ఇక దేశంలో తీవ్రవాదుండరు

తీవ్రవాదుల బాంబులు పేలాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ఆగ్రహం వెల్లివిరిసింది. నాయకులు ప్రజలపై సానుభూతి చూపారు. తీవ్రవాదాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు.

ఎప్పటిలాగే మంత్రి మహావాదికి కోపం వచ్చింది.
‘తీవ్రవాదుల ఘాతుకాలకు ప్రజలు భయపడరు. ఈ దేశం వారి ముందు తల వంచ దు. వాళ్లు ఎన్ని బాంబులు పేల్చినా, ఎంతమందిని పేల్చినా మనమీద ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రజలు చస్తూంటారు. మేం ఖండిస్తూ సరిహద్దుకావల ఉన్న సోదరదేశం వైపు ఒకవేలు చూపిస్తాం. వాళ్లు నాలుగు వేళ్లు మనవైపు చూపి మన కళ్లు పొడుస్తూనే ఉంటారు. ప్రపంచం పరుగెత్తుతూనే ఉంటుం ది. అయినా సరే ఈ ఘాతుకానికి పాల్పడ్డవారిని మేం పట్టుకుంటాం. పట్టుకుని సానుభూతితో వదలి పెడుతుంటాం’ ప్రకటించాడు మహావాది ఆవేశంగా.

వెంటనే ప్రతిపక్షాలు స్పందించాయి.
‘తీవ్రవాదులను వెతికి పట్టడం కుంభకోణాలు చేసి తప్పించుకున్నంత సులభం అనుకుంటున్నట్టున్నాడు మంత్రి, మహావాది మంత్రి అయినప్పటి నుంచీ తీవ్రవాదులు వాళ్ల స్వదేశంలో కన్నా మనదేశంలో ఎక్కువ స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఒళ్లు విరుచుకుని, తలలెత్తుకుని తిరుగుతున్నారు. మేమే చేతకాని వాళ్లమని అనుకుంటే, మాకన్నా మీరు చేతకానివారని తీవ్రవాదులు నిరూపిస్తున్నారు. కాబట్టి చేతకానితనాన్ని ఒప్పుకుని మహావాది రాజీనామా చేయాలి’ అంటూ ముక్తకంఠంతో కోరాయి ప్రతిపక్షాలు.

సాధారణంగా పిల్లి అరిచినా, బల్లి కనిపించినా రాజీనామా కోరటం ప్రతిపక్షాలకు అలవాటయిపోయింది. వాటిని పట్టించుకోకుండా పదవిని వదలకపోవటం అధికారంలో ఉన్నవారికి అలవాటయిపోయింది. కానీ మొన్నటివరకూ తన సహచరుడిగా ఉండి, పదవికోసం తనతో విభేదించి, ప్రతిపక్షంలో చేరిన పాపారావు కూడా తన రాజీనామా కోరటం మహావాది భరించలేకపోయాడు.

‘దేశం క్లిష్టపరిస్థితులలో ఉంటే, ఐకమత్యంగా ఉండే బదులు నా రాజీనామా కోరతారా?’ కోపంగా అరిచాడు మహావాది. ”నేనెందుకు రాజీనామా చేయాలి? తీవ్రవాదులు బాంబులు పేలిస్తే నా తప్పు ఏమి టి?వాళ్లు పొరుగుదేశం వాళ్లు, అని పొరుగు దేశాన్ని తిట్టానా, లేదా? తీవ్రవాదులను వేటాడతానని ప్రకటించానా లేదా? ఇంకేం చేయాలి? ఇలాంటి విషమ పరిస్థితిలో కూడ అర్థం పర్థం లేని కోరికలు కోరుతూ తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి అడ్డుపడుతున్న పాపారావు నిజమైన తీవ్రవాది. పార్లమెంటు సభ్యుడిగా పార్టీ కార్యకర్తగానే కాదు, దేశపౌరుడిగా కూడా పాపారావు రాజీనామా చేయాలి!” బంతిని బలంగా పాపారావు వైపు విసిరాడు మహావాది.

పాపారావు భగ్గుమన్నాడు. ”నన్ను దేశపౌరుడిగా రాజీనామా చేయమనండి ఫరవాలేదు. ప్రపంచంలో బోలెడన్ని దేశాలున్నాయి. పార్టీ కార్యకర్తగా రాజీనామా చేయమనండి. బోలెడన్ని వేరే పార్టీలున్నాయి. లేకపోతే నేనే ఓ పార్టీ పెట్టుకుంటాను. కానీ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయమనటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎంతో కష్టపడి నానాగడ్డి కరచి, బోలెడంత ఖర్చుపెట్టుకుని ఎంపీగా ఎన్నికయ్యాను. కనీసం ఖర్చు పెట్టిన డబ్బులయినా రాకముందే రాజీనామా చేయనుగాక చేయను. నన్ను తీవ్రవాది అన్నా ఫరవాలేదు. దేశద్రోహి అన్నా బాధ లేదు. నేను మాత్రం ఖర్చుపెట్టిన డబ్బు వసూలయ్యేంత వరకూ రాజీనామా పేరు కూడా తలవను. అయినా ఎన్నికలలో పాల్గొని గెలిచేవాడికి కష్టం తెలుస్తుంది. పార్టీ పెద్దల కాళ్లు మొక్కి, దొడ్డిదారిన పదవులు సాధించే మహావాదిలాంటి వారికి గెలవటం ఎంత కష్టమో ఎలా తెలుస్తుంది?” పోటు పొడిచాడు పాపారావు.

”ఏమిటీ, నేను పార్టీ పెద్దల కాళ్లు మొక్కా నా? మా పార్టీలో ఉన్నప్పుడు పాపారావు నా కాళ్లు ఒత్తలేదా? అయినా పెద్దల కాళ్లు ఒత్తకుండా, అడుగులకు మడుగులొత్తకుండా పదవి సాధించిన ఒక్క ప్రబుద్ధుడిని చూపించమనండి. నేను స్వయంగా తీవ్రవాదులను వేటాడతాను. అయినా పెద్దలకు గౌరవం ఇవ్వటం మన ధర్మం. మన ధర్మం నేను నిర్వహిస్తున్నాను. పాపారావు లాగా రిగ్గింగ్‌ చేయటం నాకు రాదు. అందుకే పెద్దల కాళ్లపై పడతాను. తప్పా?” తిరిగి బంతిని పాపారావు వైపు విసిరాడు మహావాది.

పాపారావు కోపం అవధులు దాటింది.
”మహావాది రాజీనామా చేయటమే, కాదు క్షమాపణలు చెప్పాలి. రిగ్గింగ్‌ చేయటం కూడా చేతకాని మహావాది నా గురించి అవమానకరంగా మాట్లాడటం నాకే కాదు, నా కోసం రిగ్గింగ్‌ చేసిన నా ప్రాంత ప్రజలందరికీ తీరని అవమానం. అందుకే మహావాది ఈ పదవికే కాదు భవిష్యత్తులో అందుకోబోయే పదవులకు కూడా రాజీనామా చేయాలి” డిమాండ్‌ చేశాడు పాపారావు.

మహావాది, పాపారావులను ఎన్నుకున్న ప్రాంతాల నడుమ స్పర్ధలు ఉన్నాయి. పాపారావు ప్రాంతం ప్రసక్తి తేవటంతో ఆయా ప్రాంతాలవారు తమను అవమానించినందుకు మహావాది క్షమాపణలు వేడుకోవాలని నిరసన ప్రదర్శనలు ఆరంభించారు.

ఈ నిరసన ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ మహావాది క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని మహావాది ప్రాంతంవారు నిరసనను హింసస్థాయిలో ప్రదర్శించారు.
అయితే అగ్నికి ఆజ్యం పోస్తూ, వాదనను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాడు మహావాది.
”పదవి నిలుపుకోవటం సులభం అనుకుంటున్నాడా పాపారావు? వచ్చే పదవికి కూడా రాజీనామా చేయాలని తన జాతికి సహజమైన లేకితనం ప్రదర్శించాడు. నేనీ పదవికే కాదు, ఏ పదవికీ రాజీనామా చేయను. అలా చేయటం మా ఇంటా వంటా లేదు” అన్నాడు మహావాది.

పాపారావు, మహావాదుల ప్రాంతాల నడుమనే కాదు. వారిద్దరి కులాల నడుమ కూడా ఉద్విగ్నతలున్నాయి. మహావాది వాడిన ‘జాతి’, ‘ఇంటా వంటా’ పదాలు పాపారావు కులానికి ఆగ్రహం కలిగించాయి. ఆ కుల సంఘం వారు మహావాది కులాన్ని దూషించారు. దాంతో ప్రాంతాల పోరు ఊపు తగ్గకముందే కులాల పోరు ప్రారంభమయింది.

అయితే మహావాది పార్టీ అధికారంలో ఉండటంతో దేశంలో ఇతర ప్రాంతాలలో ఆ పార్టీ కార్యకర్తలు మహావాదికి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. ‘మేం తక్కువ తినలేద’ని ప్రతిపక్షంవారు పాపారావుకు మద్దతు తెలుపుతూ సభలు నిర్వహించారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అయింది.

దేశంలో హింస ప్రజ్వరిల్లింది. రోజూ హత్యలు, మారణకాండలు సాధారణమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాలలో ‘కర్ఫ్యూ’లు విధించారు. పెద్దలు, మేధావులు, సినీనటులు రంగప్రవేశం చేశారు. ‘ప్రజలు శాంతంగా ఉండాల’ని విజ్ఞప్తులు చేశారు. ఐక్యత సభలు నిర్వహించారు. ఇంతలో ఓ సినీనటుడు, అనుకోకుండా ఓ పెద్దని ఢీ కొన్నాడు. అప్పటికే వాళ్ల కులాల మధ్య ‘ఢీ’ నడుస్తుండటంతో ఐక్యత సభలో ఈ ఇద్దరి సమర్థకుల నడుమ ‘రాళ్లు రువ్వే’ ఆట జోరు గా సాగింది. ఐక్యత సభ కులాల వారీగా, భాషా వారీగా, ప్రాంతం వారీగా చీలింది. ఈమధ్యలో తీవ్రవాదులు నాలుగైదు బాంబు లు పేల్చారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.

పొరుగు దేశ నేత అర్జెంటుగా తీవ్రవాద సంస్థలన్నింటినీ సమావేశానికి పిలిచాడు.
”ఆ దేశంలో బాంబులు పేల్చి మనం మన శక్తి యుక్తులను, అయుధాలను, కార్యకర్తలను, డబ్బును, సమయాన్ని వ్యర్థం చేసుకుంటు న్నాం. బాంబుల అవసరం లేకుండానే ప్రతి చిన్న విషయానికీ వాళ్లు కొట్టుకుని, తిట్టుకుని ముక్కలయ్యేందుకు తపన పడుతున్నారు. మనం బాంబులు పేలిస్తే ఏదో ఒకరోజు వీళ్లంతా ఒకటవుతారేమోనని భయం వేస్తోం ది. కాబట్టి అక్కడ బాంబులు పేల్చి లాభం లేదు. ఛలో, మరో మంచి దేశం వెతుక్కుం దాం. బాంబులు పేలుద్దాం. సమ ఉజ్జీలతో వైరంలో మజా ఉంటుంది. ఆ దేశంలో తీవ్రవాద చర్యల వల్ల మజా రావటం లేదు” అన్నాడు ఆ దేశనేత. తీవ్రవాదులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. తమ సంతోషానికి సూచనగా పది వేర్వేరు దేశాలలో బాంబులు పేల్చేశారు. రుధిర కపోతాలను గాలిలోకి ఎగరేశారు. చిత్రంగా, దేశంలో తీవ్రవాదుల దాడులు తగ్గిపోయాయి. అయితే తీవ్రవాదులను పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదిప్పుడు. దేశమంతా అల్లకల్లోలంగా ఉంటూనే ఉంది. ఇక తీవ్రవాదులతో పనేముంది?
(కస్తూరి మురళీ కృష్ణ రచన, విపుల పత్రిక)

ప్రకటనలు

2 thoughts on “ఇక దేశంలో తీవ్రవాదుండరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s