• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 242,082 హిట్లు

ఆత్మస్త్థెర్యం మనిషైతే!!

ఈనాడు ఆదివారంలో వచ్చిన వ్యాసం ఇది. ఖచ్చితంగా ఇతని జీవితం చదివిన ప్రతి ఒక్కరికీ స్పూర్తిని ఇస్తుంది. ఈ మహలింగాన్ని అభినందించడానికి మాటలు చాలవు…చదవండి మీకే తెలుస్తుంది ఎందుకిలా అంటున్నానో
కష్టాలకే కష్టం వేసే కథ అతడిది!
కన్నీళ్లకే కన్నీరొచ్చే వ్యధ..!
నోరుండీ మాట్లాడలేడు… అన్నం నమిలి మింగలేడు… ముక్కుతో గాలి పీల్చుకోలేడు… ఒకటి కాదు రెండు కాదు… ఆరేళ్ల నరకం అది. అయితేనేం! కష్టాలను అలవోకగా ఎదుర్కొనే ఆయుధం ఒకటి అతని దగ్గరుంది. అది… ఆత్మస్త్థెర్యం.
అతనికా ధైర్యాన్నిచ్చింది…
చదువుకోవాలన్న కోరిక, ఓడిపోకూడదన్న పట్టుదల, గెలవాలన్న ఆశ.

తమిళనాడు తిరునల్వేలి జిల్లా అంబసముద్రం సమీపంలోని వాగైకుళంలో అదో పూజదీపాలు తయారుచేసే వర్క్‌షాప్‌.
ఎప్పటిలాగానే ఆ రోజూ పదిహేనేళ్ల మహాలింగం పనిలోకొచ్చాడు.
కరిగిన కంచును పోతలో పోయడానికి ఉపయోగించే కుళాయి పాడవడంతో దాన్ని బాగుచేద్దామనుకుని నోటిదగ్గర పెట్టుకుని ఊదుతుండగా…
టప్‌!
స్విచ్‌ వేసిన చప్పుడు…
ఏం జరుగుతోందో అర్థం కాలేదు మహాలింగానికి…
మరుగుతున్న లావాలా… పొగలు సెగలు కక్కుతూ కరిగిన కంచు…
అన్నవాహిక గుండా… శ్వాసనాళిక గుండా…
గొంతులోంచి కడుపులోకి కుతకుతా ఉడుకుతూ…
* * *
ఆరేళ్ల తర్వాత…
మద్రాసు యూనివర్సిటీలో ఎకనామెట్రిక్స్‌ క్లాసులో ఓ తెలివైన విద్యార్థి.
అదే మహాలింగం. తేడా అల్లా ఒక్కటే!
అప్పుడు బాలకార్మికుడు… ఇప్పుడు పట్టభద్రుడు. మధ్యలో ఏం జరిగిందంటే…
* * *
ప్రమాదం జరిగిన వెంటనే మహాలింగాన్ని నెల్త్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని అన్నవాహికా ఊపిరితిత్తులూ దెబ్బతిన్నాయన్నారు అక్కడి డాక్టర్లు. చికిత్స చేయడానికి రూ. లక్షలు ఖర్చవుతాయన్నారు. అదీ తమ వల్లకాదనీ చెన్నై తీసుకెళ్లాల్సిందేననీ చేతులెత్తేశారు. మహాలింగం తండ్రి పెరుమాళ్‌ ఆచారికి దిక్కుతోచలేదు. ఇంట్లో ఇంకా ఏడుగురు ఆడపిల్లలు. ఏపూటకాపూటే తిండికోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అసలు… తండ్రికి చేదోడువాదోడుగా ఉందామనే పనిలో చేరాడు మహాలింగం.

విషయం తెలుసుకున్న ‘సుయం’ అనే స్వచ్ఛంద సంస్థ మహాలింగాన్ని చెన్నైకి తీసుకువచ్చి నిపుణులైన వైద్యులకు చూపించింది. చికిత్సకయ్యే ఖర్చు తానే భరించింది. ఏడాదిపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడతను. ఆ తర్వాత సంగతులు అతని మాటల్లోనే(రాసి చూపించాడు)…

‘ఈ ఆరేళ్లలో ఆరు శస్త్రచికిత్సలు చేశారు. అయినా నేనిప్పుడు మాట్లాడలేను… ఒక ఊపిరితిత్తి తీసేశారు… కనీసం గాలి పీల్చలేను. అందరిలా ఆస్వాదిస్తూ నోటితో తినలేను… అన్నాన్ని మెత్తగా చేసి దాన్ని కడుపునకు అమర్చిన ట్యూబులో వెయ్యాలి. ఇంటి దగ్గర ఉంటే, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటాను. బయట ఉంటే అన్నాన్ని మెత్తగా నమిలి దాన్ని తీసి ట్యూబులో వేసుకుంటాను. చలిలో, వర్షంలో బయటకు రాలేను. శ్వాస కోసం గొంతుకు చేసిన రంధ్రంలోకి ఈగలూ దోమలూ వంటి క్రిమికీటకాలు పోకుండా నిరంతరం గుడ్డ చుట్టుకోవాలి. అయినా బాధలేదు. నాకివన్నీ అలవాటైపోయాయి. బాగా చదువుకోవాలన్న ఆశే నన్ను నడిపిస్తోంది. ప్రమాదం జరిగాక ఏడాదికి ఇంటర్‌లో చేరాను. వెుదట్లో… చదువుకోవడానికి శరీరం సహకరించేది కాదు. కాసింత కదిలినా మెదిలినా నరకం కనిపించేది. పళ్లబిగువున ఓర్చుకున్నాను. చదువొక్కటే నా లక్ష్యం. అది గుర్తొచ్చినప్పుడల్లా తాత్కాలికంగా బాధను మర్చిపోయి చదువు మీదే దృష్టి లగ్నం చేసేవాణ్ని. ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత డిగ్రీ కూడా పూర్తిచేశాను. ఇప్పుడదే స్ఫూర్తితో పీజీలో చేరాను. ఎప్పటికైనా మంచి ఉద్యోగం సంపాదించి మా నాన్నకు చేదోడువాదోడుగా ఉంటాను. చదువుకోవాలన్న కోరిక ఉండీ పరిస్థితులు అనుకూలించని నాలాంటి వారు మరెందరో ఉన్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే… ఎన్ని కష్టనష్టాలెదురైనా నిరాశా నిస్పృహలను దరిచేరనీయవద్దు. ఆత్మస్త్థెర్యమే ఆలంబనగా ముందుకు సాగితే నేడు కాకపోతే రేపైనా విజయం మనదే’

చదువుకోవడానికి అన్ని వసతులూ అవకాశాలూ ఉండీ లక్ష్యసాధనలో విఫలమై కుంటిసాకులు చెప్పే వారికి చెంపపెట్టులా… కుదురైన అక్షరాల్లో ప్రస్ఫుటించే అతడి ఆత్మస్త్థెర్యం ఎంత ఉన్నతం!

2 స్పందనలు

  1. నిజం గా చాలా దుర్భరం ఆ జీవితం.అయినా అతను చాలా ఆత్మ స్తైర్యం తో సాగిపోతున్నాడు.అతన్ని చూసి అందరమూ స్పూర్తిపొందాలి.నాకు తెలీదు ….కరిగిన కంచు అంత ప్రమాదకరమా?

  2. ప్రమాదకరమా… అని అంత మెల్లిగా అడుగుతారే!!! కంచు లాంటి లోహాలు దాదాపు కొన్ని వందల సెంటిగ్రేడ్ వద్ద కరుగుతాయి. అవి గొంతులో నుంచి పోతే ఇంకేమన్నా ఉందా….. మొత్తం అన్నవాహిక కాలి బొగ్గైపోదూ. తలుచుకొంటేనే వణుకొస్తోంది. మహలింగం ఎలా తట్టుకున్నాడో..పాపం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: