పుర్రెకు పుట్టని బుద్ధులు

”మీకోసం ఎవరో వచ్చారు సార్!”
”ఎవరొచ్చారో నీకు తెలియదా?”
”ఏమోసార్! వేషంమీదొచ్చాడు”
”అదేంటి? మనదగ్గరికి ఎవరైనా ఏదైనా మిషమీదొస్తారుగానీ వేషం మీద రారే!”
”ఏమోసార్! వచ్చిన మిష ఎవరికీ తెలియకుండా వేషం వేస్కునొచ్చారేమో?”
”సరే పంపించు”
ఆంతరంగికుడు అవతలికెళ్ళి డోర్ పుష్‌చేసేలోపే ఫెళఫెళార్భటుల బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో, మారే ముదురు రంగులు తిరిగే ఎపెక్ట్ మధ్యలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆగంతకుడు.
”ఎవర్నువ్వు?”
”ఉహహాహోహ్హెహ్హెఏహ్హె… తెలీట్లేదా… పోల్చుకోలేదా… గుర్తుపట్టనట్టు నటిస్తున్నావా… జానపద బాలనాగమ్మలోంచి ఊడిపడ్డ మాయలఫకీర్ని”
”చాల్లే దొంగమారువేషాలు! ఏ విదేశీ కంపెనీ తాలూకు, ఏ బడా కాంట్రాక్టర్ తాలూకు బ్రోకర్‌వో త్వరగా తేల్చు… ముందు వచ్చినపనీ… తెచ్చిన ముడుపూ సంగతి గురించి మాట్లాడు… వేషమూ, విషయమూ త్వరగా విప్పు…”

”నాది వేషంకాదు… నేను నిజంగా మాయలఫకీర్నే…”
”కొయ్… కొయ్… మాయలఫకీరైతే చేతిలో పుర్రెఏదీ… దాన్ని హాంఫట్ చేసే ఎముకేదీ…”
”నువ్వు కాజేసి నన్నడుగుతావేం… అందుకే ఇప్పుడొచ్చింది… నా ట్రేడ్ మార్క్ పుర్రే, ఎముకలూ నాకిచ్చెయ్… అవి నాచేతిలో లేందే నువ్వే గుర్తుపట్టలేదు… ఇక సామాన్య ప్రేక్షకులెలా గుర్తుపడతారు… చిన్నపిల్లలూ, బాలనాగమ్మా ఎలా ఝడుసుకుంటారు?”

”నే లాక్కోవడమేమిటీ”

”నువ్వంటే నువ్వుకాదు… నీ ఏలుబడిలోని డిపార్ట్‌మెంట్లు… ముందు నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్… తీగెలుపెట్టడం… పుర్రె ఎముకల గుర్తులు వేసి ‘అపాయం’ అని రాయడం…”

”అవును, ముట్టుకుంటే ఛస్తారు కదా…”

”అందుకే నేనూ ఊరుకున్నాను… నా పర్మిషన్ లేకుండా నా పేటెంట్ కొట్టేసినా సైలెంటుగా ఉండిపోయాను ప్రజాప్రయోజనాల దృష్ట్యా… ఇప్పుడేమో బీడీ కట్టలమీద…”

”ఇదీ అంతేగా… పొగతాగితే ఛస్తారుగా… ఇవీ ప్రయోజనాలే…”

”చెప్పకు నాకు… ఓటర్లకు చెప్పినట్టు… అలాఅయితే ఇన్నేళ్ళూ ఎందుకు ఊరుకున్నట్టు?… ధూమపానమేనా? మద్యపానం సంగతేమిటీ… ప్రజాప్రయోజనాలు కాదు… రాజకీయ ప్రయోజనాలు…”

”అయ్యో! అలా అనుమానించకు… పుర్రెబొమ్మేసి ప్రజల ఓట్లు పోగొట్టుకుంటామా…”

”…కోరు. అందుకనే మబ్బులచాటు చందమామలా ఆడుకుంటున్నారు …ఉంచుతామనీ …ఎత్తేస్తామనీ …తగ్గిస్తామనీ …కుదిస్తామనీ …నీకు తెలీదా …నాకు తెలీదా …ఎన్నికలయ్యాక ఎవరికెవరో …పుర్రెకింది అపాయం అన్నది మీ రాజకీయ ఉపాయం …ఈ అన్యాయం సాగనివ్వను …అందుకనే నా పేటెంటు మార్కు నాకిచ్చేసైమని అడగడానికొచ్చాను…”

”వెర్రివాడివి… ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కి నిన్నడిగి తీస్కున్నామా… ఇప్పుడూ అంతే… మాకు లాక్కోడమేగానీ ఇవ్వడం తెలీదు… ఏంచేస్కుంటావో చేస్కో… క్షుద్రమాంత్రికుడివి… నువ్వు నన్నేంచేస్తావ్…”

”అవును… నేను క్షుద్రమాంత్రికుణ్నే… నా విద్యని ఒక అందగత్తె అయిన అమ్మాయి మీద మాత్రమే ప్రయోగించాను… కానీ నువ్వు క్షుద్రరాజకీయ తాంత్రికుడివి… నువ్వు నీ అధికారం కోసం అమాయకులతో ఆడుకుంటున్నావ్… బలిచేస్తున్నావ్… ఎంత తెలివిమీరిపోయావ్- శవరాజకీయాలనుంచి క్షుద్రరాజకీయంతో పుర్రె రాజకీయాల వరకూ ఎదిగావా… చూడు నిన్నేంచేస్తానో… నా పుర్రెని నీ మాయలతో లాక్కుని నన్ను ఫకీరుగా మిగులుస్తావా… చెప్తా… కాచుకో… హాంఫట్…”
చేతుల్లో పుర్రె, ఎముకలూ లేకపోడంతో మంత్రం పారక మాయలఫకీరు బిక్కమొహం వేశాడు.
రాజరాజకీయుని హేళనపూర్వక నవ్వుతో గదంతా దద్దరిల్లిపోయింది.
(వ్రాసింది పిశుపాటి ఉమామహేశ్వరమ్ , అచ్చేసింది ఈనాడు)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: