సెంటిమెంట్‌…ఓ బేతాళ కథ

“విక్రమార్కా! నీ దగ్గర ఓ బీడీ ఉంటే ఇస్తావూ?”

శవాన్ని దించడానికి చెట్టెక్కబోతున్న విక్రమార్కుడు ముందు ఉలిక్కిపడి, తర్వాత తెల్లబోయాడు. “ఇదేమిటి … నేనింకా శవాన్ని భుజాన వేసుకుని నడక ప్రారంభించకుండానే బేతాళుడు డైలాగ్‌ వెర్షన్‌ మొదలెట్టాడు! అయినా, ఈ బీడీ గోలేమిటో?”

విక్రమార్కుడు మనసులో అనుకుంటున్న మాటల్ని శవంలో బేతాళుడు ఇట్టే కనిపెట్టేసి వికవిక నవ్వాడు.
“మరేం లేదు … మన బేతాళ కథలన్నీ “పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగానే శవాన్ని కిందికి దించి…” అనే వాక్యంతోనే మొదలవుతున్నాయని వెరైటీగా ఈ డైలాగ్‌ తో ప్రారంభించా! ఈ శవంగాడెవడో గానీ .. బీడీలు తెగకాల్చికాల్చి చచ్చుంటాడు. వాడి శవంలో దూరగానే నాకూ ఓ బీడీ కాల్చాలనిపించి, నిన్ను బీడీ అడిగాను. అదీగాక ఇప్పుడంతా బీడీ గొడవలేగా!”

విక్రమార్కుడు మౌనంగా శవాన్ని దించి, భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు. బేతాళుడు మళ్లీ నస మొదలుపెట్టాడు.
“నీ అంగీకి ఉన్న జరీపోగులు గుచ్చుకుంటున్నాయోయ్‌ విక్రమార్కా! మళ్లీసారి నన్ను భుజాన వేసుకునేముందు కాస్త ఆ పోగులు తీసేద్దూ, బాబ్బాబు!”
విక్రమార్కుడు మారుమాట్లాడకుండా నడక కొనసాగించాడు.
“ఓహో … కథ చెప్తేగానీ మాట్లాడవు కాబోలు… సరే.. ఈ మధ్య జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నిక గురించి ఓ పిట్ట కథ చెబుతా! శ్రమ తెలియకుండా విను!” బేతాళుడు చెప్పడం ప్రారంభించాడు.

***

ఎన్నికల కార్యాలయంలో కేసీఆర్‌ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. నరేంద్ర రాకని కూడా గమనించలేదు.
“ఏమిటి సార్‌! అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు?” అడిగాడు నరేంద్ర. కేసీఆర్‌ తేరుకుని “ప్రచారానికి ఇంక రెండు రోజులే గడువుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా?” అంటూ ఆరా తీశాడు.

కేసీఆర్‌ ఆంతర్యం అర్థమై “ఆహా … సకల ఏ … ర్పా … ట్లు .. పూర్తయ్యాయి. ఇంతకీ ఏమిటంత సీరియస్‌గా ఆలోచిస్తున్నారు?” అడిగాడు నరేంద్ర. “ఆ ఏర్పాట్లు సరే… మన ప్రచారంలో సినిమా వాళ్లని కూడా పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఎంత గింజుకున్నా మన ఆడ తారల్లో తెలంగాణ వారు ఎవరో బుర్రకి తట్టడం లేదు” విచారంగా అన్నాడు కేసీఆర్‌.

“సినిమా ఎట్రాక్షన్‌కి ఆంధ్రా, తెలంగాణ తేడా ఉండదు లెండి .. మీరింకా తెలంగాణ లేడీస్‌ గురించి ఆలోచిస్తున్నారు. అసలు తెలుగు లేడీస్‌ ఎవరున్నారో చెప్పండి?” ఎదురు ప్రశ్న వేశాడు నరేంద్ర.
కేసీఆర్‌ బుర్ర ఊపి, మళ్లీ కాసేపు ఆలోచించి, “పోనీ, విజయశాంతిని రమ్మం దామా?” అన్నాడు.
నరేంద్ర కిసుక్కున నవ్వాడు. “ఆ మాట నాకిందాకే తట్టింది గానీ, మొదట నేనే అంటే మళ్లీ మీరు నాకూ, విజయశాంతికీ బిజెపి లింకులున్నాయని నిష్టూరాలాడతారని నోర్మూసుకున్నా.”

“సారీ, నరేంద్ర గారూ ! అప్పుడేదో సరదాకి అన్నా … విజయశాంతికి మీరంటే చాలా గౌరవం … మీరు పిలిస్తే తప్పకుండా వస్తుంది..” ఆశగా అన్నాడు కేసీఆర్‌.
నరేంద్ర ఒప్పుకుని, పత్రికల ద్వారా టీవీల ద్వారా విజయశాంతిని ఆహ్వానించాడు.
“విజయశాంతి ప్రత్యేక తెలంగాణకి కట్టుబడ్డ తెలంగాణ అమ్మాయి. ప్రత్యేక తెలంగాణయే ఎజెండాగా పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్‌నీ, తద్వారా తెలంగాణ వాదాన్నీ గెలిపించడానికి ఆమె ప్రచారానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.”

***
బిజెపి అభ్యర్థి విద్యాసాగరరావు కలవరపడి, వెంటనే అద్వానీకి ఫోన్‌ చేశాడు. “సార్‌ … మీరెలాగైనా విజయశాంతిని ఒప్పించి, టిఆర్‌ఎస్‌కి కాకుండా మన తరఫునే ప్రచారానికి వచ్చేట్టు చేయాలి. మీరంటే ఆవిడకి గురుభావం ఉంది …. మీరు చెప్తే తప్పకుండా వింటుంది” అంటూ అభ్యర్థించాడు. సరేనని అద్వానీ ఫోన్‌లో విజయశాంతితో మాట్లాడి. కరీంనగర్‌ ప్రచారానికి వెళ్లమని మరీమరీ కోరాడు.

***
విలేకరులు విజయశాంతిని చుట్టుముట్టారు. “మేడం … మీరు ప్రచారానికి వెళ్తున్నారా? ఎవరి తరపున ప్రచారానికి వెళ్తారు?” సూటిగా అడిగారు.
విజయశాంతి చిరునవ్వు నవ్వి, నుదుటి మీద లేని ముంగురుల్ని సరిచేసుకుంటూ చెప్పింది.
“టిఆర్‌ఎస్‌ తెలంగాణ కోసం పోరాడుతోంది. బిజెపి కూడా ప్రత్యేక తెలంగాణకి కట్టుబడి ఉంటామనీ, ప్రైవేట్‌ బిల్లు పెడతామనీ ప్రకటించింది. ఇద్దరూ తెలంగాణకి కట్టుబడి ఉన్నవారే! అందుకే తెలంగాణ వాదాన్ని గెలిపించాలని నా తెలంగాణ ప్రజలకి పిలుపు ఇస్తున్నాను… జై తెలంగాణ!”
“డొంక తిరుగుడు వద్దు మేడం … సూటిగా చెప్పండి … ఎవరి తరఫున ప్రచారం చేస్తారు?” విలేకరులు నిలదీశారు.
“రేపు చెప్తా”నంటూ విజయశాంతి ఇంట్లోకి వెళ్లిపోయింది.

***
చంద్రబాబు బొబ్బిలిలో ఉన్న రోజాకి ఫోన్‌ చేశాడు. “అమ్మాయ్‌, రోజా! విజయశాంతి కరీంనగర్‌కి వెళ్లేటట్టు ఉంది … నువ్వు కూడా కరీంనగర్‌కి వెళ్లాలి … రెడీగా ఉండు” అంటూ పురమాయించాడు.
రోజా మొహంలో రంగులు మారాయి. “సార్‌ … తెలంగాణ సెంటిమెంట్‌ ఉన్న చోట ఆంధ్రా అమ్మాయి వెళ్లి ఏం ప్రయోజనం? మీక్కావాలంటే విజయశాంతి అక్కడికి వెళ్లకుండా చేస్తా!” అభ్యర్థించింది రోజా. సరే కానిమ్మన్నాడు చంద్రబాబు.
రోజా విజయశాంతికి ఫోన్‌ చేసి, ఓ పావుగంట సేపు మాట్లాడింది. అంతే … విజయశాంతి ఎవరి తరఫునా ప్రచారానికి వెళ్లలేదు. విజయశాంతి లేకుండానే కరీంనగర్‌ ప్రచార ఘట్టం ముగిసింది.

***
బేతాళుడు కథ చెప్పడం ఆపి, విక్రమార్కుణ్ణి అడిగాడు. “ఓ రాజా! విజయశాంతి కరీంనగర్‌ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు? రోజా ఆమెకు ఏం చెప్పింది? ఈ ప్రశ్నలకి నువ్వు తెలిసీ జవాబివ్వలేకపోయావో…”
“నా తల వేయి వక్కలవుతుందని తెలుసు లేవోయ్‌ చెవలాయ్‌!” విక్రమార్కుడు చిరాకు పడుతూ అసలు విషయం చెప్పాడు.
“కరీంనగర్‌ ఎన్నికల ప్రచారం ఆడ సినిమా తారలకి అచ్చిరాదని రోజా చెప్పి ఉంటుంది. కిందటిసారి కరీంనగర్‌లో ప్రచారానికి బయల్దేరిన సౌందర్యకి ఏం జరిగిందో గుర్తుచేసి ఉంటుంది. ఆ దెబ్బకి విజయశాంతి ఠారెత్తి, కరీంనగర్‌ ప్రచారానికి వెళ్లడం మానేసి ఉంటుంది. ఈ సెంటిమెంట్‌ ఎన్నికల్లో ఎవరి సెంటిమెంట్‌ వాళ్లది…”
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు షరా మామూలుగా శవంతో సహా ఎగిరి మళ్లీ చెట్టెక్కాడు.

(రాజగోపాల్ రచన, నవీన్ టైటిల్)

ప్రకటనలు

4 thoughts on “సెంటిమెంట్‌…ఓ బేతాళ కథ

  1. మన సినిమా రంగం అర్థం పర్థం లేని సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఆ రోగం రాజకీయులకు కూడా అంటుకుంది. దాన్ని చక్కగా వాడుకుని భలే రంజైన బేతాళకథ చెప్పారు. రాసినవారికి అభినందనలు, పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s