అంతా పంచాంగంలోనే ఉంది!!

ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది పంచాంగం. ఉగాది పచ్చడీ, పిండి వంటలూ, సెలవూ, కొత్త బట్టలు కూడా గుర్తొస్తాయనుకోండి. కొందరికి అత్తవారి ఇల్లూ గుర్తు రావచ్చు, కొందరికి అల్లుడు గుర్తు రావచ్చు. కవులకు కలకోకిల కూజితాలూ, (కలకోకిల కూత కూయదని మనవి. మగ కోకిల కూస్తుంది) లేచిగురు మామిడి జొంపాలూ, మేఘమాలలూ, వసంత కాంతలూ గుర్తొస్తాయి. కట్టుకున్న పెళ్లాం, మాడు పగిలే ఎండా, కరెంటు కోతలు గుర్తుకు తెచ్చుకుంటే ఏం బావుంటుంది! పండగ నాడు కూడా పాత మొగుడేనా అనే సామెత ఉండనే ఉంది.

పంచాంగానికి చాలా ప్రశస్తి ఉంది. గీతా పారాయణాన్నయినా రోజూ చేస్తామో లేదో కాని పంచాంగాన్ని మాత్రం రోజూ చూస్తాం.

”నీ పంచాంగం విప్పుతాను చూడు” అంటే నీ సంగతంతా తెలుసులే… నీ గుట్టు బయట పెడతాను అని అర్థం. ”చాలా పంచాంగమే ఉంది” అంటే కూడా అర్థమయిందిగా…

రాజకీయాల గురించి చెప్పాలంటే చాలా పంచాంగమే ఉంటుంది. కొత్త పంచాంగం వచ్చిందంటే పాత పంచాంగం పోయినట్టా? కానే కాదు! ఆ పంచాంగాన్నీ అవసరార్థం విప్పాల్సిందే. మా పెదనాయన దగ్గర నూటా యాభై ఏళ్లనుంచి వచ్చిన పంచాంగాలన్నీ ఉన్నాయి. వాటి ఆధారంగానే వర్షాల గురించీ కరవు గురించీ లెక్కలు కట్టి చెప్పేవాడు. వర్షాలు వస్తాయని చెప్పినప్పుడు సరిగా రాకపోయినా కరవు వస్తుందంటే మాత్రం కచ్చితంగా వచ్చి తీరేది. కొత్త పంచాంగం వచ్చిందంటే పదవిలో ఉన్న వాడికి ఠకీమని ఒక ఏడాది కాలం కాల గర్భంలో కలిసి పోయినట్టే. పదవిలో ఉన్న ప్రతివాడూ కనీసం ఐదు పంచాంగాల్ని పోగేసుకుంటాడు. గ్యారంటీ! అవి తెరిస్తే కాని అసలు సంగతి బయట పడదు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్టు ఏ యేటి పంచాంగంలో ఏముందో…!

పంచాంగంలో చాలా సంగతులుంటాయి. పంచాంగం అంటే ఐదు అంగాలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్ణాలు ఆ ఐదు. అవే కాదు… నెల గురించీ, సంవత్సరం గురించీ, రాశుల గురించీ రాశి ఫలాల గురించీ, కార్తెల గురించీ, రుతువుల గురించీ, వానల గురించీ, గ్రహణాల గురించీ- అబ్బో బోలెడు విషయాలు ఉంటాయందులో. చదవటానికి మంచి పుస్తకం పంచాంగమే.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరి ‘జాతకాలూ’ పంచాంగంలో మాత్రమే ఉంటాయి. అలాంటి పుస్తకం మరోటి చూపెట్టండి చూద్దాం. అందరి జాతకాలూ నా దగ్గర ఉన్నాయని చెప్పుకొనే అయ్యవార్ల దగ్గర బహుశా పంచాంగమే ఉండి ఉంటుంది. సీబీఐ ఎంక్వైరీ రిపోర్టులోనూ, బోఫోర్స్‌ కమిటీ రిపోర్టులోనూ లేని విషయాలన్నీ కుండ బద్దలు కొట్టినట్టు రాసి ఉంటాయి రాశి ఫలాల రూపంలో. మీరు పైకి చెప్పినా చెప్పకున్నా అవమానం ఆరు, అర్థలాభం పన్నెండు, అపకీర్తి పది రాజపూజ్యం పూజ్యం అని ఉందనుకోండి! దానర్థమేంటి? ‘ఏ ప్రాజెక్టులోనో నువ్వు ఇంత నొక్కేశావు, అది అందరికీ తెలిసి పోయింది. నువ్వు అధికారంలో ఉన్నప్పటికీ జనానికి నీమీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. జాగ్రత్త సుమా’ అని గోచరించట్లేదూ. ఇలా పంచాంగాల్లో సవాలక్ష సత్యాలు గోచరిస్తాయి. ఇలా గోచరించే వాటినే గోచార ఫలితాలు అంటారు. గ్రహచార ఫలం అబద్ధాలు ఆడుతారు అంటే ఆ ఏడాది చచ్చినట్టు అబద్ధాలు చెప్పాల్సిందే. నేనెరుగ నేనెరుగ అని నాలుక తిప్పాల్సిందే. నాకు తెలియకుండా జరిగిందని బొంకాల్సిందే.

ధనలాభం అని ఉందో అంతే సంగతులు. వెనకాలనుంచో కిందినుంచో పైనుంచో మూటలు మూటలు వచ్చి చేరతాయి. తెలుపో నలుపో జానేదేవ్‌!

ఎలా రాస్తారో కాని- ధనకనక వస్తు వాహనాలూ, భూప్రాప్తి అని ఉందో ఇక మీరు మినిస్టర్‌ అయిపోయినట్టే… లేదా భూ ఆక్రమణకు పాలు పడతారని దాఖలాగా చెప్పవచ్చు. కొందరి విషయంలోనైనా పంచాంగాన్ని నమ్మాలి!

ఎంక్వైరీ కమిటీ రిపోర్టును వల్లను పొమ్మన్నా చెల్లుతుంది కాని, పంచాంగం సంగతి అలా కాదు. ఎంక్వైరీ కమిషన్‌ని బురిడీలూ గిరికీలు కొట్టించవచ్చు కాని, పంచాంగం దగ్గర పప్పులు ఉడకవు. గ్రహాలెలా ఉంటే అలా లెక్క తేల్చి చెమ్డా తేలాల్సిందే.

పంచాంగంలో లేనిది లేదు. కౄర క్రకచ దంష్ట్రలున్న సింహరాశీ, ఏమీ ఎరగని మీన రాశీ, అమాయకపు మేషరాశీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మన నాయకమ్మన్యులకూ, ప్రజలకూ అధికార్లకూ అసలు సిసలు ఉదాహరణలు. మకరం, కర్కాటకం, వృశ్ఛికం… సింహం, గొర్రే, ఎద్దూ, మొసలీ, ఎండ్రకాయ… ఎన్ని రకాలు! అన్నింటినీ మనలో చూసుకోవచ్చు. కొందరు గొర్రెలైతే కొందరు వాటిని భోంచేసే సింహాలూ మొసళ్ళూ. అంతా సింబాలిజం. క్షేమేంద్రుడు గుర్తుకు వచ్చేంత ఔచిత్యం ఉంటుంది పంచాంగంలో.

పంచాంగ శ్రవణం విని చూడండి. సమకాలీన రాజకీయాలూ, దైనందిన పరిస్థితులూ ఔపోసన పట్టిన వారు ప్రస్తుత పరిస్థితులపై చేసిన వ్యాఖ్యానంలా ఉంటుంది- ఏ సంవత్సరమైనా! దాని మూల సూత్రాన్ని తయారు చేసిన మహానుభావుడికి చేతులెత్తి మొక్కాలి. ఉత్తరాదిలో ఘర్షణలూ, తూర్పున తుఫానులూ మధ్యలో కరవు. ఇలా హిస్టరీ జాగ్రఫీ అంతా ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంగతులన్నీ ముంజేతి కంకణంలా భాసిల్లుతాయి పంచాంగంలో.

గ్రహణాల గురించీ, గ్రహగతుల గురించీ అంత కచ్చితత్వంతో చెప్పే పంచాంగాలు మన ఏలికల యవ్వారం గురించి కచ్చితంగా చెప్పజాలవా? ఎందుకు లెమ్మని పైపైన వదిలేస్తున్నాయంతే! బతుకు జీవుడా!!
-(చికితా రచన)

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. ప్రతి పంచాంగ శ్రవణంలో క్రితం పంచాంగ శ్రవణాన్ని వినిపించి గడిచిన ఏడాది అలాగే జరిగాయే అని సరిచూసుకొని కొత్త శ్రవణం మొదలెట్టే సంప్రదాయం వుంటే బాగుండేది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. my date of barth is 18-12-1979 morning 7.30am

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: