అవినీతి ఎవడబ్బసొమ్ము!

‘పేటెంట్‌ అంటే ఏంట్సార్‌’
‘ఏమీ లేదు. ఓ చోట ఒకడు టెంట్‌ వేసుకొని కూచుంటాడు. అక్కడ తిష్ఠేసిన వాడికి మనమంతా పే చెయ్యడమే పేటెంట్‌ అన్నమాట’
‘వూర్కోండి సార్‌. మాకు ఎంత ఇంగ్లిష్‌ రాకపోతే మట్టుకు మరీ ఇంతగానా మమ్మల్ని వేళాకోళం చేయడం’
‘నిజమేరా నాయనా’
‘మళ్లీ అదే మాట’
‘నమ్మవు కదా… ఫలానా యవ్వారాన్నో, విధానాన్నో నేనే కనిపెట్టేశా. ఇకపై అది ఆచరించేవాళ్లంతా నాకు డబ్బు ముట్టజెప్పాలంటూ ఒకడు టెంటేసుకొని కూర్చుని వసూలు చేసుకుంటుంటాడు. ఆ యవ్వారాన్ని మనం కూడా అనుసరించామనుకో… అందుగ్గాను మనమూ వాడిక్కాస్త డబ్బు ముట్టజెప్పాలన్నమాట’
‘అర్థం కాలా’
‘సరే రాజకీయ కార్యకర్తవు కదా. నీకు అర్థమయ్యేలా చెబుతా విను. ఉదాహరణకు ఇప్పుడు బ్యాలెట్‌ పెట్టెల్లో మనకు ఓట్లు తక్కువగా పోలయ్యాయని తెలిసిందనుకో… ఏం చేస్తావ్‌?’
‘ఇంకే చేస్తాం. బలవంతంగా బ్యాలెట్‌ పెట్టెలో ఏ ఇంకో గింకో పోసేస్తాం’
‘కదా… ఫలానా ఇంకు పోసే ప్రక్రియను నేనే కనిపెట్టేశా. అందుకే ఇకపై ఇలా చేసేవాడెవడైనా నాకు డబ్బివ్వాలని దాన్ని మొట్టమొదటిసారి కనిపెట్టిన మహనీయుడు పేటెంటు కార్యాలయంలో హక్కు పొందుతాడనుకో. ఆ తరవాత ఆ పద్ధతిని అనుసరించేవారంతా మొదట ఇంకుపోయడం కనిపెట్టిన ఆసామికి కాస్తంత డబ్బు ఇవ్వాలన్న మాట. దాన్నే రాయల్టీ అంటారు. దీన్లోనూ రెండు రకాలున్నాయ్‌.’
‘ఏంట్సార్‌ అవీ?’
‘ఇప్పుడూ బ్యాలెట్‌లో ఇంకు పోయడం ద్వారా ప్రత్యర్థిని దెబ్బకొట్టొచ్చని ఒకాయన కనిపెట్టాడు కదా. ఆ ప్రక్రియ ద్వారా బ్యాలెట్‌పేపర్లను చెడగొట్టేయొచ్చని కనిపెట్టిన మహానుభావుడికి డబ్బు చెల్లించడం ప్రాసెస్‌ పేటెంటన్న మాట. అప్పుడు మన కార్యకర్త-సైంటిస్టులు ఏం చేస్తారంటే… ఆ మార్గాన్ని కనిపెడతారు. ఫరెగ్జాంపుల్‌ బ్యాలెట్‌ బాక్సులను బావిలో పడేస్తారన్నమాట. ఇక్కడ అనుసరించిన పద్ధతి వేరు కదా. అప్పుడు మనం ‘ఇంకు సైంటిస్టు’కు డబ్బు చెల్లించనక్కర్లేదు. కానీ… మొదటిసారి నూతిలో వేయడాన్ని కనిపెట్టిన సదరు బావి-విజ్ఞానవేత్త తన విధానానికి పేటెంటు పొందితే ఆయనకు చెల్లించాల్సిందే. ఇదీ ప్రాసెస్‌ పేటెంటే. అయితే… పద్ధతి ఏదైతేనేం, మొత్తం మీద బ్యాలెట్‌ పేపర్లను నాశనం చేయొచ్చని కనిపెట్టినాయనకు డబ్బు చెల్లించాల్సి రావడం ప్రాడక్ట్‌ పేటెంట్‌ అన్నమాట’
‘అలాగా? అదా పేటెంట్‌ అంటే! అబ్బా… ‘అవినీతిపై పేటెంటు హక్కు అంతా ఆయనదే’ అంటూ వ్యాఖ్యానించిన ఈ మహానుభావుడు మన నోట్లో మట్టికొట్టాడు కద్సార్‌. మనల్ని విపరీతమైన దెబ్బ కొట్టేశాడ్సార్‌’
‘ఏమిట్రా… ఎలా కొట్టాడంటావ్‌ దెబ్బ?’
‘ఇలాగైతే… ఫలానా డబ్బు పంచడం కనిపెట్టింది నేనూ… అని ఒకాయన అన్నాడనుకోండి. ఆయనకు దానిపై పేటెంట్‌ ఇవ్వాలి. అలాగే మందు పంచడం కనిపెట్టినాయనకూ, క్రికెట్‌ కిట్లాయనకూ, బూత్‌ క్యాప్చరింగ్‌, రిగ్గింగూ… ఇలాంటి వేర్వేరు ప్రక్రియలన్నింటికీ పేటెంట్లన్నీ ఒక్కడికే వెళ్లిపోవూ?!’
‘అయితే?’
‘అందుకే… అన్ని పార్టీవాళ్లమూ మాట్లాడుకొని, ముందుగా ఓ మాటనుకొని ఏ పేటెంట్‌ ఎవరెవరికో పంచుకొని సదరు పేటెంట్లు పొందడం ఓ పద్ధతి. అలాగే రోడ్‌షోలూ, రిగ్గింగులూ, ఆమ్యామ్యాలూ, మామూళ్లూ, సభలకోసం లారీల మీద జనాలను తరలించడాలూ… వీటన్నింటికీ ముందుగానే మనంమనం ఓ మాటనుకొని ఫలానాది మీదీ… ఫలానాది మాది అని భాగాలేసుకోవడమూ బాగుంటుంది. పేటెంట్ల పంపకాలప్పుడు ఏదైనా అంశమ్మీద ఇరు పార్టీల మధ్య ఏదైనా గొడవొచ్చిందనుకోండి. అప్పుడు శాంతియుతంగా, సామరస్యంగా లాటరీ పద్ధతి ద్వారానో, టాస్‌ వేయడంతోనో తేల్చుకోవాలన్నమాట. అంతేగానీ… ఇలా అవినీతి ప్రక్రియపై హక్కునంతా అప్పనంగా ఒకాయనకే కట్టబెట్టేసి సదరు పేటెంటంతా ఆయనకే ఇచ్చేస్తే ఎలా?’
‘ఇచ్చేస్తే ఏం? ఆయనే కదా బద్‌నాం అయిపోయేదీ?’
‘అలాగెలా కుదుర్తుంది. ఇప్పుడు మనం చేసే అవినీతికీ ఆయనకే రాయల్టీ చెల్లించాలి. వాళ్ల పార్టీవాళ్లు చేసే అక్రమాల తాలూకు రాయల్టీ డబ్బూ ఆయనకే పోతుంది. ఇలా అంతా ఆయనకే అప్పజెప్పేస్తే ఇకపై మన ప్రాజెక్టుల తాలూకు యవ్వారాలకు సంబంధించిన అవినీతి తాలూకు డబ్బులూ అధికారంలో లేకపోయినా ఆయనకే ఇవ్వాలంటే మేమెలా ఒప్పుకొంటాం?’
‘మరిప్పుడేమంటావ్‌’
‘దాంట్లో కొన్నింటిని… సారీ… మరీ మాట్లాడితే… దాదాపూ అన్నీ మనమే కనిపెట్టాం. కాబట్టి… రింగురోడ్డు దగ్గర్నుంచి రింగవ్వడాల వరకూ… పార్టీ యవ్వారాల దగ్గర్నుంచి ప్రాజెక్టుల వరకూ… ప్రాసెస్‌ అయినా, ప్రాడక్ట్‌ అయినా… పేటెంట్ల తాలూకు రాయల్టీ అంతా మనకే ముట్టజెప్పాలి. మీకంత నామోషీ అయితేనో… కాస్తంత కష్టమైతేనో చెప్పండి. కావాలంటే ఇకపై అన్ని ప్రక్రియల పేటెంటూ నేనే తీసుకుంటా. అంతా నాకే ఇస్తే…’
‘ఇస్తే?’
‘కొద్ది గంటల్లోనే కోటీశ్వరుణ్నయిపోనూ!’
(యాసీన్‌ రచన)

ప్రకటనలు

One thought on “అవినీతి ఎవడబ్బసొమ్ము!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s