• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 242,082 హిట్లు

త్యాగం చేయుమయా!

త్యాగరాజ కీర్తనలకు కాలం చెల్లింది!
‘రాజ’త్యాగ కీర్తనలకు ఎక్కడలేని డిమాండ్‌ వచ్చేసింది.
వై.ఎస్‌. దెబ్బకు ఎక్కడో ఏదో లోకంలోనో ఉన్న కీర్తిశేషులంతా తల్లడిల్లిపోతున్నారు. ‘వై.ఎస్‌. త్యాగం ముందు తమ త్యాగాలకు అంత విలువలేకుండా పోయిందే’నని శిబి, దధీచి, బలి, కాటన్‌, వినోబా భావే, ఇందిరాగాంధీ తదితరుల ఆత్మలన్నీ ఘోషిస్తున్నాయి. స్వర్గలోకంలో సంచలనమైపోయింది. ఇక ఇలాతలం సంగతి చెప్పేదేముంది? ‘పదవీత్యాగమూర్తి’ సోనియాగాంధీవంటివారు కూడా తమ త్యాగాన్ని బేరీజు వేసుకోవలసిన పరిస్థితి రేపోమాపో రావచ్చు! తమవద్ద చట్టవిరుద్ధంగా ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించగానే ఎన్ని ప్రకంపనలు!

ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో వై.ఎస్‌. కాటన్‌ను మించిపోయారన్న కాంగ్రెస్‌వాళ్లు ఇప్పుడాయన వినోబా భావేను మించిపోయారంటున్నారు. వినోబా ఇతరుల భూమిని దానం చేయమన్నారేతప్ప తన భూమిని దానం చేయలేదని కాంగ్రెస్‌వాళ్లు పాయింటు లాగుతుంటే… ‘ఎంత అన్యాయం! వినోబా భావే దగ్గర సర్కారు భూమి ఉంటేగదా దానం చేయడానికి’ అని సన్నాయినొక్కులు వినిపిస్తున్నాయి. అంతమాత్రాన వై.ఎస్‌.తో వినోబా సరితూగుతారా? ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు దానిని భావే అనుశాసనపర్వం అన్నారు. వై.ఎస్‌. తెస్తానంటున్నదీ ఇందిర రాజ్యమేగదా! వై.ఎస్‌. చూపించిన ఆవేశం వినోబా ఎప్పుడు చూపించారు?

త్యాగాలను ‘నిష్పాక్షికంగా’ బేరీజు వేసినా వై.ఎస్‌.త్యాగానికి తిరుగులేదనిపిస్తుంది. శిబి చక్రవర్తిదేముంది, శరీరాన్ని కోసి ఇచ్చాడు. రోజూ ఆసుపత్రుల్లో ఆపరేషన్లతో తమ శరీరాల్ని ఎంతమంది కోయించుకోవడంలేదు? ‘డాక్టర్‌’కు ఈ విషయం తెలియనిది కాదు. అయినా దీనికి వై.ఎస్‌.వరకెందుకు? ఆయనకోసం ఒకరు మెడ కోసుకుంటామంటే ఇంకొకరు తొడ కోసుకుంటామనే వాళ్లు కాంగ్రెస్‌లో కొందరున్నారు.

దధీచి వెన్నెముకను ఇచ్చాడు. అదేం గొప్ప! ఎంతోమంది కాంగ్రెస్‌ నాయకులు తమ వెన్నెముకను అధిష్ఠానవర్గానికి త్యాగం చేశారని ఇందిరమ్మ హయాంనుంచి ఒకటే హోరు. దాంతో దధీచి కూడా రేసులో వెనకబడ్డాడు.

బలి చక్రవర్తి గురించి చెబితే వై.ఎస్‌.కన్నా ఆయన ఎన్ని ‘అడుగులు’ వెనక ఉన్నాడో తేలిపోతుంది! వామనుడు కోరిన మూడడుగులు దానం చేయడానికే బలి ఎలా బలి అయిపోయాడు! ప్రభుత్వానికి వై.ఎస్‌. ఇచ్చిన ఇడుపులపాయ భూములు ఎన్ని అడుగులు అవుతాయో లెక్కించి చూస్తే బలిని ‘భళీ భళీ’ అనలేం.

త్యాగం మొదలుపెట్టిన తరవాత ఎంత ఆగం అయినా సాగక తప్పదు. వై.ఎస్‌. త్యాగం ప్రభావం మరిన్ని మలుపులు తిరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అంతటి త్యాగం చేసిన తరవాత కాంగ్రెస్‌ మంత్రులు, ఆ పార్టీ నాయకులు కూడా త్యాగం చేయకపోతే ఏం బాగుంటుంది? తమకు ఎక్కడెక్కడ అక్రమ భూములున్నాయో తేల్చుకోవడం కష్టం కావచ్చు. అందుకోసం వారు మీడియా సహకారం కూడా తీసుకోవచ్చు. తారీఖులు, దస్తావేజులు అక్కర్లేదు. పాత పేపర్లు తిరగేసినా కావలసినంత సమాచారం దొరుకుతుంది. అంత భూమి చేతికొస్తే ఆంధ్రప్రదేశ్‌ తట్టుకోగలదా అన్నదొక్కటే సమస్య. ‘త్యాగాంధ్ర ప్రదేశ్‌’ తెచ్చామనీ చెప్పవచ్చు.!

‘వై.ఎస్‌.త్యాగం’ వెల్లడి కాగానే ప్రతిపక్షాలు ఒక్క క్షణం కూడా ఊరుకోలేదు. ఇంతకాలం అక్రమంగా భూములు ఉంచుకున్నందుకుగాను ముఖ్యమంత్రి పదవినికూడా త్యాగం చేయాలని ఒకటే గొడవ. నిజానికి వై.ఎస్‌.కు అది పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఆయన రాజీనామా చేస్తే సోనియాగాంధీ బాధపడతారన్నదే సమస్య అని కొందరు కాంగ్రెస్‌వాళ్లు అంటున్నారు. ఎలాగూ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారన్న కీర్తిని సోనియాగాంధీ సొంతం చేసుకున్నారుగానీ ‘చేతి’కి రాకముందే పదవిని వదిలేయడం త్యాగం ఎలా అవుతుందన్న మీమాంస ఉండనే ఉంది. అందువల్ల- రెండున్నరేళ్లపాటు నిర్ధూమధామంగా అనుభవించిన ముఖ్యమంత్రి పదవిని వై.ఎస్‌.త్యాగం చేస్తే దానిముందు సోనియా త్యాగం నిలుస్తుందా… అన్నదే చిక్కు ప్రశ్న.

ఎంతటివాళ్లు ఎంత త్యాగం చేయాలి అనే దానికీ కాంగ్రెస్‌ చట్టంలో కొన్ని రూల్సు ఉంటాయి! ఇష్టం వచ్చినట్టు త్యాగం చేయడానికి అవి ఒప్పుకోవు. బస్సు రూట్ల జాతీయం వ్యవహారంలో నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయలేదా, రైలు ప్రమాదం జరగగానే లాల్‌బహదూర్‌ శాస్త్రి పదవీ త్యాగం చేయలేదా అని అనకూడదు. అవి త్యాగాలకు పోటీలేని రోజులు! ఇప్పుడలాకాదు. పొరపాటున నోరుజారితే చేయిజారక తప్పదు. ఇతరులు అన్న మాట మీద నిలబడితేనేమో సత్య హరిశ్చంద్రుడి పేటెంటు దెబ్బతింటుంది! ‘మాట ఇస్తే తప్పడం మా ఇంటా వంటా లేద’ని ఆ మధ్య కరీంనగర్‌ ఉపఎన్నికల సమయంలో వై.ఎస్‌. అన్నప్పుడే- హరిశ్చంద్రుడి గుండె కాస్త దిగజారింది! రికార్డును సాధించడం ఎంతసేపు? దానిని ఇతరులు బద్దలు కొట్టకుండా చూసుకోవడమే అసలు సిసలైన సమస్య!

‘మా హయాంలో జరిగిన అభివృద్ధి చూడండి’ అని ముఖ్యమంత్రి పదేపదే అంటుంటారు. మొన్నటి ఎన్నికల్లో జనం పట్టించుకోలేదు. వై.ఎస్‌. చేతిలో ఇప్పుడు తిరుగులేని బ్రహ్మాస్త్రం ఉంది. ‘త్యాగాల అభివృద్ధి’ చూడమని ఇకమీద ఊరించవచ్చు. దేవుడి పాలనలో దయతలచి మంత్రివర్గ విస్తరణ జరిగితే కొంతమంది మంత్రులు కూడా త్యాగాలబాట పడతారు.

త్యాగం ఎన్నటికీ వృథా పోదు. పూర్వం కామరాజ్‌ నాడార్‌ పథకం కింద మంత్రి పదవులు త్యాగం చేసినవాళ్లూ ఆ తరవాత చేతులు ముడుచుకొని కూర్చోలేదు. రాజీవ్‌గాంధీ హయాంలోనూ త్యాగాలున్నాయి. కొందరు కేంద్ర మంత్రులు తమ పదవులు త్యాగాలు చేసి ముఖ్యమంత్రులయ్యారు. కొందరు ముఖ్యమంత్రులు తమ పదవులను త్యాగంచేసి కేంద్ర మంత్రులయ్యారు. రాజీవ్‌ లేకపోయినా ఇది సోనియా జమానా! ఇప్పుడూ త్యాగాలకూ విలువ ఎందుకు తగ్గుతుంది? కాంగ్రెస్‌వారి పుణ్యమా అని త్యాగాల ప్రక్రియ అలా వర్ధిల్లుతూనే ఉంటుంది. జనం కడుపు నిండడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి?

(శంభు వ్యాసం, ఈనాడు ప్రచురణ)

ఒక స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: