అయ్యో పాపం సత్తెన్న

“అనుకున్నట్టే మన పెద్దాయన ఎమ్మెస్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మరిప్పుడేం చేద్దాం కేశవరావుగారూ!” సాలోచనగా అడిగాడు వైఎస్‌.
“ఆమోదించి పారెయ్యండి … తిక్కరోగం కుదురుతుంది. ఇట్‌ హేజ్‌ బికమ్‌ ఫాషన్‌ టు దిస్‌ ఓల్డ్‌ జెంటిల్మాన్‌ … వియ్‌ షుడ్‌ నాట్‌ స్పేర్‌ దిస్‌ టైమ్‌” కోపంగా అన్నాడు కేకే.
వైఎస్‌ గలగలా నవ్వి అన్నాడు.
“ఈ పెద్దాయనతో ఓ చిక్కుంది మిస్టర్‌ కేకే! ఆయన లోపలుంటే బైటికి ఉమ్ముతాడు. బైట ఉంటే లోపలికి ఉమ్ముతాడు. మరాయన్ని లోపల ఉంచడం బెటరా? బైటకి పంపడం బెటరా?”
“యు ఆర్‌ హండ్రెడ్‌ పర్సంట్‌ కరెక్ట్‌! కానీ, ఆయన రాజీనామా ఆమోదించి తీరాలని పట్టుబడుతున్నాడు కదా! మరెలా?” సందేహంగా అన్నాడు కేకే.
“మనం స్వయంగా ఆయన ఇంటికెళ్ళి నచ్చచెబుదాం … ఓ ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా!” అన్నాడు వైఎస్‌.
ఇద్దరూ ఎమ్మెస్‌ ఇంటికి బయల్దేరారు.

* * *
ఇంట్లో ఎమ్మెస్‌ నెత్తిమీద తుండుగుడ్డేసుకుని, టీవీలో వస్తున్న ‘శ్రీనాధుడు’ పద్యనాటకాన్ని చూడడంలో మునిగి తేలుతున్నాడు. ఇంతలో వైఎస్‌, కేకే వచ్చారు.
వాళ్ళని చూడగానే ఎమ్మెస్‌ టీవీ కట్టేసి, ‘రండి, రండి, కూర్చోండి’ అంటూ ఆహ్వానించాడు.
“ఏమిటీ నాటకం?” అడిగాడు వైఎస్‌.
“ఏదీ … టీవీలోదా, నా రాజీనామానా?” కస్సుమన్నాడు ఎమ్మెస్‌.
“ఛ .. ఛ… మీ రాజీనామాని నాటకమని ఎందుకంటాను సార్‌! నా మొహాన రిజిగ్నేషన్‌ పడేసి, ఎంచక్కా నాటకం చూస్తూ కూర్చున్నారు కదా! అదేం నాటకమని అడిగా, అంతే!” సర్ది చెప్పాడు.
“ఎనీవే యూ ఆర్‌ వెరీ గ్రేట్‌ సార్‌! రిజైన్‌ చేసేసి, తొణక్కుండా బెణక్కుండా నాటకం చూడ్డం మీకే చెల్లింది” మెచ్చుకోలుగా అన్నాడు కేకే.
“జనంలో తలెత్తుకోలేక రిజైన్‌ చేశాగానీ, నాకు మాత్రం బాధగా ఉండదా చెప్పండి … ఆ బాధని మర్చిపోడానికే నాటకం చూస్తూ కాలక్షేపం చేస్తున్నా!” విషాదంగా అన్నాడు ఎమ్మెస్‌.
“బెంగపడి, సాధించేదేముందీ? మనకుంది కదా టేకిట్‌ ఈజీ పాలసీ” అంటూ పాడాడు కేకే.
“సరేలెండి. జరిగిందేదో జరిగిపోయింది … మీరు రాజీనామా విత్‌డ్రా చేసుకుంటేనే అందరికీ మంచిది” అనునయించాడు వైఎస్‌.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఎమ్మెస్‌ భీష్మించాడు. “ఒక వేళ నేను యాక్సెప్ట్‌ చెయ్యకపోతే ఏం చేస్తారు?” కోపంగా అన్నాడు వైఎస్‌.
“ఏం చేస్తానా? నా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా! డైరెక్ట్‌గా స్పీకర్‌కే లెటర్‌ పంపిస్తా!” చిద్విలాసంగా అన్నాడు ఎమ్మెస్‌.
వైఎస్‌, కేకే హడిలిపోయారు. “బాబ్బాబు … అంత పని చెయ్యకండి. తెలంగాణలో, అందులో కరీంనగర్‌ అసెంబ్లీకి ఉపఎన్నిక అంటే చస్తాం. సరే, అసెంబ్లీ మొదలయ్యేలోగానే మీ రాజీనామా ఆమోదిస్తాలెండి … అంతవరకు ఓపిక పట్టండి, బాబ్బాబు!” అంటూ వైఎస్‌ బతిమలాడాడు.
ఎమ్మెస్‌ తుండుగుడ్డతో కళ్ళు తుడుచుకుంటూ తనలో తనే మాట్లాడుకోవడం ప్రారంభించాడు.
“అసలు నేనేల కేసీఆర్‌కి ఛాలెంజ్‌ చేయవలె? చేసితినిబో, ‘ఏదో పెద్దాయన వాగుడులే’ అని వదిలెయ్యకుండా కేసీఆర్‌ ఏల రాజీనామా చేసి ఉపఎన్నిక తెచ్చి పెట్టవలె? పెట్టితిడిబో, సవాలు చేసిన నాకు కాకుండా జీవన్‌రెడ్డికి ఏల టిక్కెట్టు ఇవ్వవలె? ఇచ్చితిరిబో, బుద్ధిగా ప్రచారం చేయక, ‘ఎక్కడుందిరా తెలంగాణ?’ అంటూ నేనేల రెచ్చగొట్టవలె? రెచ్చగొట్టితినిబో … జనం ఇన్ని లక్షల మెజారిటీతో కేసీఆర్ని గెలిపించి నా మాడు ఏల పగలగొట్టవలె …?”
వైఎస్‌కి జాలేసి, ఎమ్మెస్‌ భుజం తట్టాడు. ఎమ్మెస్‌ గొల్లుమన్నాడు. “మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి సార్‌! లేకపోతే నాకు మంత్రి పదవి చేదా చెప్పండి … చచ్చుదో, పుచ్చుదో .. ఏ శాఖ అయితేనేం, మంత్రిగా ఉంటే ఆ దర్జాయే వేరు. అలాంటి పదవిని చేతులారా వదులుకోవడం నాకు సరదానా చెప్పండి” అంటూ కుమిలిపోయాడు. ఆ దుఃఖం ఎమ్మెస్‌ నోట పాట రూపంలో ప్రవహించింది.

ఎమ్మెస్‌: అయ్యయ్యో, చేతిలో పదవి పోయెనే!
అయ్యయ్యో, బుర్ర ఖాళీ ఆయనే!
ఉన్నది కాస్తా ఊడింది …
సర్వమంగళం పాడింది …
ఇంటా బయటా పరువుతో సహా తిరుక్షవరమై పోయిందీ …
అయ్యయ్యో …!

వైఎస్‌, కేకే కూడా గొంతు కలిపారు.

కేకే: ఆ మహామహా మన ఇందిరమ్మకే తప్పలేదు భాయీ …
ఓటమి తప్పలేదు భాయీ!

ఎమ్మెస్‌: మరి నువ్వు చెప్పలేదు భాయీ!

కేకే: ఇట్స్‌ నాట్‌ మై మిస్టేకు భాయీ!

వైఎస్‌: తెలివితక్కువగ సవాలు చేసీ దెబ్బతింటివోయీ .. బాబూ, రిజైన్‌ చెయ్యకోయీ!

ముగ్గురూ: అయ్యయ్యో …!

ఎమ్మెస్‌: నిలువు దోపిడీ మొక్కిన ఉన్నా ఫలితం వచ్చేది…

కేకే: ఎట్లీస్ట్‌, పుణ్యం దక్కేది!

వైఎస్‌: చక్కెర పొంగలి చిక్కేది!

కేకే: మౌతు మూసుకుని కాముగ ఉంటే బైపోల్‌ తప్పేది …

ఎమ్మెస్‌: మనకూ అంతటి బుద్ధేదీ?

ముగ్గురూ: అయ్యయ్యో …!

వైఎస్‌: గెల్పూ, ఓటమి దైవాధీనం, ‘చెయ్యి’ తిరగవచ్చు … మళ్ళీ పోటీ చేయవచ్చు …

ఎమ్మెస్‌: ఇంకా టిక్కెట్టెవడు ఇచ్చు …

కేకే: మేడం కాళ్ళు పట్టవచ్చు … ఛాన్సు తిరిగితే ఈ దెబ్బకు మన పరువు తిరిగి వచ్చు …

ఎమ్మెస్‌: (అనుమానంగా) పోతే …?

కేకే: (ఇకిలిస్తూ) గోచి మిగలవచ్చు …

ఎమ్మెస్‌ వాళ్ళిద్దర్నీ బయటికి నెట్టి … “చివరికి ‘కారు’ ఎక్కవచ్చు” అంటూ ముక్తాయింపు పాడేసి తలుపులు ధడేల్మని మూసుకున్నాడు.
(రాజగోపాల్ రచన, నవీన్ టైటిల్)

ప్రకటనలు

3 thoughts on “అయ్యో పాపం సత్తెన్న

  1. అదిరింది!!

    ఎమ్మెస్‌: నిలువు దోపిడీ మొక్కిన ఉన్నా ఫలితం వచ్చేది…
    నిజానికి పాటలో ఏముందంటే – నిలువు దోపిడీ దేవునికిచ్చిన ఫలితం దక్కేది…

  2. చాలా బాగా రాసారు. నిజానికి ఎమ్మెస్ కు లోపల, బయట తేడా లేదనుకుంటాను.. అక్కడా, ఇక్కడా అని లేక ఎక్కడైనా ఉమ్ముతాడనుకుంటాను. మంచి ముండావాడు పాపం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s