కౌన్ బనేగా కిరోసినీశ్వరుడు

“నాయనలారా… నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానము చెప్పుడి…”
“అటులనే”

“2006 తరవాత ఏమి వచ్చును?”
“2007 వచ్చును”

“కరెక్ట్‌ ఆన్సర్‌! మీరో కొవ్వత్తి గెలుచుకున్నారు. బైదిబై… ఇంత టఫ్‌ ప్రశ్నకి అంత ఈజీ సమాధానం చెప్పావంటే… నాకు భలే ముచ్చటేస్తోంది. నా పదహారో ఏడు వరకు నా పేరు కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయే వాణ్ణి. కాబట్టి… మీరింత చిన్న వయసులో ఎంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పినా నాకు పిచ్చిపిచ్చిగా ఆనందం కలుగుతుంది. వెర్రివెర్రిగా ఆశ్చర్యం వేస్తుంది.

తరవాతి ప్రశ్నలు చాలా కష్టం… రెడీ అయ్‌ ఉండండి… ఈసారి నేను వరసగా పది ప్రశ్నలు అడుగుతాను. ఠకీఠకీమని సమాధానం చెప్పాలి.”

“ఓకే. మేం రెడీ”

“దానము వల్ల ఏమి పుట్టును…?”
“పుణ్యము పుట్టును”

“వాగ్దానము వల్ల ఏమి పుట్టును?”
“అధికారము పుట్టును”

“వాగ్దానము తప్పినచో ఏమి పుట్టును?”
“ఆందోళన పుట్టును”

“ఆందోళన ఎవరికి పుట్టును?”
“అధికారమున ఉన్నవారికి పుట్టును”

“ఆందోళన ఎవరివల్ల పుట్టును?”
“ప్రజాగ్రహము వల్ల పుట్టును”

“ప్రజాగ్రహము ఎందులకు పుట్టును?”
“విద్యుత్తు ధర్మమును వీడినందులకు పుట్టును”

“ఉచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“ఉచితముగా అధికారము పుట్టును”

“అనుచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“రైతుల గుండెలయందు మంట పుట్టును”

“మంట వల్ల ప్రభుత్వమునకు ఏమి పుట్టును?”
“సెగ పుట్టును”

“ఇప్పుడు ప్రభుత్వమునకు ఏమి ఆలోచన పుట్టును?”
“చేతులెత్తు ఆలోచనలు మెండుగా పుట్టును”

“ఓ సెభాష్‌. మీరు రెండు టార్చి లైట్లు, ఒక చార్జింగ్‌ లాంతర్‌ గెలుచుకున్నారు. తరవాతి రౌండ్‌లోకి వెళ్ళేముందు… కాసేపు కరెంట్‌ కట్‌”

* * *

“ఈ రౌండ్‌లో ప్రతి ప్రశ్నకి నాలుగు సమాధానాలుంటాయి. మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేమని చేతులెత్తేస్తే అప్పుడు అంతవరకు గెలుచుకున్న బహుమతులతో మీరు ఇంటికి వెళ్ళవచ్చు. అలా కాకుండా తప్పు సమాధానం చెబితే అంతవరకు గెలుచుకున్న బహుమతులు కూడా మాకిచ్చేయాలి. సరేనా…”

“ఓకే”

“మాకు అధికారమిస్తే మరొక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూస్తామన్నదెవరు?
ఎ) చంద్రబాబునాయుడు; బి)బి.వి.రాఘవులు; సి)సురవరం సుధాకర్‌రెడ్డి; డి) వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి.

బాగా ఆలోచించి చెప్పండి…
“చంద్రబాబు నాయుడు”

“బాగా ఆలోచించండి…”
“రాజశేఖర్‌రెడ్డి…?”

“కరెక్ట్‌ ఆన్సర్‌! మీరు మూడు నెలలు కరెంటు కోసేసినా చదువుకోడానికి లొల్లాయ్‌బుడ్డికి కావాల్సిన కిరోసిన్‌ గెలుచుకున్నారు. తరవాతి ప్రశ్న…”

“ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిందెవరు?”
ఎ) ఇందిరమ్మ; బి) సోనియాగాంధీ; సి) వై.ఎస్‌.; డి) చంద్రబాబునాయుడు.”

‘ఇందిరమ్మ”

“బాగా ఆలోచించండి… అవసరమైతే మీ ఫ్రెండ్‌ సహాయం తీసుకోండి…”

“అవసరం లేదు. గుప్తుల రాజ్యాన్ని గుప్తులు, శాతవాహనుల రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇందిరమ్మే స్థాపించాలి. అదే రైటాన్సర్‌ అంకుల్‌”

“నీ స్థానంలో నేనున్నా అలాగే చెప్పేవాణ్ణి. కానీ నాదగ్గర కంప్యూటర్‌లో సరైన ఆన్సర్‌ నాకు కనిపిస్తోంది. నీకు కనిపించడంలేదు కాబట్టి నువ్వు తప్పు చెబుతున్నావ్‌. కరెక్టాన్సర్‌ చెప్పు. లేదంటే నువ్వు గెలుచుకున్న లొల్లాయ్‌బుడ్డి కిరోసిన్‌ను కూడా నువ్‌ కోల్పోతావ్‌. లేదంటే చేతులెత్తేస్తే… కిరోసిన్‌ డబ్బా పుచ్చుకుని చెక్కేయొచ్చు… ఏం చేద్దామంటావ్‌…”

“… … … … … …”

“కరెంటు పోయే టైమయింది తొందరగా చెప్పు…”

“వై.ఎస్‌….?”

“కరెక్టాన్సర్‌… నువ్వు సోలార్‌ లైటు గెలుచుకున్నావ్‌”

“తరవాతి ప్రశ్నకు వెళ్ళేముందు… ఈ ప్రశ్నకు జవాబు అంత కరెక్టుగా ఎలా చెప్పావో చెప్పు”

“తెలియదంకుల్‌… ఏదో అలా అనిపించింది… అంతే!”

“దటీజ్‌ద బెస్టాన్సర్‌… మరి తరవాతి ప్రశ్న…

హరితాంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామన్నదెవరు?

ఎ) చంద్రబాబునాయుడు; బి) వెంకయ్యనాయుడు; సి) కేసీఆర్‌; డి) వై.ఎస్‌.”

“వై.ఎస్‌.”

“బాగా ఆలోచించుకో…”

“ఆలోచించనక్కర్లేదంకుల్‌. ఇలాంటివన్నీ చేస్తానని చెప్పింది ఆయనేనని అర్థమైపోయింది. కాబట్టి దీని ఆన్సరూ వైయస్సే.”

“కరెక్ట్‌. మీరు ఓ సోలార్‌ వాటర్‌ హీటర్‌ను గెలుచుకున్నారు. చివరి ప్రశ్నకు కూడా సమాధానం చెబితే ఏకంగా సోలార్‌ ‘సిస్టమ్‌’నే గెలుచుకోవచ్చు…

చివరి ప్రశ్న…

రైతులకు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రోజుకు ఎన్నిగంటలు విద్యుత్తు సరఫరా చేస్తోంది?

ఎ) 24గంటలు; బి) 18గంటలు; సి) తొమ్మిది గంటలు; డి) సమాధానం చెప్పలేం”

“18గంటలు”

“బాగా ఆలోచించి చెప్పాలి. చివరి సమాధానం…”

“… … … … … …”

“సోలార్‌ వాటర్‌ హీటర్‌ తీసుకుని వెళ్ళిపోతావా… సమాధానం చెబుతావా?”

“తొమ్మిది గంటలు…”

“సారీ బాబూ… దటీజ్‌ రాంగాన్సర్‌. పొలాలకు కచ్చితంగా ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారో… సమాధానం చెప్పలేం. నువ్వు కూడా రైతు మాదిరిగానే ఈ గేమ్‌లో అన్నీ పోగొట్టుకున్నావ్‌. అలాగని రైతులా ఆందోళన పడకు… రాజశేఖర్‌రెడ్డిలా బతకడం నేర్చుకో!”
(జి.వేణు వ్యాసం)

ఒక స్పందన

  1. ha haa super chalaa bagaa cheparu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: