ఉగాది జితదినోత్సవం

మార్చి 19. సర్కారీ ఉగాది రోజు …
రవీంద్రభారతిలో సర్వజిత్‌ నామసంవత్సర ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పంచాంగ పఠనం చేయడానికి మల్లాది వారు ససేమిరా అనడంతో వేరే పెద్దాయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు.
పంచాంగ పఠనం జరుగుతుండగా వైఎస్‌ పక్కనే ఉన్న రోశయ్యని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు.
“ఇంట్లో ఉగాది పచ్చడి తినొచ్చారా, రోశయ్య గారూ!”
రోశయ్యకు ఆ ప్రశ్న వెంటనే మింగుడు పడలేదు. “మీ ఇంట్లో ఉగాది ఎప్పుడు చేస్తున్నారు?” అని డైరెక్టుగా అడక్కుండా డొంకతిరుగుడుగా వైఎస్‌ ఈ ప్రశ్న అడిగాడని ఆయనకి అర్థమైంది.
రోశయ్య సూటిగా సమాధానం చెప్పకుండా ఓ వెర్రి నవ్వు నవ్వాడు. “మీకేం .. ఎన్ని కబుర్లయినా చెప్తారు. మీ ఇంట్లో ఉగాది ఎప్పుడన్న బాధలేదు .. మధ్య నా పీక్కి చుట్టుకుంది” అని మనసులో గొణుక్కున్నాడు.
రోశయ్య మనసు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిపోయింది.
***
సరిగ్గా వారం, పది రోజులు ముందు …
“ఉగాది ఎప్పుడు?” అనే ఒకానొక భయంకర సమస్య ర్రాష్టాన్ని పట్టి పీడిస్తున్న రోజులవి. మార్చి 20వ తేదీ మంగళవారం ఉగాది సెలవు అని మొదట్లో చెప్పిన ప్రభుత్వం ఆ సెలవుని ముందు రోజుకి జరిపి 19వ తేదీ సోమవారం నాడే ఉగాది అని ప్రకటించడంతో వివాదం భగ్గుమంది.
అంతే … జలయజ్ఞం, భూయజ్ఞం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ, కరెంటు కష్టాలు, కుంభకోణాలు తదితర చిల్లరమల్లర సమస్యల్ని గాలికొదిలేసి అందరూ ఉగాది ఎప్పుడనే అంశం మీద చర్చలు ప్రారంభించారు.
“హవ్వ … సూర్యగ్రహణం రోజున ఎవరన్నా పండగ చేసుకుంటారా? ఇది శాస్త్ర విరుద్ధం” అంటూ కొందరు చాంద్రమాన పండితులు అభ్యంతరం చెప్పారు.
“మరేం పర్వాలేదు … పొద్దున్న ఎనిమిదిన్నర కల్లా గ్రహణం వీడిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఇల్లు కడిగేసి, ముగ్గులు పెట్టుకుని, తలంట్లు పోసుకుని ఉగాది పండగ జరుపుకోవచ్చు … ఆ రోజంతా పాడ్యమి తిథి ఉంది కాబట్టి సోమవారం ఉగాది చేసుకోవడమే సబబు” అంటూ మరికొంత మంది సూర్యమాన పండితులు రంగంలోకి దూకారు.
ఇరవై నాలుగ్గంటలూ మెరుగైన సమాజం కోసం వేడివేడి వార్తలు అందించాలని తపించిపోతున్న న్యూస్‌ ఛానెళ్ళకి మంచి మేత దొరికింది. పండితులతో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. చర్చా వేదికలు నిర్వహించారు. పండితులు రెండు వర్గాలుగా చీలిపోయి, ఎవరి వాదనలతో వారు జనాన్ని ఊదరగొట్టారు.
అసెంబ్లీలో కూడా ఈ అంశం ప్రస్తావనకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కలవరపడింది. “32 మంది పండితులతో సంప్రదించిన మీదటే సెలవుని మార్చాం” అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య సభకు వివరణ ఇచ్చాడు.
“ఎవరా 32 మంది పండితులు? తిరుపతి, శ్రీశైలం, సింహాచలం వంటి పెద్ద దేవాలయాల పండితుల్ని వదిలేసి, ఓ పది మంది పసలేని పండితులతో మాట్లాడితే సరిపోతుందా? సెలవులు కలిసొస్తాయని కొంతమంది అధికారులు చేసిన కుట్ర ఇది” అంటూ చాంద్రమాన పండితులు నిప్పులు చెరిగారు.
రోశయ్యకి బుర్ర తిరిగిపోయింది. ఏం చేద్దామని వైఎస్‌ని సంప్రతించాడు. అఖిలపక్ష సమావేశం పెట్టమని సలహా ఇచ్చారు వైఎస్‌.
***
కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరూ సమావేశమయ్యారు.
“ఇరవై మంది పండితులు మా తెలంగాణ భవన్‌కి వచ్చి చెప్పారు, మంగళవారం నాడే ఉగాది జరుపుకోవాలని … మా తెలంగాణలో 20వ తేదీనాడే ఉగాది జరుపుకుంటాం… కావాలంటే మీ ఆంధ్రావాళ్ళు 19న జరుపుకోండి .. ఆ రకంగానైనా మనం విడిపోదాం …” సమరశంఖం పూరించాడు నాయిని నరసింహారెడ్డి.
“ఒక వేళ రాష్ట్ర ప్రజలందరూ 20వ తేదీనే ఉగాది జరుపుకుంటే … ఇక ఎవరూ విడిపోనక్కర్లేదా?” చిరునవ్వుతో ప్రశ్నించాడు రాఘవులు.
“అయ్యా! ఇది తెలుగువారి పండగ … మధ్యలో ఆంధ్ర, తెలంగాణ వివాదమెందుకు?” అన్నారు వైఎస్‌.
కేశవరావు కూడా వైఎస్‌ని సమర్థిస్తూ అన్నాడు.
“యూసీ మిస్టర్‌ నర్సింహారెడ్డీ! దిస్‌ ఫెస్టివల్‌ ఈజ్‌ కామన్‌ ఫర్‌ ఆల్‌ రీజియన్స్‌ .. దట్‌ చట్నీ .. ఐ మీన్‌, ఉగాది పచ్చడి … కెన్‌ బీ మిక్స్‌డ్‌ విత్‌ అనకాపల్లి బెల్లమ్‌, కరీంనగర్‌ వేప పువ్వూ అండ్‌ కర్నూల్‌ మామిడికాయా … నథింగ్‌ రాంగ్‌ ఇన్‌ ఇట్‌!”
“సరే … ఇంతకీ మీరెప్పుడు ఉగాది జరుపుకుంటారో ఒక్కొక్కరూ చెప్పండి” ప్రాధేయపడ్డాడు రోశయ్య.
“ప్రత్యేక తెలంగాణ వచ్చిన నాడే నాకు ఉగాది” అన్నాడు కేసీఆర్‌. “ఈ ప్రభుత్వం గద్దె దిగి, నేను మళ్ళీ సిఎంగా ప్రమాణం చేసిన నాడే నాకు నిజమైన ఉగాది” నిర్మొహమాటంగా చెప్పాడు చంద్రబాబు. “ఈ ప్రభుత్వం మా బెంగాల్‌ ప్రభుత్వం లాగా భూసేకరణకి స్వస్తి చెప్పినప్పుడే మాకు అసలు ఉగాది” అన్నాడు రాఘవులు.
ఇలా లాభం లేదని సమావేశాన్ని ముగించాడు వైఎస్‌. సోమవారం సెలవుతో పాటు మంగళవారాన్ని ఆప్షనల్‌ హాలిడేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
“కావాలంటే రెండు రోజులూ ఉగాది జరుపుకోండి .. ఆ మాటకొస్తే వారం పొడుగునా జరుపుకున్నా నష్టం లేదు .. ఎవరి నమ్మకం వాళ్ళది” మీడియాతో చెప్పాడు రోశయ్య.
పండితులు మళ్ళీ ఒంటికాలి మీద లేచి రోశయ్య మీద విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు.
రోశయ్య మనసు కకావికలమై పోయింది. “నన్నెందుకిలా ఆడిపోసుకుంటున్నారు? నేను కనీసం దేవాదాయశాఖ మంత్రిని కూడా కాను కదా … రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేసినందుకా నేనిన్ని మాటలు పడాలి?” అనుకుంటూ కుమిలిపోయాడు. ఆ విషాదంలోంచి ఆయన నోట ఓ పాట జాలు వారింది.

“ఎవరో జ్వాలను రగిలించారూ …
వేరెవరో దానికి బలియైనారూ …
వేరెవరో దానికి బలియైనారూ …
ఆధ్యాత్మికతకు ప్రతిరూపాలై …
ఆదిశంకరుల వలె మీరుంటే …
ఆనందంతో అడిగానే …
ఆత్మీయులుగా తలచానే …
అందుకు ఫలితం … అపనిందేనా?”

ఈలోగా వైఎస్‌ భుజం తట్టడంతో ఫ్లాష్‌ బ్యాక్‌లోంచి బయటికి వచ్చాడు.
***
20వ తేదీ మంగళవారం … అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలూ ఉగాదిని జరుపుకున్నారు. పత్రికలు కూడా ఆ రోజే శుభాకాంక్షలు చెప్పాయి.
రోశయ్య పరిగెత్తుకుంటూ వైఎస్‌ దగ్గరికొచ్చాడు. “సార్‌ … కొంప మునిగింది … ఈ జ్యోతిష్కుడి స్టేట్‌మెంట్‌ చూశారా? రెండు రోజులు ఉగాది జరపడంవల్ల ఈ ఏడాది కేంద్రంలో ఉన్న మన యుపిఎ ప్రభుత్వం కూలిపోతుందట” గాభరాగా చెప్పాడు.
“కొంపదీసి ఈ విషయం మేడమ్‌కి తెలీదు కదా!” ఆందోళనగా అన్నాడు వైఎస్‌. “ఈ పాటికి ఏ పీజెఆర్‌ లాంటి వాళ్ళో దిగ్విజయ్‌సింగ్‌కి చేరవేసే ఉంటార్లెండి” నిస్పృహగా అన్నాడు రోశయ్య.
అంతలో టేబిల్‌ మీద సెల్‌ఫోన్‌ మోగింది. సూరీడు సెల్‌ అందుకుని నెంబర్‌ చూసి చెప్పాడు.
“సార్‌ … ఢిల్లీ నుంచి ఫోన్‌!”

(రాజగోపాల్‌ రచన)

4 స్పందనలు

  1. Nice post. I really enjoyed while reading . I saw devil’s advocate videos, I hope we will not elect him next time.
    I am having trouble viewing your site, it is very slow, even some other telugu wordpress blogs are the same. Did you noticed it?

  2. సూపరు. రాజగోపాల్ ఈమారు ఎవరిపక్కా మొగ్గలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: