కలియుగంలో మేధకాలవ మధనం

పురాణకాలం:
క్షీరసాగర మథనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవతలు, రాక్షసుల అభ్యర్థన మేరకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి, సాగర ప్రవేశం చేశాడు. మందర పర్వతం కవ్వంగా మారిపోయి, ఆయన మూపున నిలబడింది. వాసుకి కవ్వపు తాడై చుట్టుకున్నాడు. రాక్షసులు అహంభావంతో వాసుకి తలవైపు పట్టుకోగా, దేవతలు తోకవైపు పట్టుకుని అటూ ఇటూ లాగడం మొదలుపెట్టారు. ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం వగైరాలన్నీ ఉద్భవించాయి. వాటితో పాటే నిప్పులు చిమ్ముతూ హాలాహలం కూడా ఎగసిపడింది. అది ముల్లోకాల్ని దహించకుండా ఉండేందుకు పరమశివుడు దాన్ని గుటుక్కున మింగి, కడుపులో పడకుండా, కంఠంలోనే నిక్షిప్తం చేసి గరళకంఠుడయ్యాడు. చిట్టచివరిగా అమృతం పుట్టింది. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారమెత్తి, రాక్షసులతో అచ్చిక బుచ్చికలాడుతూ వారిని ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టడంతో క్షీరసాగర మథనం పూర్తయింది.
జగన్నాటక సూత్రధారి స్వీయ పర్యవేక్షణలో ఆద్యంతం ‘సుర’సవత్తరంగా సాగిన ఈ మహానాటకాన్ని నారదుడు కనులారా వీక్షించి ఉప్పొంగిపోయి, విష్ణుమూర్తిని అడిగాడు.
“స్వామీ! కడు నేత్రపర్వంగా జరిగిన క్షీరసాగర మథనాన్ని సాధారణ ప్రజలు సైతం తిలకించి, పులకించే భాగ్యం కల్పించవచ్చు కదా!”
విష్ణుమూర్తి మందహాసం చేసి చెప్పాడు “నారదా! నీ కోర్కె తప్పకుండా సిద్ధిస్తుంది. కలియుగంలో … కాంగ్రెస్‌ పార్టీలో ఇటువంటి మథనాలు తరుచుగా జరుగుతాయి. మేధామథనాల పేరిట జరిగే ఆ ప్రహసనాల్లో ఏమేమి ఉద్భవిస్తాయో ప్రజలు మీడియా ద్వారా వీక్షించి వినోదిస్తారు.”
***
వర్తమానకాలం:
హైదరాబాద్‌, తారామతి బారాదరీలో కాంగ్రెస్‌ పార్టీ మేధామథనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. “ఇప్పుడు నాయకులందరూ ఒక్కొక్కరే వచ్చి, మీ మేధస్సులన్నీ ఇక్కడ పెట్టి, ఓ మహాసాగరంగా చేశాక, అప్పుడు చిలకడం ప్రారంభిద్దాం” అన్నాడు దిగ్విజయ్‌ సింగ్‌.
నాయకులు బుర్రలు తడుముకున్నారు. ఎవరికీ మేధస్సులు తగల్లేదు. చాలామందికి ఖాళీగా ఉన్నాయి, మరికొందరికి మోకాళ్ళలో, అరికాళ్ళలో తగిలాయి.
“నా మేధస్సుని మా ఆవిడ దగ్గర మర్చిపోయా!” అన్నాడొకాయన. “మరేం .. ఈ పార్టీలో చేరకముందు నాకో ఔన్సుడు మేధస్సు ఉండేది. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టానో గుర్తుకొచ్చి చావడం లేదు” నిట్టూర్చాడు ఇంకొకాయన. మొత్తానికి అందరూ ఎలాగోలా మేధస్సుల్ని తెచ్చి వేదికమీద పోశారు.
“ఇదేమిటి? మన అందరి మేధస్సులు కలిపి క్షీరసాగరమంత కాకపోయినా, కనీసం హుస్సేన్‌సాగరమంతైనా అవుతుందనుకుంటే … మరీ బొత్తిగా మూసీకాలవంత అఘోరించిందేం?” చింతించాడు దిగ్విజయ్‌సింగ్‌.
“కనీసం ఆ మాత్రమైనా ఉన్నందుకు సంతోషిద్దాం కానీ ఇక మథనం ప్రారంభిద్దామా?” వాచీ చూసుకుంటూ తొందరచేశాడు వైఎస్‌. ఈ మేధా కాలవ మథనానికి కవ్వం, కవ్వం తాడుగా ఎవరుంటారన్న ప్రశ్న తలెత్తింది. దిగ్విజయ్‌సింగ్‌ కవ్వంగా ఉంటానన్నాడు. కవ్వం తాడుగా ఉండడానికి కేశవరావు ఒప్పుకున్నాడు.
“మరి ఈ కాలవలో నేను బుడుంగుమని మునిగిపోకుండా కిందన ఏ తాబేలు లాంటిదో ఉంటే బాగుంటుంది కదా” అన్నాడు దిగ్విజయ్‌సింగ్‌.
“మరేం ఫర్వాలేదు … మీరు మునిగిపోయేంత లోతైన మేధస్సులు కావివి. అయినా, మీరు మునిగిపోకుండా నేను చూసుకుంటాగా!” భరోసా ఇచ్చాడు వైఎస్‌.
కాంగ్రెస్‌లో వైఎస్‌ అస్మదీయులు, తస్మదీయులు రెండుగా చీలిపోయి, కవ్వం తాడుగా ఉన్న కేశవరావును పట్టుకోడానికి వచ్చారు. “ఠాట్‌ … మేం కేకే కాళ్ళు పట్టుకోవడమా? అసంభవం … మేం తలవైపే పట్టుకుంటాం” అన్నారు తస్మదీయులు. సరేకానిమ్మని కేకే కాళ్ళవైపు వెళ్ళారు అస్మదీయులు.
మేధకాలవ మథనం ప్రారంభమైంది. తలవైపు పట్టుకున్న తస్మదీయుల్ని చూస్తూ సణగడం మొదలుపెట్టారు కేశవరావు.
“అరె … సరిగ్గా పట్టుకోండయ్యా! డోంట్‌ ప్రెస్‌ మీ హార్డ్‌ … ఐ విల్‌ నాట్‌ ఈల్డ్‌ టు ఎనీ ప్రెషర్‌ .. యూ డోంట్‌ నో హౌ టూ చిలుకుడూ!”
కేకే ఘోష వినలేక తస్మదీయులు తలలు బాదుకున్నారు. “మా బాగా అయింది” అస్మదీయులు ఇకిలిస్తూ చంకలు గుద్దుకున్నారు.
అందరూ తెలంగాణ అంశాన్ని జపిస్తూ మథనం సాగించారు. పొగలు కక్కుతూ ఎస్సార్సీ అనే హాలాహలం ఉద్భవించింది. “ఎస్సార్సీ అంటే కందిరీగల తుట్టని కదపడమే! ఇప్పుడు దీన్ని ఎవడు భరిస్తాడు?” నాయకులు గోలపెట్టారు.
“అన్ని రకాల విషాలు మింగుతూ నిబ్బరంగా ఉన్న మన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గారు ఉన్నారు కదా! ఆయనకే ఇచ్చేద్దాం” అంటూ దిగ్విజయ్‌సింగ్‌ దాన్ని మన్మోహన్‌కు అంటగట్టేశాడు. మన్మోహన్‌సింగ్‌ ఆ ఎస్సార్సీ హాలాహలాన్ని నోట్లో వేసుకుని మింగలేక, కక్కలేక నానా అవస్థపడ్డాడు.
మేధకాలవ మథనంలో అందరూ ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. అందర్నీ నోరూరిస్తూ మంత్రి పదవుల అమృత కలశం బయటపడింది.
“మా కంటే మాకు” అంటూ అస్మదీయులు, తస్మదీయులు ఆ కలశం వెంటపడ్డారు. వైఎస్‌ గభాల్న కలశాన్ని దొరక పుచ్చుకుని, “అమ్మా … ఆశ … దోశ … మీరందరూ రెండు వరసలుగా నిలబడండి … అందరికీ పదవులు పంచుతా” అన్నాడు వైఎస్‌.
“క్షీర సాగర మథనం స్టోరీ మేం కూడా చదివాం లేవోయ్‌! రెండు వరసలుగా నిలబడితే, మమ్మల్ని వదిలేసి, అస్మదీయులకే పదవులు పంచాలని కదూ నీ ఎత్తు … మాకు తెలుసులే … అందరం ఒకే వరసలో నిలబడతాం…” అంటూ తస్మదీయులు అస్మదీయుల్లో కలిసిపోయారు.
“రాహు కేతువుల్లా మీరు మాలో కలిసిపోతే, మా వైఎస్‌ మిమ్మల్ని గుర్తుపట్టలేడనుకుంటున్నారు కాబోలు … అందుకే మిమ్మల్ని మెంటల్‌ బ్రదర్స్‌ అన్నారు” అస్మదీయుడొకడు తస్మదీయు లిద్దర్ని చూస్తూ వ్యాఖ్యానించాడు.
పదవుల కలశాన్ని పట్టుకున్న వైఎస్‌ అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోబోయాడు. “అదేమిటి? మాకు పదవులు పంచుతా, నిలబడమని చెప్పి వెళ్ళిపోతారేం?” నిలదీశారు నాయకులు.
వైఎస్‌ పకపక నవ్వాడు. “మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పాగానీ ఇప్పుడే పంచుతానని చెప్పలేదుగా!”
“మరెప్పుడు పంచుతారు?” అంటూ నాయకులు లబలబ లాడారు.
“బడ్జెట్‌ సమావేశాల్లోగా తప్పకుండా పంచుతా” అంటూ మంత్రి పదవుల కలశంతో న్రిష్కమించాడు వైఎస్‌.
(రాజగోపాల్ రచన)

7 స్పందనలు

  1. భేష్ రాజగోపాల్!
    ధ్యాంక్స్ పూతరేక్స్!!

  2. బ్రహ్మాండంగా ఉందండి.

  3. అధ్బుతం! మీ కలియూగ పురాణ కాలక్షేపం. ఇది వ్రాసిన వారికి, చదివిన వారికి, ఈ కలియూగ రాజకీయ పాపపంకిలం అంటకుండు గాక!

  4. అద్భుతంగా రాశారు రాజగోపాల్ గారు. అందించిన మీకు కృతజ్ఞతలు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: