• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 242,082 హిట్లు

ప్రచారంలో విచారం

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏది?
హైదరాబాద్‌ అనుకునేవాడు అమాయకుడు. కరీంనగర్‌ అనుకునేవాడు మేధావి.
‘వలస వచ్చిన అదృష్టము – ఇది కలిసి వచ్చిన అదృష్టము’ అని మంత్రులంతా చలో కరీంనగర్‌ అనుకుంటూ పొలోమంటూ వెళ్ళేసరికి సీను ఇలా మారిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల దృష్టి సాధారణంగా వాళ్ళ అధిష్టానవర్గం ఉన్న కరినగరం మీద ఉంటుంది. ఇప్పుడు వారి కన్ను కరీంనగర్‌ మీదికి మారింది. కరినగరం ప్రకృతి కరీంనగర్‌ వికృతి అని రాజకీయ వ్యాకరణం చెబుతోంది.

”ఎన్నికలు వస్తేను ఎంతో బాగుండు!
మంత్రులే మనమధ్య మసలుతుంటారు” అని ఇతర ప్రాంతాలవాళ్లు అసూయపడేట్టు ఉంది. ప్రజల వద్దకు పాలన అనేది పాత నినాదం, వీధివీధికి మంత్రి అనేది కొత్త విధానం.

మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పుడు విజయవంతంగా వాయిదా వేస్తుంటే మంత్రి పదువుల మీద ఆశ పెట్టుకున్నవాళ్లు ఇంతకుముందు బాధపడ్డారు. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రే బాధపడుతున్నారు. మంత్రి వర్గవిస్తరణ ఎప్పుడో జరిగి ఉంటే మరింతమంది మంత్రులను కరీంనగర్‌కు పంపి ఉండేవాణ్ని కదా అనేదే ఆయన బాధ. ఇటువంటి ‘జీవన రణ సమస్య’ వల్ల మంత్రులెవ్వరూ హైదరాబాద్‌లో లేకపోయినా పరిపాలనలో ఎటువంటి లోటూరాదని తేలిపోయింది. అవసరమయితే పైరవి అస్తమించని సామ్రాజ్యం కరీంనగర్‌కు విస్తరిస్తుంది. అంతే, దాంతో కరీంనగర్‌ భూములకు కూడా రింగ్‌రోడ్డు భూముల కళ వచ్చేస్తుంది. అంతకుమించిన కల ఏముంటుంది? అభివృద్ధి మంత్రం అతికినట్టు సరిపోతుంది! అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదనే వాళ్లకు ఇదే జవాబు.

అభివృద్ధి మంత్రం కోణం మారిస్తే సరి! గడచిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌వాళ్లు ఎంత అభివృద్ధి చెందారో చూడండి! మీరు మీ పార్టీకి అండగా ఉంటే ఎంతగా అభివృద్ధి చెందుతారో ఊహించుకోండి! అని ఒక్కమాట చెబితేచాలు పరిస్థితి అనుకూలంగా మారిపోతుంది. ఈ దెబ్బకు ఎవరయినా పడిపోతారు. యథారాజా తథా ప్రజా! కరీంనగర్‌ కదనంలోనే కాదు, బొబ్బిలి యుద్ధంలోనూ ఇది ఖచ్చితంగా పనికొస్తుంది! కళ్లముందు కనిపించేదాన్ని ఎవరు కాదనగలరు? ‘అభివృద్ధి’ అభ్యర్థుల అఫిడవిట్లలో కనబడడం లేదే అని కంగారుపడవద్దు. కనిపిస్తే దిష్టి తగులుతుంది. ఆస్తుల సృష్టి ఆగిపోతుంది. ఆస్తులకు గుట్టు రాజకీయానికి పట్టు తారకమంత్రం.

రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘కరీంనగర్‌లో కిట్టు… బొబ్బిలిలో తిట్టు’ అనక తప్పదు. చట్టం తనపని తాను చేసుకుపోతున్నట్టే ఈ రెండూ తమపని తాము చేసుకుపోతున్నాయి. ఎక్కడ మూటలు పనిచేస్తాయో ఎక్కడ మాటలు పనిచేస్తాయో ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు.’కిట్టు కొట్టు ఓటు పట్టు’ అనేది వజ్రాయుధమైపోయింది. రెండు ఉప ఎన్నికల్లోనూ తిట్టు కవులను పిలిపించి వాళ్లచేత గంగా ప్రవాహంలా ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. మరోవైపు పాజిటివ్‌ ప్రచారం కూడా సాగుతోంది. ”జీవన’మూ ఎంత పావనమూ” అని కరీంనగర్‌లో అంటే, ‘ఆహా బొత్స’! అంటే ‘ఓహో వత్సా’ అని బొబ్బిలిలో అంటున్నారు.

రాజకీయమంతా డ్రామా అన్న విషయం తెలిసిందేగానీ ‘అలుగుటయే ఎరుంగని బీడి కార్మికుండలిగిన నాడు’ అన్న ధిక్కార పద్యం వినబడుతుంటే ‘అధిక్కార’ పార్టీకి కలవరం కలుగుతోంది. అయినా ఢిల్లీ పుర్రెల్లో తాము ఆశించినంత మార్పు కనబడడంలేదే అన్న బాధ కూడా ఉంది. ప్రతిపక్షాలు పని గట్టుకుని వ్యతిరేకతను ‘పుర్రె’ కొలుపుతుంటే, ‘బీడీ- ఏది నీకు జోడీ’ అని కాంగ్రెసువాళ్ల అంతరాత్మలు ఘోషిస్తున్నాయి. పల్లెబాట, నగరబాట సంగతి ఏమయినా ఫర్వాలేదుగానీ పోరుబాట ఏమవుతుందన్నదే వారి సమస్య! అయినా ఏలినవారు ఇందుకు ఎన్నికల సమయంలోనే కాదు, అంతకు ఎంతో ముందునుంచి యుద్ధ ప్రాతిపదికమీద రిహార్సల్సు వేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య మొదలుకొని వరద బాధితుల సమస్య వరకు ఏ సమస్య వచ్చిపడ్డా… ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏంచేసింది? అని దబాయించడం మొదలుపెట్టారు. ‘ప్రతిపక్షమూ ఒకనాటి అధికార పక్షమే’ అన్న సరికొత్త సామెతకు ‘ధూపకల్పన’ చేసి గండం నుంచి గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నికలన్న తర్వాత ఎన్నెన్ని పాట్లు ఉంటాయి? కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలని నాలుగు బాటలు కనుక్కున్నవాడు తప్పనిసరిగా ఎన్నికల రాజకీయాల్లో చేయితిరిగినవాడు. గోటితో పోయేదానికి గొడ్డలితో పనేముందని మాటవరసకు అంటారు. అదే ఎన్నికల్లో అయితే కాంటాక్టుతో కానిదానిని కాంట్రాక్టుతో సాధిస్తారు. అమ్మా, బాబూ, అన్నా, తమ్ముడూ, అక్కా, చెల్లెలూ అని వరసకలిపితే ఓట్లు పడే రోజులా ఇవి- అని ఆశ్చర్యం ప్రదర్శిస్తారు. తిరిగే కాలూ, తాగే నోరు ఊరుకోవన్న మాచెడ్డ నమ్మకమూ నాయకులకు ఉంటుంది. అందుకోసం ‘సారాభౌములు’ పొలోమని పోలింగ్‌ రోజున నడుంబిగించడం చూస్తుంటాం. తనదారికి వచ్చేవారి కోసం ధనలక్ష్మి తన ప్రయత్నాలు చేస్తుంటుంది. కండబలం ఉన్న గండరగండడు పోలింగ్‌ క్యూలో తన కాళ్లమీద తాను నిలబడి ఇతరులను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడకుండా చేస్తుంటాడు. ఓటరుకు ఒక్కో చోట ఒక్కో నిషిద్ధాక్షరి! ఇంతజేసీ ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏపార్టీలో ఆ పార్టీకి ఎంతమంది శత్రువులు ఉన్నారన్న దాన్ని బట్టే ఫలితం!
(శంకరనారాయణ వ్యాసం)

ఒక స్పందన

  1. పైరవీ అస్తమించని సామ్రాజ్యం – గొప్పప్రయోగం. శంకరనారాయణగారు అవధానాల్లో అప్రస్తుతప్రసంగం చేస్తారని విన్నాను. అదెంత పసందుగావుంటుందో మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: