ఎవరి జాగా ఎంత

ఇంటర్లో మాకొక ఇంగ్లిష్‌ లెసనుండేది. ”హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఎ మాన్‌ నీడ్‌?” ఒక రాజుగారు ఓ వ్యక్తితో ”సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ నువ్వు పరిగెత్తినంత నేల ఇస్తా” అని అంటారు.

అప్పుడతను అత్యాశతో ఉదయంనుంచి సాయంత్రందాకా శక్తి పూర్తిగా ఉడిగిపోయినా పరిగెడుతూనే ఉంటాడు. సూర్యాస్తమయానికల్లా అతి ప్రయాసవల్ల పూర్తిగా డస్సిపోయి ప్రాణాలొదులుతాడు. అతడి శవాన్ని పాతిపెడుతూ తోటివాళ్లు ”మనిషికెంత నేల కావాలి? ఆరడుగులు చాలు… చనిపోయాక పాతిపెట్టడానికి” అనుకుంటారు సానుభూతిగా.

నిజానికి ఈ కథ ప్రస్తుత కాలానికి అతికినట్లు సరిపోతుంది. వందల, వేల (ప్రభుత్వ భూమి) ఎకరాలను రాజకీయనాయకులు, వారి వందమాగధులు కబ్జా చేసేస్తున్నారు. ”అరే… ఇదేంటయ్యా మరీ అన్యాయంగా” అని అడిగితే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికంటున్నారు. సర్కారీ స్థలాలను సేకరించి పారిశ్రామికవేత్తలకు లీజుకిచ్చే సంస్థలు కొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. ముందస్తుగా అలాంటి సంస్థలకు నేతలు గాలం వేస్తారు. కీలక పదవుల్లో పెద్దలు వాటిపై ఒత్తిడి తెస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ సంస్థలు తక్కువ ధరకే పైరవీకారులకి భూమిని కట్టబెడుతున్నాయి. కావలసినంత భూమిని భోంచేస్తూ నేతలు బొజ్జలు పెంచేస్తున్నారు. వాసన పసికట్టి ప్రతిపక్షాలు మీడియా సాయంతో గగ్గోలు పెడతాయి.

”నిరుద్యోగులకు ఉపాధి కల్పించే మహదాశయంతో పారిశ్రామికవేత్తలకు స్థలాలిస్తుంటే ప్రతిపక్షం అల్లరి చేస్తోంద”ని అధికారపక్షం ముక్కుచీది ప్రజల వీపులకు రాస్తుంది.

”దొంగ ఏడుపులు వద్దు” అంటుంది ప్రతిపక్షం

”మీరిచ్చినప్పుడు?” అంటుంది అధికారపక్షం

”అప్పుడే అడగాల్సింది!” అని ప్రతిపక్షం కిసుక్కున నవ్వుతుంది. ఈ డ్రామా చూసి ప్రజలంతా తరించి తీరాల్సిందే.

పేదవాడికి గుప్పెడు నేల లేదు. గృహ పథకాలు సముద్రంలో కాకిరెట్టల్లాంటివి. అంతో ఇంతో నేల ఉన్నా సాగు సౌకర్యంలేదు. దైవాధీనం పంట.

”పంటెలాగూ లేదు ప్రత్యేక ఆర్థిక మండళ్లకు భూమంతా ఇచ్చేసి అభివృద్ధి చెందుదా”మన్నది కేంద్రప్రభుత్వ బాణీ. అది తప్పుడు అభిప్రాయమన్నది విపక్షం వాణి. ప్రజలనెవరూ అడగరు. ప్రజా వ్యతిరేకతకు కారణాలను కూడా రాజకీయ పక్షాలే విశ్లేషిస్తాయి.

పుట్టిన ప్రతి మనిషికీ చనిపోయాక నేలలో దాక్కునే హక్కుంది (మతపరంగా రిజర్వు చేసిన స్థలాల్లోనే). ఎలక్ట్రిక్‌ క్రిమేషన్‌ వచ్చాక ఆ అవసరం కూడా లేకుండా పోతోంది.

ఎవరెన్ని ఎకరాలు వెనకేసుకున్నా, దానకర్ణుడిలా దానం చేసినా నేల శాశ్వతం. మనిషి అశాశ్వతం. దస్తావేజులూ, రిజిష్టరు కాగితాలూ భూమిని వారసత్వంగా మోస్తాయి.

యుగాంతంలో పన్నెండుగురు సూర్యులు వస్తారట. భూమంతా జలమయమై సకల ప్రాణికోటీ నశించిపోయి కొత్త యుగం అవతరిస్తుందట. అప్పుడు కొత్త లేఅవుట్లు వేసుకుని రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టాలేమో!

మనది వ్యవసాయ ప్రధాన దేశం. రైతన్నే దేశానికి వెన్నెముక అని మీటింగుల్లో పాడతాం. కానీ వాస్తవంలో అన్నివిధాలా అన్యాయానికి గురైన అన్నదాతలు దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

జనం పెరుగుతారు, భూమి పెరగదు. పండించే నేల పోతే భవిష్యత్తులో తిండిగింజలు దొరకవని వ్యవసాయ నిపుణులు నెత్తీనోరు కొట్టుకుంటారు.

విదేశీ పెట్టుబడులు కావాలి, తిండి కావాలంటే దిగుమతి చేసుకుంటాం దాందేముంది అని ఆర్థిక నిపుణులు లెక్కలు వేసి చెబుతారు.

ఏది నిజమో, ఏది అబద్ధమో తమకు ఏం కావాలో తెలీని అయోమయావస్థలో సామాన్యులు బిక్కమొహం వేసుక్కూర్చుంటారు.

సర్వీసు మొత్తం సంపాదనతో చదువూ, తిండీ, బట్టా పోగా వంద గజాల స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నది మధ్యతరగతి ఉద్యోగుల ఆరాటం. ఊళ్లకు ఆవల ఆ మాత్రం స్థలం కూడా గగనకుసుమమైపోయిందిప్పుడు.

బహుళజాతి సంస్థల్లో పనిచేసే హైటెక్‌ మనుషులు నగరాల నడిబొడ్డున ఫ్లాట్లలో ఉంటారు. వాళ్లకు నేలతో అవసరం ఉండదు. గాల్లో వేలాడగలరు. కోటీశ్వర్లకీ నేల అక్కర్లేదు. వాళ్లు అందంగా చెక్కిన కొండలపై హిల్‌ కాలనీల్లో ఉంటారు.

పేదవాడికి గుడిసె వేసుకోవాలంటే యాభై గజాల నేల కావాలి. గజం భూమి ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతున్న ఈ రోజుల్లో గుడిసె వేసుకోవడానికి జాగా ఎక్కడుంది? ఇల్లు లేకపోతే పోయే ఏ చెట్టుకిందో కాపురం పెడదామన్నా చెట్లు మాత్రం ఎక్కడున్నాయి?

‘ఇండియా షైనింగ్‌’ అంటే ఏంటో, ‘భారత్‌ నిర్మాణ్‌’లో తామెక్కడ ఉన్నామో తెలీని ప్రజానీకం తినో, తినకో ఫుట్‌పాత్‌ల మీద పడుకుంటారు. ఏ వాహనమో వారి పైనుంచి పోకపోతే పొద్దున్నే లేచి పేపర్‌ చూస్తారు.

వందల వేల ఎకరాల భూకబ్జా వివరాలు పతాక శీర్షికలు కనబడతాయి. రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో పట్టపగలే జరుగుతున్న మర్డర్ల గురించి వార్తలు దండిగా ఉంటాయి.

తనపై పుట్టి, తనలో కలిసిపోయే మానవజాతి తనను సొంతం చేసుకోవడం ఏమిటని భూమాత మానవజాతి అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటుందేమో!
(ఈనాడులో గౌరీ అల్లూరి వ్యాసం)

ఒక స్పందన

  1. పాపం రాజకీయ నాయకులని తిడతాం కానీ, చాల మంది అంతే కదా. డబ్బు వస్తుంది అంటే tempTation ఆపుకోవటం చాలా కష్టం. న్యాయం, నిజాయితీ ఇట్లాంటివి చెప్పుకోవటనికి బాగానే ఉంటయి కానీ మన డబ్బు పోతుందంటే చాలా మంది ఈ రూల్స్ అన్నీ గాలికి వదిలేస్తారు. నా మట్టుకు నేను ట్రఫిక్ పోలిసు 500 ఫైన్ రాయమంటావా అని చెయ్యి జాపితే 50 చేతులో పెట్టి వచ్చాను. మున్సిపల్ ఆఫీస్ లో, టెలిఫోన్ ఎక్స్ఛేంజి లో డబ్బులు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి అని గట్టిగా అడగలేదు. “పని కావటం ముఖ్యం. ఇప్పుడు రూల్సు మాట్లాడుతూ కూచుంటే ఎట్లా” అని calm గా ఇచ్చాను. ఎంత గట్టిగా అనుకున్నా మన డబ్బు పొతుంది అన్నప్పుడు నిజాయితీ గా ఉండటం చాలా కష్టం.

    నా ఒపీనియన్ ఏమిటంటే ఎంతో కొంత తినేది తిన్నా పని చేస్తే చాలు. ఉదా:- మలేషియా లో అవినీతి చాలా ఎక్కువ. కాని పనుల్లో quality ఉంటుంది. మన రోడ్ల లాగా వాళ్ళ రోడ్లు వర్షం రాగానే కొట్టుకు పోవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: