ఈ భూమి ఎవడిదిరా?

చెట్టుమీదనుంచి పండు కింద పడగానే భూమికి ఏదో ఆకర్షణశక్తి ఉందని న్యూటన్‌ మహాశయుడు కనుగొన్నాడని సైన్సు పాఠాలు చెబుతుంటాయి. ఆయనో గొప్ప శాస్త్రవేత్తని ఎంతో కాలం నుంచి కొనియాడుతున్నారు. ఇది సైన్సుకు చెల్లుతుందేమోగానీ పొలిటికల్‌ సైన్సుకు చెల్లదు. భూమి ఆకర్షణ ఏదయినా పైనుంచి కిందికి వస్తేగానీ తెలియదు. కానీ- ధర కింది నుంచి పైకి వెళితేనే తెలుస్తుంది. న్యూటన్‌ కనిపెట్టిన దానికన్నా ‘ఫలప్రద’మవుతుంది. ఈ సరికొత్త పుణ్యం కట్టుకున్నవారు కాంగ్రెస్‌ నాయకులే. ఆ ఖ్యాతి వాళ్లకే దక్కాలి. లేకపోతే చరిత్రకు అన్యాయం జరుగుతుంది.

భూమేరా అన్నిటికీ మూలం
భూమి విలువ తెలుసుకొనుట నేతల ధర్మం

అని ‘హస్త’ కళాకారులు పాడుతుంటే ఎంత గజకర్ణ గో’కర్ణప్రేమం’గా ఉంటున్నది!

‘అఖి’ల్యాండ్‌ ‘ఈశ్వరి పాలయ మాం’ అని పాలకపక్షం వారు గానం చేస్తుంటే ఎంత భూభక్తి గోచరిస్తున్నది. దానిని భూమ్యాకర్షణ శక్తి అనుకున్నా, ‘బూమ్‌’ ఆకర్షణ శక్తి అనుకున్నా ఎవరయినా కృతజ్ఞులుగా ఉండవలసిన పవిత్ర బాధ్యత ఉంటుంది! పైగా దోషులుగా చిత్రించి ఒంటికాలిమీద లేవడమా? ఇట్లా చేస్తే వచ్చే జన్మలోనైనా హైదరాబాద్‌ శివార్లలో ఒక్క గజం స్థలమైనా దక్కుతుందా? కనీసం నిలువనీడ అయినా ఉంటుందా? అయ్యో ‘పాపం’ అనుకోరేం! భూమి విలువ పెంచుతున్నప్పుడు ఎవరయినా అడ్డుకుంటే భూమాత ఎంత విలపిస్తుందో ఆలోచించరేం? భూమి విలువను పెంచడానికి ఎంత ‘చే’యూతనిచ్చారో గుర్తించరేం? అడుగులోన అడుగువేసి ఎంత పరుగుతీస్తున్నారో చూసి పిడుగు వేస్తే ఎలా? సొంత కాళ్లమీద నిలబడాలంటే భూమి అవసరమా? కాదా? భూమి మీద దుమారం లేపడమంటే కాలు గుంజి కిందపడేయడమే కదా! అది భూమి మీద భారం పెంచడమే కదా!

భూమి విలువను పెంచడానికి ఎన్ని ఇక్కట్లు! నానా అవస్థలుపడి ఏ ఔటర్‌రింగ్‌ రోడ్డో అలైన్‌మెంట్లు మార్చి మార్చి కాస్త భూమి ‘కూడు’ గట్టుకుంటే ఎంత గొడవ? కోట్లు మూటలు కట్టుకుంటున్నారహో అంటూ ‘కోటలు’ బీటలు వారేట్టు మాటలు మాట్లాడతారా! పోనీ ప్రజాస్వామ్యంమీద ‘దయతలచి’ అనవసరమైన ఉసురు తగలడమెందుకులే అనుకుని మన భూములు ఉన్నచోటే మంచి మంచి సంస్థలను తెచ్చుకుందామన్నా మెటికలు విరుస్తున్నారు. అంతేతప్ప ఎక్కడో చోట భూముల ధరలు పెరుగుతున్నాయిలే అనుకోరేం? ఉదాహరణకు ఐ.ఐ.టి.ని మెతుకుసీమకు తెస్తే సరస్వతి పక్కన ఆ సంస్థను పెట్టమంటారేం? అంటారెందుకు? ‘సరస్వతి’ పక్కన లక్ష్మి నిలవదనే సామెతను గుర్తుచేసుకోరేం? జ్ఞానికి బాసర అయితేనేం కీసర అయితేనేం? తత్వం తలకెక్కించుకుంటే సమస్యేమీ ఉండదు.

ఎంత జ్ఞానం సంపాదించుకుంటే మాత్రం సాధించేదేముంది? మంచి విద్యాగంధం ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం ఉంటే మంచిగా డబ్బు వస్తుంది! ఆ డబ్బుతో భూములు కొనాలి. అంతేగా! దానికి ఇంత ప్రయాస అవసరమా? మేడ్‌ డిఫికల్టు విద్య ఎందుకు? చదువుల సారమెల్ల చదవడానికి చెప్పాల్సిన పద్ధతి ఇదేనా? అందువల్ల భూపరిజ్ఞానాన్ని పిల్లలకు నూరిపోయడానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి అధికార (పార్టీ) భాషలో పాఠాలు చెప్పాలి. ప్రాక్టికల్స్‌ను ‘థీరి’గా చేయించగలిగిన చేయి తిరిగినవారి సేవలను ఇందుకోసం ఉపయోగించుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు తేరగా ఉన్నాయి? ఎక్కడెక్కడ చక్కగా ఆక్రమించుకోవచ్చు! అవసరమైతే అడవులు, కొండలు, నదీనదాలూ, ఎడారులా మనకడ్డంకి అంటూ శ్రీశ్రీ మాటలను కూడా వాడుకుని కొండ గుర్తులు చెప్పి బల్లలను ముందుకు తోస్తే వారు బాగుపడతారు. చేతివాటం అనగానేమి అనే విషయంలో భావిభారత పౌరులకు ‘దశానిర్దేశం’ చేయాలి. నేల విడిచి ‘స్కాము’ చేయడం సాధ్యం కాదన్న విషయం ‘అభివృద్ధి’ నిరోధకులకు ‘తోటతెల్లం’ చేయాలి. భూమికి అతుక్కుపోయే విద్యను ‘స్కూలంకషం’గా చెప్పడానికి ఊరూరా ‘జిగురు’కులాలు స్థాపించాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకంకింద ఎటువంటి భూములను ఎలా గుటుక్కున మింగేయవచ్చో అనుభవజ్ఞులచేత చెప్పించవచ్చు. ఎవరైనా ఛాదస్తులు రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు లేకుండా ఎలా చేస్తారు అని అభాండాలు వేస్తే బాలకృష్ణుడు నోరు తెరిచి 14 భువనభాండాలు చూపించాడు. వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా అని దబాయించాలి. అంతేకాదు.

పాలసంద్రమందు పవ్వళించెడు వాడు
గొల్ల ఇండ్లపాలు కోరనేల?
‘ అని (వే)మన పద్యం చెప్పి ‘పరుల సొమ్ముమీద ఎల్లవారికి ప్రీతి ఉంటుందని అందులోని తీపి అనితర సాధ్యమని ‘ఊరి’స్తూ చెప్పాలి. ఇటువంటి విషయాలన్నింటితో ‘భక్తి-భుక్తి’ పేరుతో సిలబస్‌ రూపొందించాలి. మనిషి పుట్టేది భూమిమీదనే, చనిపోయినా కలిసేది భూమిలోనే కాబట్టి ఆ భూమిని ఎలా సంపాదించుకున్నా తప్పులేదన్న నీతిబోధలు చేయాలి. ఇందుకోసం ”సుత్తి ముక్తావళి’ రూపొందించాలి. ‘నేత బీరకాయలు’ అనే శీర్షిక కింద అడ్డగోలుగానయినా గోలు సాధించిన మహానుభావుల జీవిత చరిత్రలను సోదాహరణంగా చెప్పాలి. వారిలోనుంచే ఈ యూనివర్సిటీ ‘వైస్‌’ ఛాన్సెలర్‌ను ఎంపికచేసుకుంటే సమర్థతకు తగిన గుర్తింపునిచ్చినట్టు అవుతుంది. కొత్త విశ్వవిద్యాలయం తరఫున సూదిమొన మోపినంత స్థలం కూడా పాండవులకు ఇవ్వనన్న దుర్యోధనుడి పేరుతో ‘కౌరవ డాక్టరేట్‌లు, కబ్జాకళాప్రపూర్ణ, కబ్జాశ్రీ, కబ్జారత్న, కబ్జా భూషణ వంటి బిరుదులూ ప్రదానం చేయవచ్చు. కొత్త యూనివర్సిటీకి భవనాలు ఎట్లా అనే దిగులు అక్కర్లేదు. విద్యార్థులు లేని కారణంగా రానురాను ప్రభుత్వ కళాశాలలను మూతవేసేస్తారని వార్తలు వస్తున్నాయి. భూమి రుణం తీర్చుకోవడానికి ఆ భవనాలను ఈ యూనివర్సిటీకి వినియోగించుకోవచ్చు. దీనిని ‘జాతీయం’ (చేసే) పథకం కింద చేపట్టాలి. ‘భారతీయులే పేదవారు… భారతదేశం పేదది కాదు’ అనే మాట మనకు తెలుసు. ఈ పేదరికం ఎందుకొచ్చింది? ‘భూమిలేకనేగా’. కాబట్టి ఆ భూమి ఎలాగైనా ‘చేతి’కొచ్చేట్టు చేస్తే సరి!

వెనకటికి ఆరుద్ర ఆ’రుద్ర’ భూములన్నీ నావి అన్నారు. ‘ఆయనకొక్క సెంటు పొలమైనను లేదట రుద్రభూమిలో కాయము సేయగా బడిన కాశ్యపి మూరలమేరతప్ప’ అని పల్నాటి కవులు భూమిలేక లబలబలాడారు. ఇంకా ‘శ్మశానాలు కనబడుతాయంటే ఎంత అవమానకరం. అవి కూడా కళకళలాడాలంటే కబ్జాచేసి తీరవలసిందే’ అని నాయకశిఖామణులు చెబుతుంటే ‘చచ్చినట్టు’ నమ్మవలసిందే. ఎలాంటి భూమి అయినా విలువ పెంచుకోవలసిందే.
(శంకరనారాయణ వ్యాసం, ఈనాడు ప్రచురణ)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: