ఇడుపులా బ్రదర్స్‌…(50% డిస్కౌంట్‌ బిట్లు మా ప్రత్యేకత)

“మార్గశిర మాసం బంపర్‌ డిస్కౌంట్‌…

న్నేడ్డే… ఈ ర్రోజే…

ఫిప్టీ పర్సెంట్‌- యాభై శాతం డిస్కౌంట్‌.

రండి. కొనండి. మీ అభిమాన…

ఇడుపుల బ్రదర్స్‌… ఇడుపుల బ్రదర్స్‌లో…

ఒక్క రోజు… ఈ ఒక్కరోజు మాత్రమే!

‘ధర’ పెంచి ఇచ్చే డిస్కౌంట్‌ కాదు…

సిసలు డిస్కౌంట్‌… అస్సలైన ధర తగ్గింపు…

ర్రండి…స్సార్‌! ర్రండి మేడమ్‌!”
* * *
“ఇటు సార్‌… ఇటు కూర్చోండి… చెప్పండ్సార్‌. మీకూ మీ పిల్లలకి తలో నాలుగు ‘బిట్లు’ తీద్దామా…”

“తలో నాలుగా… మీరు ఎంత డిస్కౌంటిస్తేమాత్రం, నా జేబులో సొమ్ము ఉండక్కర్లేదా? వద్దులేగానీ, నాకూ మా ఇద్దరు పిల్లలకి షర్టుబిట్లు కొంటా… పిల్లల కొలతలు గుర్తులేవ్‌. మొత్తం ఒకే తానులోంచి తీయి. కొలత చూసి చెప్పు… ఎంత కావాలో”

“అల్లాగేసార్‌…”
* * *
“సార్‌, ముగ్గురికీ ఆరుమీటర్ల పద్దెనిమిది పాయింట్లు సరిపోతుంది”

“ఇదేం లెక్కయ్యా… 618కి బదులు 620 అని చెప్పొచ్చుగదా!

“వద్దు సార్‌. మాది నిజాయతీతో చేసే యాపారం. ఇందులో ఒక్క సెంటీమీటరు కూడా తేడా రాడానికి వీల్లేదు. అందుకే 620 కాదు సార్‌, 618 సరిపోతదని చెబుతున్నా”

“సెంటీమీటర్లలో కూడా కక్కుర్తిపడని నీలాంటి మనుషులే కలియుగంలో లోకమంతా ఉంటే… భూమే స్వర్గం, ఆంధ్రదేశమే దేవుడి రాజ్యం”

“ఏదో తమరి అభిమానం…”

“లెక్కలో నిక్కచ్చిగా ఉండి… డిస్కౌంటు కూడా ఇస్తున్నారంటే… ఇడుపులా బ్రదర్స్‌ షోరూంకు ప్రచారం ఎందుకు?”

“అంతా మీ అభిమానం”

“ప్రజలు ఎలా బట్టగడుతున్నారో ఆలోచిస్తూ, మీ తానులో ముక్కల్ని మాకోసం చించి, పంచి ఇస్తున్న ఇడుపుల బ్రదర్స్‌ షోరూం కీర్తి… ఆ చంద్రతారార్కం నిలిచిపోతుంది”

“సార్‌, ఇదిమాది అని మేం అనుకోం సార్‌… ఇది మీది అనే ఫీలింగ్‌తోనే… కచ్చితమైన లెక్క చెప్పాం. 620 అని చెప్పొచ్చు. కానీ చెప్పం. ఎందుకంటే… మాది కాదని మేం అనుకున్నది, మీకు ఇవ్వక తప్పనిది 618.”

“నాకు సరిగా అర్థం కావడం లేదుగానీ… ఈ బస్సు మీది… ఈ చెత్తకుండీ మీది… ఈ రోడ్డు మీది… ఇలాంటి నినాదాలు చూశాంగానీ, ఇంతవరకు మీరుంచుకున్న ‘బిట్టు’ను… ‘ఇది మాదికాదు మీద’ని ప్రకటించి మాకే ఇచ్చింది ఇడుపుల బ్రదర్స్‌ మాత్రమే. మీ గురించి మా ఇరుగు, పొరుగు, అరుగు అందరికీ చెబుతా…”

“మీ ఆనందం…”
* * *
“నాన్నోయ్‌! ఆ షాపువాడిచ్చింది 618 లేదట! టైలరంకుల్‌ చెప్పాడు. ఇది 310 మాత్రమే ఉందట!”

“ఒరే చిన్నా… తప్పు కొలిచి ఉంటాడురా… ఇడుపుల బ్రదర్సేమిటి? తప్పు చేయడమేమిటి? వాళ్ళ ఇంటావంటా లేదు. బిట్టుని మడత తీయకుండా సగమే కొలిచి ఉంటాడు… సరిగ్గా చూద్దాం. ఏదీ… నీ స్కేలు పట్టుకురా…

… … … … …

అవున్రోయ్‌! మడత తీసినా ఇది 310 మాత్రమే ఉంది. ఇందులో ఏదో మడత పేచీ ఉన్నట్టుంది. బిల్లు’కలెక్టరు’ పొరపాటున 618కి బదులు 310 ఇచ్చాడేమో అడుగుదాం… పదండి, ఇడుపుల సంగతి, మన ఉడుపుల సంగతి తేలుద్దాం”
* * *
“అయ్యా, ఇడుపులా… నిన్న నీదగ్గర బిట్టు తీసుకున్నాం. 618 సరిపోతుందన్నావ్‌”

“అవును. మాట తప్పడం మా ఇంటావంటా లేదు”

“అది సరేనయ్యా… ఈ సంచీలో నువ్వు చెప్పినంత గుడ్డ లేదు”

“పొరపాటు… సరి చూసుకోండి”

“ఇదిగో నువ్వే చూడు. ఇదెంత ఉందో…”

“310. కొలత సరిగ్గానే ఉందిగా”

“అదేమిటి బాబూ… 618 ఇస్తానని 310 ఇచ్చి, పైగా లెక్క సరిపోయిందని బుకాయిస్తావేమిటి?”

“అయ్యా… పొరపాటు పడింది మీరు. మేం ముందే చెప్పాం డిస్కౌంటు ఇస్తున్నామని. అలాగే ఇచ్చాం. 618లో మీకు చెప్పినట్టే యాభై శాతం డిస్కౌంటు ఇచ్చాం. 310 లెక్కకొచ్చింది. సరిపోయిందిగదా…”

“ఇది మోసం… దగా… వంచన… మాకిస్తానన్న బిట్టులో డిస్కౌంటా… అన్యాయం, అక్రమం…”

“కాదు… ఇదే సక్రమం”

“ఇది మాది కాదు- మీదన్నావ్‌… ఇదేం ధర్మం?”

“మాకేది ధర్మమో నువ్వు చెప్పొద్దు… నేం చెప్పింది విను… మాట తప్పడం మా ఇంటా వంటా లేదు… అదంతే. అర్థమయిందా?”
(శ్రీముఖ వ్యాసం)

ప్రకటనలు

3 thoughts on “ఇడుపులా బ్రదర్స్‌…(50% డిస్కౌంట్‌ బిట్లు మా ప్రత్యేకత)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s