‘సారా’oశం!

క్రియ ఎరగనివాడు మందుల సంచీ ఎత్తుకెళ్లాడని పాతకాలం సామెత. (సామెతలన్నీ పాతకాలం నాటివే, కొత్త సామెతలేవీ పుట్టినట్టు లేవు).
హాయిగా సారా పోసి, డబ్బులు పంచి, రిగ్గింగు చేసి, బెదిరించి, బామాలి సంప్రదాయ పద్ధతుల్లో ఓట్లు వేయించుకుని గెలవచ్చుగా, ఈ క్రికెట్‌ కిట్లేంటి? కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టేప్పుడు కాస్త వెనకా ముందూ ఆలోచించాలి. మందు వేసేప్పుడు దాని క్రియ కూడా తెలియాలి. (ఆ ‘మందు’ కాదు. ఆ మందు ఎఫెక్టు ఎవడు వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా ఒకటే.) అలా కాకుంటే తిరగబెడుతుంది. (తిరగ బెట్టడాన్ని తెలుగులో రియాక్షన్‌ అంటారు.) ఓల్డీజ్‌ గోల్డ్‌, పాత పద్ధతులే మంచివి.

వెనకటికి నారద మహర్షి వీణమీటుతూ అలా అలా వెళ్తోంటే ఒక పుర్రె కనిపించిందట. దాని నుదుట బ్రహ్మరాతని చదివాడు నారదుడు. బ్రహ్మరాత నారదుడికి కాకపోతే మనకి అర్థం అయ్యి చస్తుందా?!

”వీడు చచ్చిన తరవాత పుణ్యం చేసుకుంటాడు” అని రాసి ఉందట పుర్రె నుదుట.

”ముసలాయనకు చిత్తచాంచల్యం కలిగిందా, చచ్చాక ఎవడైనా పుణ్యం ఎలా చేసుకు చస్తాడు” అని మహర్షుల వారు కించిత్‌ చింతాభ్రాంతులై పుర్రెను చేగొని నేరుగా బ్రహ్మ దగ్గరికెళ్లి ”నాన్నారూ, ఇదేంటి చచ్చాక ఎవరైనా పుణ్యం ఎలా చేస్తారు? అన్నీ ఇలా అబద్ధాలు రాస్తున్నారేంటీమధ్య?” అని నిలదీశాడట.

మతి భ్రమణం కాదు నారదా, శ్మశానంలో ఎక్కడో దుమ్ము దూళిలో పడి ఉన్న పుర్రెని నీలాంటి మహర్షి చేత్తో తాకడం, దాన్ని బ్రహ్మలోకానికి మోసుకు రావటం మామూలు సంగతా? నువ్వెప్పుడైతే ముట్టుకున్నావో ఆ క్షణాన్నే అతనికి సకల పుణ్యాలూ దక్కాయి. ఇక్కడికి తేగానే జన్మరాహిత్యం పొందాడు. నా రాత తప్పు కాదు పొమ్మన్నాడట బ్రహ్మ. అదీ పుర్రె కథ. కరీంనగర్‌లో ఇప్పుడు నేతల తలరాతల్ని తిరగరాస్తున్నది అలాంటి పుర్రే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బెంబేలూ, భయాందోళనలూ బీడీ తాగేవారికన్నా, కాంగ్రెస్‌కే డేంజరయింది.

పాత్రానాంఘ్రతమా, ఘృతానాంపాత్రమా అని వెనకటికి ఎవరో ఒక తార్కికుడికి సందేహం కలిగిందట. నెయ్యి వల్ల పాత్ర ఉందా, పాత్ర వల్ల నెయ్యి ఉందా అని. ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌ ఉందా కరీంనగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉందా అని సంశయం కలగకపోదు ఎవరికైనా. ఎందుకంటే- ఎక్కడ చూసినా, విన్నా కరీంనగర్‌, కరీంనగర్‌, కరీంనగర్‌.

మనం గెలవాలంటే అవతలివాడు ఓడిపోవాలి… మనం గెలిచే ఉపాయాలకన్నా ఎదుటి వాడిని ఓడించే ఉపాయం చేస్తే పని సుళువు అవుతుంది. ఇదే రాజనీతి. భారత మహా సంగ్రామంలో ధర్మజుడు నేరుగా భీష్ముడిని ఏమడిగాడు? తాతా నువ్వెలా చస్తావని అడిగాడా లేదా! అదీ పాయింటు.

మనవాడికి పోస్తే తాగి తందనాలాడి ఓటేస్తాడు. అవతలివాడికి పీకలదాకా తాగిస్తే ఒళ్లు తెలియక పోలింగు రోజంతా ఏ మురుగు కాలువ పక్కనో పడి తూలుతుంటాడు. కనుక మిత్రమా- స్వపర భేదం లేకుండా తాగించాలి. సాఖియోఁసే, సాథియోఁసే మిల్‌కర్‌ పీనా (తాగితే అంతా కలిసి తాగాలని) ఉర్దూ గజళ్లు చాలా ఉన్నాయి- శత్రువుకి కూడా తాగించాలట. చరిత్రలో కరీంనగర్‌ ఎన్నికల పేరు చిరస్థాయిగా ఉండేట్టుండాలి.

నిజానికి తాగిన ప్రతివాడూ తాగుబోతు కాదు- ”తాగితాగితాగి, తాగ లేనివాడె తాగుబోతు” అన్నారు విజ్ఞులు. తాగగలిగిన వాడు తాగుబోతు కాదు. తాగలేనివాడే తాగుబోతు అని తాత్పర్యం.

నాటి ‘సుర’నే నేటి సారా అయింది. అలనాటి ‘మధిర’నే కాలప్రభావం వల్ల మందుగా, మద్యంగా అవతరించింది. ఆనాడు తాగుడుకు ఉన్న ఖదర్‌, గౌరవం ఈనాడేది! ”చల్ల పోసినవాడు చేతకాని వాడు, కల్లు పోసినవాడు కన్నతండ్రి”గా భావించే వారప్పుడు. ఉమర్‌ ఖయ్యాం జీవితంలో ఏం కోరుకున్నాడు… కప్పెడు సారా, చిప్పెడు మెతుకులే కదా! మెతుకులు ఇవ్వలేనప్పుడు కప్పెడు సారా ఇస్తే తప్పేంటి? ప్రజలకు ‘కావాల్సిన’ దాన్లో యాభై శాతం ఒనగూర్చినట్టే కదా!

దేవదానవ గణాలు ఎందుకు కొట్టుకు చచ్చారు? మందు కోసమే కదా! మందు మహాత్మ్యం తెలియని వాడే, మజా ఎరగనివాడే, మందు పోసేవాడిపైన ఏడుస్తాడు.

బాధ కలిగినా, ఆనందం కలిగినా ధ్యాస ఎటు మళ్ళుతుంది… బారు బాట పడుతుందా లేదా? దేవదాసు ఎందుకు తాగాడు… బాధ మరవటానికే కదా! మొత్తం వైద్యంలో కష్టాల్ని తొలగించే ఔషధం ఏదైనా ఉందా? రేపటి రోజున ఎయిడ్స్‌కీ మందుకనుక్కొంటారేమో కాని, హృదయ వేదనని తీర్చే మందు కనుక్కోగలరా, పేదల బాధల్ని మరిపించే మెడిసన్‌ సృష్టించగలరా? నెవర్‌! అసాధ్యం!! మద్యం మాత్రమే ఆపని చేయగలదు. కష్టాలనీ, కడగళ్ళనీ మరిపించి మురిపించే దివ్యౌషధం సారా ఒక్కటే!

ప్రజలు ఏది అడుగుతున్నారో దాన్ని ఇవ్వకూడదు. (ప్రజలకు ఏది కావాలో దాన్ని ఇవ్వాలి) కనుక ఫూటుగా తాగించడమే మేలు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా వద్దా? ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకోవటం! వాళ్లు తాగి ఎన్నుకున్నారా, తాగకుండా ఎన్నుకున్నారా అని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. తాగుడు ద్వారా ప్రజాస్వామ్యం వస్తే, తాగించడం ద్వారా డెమోక్రసీ బతికి బట్ట కడితే, తాగించడం తప్పెలా అవుతుంది? తుపాకీ గొట్టంలోంచి విప్లవం వస్తుందంటే నమ్ముతున్నామా లేదా? అలాంటప్పుడు మందు బుడ్డి నుంచి ప్రజాస్వామ్యం ఎందుకు రాదు? వస్తుంది!

గాంధీ గారు చెప్పిన స్వపరిపాలన అంటే ఏంటి, ఎవడికి తోచినట్టు వాడు పరిపాలించడం, ప్రవర్తించడం కాదా!

ప్రజలనుంచి వచ్చిన డబ్బును ప్రజలకు తిరిగి ఇవ్వడంలో తప్పేంటి? ప్రజలనుంచి ఏదో రూపంలో తీసుకున్నదే కదా! దాన్ని కరీంనగర్‌లో ఓటర్లకి పంచితే తప్పొచ్చిందా? దానగుణం ఉండకపోతే ఎట్లా? అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తిననివ్వదని పక్కవాడికి ఏడుపెందుకు?

డబ్బు ఉంది కనుక తాగుడు పోసి ఓట్లు కొంటున్నారు. అది చేతకానివారు నిబంధనలనీ, అదనీ ఇదనీ డొంక తిరుగుడు సొల్లు కబుర్లు వల్లిస్తున్నారు. చేతకానివాడే నీతులు మాట్లాడుతాడని నీతివాచకంలో ఉంది (ఉండి ఉంటుంది లెండి నేను చెప్పగానే వెంటనే వెళ్ళి సరి చూస్తారా…)

సారా ఆత్మలాంటిది. సారా గెలిపించింది, సారా గెలిపిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏమైనా, సారా శాశ్వతంగా ప్రవహిస్తోంది. సారా జిందాబాద్‌! సారా అమ్మకాలపైనే ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఎన్నికలప్పుడైనా నాలుగు సీసాలు ఎక్కువ అమ్ముడవకుంటే ప్రభుత్వం బతికి బట్ట కట్టేదెలా? సో సారాకీ ప్రజాస్వామ్యానికీ, సారాకీ ప్రభుత్వానికీ, సారాకీ ఎన్నికలకీ, సారాకీ గెలుపునకీ అవినాభావ సంబంధం ఉంది. సారా వర్ధిల్లాలి!
(చికిత వ్యాసం, ఈనాడు ప్రచురణ)

2 స్పందనలు

  1. గాంధీ గారు చెప్పిన స్వపరిపాలన అంటే ఏంటి, ఎవడికి తోచినట్టు వాడు పరిపాలించడం, ప్రవర్తించడం కాదా!

    దుమ్ములేపే మాట. గట్టిగా పైకి నవ్వకుండా వుంటానికి విఫలయత్నం చేశాను.
    ఇంతకీ ఎవరీ చికిత? ఎవరైనా, దీన్నిక్కడ రాసి భద్రపరచినందుకు ధన్యవాదాలు.

  2. వెనకటికి నారద మహర్షి వీణమీటుతూ అలా అలా వెళ్తోంటే – నారదుడు మీటేది వీణకాదు, మహతి అనే పేరుగల తంబురా కదా, ఎమో మరి ‘తాగితాగితాగి, తాగలేనివాడె తాగుబోతు’ అని సెలవిచ్చారు కదా, ఈ ఒక్క మాట తాగివున్నపుడు రాశారేమో. గట్టిగా అడిగితే – ఏంట్నువ్‌జూశావా‌ అని దబాయిస్తే నేనే శాస్త్రం తిరగెయ్యను?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: