ఆదాన కర్ణులు

మొదటి అంకం:
ఎవరూ భిక్షుకుల చరిత్ర రాసినట్టు లేరు. కాని ఆదినుంచీ మన వేద వేదాంగాలూ, పురాణేతిహాసాలూ దానగుణం గురించి చాలా చెప్పాయి. అడుక్కునేవాళ్లు లేకుంటే దాతృత్వం విలువేముంటుంది? దానగుణానికి స్థానం ఉంది కనుక అడుక్కునేవాళ్ళు ఆదినుంచీ ఉన్నారని అర్థం. భాగవతంలో రంతిదేవుడనే రాజు దానం చేసి చేసి పేదవాడయిపోతాడు. పరమశివుడిని భిక్షపతి అని అంటారు. మనది భిక్షుక ధర్మం, ఎంత డబ్బున్నవాడైనా ఉపనయనంలో భిక్షాపాత్ర పడతాడు ”భవతీ భిక్షాందేహీ” అని గోదాన, భూదాన, హిరణ్యదాన, కన్యాదాన, విద్యాదాన, అన్నదాన… వగైరా నానావిధ దానాల చరిత్ర చాలానే ఉంది. దానం చేసేవాడు స్వర్గానికెళ్తాడనీ ఉంది. అవును. నిజమే దానం చేసేవాడు స్వర్గానికి వెళ్తాడు, దానం తీసుకున్నవాడు దాన్ని అనుభవిస్తూ ఇక్కడే ఉండి ఐదేళ్లు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. బిచ్చం వేసేవాడే బిచ్చగాడైపోతాడు.

అన్ని దానములకన్న అన్నదానమె మిన్న అన్నారు. కాని ఓటు దానం గురించి ఎవరూ ప్రస్తావించనే లేదు. చాలా అన్యాయం. వెనకటికి ఉన్నట్టుగా గొప్ప కవులూ, రుషులూ ఈ కాలంలో లేరు. ఉంటే ఓటు దాన ప్రశస్తిని వర్ణించి ప్రజలందర్నీ దానకర్ణుల్ని చేసేవారు. అట్లా జరిగి ఉంటే ప్రజలే క్యూకట్టి, ఏడుకొండలవాడికి మొక్కులు తీర్చుకున్నంత భక్తి ప్రపత్తులతో ఓట్లేసేవారు. ఈ ప్రచారాలూ, సారాబుడ్లూ, క్రికెట్‌కిట్లూ, డబ్బు పంపిణీ అవసరం ఉండేది కాదు.

ఓటరూ రంతిదేవుడూ ఒకటేనని నా అభిప్రాయం. ఆయనకున్నది అంతా ఇచ్చివేసి పేద అయిపోయాడు. ఇక్కడా అంతే దానం చేసిన వాడిని తొక్కేయడం ఆదినుంచీ వస్తున్నదే. బలిచక్రవర్తికేమయింది? కర్ణుడు ఒకసారి ఇల్లు పీకి ఇచ్చాడు, రెండోసారి ఒళ్లు పీకి ఇచ్చాడు. పర్యవసానం ఏమయింది? ఇదంతా చూస్తే చరిత్ర పునరావృతమయినట్టు కనిపించట్లేదూ? ఓటేస్తున్న పత్తి రైతులు ఎక్కడ తేలుతున్నారు? సిరిసిల్ల నేత కార్మికులు ఏమవుతున్నారు? స్వర్గప్రాప్తి లభిస్తుందా లేదా? ఉన్నదాన్లో అంతో ఇంతో ఇవ్వడం వేరు ఉన్నదంతా సమర్పించుకోవటం వేరు.

పాపం పరమశివుడు భస్మాసురుడికి వరాలిస్తే భస్మాసురుడు ఎలా స్వామివారి తలపైనే చేయిపెట్ట జూశాడు. మర్మం ఎరిగినవారు కనుక ఇప్పుడెవరూ వరాలు ఇవ్వరు. వాగ్దానాలు ఇస్తారు. పరమశివుడు అక్కడే నుంచుని భస్మాసురుడికి వరం ఇచ్చాడు కనుక తిరగబెట్టింది. అదే ”నేను తిరిగి కైలాసానికెళ్లాక చూస్తానులె”మ్మంటే బాధ తప్పేది. గడచిన చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే అన్నట్టు దాతల చరిత్రంతా వెతల చరిత్రే. దానం చేసినవాడు మటాష్‌ అయినట్టు ఎన్నో దాఖలాలు ఉన్నాయే కాని దానం తీసుకున్నవాడు చెడిపోయినట్టు ఎక్కడా లేదు. రావణబ్రహ్మ భిక్షుకుడి వేషంలోనే సీత దగ్గరకొచ్చాడు. తరవాత జరిగిన కథంతా మనకు తెలుసు.

దానం చేసే కర్ణుణ్ని దానకర్ణుడు అంటారు. మరి దానం తీసుకునే కర్ణుణ్ని ఏమంటారు. ఆదానకర్ణుడు అంటారు. కనుక ఓట్లు అడగటానికి వచ్చేవారంతా ‘ఆదానకర్ణులు’.

”ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై, తనువుపై హంసోత్తరీయంబుపై…” వగైరా వగైరా మన్ననలు అందుకొన్న ”చేయి కిందై మీదై నా చేయి ఉండుట పాడింగాదే రాజ్యముగీజ్యమున్‌ సతతమే, కాయంబు నా పాయమే” అన్నాడు బలిచక్రవర్తి. శ్రీలక్ష్మిని ముట్టుకున్న (శ్రీహరి) చెయ్యి చాచాడు. నేను అతనికి దానం చేస్తున్నాను. పోతే పోనీ, ఈ రాజ్యం గీజ్యం ఉండేదా పాడా అని మూడడుగుల నేలని దానం చేశాడు బలిచక్రవర్తి. ”కలియుగే గృహే గృహే శక్తి” అన్నట్లు కలియుగంలో గృహేగృహే బలిచక్రవర్తి.

నిజమే మరి. తూగుటుయ్యాలపై, పట్టుపాన్పులపై, ఏసీ గదుల్లో సకల భోగభాగ్యాలూ అధికారం, దర్పం అనుభవిస్తూ సురపూజా భాజనంబైనట్టి, సరస పదార్థ రససంపన్నంబైన యన్నంబు తినేవాళ్లు వచ్చి ఎండల్లో వానలో మనముందు దేహీ అంటే ఓటేం లెక్క ప్రాణం కూడా ఇచ్చేస్తాం. అది మన ధర్మం, అది మన సంప్రదాయం.

* * *

రెండో అంకం:
బిక్షుకుల్లో నానావిధాల వాళ్లుంటారు. పాటలు పాడి బిచ్చమడిగేవాళ్లూ, దీవెనలు ఇచ్చి భిక్ష తీసుకునేవాళ్లూ, వివిధ వేషాలు వేసి, ఆనందం కలిగించీ బిచ్చం పుచ్చుకునేవాళ్లూ, గారడీలు చేసి ధర్మం అడిగేవాళ్లూ, సానుభూతి పొంది సంపాదించేవాళ్లూ, తమతమ రోగాల్నీ, అంగవైకల్యాన్నీ, పసిపిల్లల్నీ చూపెట్టి తద్వారా మన సెంటిమెంటుపై ప్రభావం చూపేవాళ్లూ, దేవుడి పేరున అడుక్కునేవాళ్లూ. ఎన్ని రూపాలో, ఎన్ని ట్రిక్కులో, ఎన్ని టక్కుటమారాలో…

అందర్లోకీ నాకు పిట్టలదొర బాగా నచ్చుతాడు. ‘గొప్ప గొప్ప’ వాళ్ల ఉపన్యాసాల్ని తలపిస్తుంది అతని వరస. ఎన్నెన్ని చెబుతాడో, జీవితంలో ఒక్కసారైనా పిట్టలదొరలా మాట్లాడాలని చిన్నప్పటినుంచీ బహుకోరికగా ఉండేది. అలా చేయాలంటే నిజం పిట్టలదొర అయినా కావాలి లేదా రాజకీయాల్లోనైనా చేరాలి. ఒకటి నామోషీ, రెండోది చేతకాదు-

ఎన్నికల ఉపన్యాసం చదువుకుని చూడండి. బహుశా దాన్ని రాసిపెట్టేది (ఘోస్ట్‌ రైటర్స్‌) పిట్టలదొరలే కాబోలు ఎవరికెరుక. చాలా బావుంటాయి.

మన కళలూ, మన సంస్కృతీ, భాషల్లాగే బిచ్చగాళ్ల రూపాలు కూడా నశించిపోతున్నాయి. గంగిరెద్దువాళ్లూ బహురూపులు, వీధి నాటకాల వాళ్లూ, సాధనాశూరులూ, హరిదాసులూ, వివిధ రకాల వాద్యాలతో రంజింపజేసి భిక్ష అడిగేవారు ఇప్పుడేరి? బాధేంటంటే భిక్షుకులు అంతరించి పోవట్లేదు. భిక్షపు కళలు అంతరించిపోతున్నాయి.

నాటకం పోయి సినిమా వచ్చినట్టు కొత్త నీరు వస్తోంది. కొత్త పద్ధతులూ, కొత్త వేషాలూ, కొత్త సంస్కృతి.

* * *

మూడో అంకం:
మన రాష్ట్రంలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టీ కరీంనగర్‌పైనే ఉంది. నాయకులకైతే మరీనూ… కరీంనగరే సర్వస్వం. కొత్త ప్రేయసిలా… ”నీవే తల్లివి తండ్రివి నీవే గురుడవు, దైవము నీవే సఖుడవు, నీవే నా అతియు గతియు నిజముగ కృష్ణా” అన్నట్టు అన్నీ కరీంనగరే.

తిట్లూ దీవెనలూ అయిపోయాయి. ప్రచారం దుష్ప్రచారం అయిపోయాయి. ఆత్మస్తుతీ, పరనిందలు అరిగిపోయిన గ్రాంఫోను రికార్డులయిపోయాయి. గంగాభాగీరథిలాగా సారా ప్రవహిస్తూనే ఉంది. ”లావా ప్రవాహాన్ని లాఠీలు ఆపునా” అని వెనకటికి కమ్యూనిస్టుల పాటొకటి ఉండేది. ఇప్పుడు దాన్ని ”సారా ప్రవాహాన్ని ఈసీలు ఆపునా” అని చదువుకోవాలి. డబ్బూ దస్కం, లావాదేవీలూ లాలూచీలూ అయిపోయాయి. ఈ ఎన్నికల్లో కొత్త వింత ఏంటంటే క్రికెట్‌ కిట్లు పంచడం. వచ్చే ఎన్నికల్లో ల్యాప్‌టాప్‌లూ, వీడియోగేములూ, సెల్‌ఫోన్లూ, సీడీలు పంచి యువతని ఆకర్షించవచ్చు.

ఒక నాయకుడు వెళ్లి వరి పొలంలో కోత కోశాడు (కోతలే కోసేవని ఒకావిడ అక్కడే అందిట), ఒకాయన చెప్పులు పాలిష్‌ చేశాడు (తన వారికేనా ప్రతిపక్షపార్టీలవి కూడానా, ఎలాగూ ఓటర్లకు చెప్పులు కానీ, వాటికి పాలిష్‌ కానీ ఉంటుందని నేను అనుకోను), ఆత్మహత్య చేసుకున్న రైతు శవం వేషం కట్టాడొకాయన. నడివీధిలో ఒకాయన డ్యాన్స్‌ చేశాడు. ఒకాయన పుర్రెగుర్తుగా ఊరేగాడు. చోటామోటా నాయకులు ఆంజనేయస్వామి వేషాలూ, రాముడి వేషాలూ కట్టారు. పాటలు పాడారు. గుళ్లూ గోపురాల్నీ సందర్శించారు. తలలపై చేతులెట్టి దీవించారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది. ఒక్క ఓటు అడుక్కోవటానికి ఎన్నెన్ని రూపాలు… ఎన్నెన్ని వేషాలు! అంతరించిపోతున్న కళలన్నింటినీ కళ్లకు కట్టట్లేదూ? దానం చేయడంలో తప్పులేదు. అది మన ధర్మం కూడా. అందుకే బిచ్చగాడు ‘ధర్మం బాబూ అంటాడే కాని ‘దానం బాబూ’ అనడు. ధర్మం అంటే మనం ఆచరించాల్సిన విధి అని అర్థం. దాన్ని మనకు గుర్తు చేస్తాడన్న మాట.

నానావిధ దానాల్లో ఓటు దానాన్ని కూడా చేరుస్తున్నానని మనవి చేస్తున్నాను. అన్నట్టు చెప్పడం మరిచా హిందీలో ఓటు వేయటాన్ని మత్‌దాన్‌ అని అంటారు. వాళ్లు మనకన్న ముందున్నారు కదూ.

దానాల్లో అపాత్రదానం (అంటే అనర్హమైన దానం) చేయకూడదంటారు. అలా చేయడం వల్లే కర్ణుడి కొంపకొల్లేరయింది… కన్యాదానం (పాపం శమించుగాక) చేస్తే పుణ్యమని దారినపోయే దానయ్యకో, అరవైఏళ్ల ముసలాడికో మన కూతుర్ని కట్టబెడతామా?

భిక్షాపాత్రలో పడ్డ వస్తువుని అనుభవించడానికీ, ఆరగించడానికీ భిక్షకుడికి అన్ని అధికారాలూ ఉంటాయి. కాదనలేం. ఆనక చింతించీ ప్రయోజనం లేదు.
(చికిత వ్యాసం, ఈనాడు ప్రచురణ)

ప్రకటనలు

2 thoughts on “ఆదాన కర్ణులు

  1. “ఎన్నికల ఉపన్యాసం చదువుకుని చూడండి. బహుశా దాన్ని రాసిపెట్టేది (ఘోస్ట్‌ రైటర్స్‌) పిట్టలదొరలే కాబోలు ఎవరికెరుక.” తరువాత “చాలా బావుంటాయి.” అని చదవగానే ఫక్కున నవ్వక తప్పిందికాదు.

  2. బాధేంటంటే భిక్షుకులు అంతరించి పోవట్లేదు. భిక్షపు కళలు అంతరించిపోతున్నాయి.భిక్షాపాత్రలో పడ్డ వస్తువుని అనుభవించడానికీ, ఆరగించడానికీ భిక్షకుడికి అన్ని అధికారాలూ ఉంటాయి. కాదనలేం. ఆనక చింతించీ ప్రయోజనం లేదు.

    వహ్వా!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s