ఈ ఉత్సవం చాలా హాట్‌ గురూ!

ఇది తప్పక చదవాల్సిన సరదా వ్యాసం. నాకైతే…నవ్వి…నవ్వీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దీన్ని సరదాగా చదివి మనసారా నవ్వుకోండి :)
****************************************************
“తెలుగు రాజకీయ కళామతల్లి ముద్దుబిడ్డలకు నా అభినందనలు” అంటూ పివి ప్రసంగం ప్రారంభించగానే అందరూ థ్రిల్లయిపోయి చప్పట్లు కొట్టారు. ప్రసంగం మధ్యలో పివి అందర్నీ పేరు పేరునా పలకరించాడు “ఏం వెంకటస్వామి గారూ, ఆరోగ్యం ఎలా ఉంది? వాట్‌ మిస్టర్‌ రాజశేఖర్‌, జలయజ్ఞం పూర్తయిందా? ఈ యజ్ఞం పూర్తి చేస్తే నువ్వు రాజశేఖర సోమయాజిగా చరిత్రకెక్కి పోతావులే! చంద్రబాబూ, ఇంట్లో అంతా క్షేమమేనా? ఇంట్లో అంటే మీ ఇంట్లో కాదోయ్‌ .. మీ పార్టీలో ..” అంటూ పివి తన సహజశైలిలో సున్నితంగా ఛలోక్తులు విసురుతుంటే అందరూ పగలబడి నవ్వారు.

“మిత్రులారా ఈ రోజు ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశానంటే …” ఆగాడు వైఎస్‌. అది ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటైన అఖిలపక్ష ఇష్టాగోష్ఠి సమావేశం. చంద్రబాబు, కేసీఆర్‌, రాఘవులు తదితర ప్రతిపక్ష నాయకులతో పాటు కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా హాజరయ్యారు. వైఎస్‌ కొనసాగించాడు.
“… ఈ మధ్య మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అది చూశాక, సినిమా వాళ్ళలాగే మన రాజకీయ నాయకులు కూడా అలాంటి ఫంక్షన్‌ ఎందుకు జరుపుకోరాదనే ఆలోచన తట్టింది. దాన్ని గురించి చర్చించడానికే ఈ రోజు మీ అందర్నీ ఇక్కడికి పిలిచాను. చంద్రబాబు గారూ! మీరేమంటారు?”

“బ్రెమ్హాండంగా ఉంటుంది … కానీ, వాళ్ళకి ఓ అకేషన్‌ వచ్చింది కాబట్టి ఉత్సవాలు చేసుకున్నారు. వేరు వేరు పార్టీ వాళ్ళం … మన అందరికీ కామన్‌గా వచ్చే అకేషన్‌ ఏమిటి? దీనికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది” అన్నాడు చంద్రబాబు. అవునవునన్నట్టు మిగిలిన వారంతా కోరస్‌ పాడారు.
“అదీ ఆలోచించాను .. మన అందరం ఎప్పుడో ఒకప్పుడు వేరు వేరు వ్యాపకాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాళ్ళమే కదా! ఆ సందర్భాన్ని ఉపయోగించుకుందాం … రాజకీయ జీవిత వజ్రోత్సవం అనో, రాజకీయ జీవిత స్వర్ణోత్సవం అనో సెలబ్రేట్‌ చేసుకుందాం” చెప్పాడు వైఎస్‌.
“ఈ ఐడియా బాగానే ఉంది కానీ వజ్రోత్సవం, స్వర్ణోత్సవం అంటే డెబ్బై, యాభై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న ముసలాళ్ళకే పరిమితమై పోతుంది. అంచేత రాజకీయ జీవిత రజతోత్సవం జరుపుకుందాం … అప్పుడు పాతికేళ్ళ కేటగిరీలోకి చాలామంది వస్తారు” సవరణ ప్రతిపాదించాడు కేసీఆర్‌ మూజువాణీ ఓటుతో అందరూ ఆమోదించారు.

“సినిమా వాళ్ళ ఫంక్షన్‌లాగే మన ఫంక్షన్‌ కూడా హైటెక్స్‌లోనే గ్రాండ్‌గా జరపాలి. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత ప్రొఫెషనల్స్‌కి అప్పచెప్పాలి. మొత్తం కార్యక్రమాన్ని టీవీలో లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలి … ఆ విధంగా ముందుకు పోవాలని మనవి చేస్తున్నాను …” గడగడా వల్లించాడు చంద్రబాబు.
“సినిమా హీరోలందరూ ఓ థీమ్‌సాంగ్‌ చేసినట్టు మనం కూడా ఓ థీమ్‌ సాంగ్‌ చేద్దాం … సీనియర్‌ నాయకులంతా ఒకే రకమైన బట్టలు కుట్టించుకుని చెట్టాపట్టాలేసుకుని ఓ పాట పాడదాం … దిస్‌ విల్‌ డెఫినేట్లీ ఎట్రాక్ట్‌ ది పబ్లిక్‌” అంటూ ముచ్చట పడ్డాడు కేకే.
“బాగా చెప్పావు” కేకేకి మద్దతిస్తూ ఎమ్మెస్‌ మరో సలహా ఇచ్చాడు.
“వాళ్ళు తెలుగు చలనచిత్ర జగతికి రూపాలం మేము … ప్రజల గుండెలందు వెలుగు దీపాలం మేము …” అంటూ పాడారు. మనం కూడా ఇలాంటి పాట రాయిద్దాం .. బయట వాళ్ళెందుకు .. మన ప్రజాకవి మందాడి సత్యనారాయణరెడ్డి ఉన్నాడుగా … ఆయన చేతే రాయిద్దాం … ఏమంటావు మందాడీ…”
మందాడి గొంతు సవరించుకుని చెప్పాడు.

“నన్ను రాయమంటే ఇలా రాస్తా! … తెలుగు రాజకీయ జగతికి శాపాలం మేము … ప్రజల గుండెలందు జ్వలించు కోపాలం మేము …”
వైఎస్‌ చేతులెత్తి దండం పెట్టగానే మందాడి టక్కున పాట ఆపేశాడు.
మొత్తానికి పాతికేళ్ళ రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న నాయకులందర్నీ సన్మానించాలని అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇంకా సీనియర్‌ నాయకుల్ని గుర్తించి, ‘లెజెండ్స్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ అనే మరో కేటగిరీలోనూ సత్కరించాలని మరో తీర్మానాన్ని ఆమోదించింది. నాయకుల రాజకీయ జీవిత రజతోత్సవాన్ని పార్టీ సిద్ధాంతాలు, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా, ‘నభూతో నభవిష్యత్‌’ అనే రీతిలో నిర్వహించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

***
హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నాయకుల రాజకీయ జీవిత రజతోత్సవ వేడుకలు అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వేదిక మీద ప్రత్యేకంగా అమర్చిన జయంట్‌ ్రస్కీన్‌పై హఠాత్తుగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రత్యక్షమయ్యాడు.
“తెలుగు రాజకీయ కళామతల్లి ముద్దుబిడ్డలకు నా అభినందనలు” అంటూ పివి ప్రసంగం ప్రారంభించగానే అందరూ థ్రిల్లయిపోయి చప్పట్లు కొట్టారు. ప్రసంగం మధ్యలో పివి అందర్నీ పేరు పేరునా పలకరించాడు “ఏం వెంకటస్వామి గారూ, ఆరోగ్యం ఎలా ఉంది? వాట్‌ మిస్టర్‌ రాజశేఖర్‌, జలయజ్ఞం పూర్తయిందా? ఈ యజ్ఞం పూర్తి చేస్తే నువ్వు రాజశేఖర సోమయాజిగా చరిత్రకెక్కి పోతావులే! చంద్రబాబూ, ఇంట్లో అంతా క్షేమమేనా? ఇంట్లో అంటే మీ ఇంట్లో కాదోయ్‌ .. మీ పార్టీలో ..” అంటూ పివి తన సహజశైలిలో సున్నితంగా ఛలోక్తులు విసురుతుంటే అందరూ పగలబడి నవ్వారు. “తెలుగు రాజకీయ పరిశ్రమ చాలా గొప్పది. ఈ పరిశ్రమలో ఉండటం అదృష్టం. ఎంతో చరిత్రాత్మకంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు” అంటూ పివి తన ప్రసంగాన్ని ముగించాడు. యానిమేషన్‌ ప్రక్రియ ద్వారా జరిగిన ఈ కార్యక్రమం అందర్నీ అలరించింది.

ఆ తర్వాత ప్రముఖుల ప్రసంగాలు, మధ్యమధ్యలో వినోద కార్యక్రమాలు రసవత్తరంగా జరిగాయి. చివర్లో ఉత్సవాల కమిటీ కన్వీనర్‌ కెవిపి రామచంద్రరావు వేదిక ఎక్కాడు.
“మిత్రులారా! మీరందరూ ఎదురు చూస్తున్న సన్మానాల ఘట్టం త్వరలో ప్రారంభం కాబోతోంది. ముందుగా పాతికేళ్ళ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న వారిని సన్మానించుకుందాం. ఒక్కొక్కరికీ నలుగురు ప్రముఖుల చేత సన్మానం చేయించాలని అనుకున్నాం గానీ ఈ కేటగిరీలో కొన్ని వందల మంది వచ్చి చేరారు. ఏ ఒక్కర్నీ నిరుత్సాహ పరచడం మాకిష్టం లేదు. అంచేత, నేనిప్పుడు పేర్లు వరసగా చదువుతాను. అందరూ క్యూలో వచ్చి, సన్మాన పత్రాలు స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాను” అంటూ కేవీపీ పెద్ద లిస్టు తీసి పేర్లు చదవడం మొదలుపెట్టాడు. అందరూ పొలోమంటూ బఫే డిన్నర్‌లో అతిథుల్లా క్యూలో రావడం … తమ వంతు రాగానే చేతులు చాపడం .. వారికి సన్మాన పత్రాలు ప్రసాదించడం .. ఈ తతంగం పూర్తయ్యేసరికి మూడు గంటలు పట్టింది.

మళ్ళీ వేదిక ఎక్కాడు కేవీపీ. “ఇప్పుడు మనం లెజెండ్స్‌ ఇన్‌ పాలిటిక్స్‌నీ, సెలబ్రిటీస్‌ ఇన్‌ పాలిటిక్స్‌నీ సన్మానించుకోబోతున్నాం. నిజానికి ఈ రెండు కేటగిరీల్లోనూ సన్మాన గ్రహీతల్ని ఎంపిక చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశాం” అంటూ వివరించాడు.
సభలో అందరి మొహాల్లోనూ లెజెండ్స్‌ ఎవరా, సెలబ్రిటీస్‌ ఎవరా అనే ఆత్రుత కనిపించింది. “ఇప్పుడు లెజెండ్స్‌ కేటగిరీలో ముందుగా వెంకటస్వామి గారినీ, ఆ తర్వాత జైపాల్‌రెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, సలావుద్దీన్‌ ఒవైసీ గార్లను సన్మానించబోతున్నాం” ఎనౌన్స్‌ చేశాడు కేవీపీ. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ నలుగురి సన్మానాలు పూర్తయ్యాయి.
“ఇప్పుడు లెజెండ్స్‌ కేటగిరీలో లాస్ట్‌ … బట్‌ నాట్‌ లీస్ట్‌ … మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారిని సత్కరించుకోబోతున్నాం … వైఎస్‌ గారూ, వేదిక పైకి రావాలి” అభ్యర్థించాడు కేవీపీ.
వైఎస్‌ చిరునవ్వు నవ్వుతూ వేదిక ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. కేవీపీ ఆయన మెళ్ళో పతకాన్ని వేశాడు. సన్మాన పత్రం అందించాడు. జ్ఞాపిక బహూకరించాడు.
“ఇప్పుడు సెలబ్రిటీస్‌ కేటగిరీ కింద మరికొందరు ప్రముఖుల్ని సత్కరించుకుందాం… చంద్రబాబు నాయుడు, రాఘవులు, దత్తాత్రేయ, కె.నారాయణ, ఎమ్మెస్‌, కేసీఆర్‌, కేశవరావు, పి.జనార్దన్‌రెడ్డి గార్లు వేదికపైకి రావాలని కోరుతున్నాను” అన్నాడు కేవీపీ. అందరూ లేచి, వెళ్ళబోతుండగా పీజేఆర్‌ గబగబా వేదిక ఎక్కి కేవీపీ చేతిలో మైకు లాక్కున్నాడు.

“అసలు లెజెండ్‌ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు అర్థాలతో ఓ పుస్తకం రాశారా? సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, ఆ కార్మిక శాఖకే మంత్రిగా పనిచేసిన నేను లెజెండ్‌ని కానా? రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్‌ నుంచి వరసగా ఎన్నోసార్లు గెలిచిన నేను లెజెండ్‌ని కానా?” అంటూ పీజేఆర్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. సభలో పెద్దపెట్టున కలకలం రేగింది. పీజేఆర్‌కి మద్దతుగా మర్రి శశిధర్‌రెడ్డి నినాదాలు చేశాడు.

పీజేఆర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “నా మాట సరే … సాక్షాత్తూ ఇందిరమ్మకే సలహాలిస్తూ, ఢిల్లీలో రాజకీయ చక్రం తిప్పిన ఎమ్మెస్‌ లెజెండ్‌ కాదా? గల్లీ స్థాయి నాయకుడుగా జీవితం ప్రారంభించి ఢిల్లీ స్థాయికి ఎదిగిన వి.హనుమంతరావు లెజెండ్‌ కారా? ఒక్క రోజులో ప్రభుత్వాన్ని కూల్చి, నెల రోజులు ర్రాష్టాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించిన నాదెండ్ల భాస్కరరావు లెజెండ్‌ కారా? దయచేసి నన్ను మన్నించండి … ఈ సెలబ్రిటీ అవార్డును నేను తిరస్కరిస్తున్నాను” అనేసి పీజేఆర్‌ వేదిక దిగి విసవిసా బయటికి వెళ్ళిపోయాడు.
సభలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. వైఎస్‌ లేచి, వేదిక ఎక్కి, మైకు అందుకున్నాడు. ఆయన మొహం ఉద్విగ్నంగా, గంభీరంగా మారింది. కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.
“నాలుగే నాలుగు ముక్కలు మాట్లాడతా! ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన గురించి కాదు. మనల్ని ఈ స్థితికి తీసుకు వచ్చిన రాజకీయ కళామతల్లి గురించి మాట్లాడుకోవాలి. ఏడీ .. పిజెఆర్‌ ఎక్కడ? .. సరే … నేను చదివిన డాక్టర్‌ చదువుకీ, ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి హోదాకీ … నా సామాజిక నేపథ్యానికీ ఎక్కడా పొంతన లేదు … ఈ స్టేటస్‌ .. ఈ ప్రశంసలు … ఈ హోదాలు మనకి ఎవరిచ్చారు? ఆ రాజకీయ కళామతల్లి ఇచ్చింది … ఒరే, నాయనా … ఎదగండ్రా అంది … ఎదిగిపోయాం … పత్రికా సోదరులు రాసే వాటికి మనం ఉప్పొంగి పోకూడదు … పేపర్లో ఫోటో వేసి ఇంత ఆర్టికల్‌ రాసేసరికి ప్రతివారూ పేపర్‌కి ఎక్కేస్తున్నారు …” వైఎస్‌ ఆయాసం తీర్చుకోడానికి ఒక్క క్షణం ఆగాడు. ఎవరో వచ్చి మంచినీళ్ళ బాటిల్‌ ఇచ్చారు. ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అంటూ గటగట నీళ్ళు తాగేసి, స్తిమితపడి, మళ్ళీ మొదలుపెట్టాడు వైఎస్‌.

“ఇవాళ ఉదయం నేనో పెళ్ళికి వెళ్ళాను … చిన్న చిన్న తప్పులు చాలా జరిగాయి. నాకు చాలా కోపం వచ్చింది … ఛ .. ఛ… నేను కోప్పడితే ఏమిటసలు? పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు నాకొచ్చిన కోపం ఆఫ్టరాల్‌ అనిపించింది. చిన్నచిన్న తప్పులు ఎక్కడ జరగవు? ఏ కుటుంబంలో జరగవు? అంతమాత్రాన రోడ్డు మీదికొచ్చి అరుచుకుంటామా?
ప్లీజ్‌! అందరికీ చేతులెత్తి మొక్కుతాను … బయటి వారికి లోకువ కావద్దు …” అంటూ వైఎస్‌ చేతులు జోడించి, మళ్ళీ ప్రసంగాన్ని కొనసాగించాడు.
“నేనూ, చంద్రబాబు, రాఘవులు, కేసీఆర్‌ మేమంతా సమకాలికులం … ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం … ఇప్పుడు నాకు ఇంత పెద్ద గౌరవం ఇచ్చి వారి నుంచి నన్ను వేరు చేయకండి … నాకిచ్చిన ఈ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నందుకు నన్ను మన్నించండి” అంటూ వైఎస్‌ వేదిక దిగి పోయాడు. చప్పట్లతో, ఈలలతో, కేకలతో సభ దద్దరిల్లిపోయింది.

ఇంతలో నలుగురు వస్తాదులు నగిషీలు చెక్కిన ఓ పెద్ద భోషణాన్ని మోసుకు వచ్చి వేదిక మీద పెట్టారు. ఆ భోషాణం గురించి కెవిపి వివరించాడు.
“ఇది టైమ్‌ కాప్స్యూల్‌ .. అంటే కాల నాళిక … పాతికేళ్ళ తర్వాత తెలుగు రాజకీయాలు ఎలా ఉంటాయన్న అంశం మీద నాయకులు తమ అభిప్రాయాలు రాసి ఈ పెట్టెలో వేయాలని కోరుతున్నాను. పాతికేళ్ళ తర్వాత మనం జరుపుకోబోయే స్వర్ణోత్సవంలో ఈ పెట్టె తెరుస్తాం …”
“అలా కుదరదు .. మా తెలంగాణ వాళ్ళకి సెపరేట్‌ పెట్టె కావాలి” అంటూ డిమాండ్‌ చేశాడు కేసీఆర్‌. “అలా అయితే, మా రాయలసీమ క్కూడా వేరే పెట్టె కావాలి” అన్నాడు టీజీ వెంకటేష్‌. “మా ఆంధ్రాక్కూడా …” అన్నాడు చేగొండి హరిరామ జోగయ్య. “మరి మా ఉత్తరాంధ్రకో?” అన్నాడు బొత్స సత్యనారాయణ.
“ఇక్కడ రాజకీయాలు వద్దనుకున్నాం కదా! అయినా ఎప్పుడో పాతికేళ్ళ తర్వాత సంగతి … అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో … నందో రాజాభవిష్యతి” అంటూ కెవిపి అందరికీ నచ్చచెప్పి శాంతింపచేశాడు.
ముందుగా వైఎస్‌ వచ్చి, తనకిచ్చిన అవార్డును భక్తిగా కళ్ళకద్దుకుని పెట్టెలో వేశాడు. మరికొంతమంది వారి అభిప్రాయాలతో కూడిన కవర్లు వేశారు. ఆ తర్వాత ఆ పెట్టె ఎక్కడ భద్రపరచాలి అనే అంశం మీద చిన్నపాటి చర్చ జరిగింది. సెక్రటేరియట్‌లో పెడదామన్నారు కొందరు. ఇది ్రపైవేట్‌ వ్యవహారం కాబట్టి కుదరదన్నాడు వైఎస్‌. గాంధీభవన్‌లో పెడదామని కేకే సూచిస్తే, తెలంగాణ భవన్‌లో పెట్టాలని కేసీఆర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టాలని రాఘవులు, మఖ్దుంభవన్‌లో పెట్టాలని నారాయణ వాదులాడుకున్నారు.

“పెద్దవాణ్ణి … నేనో సలహా చెప్తా … వింటారా?” అన్నాడు ఎమ్మెస్‌ పెద్దరికంగా. “వింటాం … చెప్పండి, చెప్పండి” అన్నారంతా.
“ఈ పెట్టెని పూర్తి భద్రత మధ్య దమ్మిడీ ఖర్చులేకుండా భద్రపరిచే ప్రదేశం హైదరాబాద్‌లో ఒక్కటే ఒక్కటుంది” అన్నాడు ఎమ్మెస్‌.
అందరి మొహాల్లో ఉత్సుకత తొంగి చూసింది.
“అక్కడ వేలాది మంది ప్రజలు నిత్యం వచ్చి ఈ పెట్టెని దూరం నించే చూసి పోతుంటారు .. సెక్యూరిటీ గార్డులు రాత్రీ పగలూ కాపలా కాస్తుంటారు…”
“ఎక్కడ, ఎక్కడ, ఎక్కడ…?” ఆత్రంగా అడిగారంతా.
ఎమ్మెస్‌ చిన్నగా నవ్వి చెప్పాడు.
“నెహ్రూ జూలాజికల్‌ గార్డెన్స్‌..”

(ఆంధ్రజ్యోతిలో రాజగోపాల్ వ్యాసం)

ప్రకటనలు

2 thoughts on “ఈ ఉత్సవం చాలా హాట్‌ గురూ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s