దూకినోడికే… మా ఓటు

”రండి… వినండి… ఇదే నా చివరి కోరిక. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు. కానీ నాతోబాటు మరో ముగ్గుర్నలుగురు మీ కోసం క్యూలో ఉన్నారు. మీరు ఎవరిని ఇష్టపడతారో తెలియడం లేదు. అందుకే ఈ వాటర్‌ట్యాంకెక్కా. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అందుకే… చెప్పండి మీరంతా నాకే ఓటేస్తానని మాటిస్తే దిగివస్తా… లేకపోతే, మీమీద నాకున్న ఏకపక్ష, ఏకమార్గ ప్రేమను నిరూపించుకుంటూ ఇక్కడినుంచి దూకేస్తా… మరణిస్తా. ఆ తరవాత మీరంతా ఏడ్చినా ప్రయోజనం ఉండదు. నేను పార్లమెంటుకు వెళ్ళను, అసెంబ్లీకీ వెళ్ళలేను. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతా… మీరు అప్పుడు నన్నుచూసి ఎలా ఏడుస్తారో తలుచుకుంటే, నాకిప్పుడు తెగ ఏడుపొస్తోంది. వద్దు… ఏడవద్దు… మీరేడవద్దు… మనం ఒకరికోసం మరొకళ్ళం బతుకుదాం. చావొద్దు. నన్ను బతికించండి. రాజకీయంగా బతికించండి. మీ ఓటు నాకే వేస్తామని చెప్పి నన్నీ ట్యాంకునుంచి దించండి. అందలం ఎక్కించండి…”

”మహాజనులారా, ఇటు… ఈ పైకి, ఈ ఏడంతస్తుల మేడమీదికి చూడండి. మీకు తెలుసు. ఈ మేడ నాది కాదు. ఇంతవరకు మిమ్మల్ని ఓటు వేయండని బెదిరించిన ట్యాంకుమీది లీడర్‌ది. చూశారా! తన ఇంటిమీదినించి కాకుండా జనం నీళ్ళు తాగే ట్యాంకుమీదినుంచి దూకుతానంటున్నాడు. ఇందులోనే కుట్ర ఉంది. ఆయన చూపంతా జనం సొమ్ముమీదే. కాబట్టే ఆయన మనందరి ట్యాంకుమీదినించి బెదిరిస్తుంటే, నేను ఆయన ఇంటిమీదినుంచి చివరి కోరిక కోరుతున్నా. నన్ను గెలిపించండి. నా చిత్తశుద్ధిని శంకించకండి. వాటర్‌ట్యాంకుకన్నా ఎత్త్తెన, మన నియోజకవర్గంలో అతిపెద్ద బిల్డింగుమీదికి ఎక్కడం ద్వారా… నేనే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్న విషయం నిరూపించుకుంటున్నా. మీ ఓటు మాట నన్ను బతికిస్తుంది. అతని ఓటి మాటల్ని మీరు నమ్మకండి. మీరు ఓటేస్తానని వాగ్దానం చేస్తే, మీమీద నాకున్న ప్రేమను ప్రాక్టికల్‌గా నిరూపించుకుంటా. ‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను’ అని ఇక్కడినుంచి ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, మీరంతా నన్ను ప్రేమిస్తున్నట్లు ఓటు మాటిస్తే, మేడమీదినుంచి దిగగానే సినిమాలోని సోదరసోదరి ప్రేమకు తగ్గకుండా మిమ్మల్నందర్నీ… ప్రతి ఒక్కర్నీ గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంటా. ఇవ్వండి… అవకాశం ఇవ్వండి… నేను గెలిచే అవకాశం ఇవ్వండి… మిమ్మల్ని గాఢంగా దగ్గరకు తీసుకుని బృందగీతాలు పాడే అవకాశం ఇవ్వండి. నా పదవికి ప్రాణం పోయండి… నన్ను బతికించండి… ముందే చెప్పా, ఇక్కడినుంచి దూకితే బతికే అవకాశమే లేదు.”

”ఒట్టిదే… వాళ్ళిద్దరూ చెప్పింది ఒట్టిదే… వాళ్ళిద్దరికీ మీరంటే ఒక్కప్రాణమే. నా ఒక్కడికే మీరంటే పంచ ప్రాణాలు. అందుకే పంచ కట్టుకుని నూతిగోడెక్కా. వాళ్ళిద్దరికీ మీ ప్రాణం అంటే లెక్కలేదు. అక్కడినుంచి మీమీదికి దూకాలన్నది వాళ్ళ ప్లాను. అలాగైతే నేను ప్రేమిస్తున్న మీరు చస్తారు. వాళ్ళు ఆసుపత్రికి చేరి బతికిపోతారు. కాబట్టి ప్రేమను నిరూపించుకునే మార్గం ఎత్తునుంచి జనం మీదికి దూకడం కాదు… జనం లేని చోట కిందికి దూకడం. కాబట్టి నేను బావిలో దూకుదామని నిర్ణయించుకున్నా. దూకుతూ కూడా జనం గురించే ఆలోచించే నాకు మాత్రమే మీరు ఓటు వేయండి. అలా మాటివ్వండి. బావి కోసం కాదు… భావి కోసం నాకు ఓటేయండి. మీరు కాదంటే… నాకు మరే గొయ్యీ అవసరం లేదు. ఈ నుయ్యిలోనే దూకుతా…”

(జనమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు… ఎవరు దూకుతారా, ఎప్పుడు దూకుతారా అని… క్షణాలు, నిమిషాలు, గంటలు… గడుస్తున్నాయి. ఓటర్ల సహనం నశిస్తోంది. ఇక జనం నోరు విప్పారు… అనేక గొంతులు పలుకుతున్నాయి.)

”దూకుతా దూకుతా అనేవాడేగానీ దూకే వాడు ఒక్కడూ లేడే…”
”ఓ వాటర్ ట్యాంకాయనా, దూకు…”
”ఓ మేడమీది సారూ… దూకితే నా ఓటు నీకు”
”ఆయనేంటి… బావి గిలక్కి తాడేసి కట్టేస్కుంటన్నాడు?”
”మా మీద యమా లవ్వన్నావ్ గదయ్యా. కావిలించుకుని ఐశ్వర్యారాయ్, హృతిక్‌రోషనైపోదామన్నావ్…”
”ఇట్ల గాదుగానీ, మనమంతా ఒకే మాటమీదుందాం… సరేనా”
”సరే!”
”నేను దూకినోడికే- అంటా… మీరంతా- మా ఓటు అనండి. సరేనా?”
”దూకినోడికే…”
”మావోటు”
”దూకినోడికే…”
”మా వోటు”
(జనం అరుస్తూనే ఉన్నారు. నాయకులు పైన, జనం కింద… అదీ సంగతి!)
(ప్రమోదూత రచన, ఈనాడు ప్రచురణ)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: