‘ఉత్తరా’యణం

‘పుర్రె’కనబడినంత
చిర్రెత్తిపోతోంది
కరీంనగరమ్మంత
కంగాళీ అవుతోంది’
అనుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి ‘బీడి’తులు గుర్తుకురాగానే కరీంనగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ భవితవ్యం ‘డేంజర్‌’ జోన్‌లో పడిపోతుందా అన్న అనుమానపుపొగలు కమ్ముకుంటున్నాయి. కరీంనగర్‌, బొబ్బిలి ఉపఎన్నికల్లో పరిస్థితి ‘అటు కారు, ఇటు ‘కారు’, మధ్యలో సర్కారు’ అయిపోయింది. కరీంనగర్‌ కదనంలో ‘కారు’ పార్టీ సింహస్వప్నమైపోతే, బొబ్బిలి యుద్ధంలో ‘కారు’ కంపెనీ వ్యవహారం కాంగ్రెస్‌ను కంగుతినిపిస్తోంది. కారులో వెళ్లి ప్రచారం చేస్తే అది టి.ఆర్‌.ఎస్‌.కు ప్రచారం చేసినట్టు అవుతుందా… అన్న భయమూ పట్టుకుంది! కరీంనగర్‌ ఉపఎన్నిక వై.ఎస్‌.తో ‘సీటు ముడి’ వేసుకుందన్న ప్రచారం సాగుతుండటంతో ఉపఎన్నిక అపఎన్నిక అయ్యేట్టు ఉందని ప్రతిపక్షాలు నిఘావేస్తున్నాయి. ‘కిట్‌’కిటలాడుతున్న కాంగ్రెస్‌ సామగ్రిని చూస్తే టి.ఆర్‌.ఎస్‌. వికెట్‌ను పడగొట్టడానికి ఎంతకైనా ‘బరి’తెగిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చిత్రమేమిటంటే కరీంనగర్‌ ఎన్నికలో కాంగ్రెస్‌కు ప్రధానప్రత్యర్థి ‘బీడి’అయి పొగలుసెగలు కక్కుతోంది. బీడీ ఏ పార్టీ ఎన్నికల గుర్తు కాకపోయినా, అది స్వతంత్రంగా రంగంలోకి దిగి కాంగ్రెస్‌ ఆరోగ్యానికి పరీక్ష పెడుతోంది. దాంతో బీడీచిచ్చు కారుచిచ్చు అయిపోయింది. పుర్రెకోబుద్ధి అని పెద్దలు అన్నారు. ఎన్నికల సమయానికి ఏ ఓటరు బుద్ధి ఎటు మళ్లుతుందో అని కాంగ్రెస్‌వారిలో కలవరం పుట్టింది. ఉత్తరానికి దక్షిణ(ం) తోడు అవసరమా అనిపించింది. ఫలితంగా ‘లా’వొక్కింతయు లేక కాంగ్రెస్‌ వారు (నోట్ల)కట్టకట్టుకొని ‘కిట్‌’కులు నేరుస్తున్నారట! ఇవి చేతుల చేతలయితే, మాటల్లో సాంస్కృతికమంత్రివంటివారు తనదయిన ‘సంస్కృత’ భాషా పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘మైకుపోతు’ గాంభీర్యమూ కనిపిస్తోంది. ప్రజా’జీవన’ంలో విజయానికి ఇన్ని పాట్లు అవసరమా… అన్న ఆందోళనను జనం వ్యక్తం చేస్తున్నారు. ‘కిట్లు పంచకుండా ఓట్లు పడతాయా’- అని కొందరు కాంగ్రెస్‌ నాయకులే ‘బెదురు ప్రశ్నలు’ వేస్తున్నారు. ‘మద్య’ ఛందస్సులో పద్యాలు పాడక తప్పుతుందా అని అడుగుతున్నారు. దొరికారు కాబట్టి దొంగలయ్యారుకానీ దొరకని దొరలు ఎందరు లేరని ‘జన’రలైజ్‌చేసే దోస్తులూ ఉన్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్‌ పెద్దలకు కరీంనగర్‌లో అడుగుపెడితే ఎదురుగా కారు వస్తుందంటే భయం! బొబ్బిలిలో రాని కారు కొంపముంచుతుందని భయం! అక్కడా ఇక్కడా బేకారవుతామని భయం. దేవుడి దయతో రింగ్‌రోడ్డు రావాలేకానీ కాంగ్రెస్‌ వాళ్ల కార్లకోసమే ఎన్నో కార్ల కంపెనీలు అవసరమవుతాయి! వోక్స్‌ కంపెనీ పోతే పోనీ, దాని బాబులాంటి కంపెనీ వస్తుందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఊరిస్తున్నారు. (ఇక్కడ ఓ చిన్న సవరణ. ‘బాబులాంటి’ అనే మాటను వై.ఎస్‌. వాడలేదు. బాబు అంటే చంద్రబాబుకు ప్రచారం అవుతుందన్నదే ఆయన భయం).
వై.ఎస్‌. ప్రభుత్వ అవినీతికి భయపడే వోక్స్‌ వంటి కారు కంపెనీ మన రాష్ట్రానికి రాకుండా మహారాష్ట్రకు జారుకుందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటుంటే… ఎక్కడుంది అవినీతి- ఈ భూమిలో ఉందా, ఆ స్తంభంలో ఉందా… అని కాంగ్రెస్‌ నాయకులు అడుగుతున్నారు. పైగా మీడియావాళ్లు తమకు ‘భూ’గర్భ శత్రువులు’ అయ్యారే అన్నదీ వారికి బాధ కలిగిస్తోంది. అక్రమాల లీల సరే… ఇది ఏమిటీ ఎన్నికల వేళ అని వై.ఎస్‌. మదనపడిపోతున్నారు.
‘ఏడు పదుల వయస్సులో ఎమ్మెస్సార్‌ కె.సి.ఆర్‌.తో కయ్యానికి కాలు దువ్వనేల? దువ్వెను పో… కె.సి.ఆర్‌. తప్పుకొంటే ఎన్నికల కమిషన్‌ను బతిమాలి బామాలి వెంటనే ఎన్నికలు జరిపిస్తానని కేకే నోరు జారనేల? జారెను పో… ఆ సవాల్‌ అందుకుని కె.సి.ఆర్‌. రాజీనామా చేయనేల? చేసెను పో… ఇప్పుడే ఎన్నికలు జరగనేల?’ అంటూ వై.ఎస్‌. తికమక పడుతున్నారు. అటు ఉత్తర తెలంగాణా (కరీంనగర్‌) ఇటు ఉత్తరాంధ్ర (బొబ్బిలి) ఏకకాలంలో పెనుసవాలు విసురుతుండటంతో ‘ఉత్తరాన్ని’ ఉత్తరంతోనే ఎదుర్కోవాలన్న నిర్ణయానికి వై.ఎస్‌. వచ్చారు. అందరూ తూర్పు తిరిగి దండం పెడుతుంటే ఆయన వెరైటీగా ‘ఉత్తరం’వైపు తిరిగి రెండు చేతులూ జోడించి ‘అనంత’మైన దండం పెట్టారు.
”లంచమడిగినవాణ్ని
పీచమణిచేస్తాను
ఉత్తరం రాయండి
చిత్తు చేసేస్తాను’
అని అనంతపురం జిల్లాలోని నల్లమాడలో వై.ఎస్‌. మాట్లాడుతూ అక్రమాలపై నిప్పులుచెరిగేసరికి తెలుగునాట ఉన్న పోస్టాఫీసులన్నీ కిటకిటలాడే పరిస్థితి వచ్చింది. ఈ దెబ్బకు పోస్టు డబ్బాలన్నీ అబ్బా అంటాయి. ఇంగ్లీషువాడు మేధావిని మ్యాన్‌ ఆఫ్‌ ‘లెటర్స్‌’ అని ఊరకే అనలేదనిపిస్తుంది. అక్రమాలపై లెటర్‌ బాంబుమోతలు ఎలా ఉంటాయోనన్న భయాలు మొదలయ్యాయి. పాలకులు ఉత్తరకుమారులన్న ముద్ర ఎప్పటినుంచో ఉంది. అది వై.ఎస్‌. హయాంలో కొత్త మలుపు తిరిగింది. ఈ పరిస్థితి కూడా ‘ఎవ్వనిచే జనించె’ అనే ప్రశ్న వేసి ‘ఎమ్మెస్సార్‌చే జనించె’ అని రాగం తీసినవాళ్లూ ఉన్నారు. ఆ మధ్య ఎమ్మెస్సార్‌ ముఖ్యమంత్రికి సన్నిహితుడయిన మంత్రి రఘువీరారెడ్డిని భుజం తట్టి ‘భావి ముఖ్యమంత్రివి నీవేనయ్యా’ అన్నారు. పైగా అన్నవాడు సామాన్యుడు కాడు. ‘చంద్రబాబును ముఖ్యమంత్రి చేసిందీ నేనే… రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి చేసిందీ నేనే’ అని మైకు దొరికితే చాలు చెప్పే పెద్దమనిషి. రేపు కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం వచ్చినా, ప్రతికూల ఫలితం వచ్చినా అందుకు తానే కారణమని ఢంకా బజాయించి చెప్పగల ధీశాలి. ఆయనతో పెట్టుకోవడం కష్టం. అయినా ముఖ్యమంత్రి కావడం దేవుడెరుగు ఉన్న మంత్రి పదవి ఊడిపోతుందన్న భయం మనస్సును సహజంగానే పీడిస్తుంది. మౌనంగా ఉందామంటే అర్ధాంగీకారం కింద రావచ్చు. దాంతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు రికార్డును వై.ఎస్‌. బద్దలు చేయాలని కోరుకుంటున్నానని రఘువీరుడు అనక తప్పలేదు. రికార్డు సాధించాలంటే అంత తేలికకాదు, ఎంతో కాలం పడుతుంది. కార్డు రికార్డులో భాగమే కాబట్టి ముందు కార్డు సాధిద్దామని వై.ఎస్‌. లక్ష్యంగా పెట్టుకున్నారు. జనాన్ని చూసి
‘ఒక్క కార్డే చాలు
వద్దులే టెలిఫోన్లు’
అన్నారు. ప్రస్తుతానికి కార్డుస్థాయి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రికార్డును అరిగిపోయేదాకా ఎన్నిసార్లయినా వేయవచ్చు! అయితే ఒక్కటే చిక్కు. ‘అక్రమాల మీద పోరాడే విక్రమార్కా! మీ పోరాటమేదో కాంగ్రెస్‌ వాళ్ల భాగోతాలమీద యుద్ధంతో మొదలు పెట్టరాదా?’ అని అడుగుతూ ఏ అభాగ్యుడయినా ఉత్తరం ముక్క రాస్తే ఎలా అన్నదే అది!

(వ్రాసింది శంకరనారాయణ, అచ్చేసింది ఈనాడు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s