరోపణలు రుజువయితే ఆ తమాషా వేరు. ఆగమేఘాల మీద నివేదికలు ‘లీక్‌’ అవుతాయి. ‘లీకు వీరుడు, మా రాకుమారుడు’ అని లోలోపల బడానాయకులు తబ్బిబ్బయి పాడుకున్నా, పైకి మాత్రం ‘నివేదిక ఎలా లీక్‌ అయింది’ అని షాక్‌ తిన్నట్టు విచారం ప్రదర్శిస్తారు. అసలు సిసలు రాజకీయం అంతా నివేదిక వెల్లడించిన తర్వాత మొదలవుతుంది. నివేదికలు ప్రతీకారానికి అవకాశం ఉన్నవయితే తక్షణ చర్యలు మొదలవుతాయి. అయినవాళ్ల లొసుగులు బయటపడితే మాత్రం ఆ నివేదికలు అటకలను అద్దెకు తీసుకుని చెదలతో పొత్తుపెట్టుకుంటాయి. సహజసిద్ధమైన ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకొంటాయి.
ఏ మాట కామాటే చెప్పాలంటే కమిషన్లు లేకపోతే, విచారణలు జరగకపోతే, ఏలినవారికి ఎంత కష్టం ఎంత కష్టం. ప్రభుత్వాలు అడుగుముందుకు వేయలేవు. అడుగున పడిపోతాయి. సమాజం అన్న తర్వాత ఏదో ఒక దుర్మార్గం జరిగిపోతుంది. ఏదో ఒక ఉత్పాతం జరిగిపోతుంది. ఏలికలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. జనమంతా గగ్గోలు పెడతారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు దుమారం రేపుతాయి! అప్పుడు ఫలానా న్యాయమూర్తితో విచారణ జరిపించబోతున్నామని ప్రభుత్వం తక్షణం ప్రకటిస్తుంది! దాంతో అంతా చల్లబడుతుంది! విచారణ మార్గాన్ని తలచుకొని దొరకునా ఇటువంటి ‘పెయిన్‌ కిల్లర్‌’ అని ప్రభుత్వ పెద్దలు గండం గడచిందనుకుంటారు. పిండం బయటపడ్డప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. జగన్నాథుడి మీద భారం వేసి గుండె మీద చెయ్యివేసుకుని హాయిగా ఉంటారు. నిజమే.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికలా ‘విచారించి’ తప్పించుకోవడం కన్నా మించిన రాజకీయం ఏముంటుంది?- ఎంత విచారించినా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: