న్యూ ఇయర్‌ స్పెషల్‌

కలలోనే ఒక మెలకువగా…

ఎప్పట్లాగే వైఎస్‌ క్రిస్మస్‌ సెలవులకి కుటుంబ సమేతంగా ఇడుపులపాయ ఎస్టేట్‌కి బయల్దేరి వెళ్ళాడు. రాత్రికి ఎస్టేట్‌లోని గెస్ట్‌ హౌస్‌లోనే బసచేసి, మర్నాడు పొద్దున్నే యథాప్రకారం ఎస్టేట్‌లోకి మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు, ఎస్టేట్‌ మేనేజరు, సిబ్బంది అందరూ ఆయన్ని అనుసరించారు.

ఎప్పుడు ఎస్టేట్‌లోకి వాకింగ్‌కి వెళ్ళినా మీడియాని పిలిచి, కుటుంబ సభ్యులతో రకరకాల ఫోటోలు దిగే అలవాటున్న వైఎస్‌ ఈసారి వాళ్ళని వెలేశాడు. మీడియా వాళ్ళు వస్తే లోపలికి రానివ్వద్దంటూ సెక్యూరిటీ సిబ్బందికి ముందే ఆజ్ఞలు జారీ చేశాడు.
వాకింగ్‌ చేస్తూ, చేస్తూ మొక్కల గురించీ, చెట్ల గురించీ, వాటి బాగోగుల గురించీ ఆరా తీసే వైఎస్‌ ఈసారి ఆ పని కూడా చెయ్యలేదు.
“ఏమయ్యా! వీటికి నీళ్ళు పోయడం లేదా? ఇలా ఎండిపోయాయి? దీనికేం ఎరువు వేస్తున్నారు? .. అది కాదు … ఆ ఎరువు మార్చి ఈ ఎరువు వెయ్యండి …” అంటూ గలగలా మాట్లాడుతూ తిరిగే వైఎస్‌ ఈసారి యమా సీరియస్‌గా చుట్టూ చూస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టు తిరుగుతున్నాడు. వైఎస్‌ అలా కాలుగాలిన పిల్లిలా ఎందుకు తిరుగుతున్నాడో మిగతా వాళ్ళకి అర్థంకాక బుర్ర గోక్కున్నారు.
వైఎస్‌కి దూరంగా మట్టి పని చేస్తున్న కూలీలు కనిపించారు. వైఎస్‌ ఉలిక్కిపడి, ‘మేనేజర్‌!’ అంటూ గావుకేక పెట్టాడు. మేనేజర్‌ పరిగెత్తుకొచ్చాడు.
“ఏమయ్యా! వీళ్ళంతా మన వాళ్ళేనా?” గాభరాగా అడిగాడు వైఎస్‌.
“అంతా మన వాళ్ళేసార్‌! వాళ్ళలో ప్రతి ఒక్కడూ నాకు పెర్సనల్‌గా తెలుసు …” అన్నారు మేనేజర్‌.
వైఎస్‌ కొంచెం కుదుటపడి అన్నాడు.

“మరేం లేదు … ఈ మీడియా వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఏ వేషంలో లోపలికి దూరి ఫోటోలు తీస్తారో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు. మొన్న హెలికాప్టర్‌లో వచ్చి, చక్కర్లు కొడుతూ కావల్సిన ఫోటోలన్నీ తీసుకు పోలేదూ?”
మేనేజర్‌ చేతులు నులుముకున్నాడు. “సారీసార్‌! మన తెలుగు పేపర్ల వాళ్ళు మరీ అంత ఎత్తుకి ఎదిగి పోతారనుకోలేదు. అయినా వాళ్ళ మొహం లెండి … ఏవో పిచ్చిపిచ్చి ఫోటోలు తీశారు గానీ తీయాల్సిన అసలు ఫోటోలు తియ్యనే లేదు” అనేసి నాలిక్కర్చుకున్నాడు.
వైఎస్‌ చిరాగ్గా చూసి, ‘ఎందుకైనా మంచిది … ఓ సారి వాళ్ళని చూసొద్దాం!” అంటూ కూలీల దగ్గరికి వెళ్ళాడు. ఆయాసంతో రొప్పుతూ, చెమటలు కక్కుతూ, మాసిపోయిన గడ్డాలతో ఉన్న ఆ కూలీలు వైఎస్‌ కళ్ళకి జర్నలిస్టుల్లాగే కనిపించారు. వాళ్ళని నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశాడు. వాళ్ళ చేతుల్లో ఉన్న పారల్నీ, గునపాల్నీ తిప్పి తిప్పి చూసి, వాటిలో ఏ దొంగ కెమెరాల్లేవని నిర్ధారించుకుని సంతృప్తిపడ్డాడు.
“మేనేజర్‌! ఇక మీదట మనం ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఈ మీడియా వాళ్ళ సంగతి నీకు తెలీదు. వాళ్ళ దగ్గర చిన్న చిన్న కెమేరాలు ఉంటాయి. ఏ కుక్కకో, పిల్లికో మెళ్ళో బెల్టు కట్టి, ఆ బెల్టులో కెమెరాలు పెట్టి, మన ఎస్టేట్‌లోకి పంపినా పంపేస్తారు … బీ కేర్‌ ఫుల్‌” ఉపదేశించాడు వైఎస్‌. బాస్‌ తెలివితేటలకి, ముందు చూపుకీ మేనేజర్‌ ముగ్ధుడై పోయాడు.

ఇంతలో ఓ కూలీ పరిగెత్తుకు వచ్చి మేనేజర్‌ చెవిలో ఏదో గొణిగాడు. మేనేజర్‌ కలవరపడ్డాడు. గబగబా వైఎస్‌ దగ్గరికి వచ్చి, “సార్‌! అక్కడ తవ్వుతుంటే, గునపాలకి ఏదో ఖణ్‌ఖణ్‌మని తగులుతోందట” గుసగుసగా చెప్పారు. వైఎస్‌ మొహంలో రంగులు మారాయి. గబగబా అటువైపు నడిచాడు.
అక్కడ కూలీలు పనులాపేసి, నేలవైపు భయంగా చూస్తూ నిలబడి ఉన్నారు. ‘అలా దిష్టి బొమ్మల్లా నించుంటారేం? జాగ్రత్తగా తవ్వండి” వైఎస్‌ ఆజ్ఞాపించాడు.
కూలీలు తవ్వడం మొదలుపెట్టారు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం … అందరి మొహాల్లో సస్పెన్స్‌ .. గునపం తగిలినప్పుడల్లా ఠంగ్‌ …ఠంగ్‌మని శబ్దం వస్తోంది. కూలీలు తవ్వడం ఆపి, చేతుల్తో మట్టి తొలగించారు. అందరి కళ్ళు పెద్దవయ్యాయి. వెన్నుపూసలో మంచుముక్క పెట్టినట్టు వణికారందరూ.
అక్కడో పాత ట్రంకు పెట్టె … తాళం వేసిన పెట్టె … కనిపించింది.
“సార్‌! నక్సలైట్లు పెట్టిన మందుపాతరలా ఉంది. బాంబ్‌ స్క్వాడ్‌ని పిలుద్దామా!” మేనేజర్‌ కీచుమంటూ అరిచాడు.
వైఎస్‌ పరిశీలనగా ఆ పెట్టెని చూశాడు. “ఊహూ … మందుపాతర ఇలా ఉండదు. ఏమైనా నిధినిక్షేపాలు ఉండొచ్చు. భూమిలోపల దొరికింది కాబట్టి రూలు ప్రకారం దీన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వం అంటే నేనే కాబట్టి దీన్ని మన గెస్ట్‌ హవుస్‌కి తరలించండి … క్విక్‌!” అంటూ ఆదేశాలు జారీ చేశాడు.

***
కూలీలు ఆ ట్రంకు పెట్టెని జాగ్రత్తగా వైఎస్‌ గదిలో టేబిల్‌ మీద పెట్టారు. వైఎస్‌ అందర్నీ బయటికి పంపేసి, తలుపులు బిగించుకుని, పెట్టెకోమారు దండం పెట్టి, తాళం కప్ప విరగ్గొట్టే పని మొదలుపెట్టాడు. ఒకటి రెండు సుత్తి దెబ్బలు పడేసరికి తాళం కప్ప ముక్కలైంది. వైఎస్‌ ఊపిరి బిగపట్టి పెట్టె మూత తెరిచాడు.
అందులో … రాజుల కాలంనాటి నగిషీలు చెక్కి ఉన్న ఓ పేటిక, పక్కనే ఓ ఉత్తరం కనిపించాయి. వైఎస్‌ ఆసక్తిగా ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులో ఇలా ఉంది.
“ఈ పెట్టెను కనుగొన్న వారు ధన్యులు. ఈ పెట్టెలో ఉన్న పేటిక సామాన్యమైనది కాదు. ఇది విజయా వారు నిర్మించిన ‘మాయాబజార్‌’ చిత్రంలో మీరందరూ చూసిన ‘ప్రియదర్శిని’ పేటిక. ఈ పేటికని తెరిచి చూసిన వారికి అందులోని మాయాదర్పణంలో వారికి ఇష్టమైన వ్యక్తి లేదా వారు కోరుకుంటున్న వస్తువులు కనిపిస్తాయి. దీన్ని తెరిచేముందు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఇది సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే పని చేస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త … విజయీభవ!”
వైఎస్‌కి ‘మాయాబజార్‌’లోని ‘ప్రియదర్శిని’ సన్నివేశం గుర్తుకొచ్చి ఆనందంతో చప్పట్లు కొట్టాడు. గబగబా పేటిక తెరవబోయి ఆగాడు. “ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే పని చేస్తుంది” అన్న మాటలు గుర్తొచ్చాయి. వైఎస్‌ పెట్టె మూసేసి ఆలోచిస్తూ నిలబడ్డాడు. చటుక్కున బుర్రలో ఓ బల్బు వెలిగింది. వెంటనే ఆప్తమిత్రుడు కేవీపీకి ఫోన్‌చేసి, పెట్టె దొరికిన విషయం టూకీగా చెప్పి, తన కొచ్చిన ఆలోచనని వివరించాడు.

“ఈ డిసెంబర్‌ 31 రాత్రి మన ఎస్టేట్‌లో గ్రాండ్‌గా ఓ పార్టీ అరేంజ్‌ చేద్దాం. దానికి మన మంత్రుల్నీ, ప్రతిపక్ష నాయకుల్నీ, అధికారుల్నీ, అందర్నీ ఆహ్వానిద్దాం … ఎలాగూ ప్రతిపక్షాల వారు ఎస్టేట్‌కి వస్తే ఓ పూట భోజనం పెడతానని మాటిచ్చాను కదా! ప్రియదర్శిని పేటిక విషయం అప్పుడే చెప్పొద్దు … అందరూ వచ్చాక, ఒక్కొక్కర్నీ పేటిక తెరిచి చూడమందాం! అందర్నీ ఓ ఆటాడిద్దాం! ఎలా ఉంది అయిడియా!”
భేషుగ్గా ఉందన్నాడు కేవీపీ. వైఎస్‌ వెంటనే తన ఆలోచనని ఆచరణలోకి పెట్టాడు. అందరికీ స్వయంగా తానే ఫోన్లు చేసి, 31 రాత్రి విందుకు ఆహ్వానించాడు. రాజకీయాలు పక్కన పెట్టి, అందరూ ఉల్లాసంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుదామంటూ ప్రతిపాదించాడు. వస్తే మీకో తమాషా చూపిస్తానంటూ ఊరించాడు. ‘ఇదేదో వెరైటీగా ఉందే’ అనుకుని అందరూ విందుకు రావడానికి అంగీకరించారు.

***
డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి రానే వచ్చింది. వైఎస్‌ ఎస్టేట్‌ రంగురంగుల విద్యుద్దీప కాంతులతో పట్టపగలులా వెలిగిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు, అధికారులతో ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది. సాక్షాత్తూ రాష్ట్ర శాసన సభ అక్కడ కొలువుతీరి ఉందా అని అనిపించింది అందరికీ.
అందరూ చాలాసేపు ముచ్చట్లాడుకుని, విందుభోజనానికి లేచారు. వైఎస్‌ అందరికీ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించాడు.
“ఇంతకీ ఏదో తమాషా చూపిస్తానన్నారు … ఇంకా చూపించరేం” అడిగారంతా. భోజనాలయ్యాక చూపిస్తానన్నాడు వైఎస్‌. అందరిలో ఆసక్తి అధికమైంది. రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బహుశా ఎస్టేట్‌ భూముల గురించే ఏదో చూపిస్తాడని అందరూ భావించారు.
భోజనాలయ్యాక, వైఎస్‌ వేదిక పైకెక్కి మైకు అందుకున్నాడు. “మిత్రులారా! నా ఆహ్వానాన్ని మన్నించి, నా ఎస్టేట్‌కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు … నూతన సంవత్సర శుభాకాంక్షలు … మీ అందరికీ ఓ తమాషా చూపిస్తానన్నానుగా … ఇప్పుడు మీరు అదే చూడబోతున్నారు …”
అందరూ పిన్‌డ్రాప్‌ సైలంటుగా వింటున్నారు.

“అదిగో, ఆ టేబిల్‌ మీద ఉన్న పేటిక చూశారుగా! అది మాయాబజార్‌ సినిమాలో మనం చూసిన ప్రియదర్శిని పేటిక. ఈ పేటిక తెరిచి చూసిన వారికి అందులోని అద్దంలో వారికి ఇష్టమైన వారు కనిపిస్తారు. ఆ దృశ్యాన్ని అందరూ చూడడానికి వీలుగా … ఇక్కడో పెద్ద ్రస్కీన్‌ను అమర్చి, పేటికకి కనెక్షన్‌ ఇచ్చాం … ఆ దృశ్యం ఆ ్రస్కీన్‌మీద కూడా కనిపిస్తుంది. అతిథులందరూ ఒక్కొక్కరే వచ్చి, పేటికని తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాను. ముందు ఎవరొస్తారో చెప్పండి” అంటూ వైఎస్‌ చంద్రబాబు వైపు చూశాడు.

చంద్రబాబు గడ్డం గోక్కున్నాడు. “ఇటువంటి చిత్రమైన వస్తువులు ప్రపంచంలో ఇంకా ఉన్నాయన్న మాట. ఇంతకీ నిజమేనంటారా?” అన్నాడు పక్కనే ఉన్న ఎమ్మెస్‌తో.
“చాలా ఉబలాటపడుతున్నట్టున్నావు … ముందు నువ్వే చూడు” అన్నాడు ఎమ్మెస్‌.
‘సరే, మీరు కూడా రండి’ అన్నాడు చంద్రబాబు, ఇద్దరూ వేదిక మీదికి నడిచారు.
“చంద్రబాబుకి ఎవరు కనిపిస్తారో చెప్పుకోండి, చూద్దాం” అన్నాడు ఎమ్మెస్‌ సభని ఉద్దేశించి.
‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ అరిచారెవరో. ‘కాదు, థర్డ్‌ ఫ్రంట్‌’ అన్నారింకెవరో.
‘అదేమీ కాదు … వైఎస్‌ కనిపిస్తాడు. కావాలంటే పందెం” అన్నాడు ఎమ్మెస్‌. చంద్రబాబు ఎమ్మెస్‌ వైపు కోపంగా చూసి, పేటిక తెరిచాడు. పేటికలోని దర్పణంలో ముఖ్యమంత్రి కార్యాలయం, సిఎం కుర్చీ కనిపించి, బాబుకి మతిపోయినంత పనైంది.
“ఆహా … ఓహో .. ఖరీదైన సోఫాసెట్లు … కళ్ళు చెదిరే టేబిళ్ళు, కుర్చీలు, డెకరేషన్లు … అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది … ఇదంతా ఏమిటండీ” పరవశంగా అన్నాడు చంద్రబాబు.

“ఏమిటీ అంటే, నీకు ప్రియమైనది ముఖ్యమంత్రి పదవి అన్నమాట” తేల్చేశాడు ఎమ్మెస్‌.
“నాకేం అటువంటి ఆశల్లేవు … మీరు నా పక్కనే ఉన్నారుగా .. మీరు కోరుకున్నది నాక్కనిపించిందో ఏమో … ఇప్పుడు మీరు చూడండి, మీకేం కనిపిస్తుందో చూసి, ఒప్పుకోవల్సి వస్తే ఒప్పుకుంటాను” ఈసడింపుగా అన్నాడు చంద్రబాబు.
“సరే, నీ కోసం చూస్తున్నాను” అంటూ ఎమ్మెస్‌ పేటిక తెరిచాడు. అందులో రాజ్‌భవన్‌ కనిపించింది. కరెంటు సమస్య మీద చంద్రబాబు, తదితర ప్రతిపక్ష నాయకులు ఇస్తున్న వినతిపత్రాన్ని గవర్నర్‌ హోదాలో ఎమ్మెస్‌ స్వీకరిస్తూ కనిపించాడు. “డోంట్‌ వర్రీ, వైఎస్‌ సర్కార్ని డిస్మిస్‌ చేసేస్తా” అంటూ ఎమ్మెస్‌ వారికి అభయం ఇవ్వడం కూడా కనిపించింది.

“అంటే, మీకు గవర్నర్‌ కావాలని ఉందన్నమాట” వ్యాఖ్యానించాడు వైఎస్‌.
“అందులో ఆశ్చర్యమేముంది? నేను గవర్నర్‌ పదవిని కోరుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేగా!” ఆనందంగా అన్నాడు ఎమ్మెస్‌.
వైఎస్‌ పిలవడంతో కేసీఆర్‌ వేదిక ఎక్కి పేటిక తెరిచి చూశాడు. అందులో ఎమ్మెస్‌ కనిపించాడు. కేసీఆర్‌ భక్తిగా నమస్కరించాడు.
“మీకు ఎమ్మెస్‌ కనిపించాడేమిటి? చిత్రంగా ఉందే!” విస్తుపోయాడు చంద్రబాబు.
“చిత్రమేముంది? కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా చేశాక, గోళ్ళు గిల్లుకుంటూ ఏం చేయాలో తోచని నాకు, దమ్ముంటే ఎంపీ సీటుకి రిజైన్‌ చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఛాలెంజ్‌ చేసింది ఎమ్మెస్‌ కాదా! ఆయన పుణ్యమాని నేను రెండు లక్షల రికార్డు మెజారిటీతో గెలవడం, తెలంగాణ ఉద్యమానికి ఇంత ఊపు రావడం జరిగాయి. అందుకే నాకు ఎమ్మెస్‌ అంటే ఎంతో ఇష్టం” వివరించాడు కేసీఆర్‌.
“ఇప్పుడెవరొస్తారో, రండి” అంటూ అందర్నీ చూశాడు వైఎస్‌. “ఇదేదో యమా డేంజర్‌ వ్యవహారంలా ఉందే” అనుకుంటూ ఎవరికి వారే వెనక్కి తగ్గారు.
“ఏమిటి? ఎవరూ రారా? భయపడుతున్నారా? ‘సూదికోసం సోదికి పోతే’ అనే సామెత గుర్తొస్తోందా?” కవ్వించాడు వైఎస్‌.
“మమ్మల్ని పిలవడం కాదు … అసలు ముందు మీరే చూసి ఉండాల్సింది … అవునవును … మీరే చూడాలి … మీరే చూడాలి …” సభలో అందరూ గోలగోలగా అరిచారు.

“అవును .. మీరే చూడండి వైఎస్‌ గారూ! ఎవరు కనిపిస్తారో, ఏమిటో?” అన్నాడు ఎమ్మెస్‌.
“అందరికీ తెలిసిన విషయమేగా! నాకు సోనియాగాంధీ కనిపిస్తుంది … లేదా ఇందిరమ్మ … ఇక వేరే చూడాలా?” నవ్వుతూ అన్నాడు వైఎస్‌.
“ఈ మాత్రానికే కేవీపీ ఏమీ అనుకోడు గానీ … చూడవయ్యా నాయనా!” చనువుగా అన్నాడు చంద్రబాబు.
“సరే … నా కెవరు కనిపించినా మీరెవరూ మూర్ఛపోరాదు. నాకు ప్రియులెవరో, అప్రియులెవరో నాకే తెలియదుగా మరి!” అంటూ వైఎస్‌ పేటిక తెరవబోతూ, ఆగి, సభని ఓ సారి కలయజూశాడు.

సభలో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. గాలి స్తంభించి పోయింది. ఆకులు కదలడం మానేశాయి. అందరూ ఊపిరి బిగపట్టి, రెప్పవాల్చకుండా స్క్రీన్‌ వైపే చూస్తున్నారు.
వైఎస్‌ చిద్విలాసంగా పేటిక మూత తీసి దర్పణంలోకి చూశాడు.
అందులో …
రెండు పత్రికలు కనిపించాయి.

(రాజగోపాల్ రచన)

ప్రకటనలు

One thought on “న్యూ ఇయర్‌ స్పెషల్‌

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s