నన్నొదిలెయ్‌ నారదా…

“నారదా! ఈ మధ్య నీకు ఏమైంది? తెలుగువారి వార్తావిశేషాలు వినిపించడం బొత్తిగా మానేశావు. తెలుగు నేలంటే నాకెంతో మక్కువ. తెలుగు ప్రజలూ నాకు ఎంతో సన్నిహితులు. వారికోసమే గదా నా కలియుగ వైకుంఠం తిరుపతిలో వెలిసింది. చెప్పు! నారదా!… తెలుగు వార్తా విశేషాలు…”
నారదుని ఆరా దీశాడు నారాయణుడు.
ఆయన మాటలకు నారదుడు నిట్టూర్చాడు.
“నీకేం, నారాయణా! శయన మందిరంలో పాదపద్మాలకు శ్రీ మహాలక్ష్మితో సేవలు చేయించుకుంటూ ఎన్ని కబుర్లయినా వినగలవు, మరిన్ని చెప్పమని అడగనూ గలవు. నీకు ఇష్టమైన సంగతులు నివేదించాలని నాకూ ఉంది. కానీ ఈ రోజుల్లో తెలుగువారి సమాచారం సేకరించి నీకు చెప్పడం అంత సామాన్యమైన వ్యవహారమేమీ కాదు. ప్రస్తుతం తెలుగునేలను ఏలుతున్న ప్రభువులు సమాచార వ్యవస్థలపై రుసరుసలాడుతున్నారు. పత్రికలను తగలబెట్టిస్తున్నారు. సమాచార సాధనాలకు ఇంధనంగా ప్రజల నుంచి నిధులు అందే ‘మార్గాలనూ వెతికి వెతికి పలు విధాలుగా పరిహసిస్తూ గేలి చేస్తున్నారు. ఈ పరిస్థితిలో తెలుగు నేలపై తిరిగి సమాచారాన్ని సానబట్టాలంటే కత్తి మీద సామే! పత్రికలు కావాలంటే కాలిపోతున్న తమ ప్రతులకు అదనంగా మరిన్ని ముద్రించుకుంటూ వాటి తంటాలేవో అవి పడగలవు. కానీ యుగాల తరబడి ఒకేఒక్క తంబురను తోడు చేసుకుని బుర్రను గిర్రున తిప్పే సమాచారం వింపించే నాకు… ఆ ఉన్న ఒక్క తంబురను కూడా పత్రికను తగలబెట్టినట్లు తగలబెట్టిస్తే… నాకేం గతి? అసలే ఒంటరిగాణ్ని. దాడిని శాయశక్తులా ఎదుర్కొనడానికి ఉమ్మడి కుటుంబం కూడా లేని వాణ్ని. నన్నిలా వదిలెయ్యి.
“మీకంతగా వినాలనుంటే అంటార్కిటికా ఖండం గురించి అడగండి. ఎంత చలినైనా తట్టుకొని వార్తలు తెస్తా. అంతేగానీ ఆంధ్రదేశం పొమ్మని మాత్రం అడగకండి”.
“అదేం నారదా? అంతలోనే ఇంత మార్పు? రెండున్నర సంవత్సరాల క్రితం తెలుగు నేతల గురించి ఎన్నెన్నో గొప్పలు చెప్పావు. నీలాగే పాదయాత్రలు చేస్తున్నారని, ప్రజల చెవుల్లో ఇళ్ళు కట్టుకొని ఏవేవో జప నామస్మరణలు చేస్తున్నారని”
“నిజమే స్వామి! అప్పుడు జరిగింది అప్పుడు చెప్పాను. ఇప్పుడు జరిగింది ఇప్పుడు చెప్పాలనీ అనుకున్నాను. కానీ నాకేం తెలుసు? ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలో… ఏం చెప్పకూడదో తెలియచెప్పడానికి… సంపాదకులకే సంపాదకుడైనటువంటి రాజాధిరాజు ఏలుబడిలో పత్రికల మీద ఆయన అనుంగు వీరంగ సహచరులు సాగిస్తున్న పలు దాడుల్ని చూసిన పిమ్మట… నాకు అరికాళ్ళలో చెమటలు పట్టాయి. తలలో ముచ్చెమటలు పుట్టాయి. ఇక నేనేమి చెప్పగలను? నాడు ప్రజల చెవునిల్లు కట్టుకొని ఓట్లకోసం బతిమాలిన వారే… నేడు ప్రజల చెవుల్లో పూవ్వులు పెట్టారని చెబితే నన్ను బతకనిస్తారా?
“పాదయాత్రల పేరిట తాము తిరిగిన ఊళ్ళపేర్లు చెబితే ఊరుకుంటారు గానీ- భూబకాసురులుగా మారి బంధుమిత్ర సపరివారంగా, రాజధాని నగరాన్ని గుండుగుత్తగా, చాప చుట్టినట్లు భూకబ్జా చేసుకుంటున్న వైనం చెబితే… మిన్నకుంటారా?
“తిరుపతిలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ నీకు భాగ్యనగరంలోని బడుగుజీవుల ఆర్తనాదాలు వినరావడం లేదు. చక్రాయుధంతో నువ్వు శతృవుల్ని మాత్రమే సంహరిస్తావు. చక్రాయుధం నమూనాలో ఉండే రింగ్ రోడ్ అనే ఆయుధంతో నాయకులు తమను ఎన్నుకున్న ప్రజలపైనే దాడికి తెగబడ్డారని చెబితే నా తంబుర పగలగొట్టకుండా ఉంటారా?”
“అంతదాకా వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా… నువ్వు నిర్భయంగా సంచరించు నారదా!” మధ్యలో జోక్యం చేసుకున్నాడు శ్రీమన్నారాయణుడు.
“నీవు నాకేం సహాయం చెయ్యగలవు స్వామీ! నాయకులు తలపెట్టిన జలయజ్ఞం ఏనాడో ధనయజ్ఞంగా మారి ఆ ధనయజ్ఞంలో కొంత సొమ్ము నీ హుండీలో కూడా మూటలుగా జమ పడిందిగా స్వామీ! మరి మాటలు తప్ప ఏనాడూ నీ హుండీలో మూటలు వేసి ఎరుగనివాడిని. ఇలాంటి సంకట స్థితిలో… మీరు నా వెనకే ఉంటారని నేనెలా నమ్మేది!?”
చురుక్కుమని గుచ్చుకుంది నారాయణుడికి. ఇబ్బందిగా మొఖం పెట్టి…
“నమో నారదా!” అని నమస్కరించి, ‘నన్ను వొదిలెయ్’ అన్నట్లు ప్రాధేయ పూర్వకంగా చూశాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు.
(వ్రాసింది శ్రీకాంత్, వేసింది ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s