చట్టానికి పనెక్కువవుతోంది!

‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని దివంగత ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు అనేవారు. అది పి.వి. అంటే గిట్టని నాయకులకే పరిమితమైందని జనం చెవులు కొరుక్కునేవారు. ఇప్పడు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కూడా ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటున్నా ఆ ‘చెడ్డపేరు’ ఆయనకు రాలేదు. కారణం ‘చట్టం’ అమలు పరిధిని (ఎ)స్టేట్‌ కామందులు బాగా విస్తరించడమే. ఫలితంగా చట్టం తన పని తాను చేసుకుపోవడం జనంలోకి బాగా చొచ్చుకుపోయింది.

ఆ మధ్య స్కాలర్‌షిప్పులు, హాస్టళ్లలో సౌకర్యాల కోసం విద్యార్థులు రోడ్డున పడ్డప్పుడు చట్టం తన పని ఎంత బాగా చేసింది! చట్టం ‘లాఠీ’వి చూపడం వల్ల ఎంతమంది విద్యార్థుల కాళ్లూ చేతులు విరిగాయి! ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు! నేటి విద్యార్థులే రేపటి పౌరులు కదా! అందరికన్నా ముందు వారికి చట్టం గురించి తెలియాలి. వారికి చట్టం గురించి తెలియకపోతే భవిష్యత్తులో చట్టసభలకు ఎన్ని ఇబ్బందులు! వాకౌట్‌ చేయడానికి గూడా మనుషులు దొరకరు. ప్రతిదీ పరీక్షే అవుతుంది. పరీక్షలకు విద్యార్థులు చదువుకునేప్పుడు కరెంటు కట్‌ అవుతోంది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకు పోతుండటం వల్లే ఇది సాధ్యమయింది. పరీక్షలకు చదువుకునేటప్పుడు లేని కరెంటు పరీక్షలప్పుడు మాత్రం ఎందుకని అప్పుడు కూడా తీసేశారు. ఆ మధ్య ఒక చోట కొవ్వొత్తుల వెలుగులో పరీక్షలు నిర్వహించారు. కొవ్వొత్తి కన్నా ఆదర్శం ఏముంది? తాను కరిగిపోతూ ఎదుటివారికి వెలుగునిస్తుంది!

ఏలినవారు చట్టం ద్వారా ఇస్తున్న సందేశం ఇదే.

మహాత్ములు చెప్పరు… చేసి చూపిస్తారు. ‘చట్ట’పట్టాల్‌ వేసుకుని విద్యార్థులంతా నడవవలెనోయ్‌!

మధ్యలో రైతులొకళ్లు, ఒకరు ఏడు గంటలు కరెంటు కావాలంటే ఇంకొకరు తొమ్మిదిగంటలు కావాలంటారు. ‘ఏకాభిప్రాయం’ వచ్చే వరకు కరెంట్‌ ఊసు ఎత్తకూడదు. కరెంటెస్సార్సీ వేయవచ్చు. వాన రాకడ కరెంటు పోకడ ఎవరికి తెలుస్తుంది? అయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. అంతోటి దానికి విద్యుత్తుకోసం గొడవలు పెట్టుకోవడమెందుకు? అయినా ‘రాజకీయ రైతులకు’ పనేమి ఉంటుంది? పొలాలను నమ్ముకోవాల్సిన (వల్లకాకపోతే అమ్ముకోవాల్సిన) రైతులు రోడ్ల మీదికి రావడమేమిటి? ఇది మన సంప్రదాయమా? కరెంటుకు గుట్టు రైతుకు గట్టు ముఖ్యమని ఏలినవారు ఎన్నిసార్లు చెప్పాలి? అయినా వినరేం?

రోడ్లమీదనే వంటలు వార్పులు చేస్తామని బెదిరిస్తారా? కబ్జా చేయకుండా రోడ్లను వదిలేసినందుకు సంతోషించక ఇదొకటా? పైగా ధర్నాలా? కరెంటు షాక్‌తోనే తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయిందని ‘సెంటిమెంటు’ తెస్తారా? సెంటిమెంట్ల మీద కూడా చట్టం తెచ్చి, అది తన పని తాను చేసుకుపోతే తప్ప పరిస్థితి సద్దుమణిగేటట్టు లేదు. పాపం చట్టానికి ఈ మధ్య విశ్రాంతే దొరకడం లేదు!

ఇళ్ల స్థలాలకోసం భూములు ఆక్రమించుకుంటామని ఎర్రన్నల ఆధ్వర్యంలో జనం కన్నెర్రచేస్తారా? అందుకే చట్టం తన పని తాను చేసుకుపోయింది. రైతులు గాయపడ్డారని ఆలోచిస్తారు గానీ పోలీసులు లాఠీలు విరిగిపోయాయని కించిత్తుకూడా బాధపడరేం. పోలీసులు కూడా పట్టించుకోకపోతే చట్టం చట్టుబండలవుతుందని అనుకోరేం. ‘కనిపించుటలేదు’ అన్న శీర్షిక కింద చట్టం అదృశ్యం అంటూ మీడియాలో ప్రకటనలిస్తే దానిని తిరిగి తెచ్చే పూచీ ఎవరిది? చట్టం అంటే పోలీసుల చేత పోలీసుల కొరకు పోలీసులే అమలుపరిచేది అని పండితులు అర్థం చెబుతుంటే బుర్రకెక్కదా?

ఏ గొడవా లేకుండా అంతా నోట్లో వేలు వేసుకుని కూర్చుంటే చట్టం ఎందుకసలు? చట్టం అమలు కావడం లేదని ఎవరన్నా కొర్రీలు వేస్తే దానికి జవాబు చెప్పే వెర్రివాడెవడు? ఆక్రమించుకోవడానికి కూడా ఓ పద్ధతుంటుంది. సమయమూ, సందర్భం ఉంటుంది! అది తెలుసుకోవాలి. ‘భూదానాలు’ అన్నీ అయ్యే వరకు ఏమిటా తొందర? వినోబాభావే అంతరాత్మ ఎంత ఘోషిస్తుందో ఊహించారా? వంటగ్యాస్‌ దొరకడం లేదని తన సొంత జిల్లా కడపలో గడప గడప అంటుంటే వై.ఎస్‌. ఎంత బాధపడతారు? గ్యాస్‌ సరఫరా చేయకపోవడం మా ఇంటా వంటా లేదని అనకుండా ఆయన ఎంత నిగ్రహించుకున్నారు?

కరెంటు పరిశ్రమలకు కోతపెట్టి ఇళ్లకు ఇస్తున్నామని, ఇళ్లకు కోతపెట్టి పొలాలకు ఇస్తున్నామని అన్నా వినిపించుకోరేం. వీధులకు కోతపెట్టి ఇళ్లకు ఇస్తామంటే ఒప్పుకోరేం! వీధుల్లో కరెంటు లేకపోతే దొంగతనాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువవుతాయని అంటారా? అవేవీ లేకపోతే పోలీసులెందుకు? పోలీసులు లేకపోతే చట్టమెందుకు? బుర్రపెట్టి చెబితే బుర్రకథలుగా కొట్టివేస్తారా? మేధావులూ! ఆలోచించరేం! అడ్డమయిన వాళ్లూ ఆందోళన చేస్తే ఐ.ఐ.టి. వస్తుందా? అని ఓ పోలీసు అధికారి అన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ మాటతో వెనుతిరిగి ఉంటే లాఠీల అవసరం ఉండేదా? చట్టం అంటే ‘మాటలు’ కాదు అని చెప్పడానికేగా లాఠీలు రంగంలోకి దిగింది!

చట్టమైనా మారాలి మనుషులైనా మారాలి. మనుషులెలాగూ మారరు. కాబట్టి చట్టాన్ని మార్చుకుంటే సరి! అన్ని సమస్యలకూ అపురూపమైన పరిష్కారాలు దొరుకుతాయి. ఉదాహరణకు కరెంటు సమస్య ఉందనుకోండి. ప్రతిపక్షాలకు విద్యుత్‌ కోత పెట్టి అధికారపక్షానికి ఇవ్వాలని చట్టం చేస్తే సరి! ఇదే మార్గంలో భూములు, రేషన్‌, గ్యాస్‌ వంటి వాటినన్నిటిని ప్రతిపక్షాలకు కట్‌చేసేసి అధికారపక్షం వారికే ‘కోటా’ ఇస్తూ చట్టం చేస్తే సరి! ‘గెలిచిన వేళ’నే చూడాలి అని అధికారంలో ఉన్నవాళ్లు పాడుకుంటారు. తప్పేముంది. అంతా ‘ప్రజాస్వామ్యబద్ధం’గా జరుగుతుంది. ఓడినవాళ్లు ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండటం లేదా? అవసరాలకూ అంతే.

‘చట్టం ముందు అందరూ సమానులే’ అంటారా? ‘కొంతమంది అధికసమానులు’ అన్న మాట వినలేదా? దీనికి కాస్త సవివరణ అవసరం. ‘చట్టం ముందు అందరూ సమానులే… అధికారపక్షం వాళ్లు అధిక సమానులు’ అని చట్టం చేస్తే ఎంత చక్కగా ఉంటుంది! చట్టం తన పని తాను ఎంత భేషుగ్గా చేసుకుపోతుంది!!

(శంకరనారాయణ వ్యాసం)

ప్రకటనలు

One thought on “చట్టానికి పనెక్కువవుతోంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s